నన్నపనేని వెంకన్న చౌదరి
నన్నపనేని వెంకన్న చౌదరి హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త. అతను వి.సి. నన్నపనేనిగా సుపరిచితుడు. హైదరాబాదు లోని నాట్కో ఫార్మా సంస్థ అధినేత. 1200 కోట్ల డాలర్ల సంపదతో హురున్ గ్లోబల్ సంపన్నుల జాబితాలో 2686వ స్థానంలో ఉన్నాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]నన్నపనేని వెంకన్న చౌదరి గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం లోని గోళ్ళమూడిపాడు గ్రామములో జన్మించాడు.[2] ఆరవ తరగతి వరకు స్వంత ఊర్లోనే చదువుకున్నాడు. ఏడు నుండి ఎస్.ఎస్.ఎల్.సి.వరకు గుంటూరు జిల్లా, కావూరు లోను, పన్నెండవ తరగతి గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల లోనూ చదివాడు. ఆంధ్రా యూనివర్సిటిలో బి.ఫార్మా, ఎం.ఫార్మా చదివాడు. 1969లో ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళ్లి న్యూయార్కు లోని బ్రూక్లిన్ కాలేజిలో చదువుకుంటూనే వెటరిన్ పైన్ ఫార్మా స్యూటికల్స్ లో ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే మిసిమి పత్రిక స్థాపకుడైన ఆలపాటి రవీద్రనాథ్ కుమార్తె దుర్గా దేవిని పెళ్లి చేసుకుని అమెరికాలో కాపరం పెట్టాడు. అక్కడే వీరికి రాజీవ్, నీలిమ పుట్టారు.
పారిశ్రామికవేత్తగా
[మార్చు]అమెరికాలో పన్నెండేళ్లు ఉద్యోగం చేసింతర్వాత భారతదేశంలో ఔషదాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు ఊహ తెలిసే లోపే 1981 లో కుటుంబంతో సహా భారతదేశం వచ్చేశాడు. అప్పట్లో ఫార్మసీ రంగానికి ముంబాయి కేంద్ర స్థానంగా వెలుగొందు తూండేది. ఆ సమయంలోనే హైదరాబాదులో నాట్కో పేరుతో ఔషద తయారీ సంస్థను స్థాపించాడు. అక్కడే టైం రిలీజ్ సాంకేతికతో దేశంలోనే తొలిసారి కోల్డ్యాక్ట్ కార్డిక్యాప్ వంటి మందుల్ని తయారు చేయడం మొదలెట్టాడు. దీనితో తన కంపెనీ 65 కోట్ల వార్షిక టర్నోవరుకు చేరింది. నాట్కో సంస్థ కోల్డ్ యాక్ట్ వంటి స్వంత బ్రాండు మందులను ఉత్పతి చేసింది. ఆ ఉత్సాహంతో, 1991 లో " నాట్కో లేబరేటరీస్ " పేరుతో బల్క్ డ్రగ్స్ యూనిట్ స్థాపించాడు.
ఆయన సంస్థ సాధారణ కార్యకలాపాలతో పాటు కొత్త రకాల ఔషధాలను కనిపెట్టే కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తాడు.
నష్టాలు
[మార్చు]బల్క్ డ్రగ్ వ్యాపారంలో భారీగా నష్టం వచ్చింది. దాంతో ఆ వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టారు. అప్పుడు ఒక బ్యాంకు అధికారి "మీరు కేవలం పారిశ్రామిక వేత్త కాదు. శాస్త్రవేత్త. బల్క్ డ్రగ్స్ లో మీరు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలరు. మీయూనిట్ ను అమ్మకండి. యూ కెన్ డు వండర్స్ " అని అన్నాడు.[ఆధారం చూపాలి] అప్పటి వరకు కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజిని తెచ్చిపెట్టిన కోల్డ్ యాక్ట్ వంటి 50 మందుల ఫార్ములాలను అమ్మేసి, వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చేసి బల్క్ డ్రగ్స్ సంస్థను తానే అట్టిపెట్టుకున్నాడు. తర్వాత అనేక రకాల కాన్సర్ వ్యాదులకు మందులు తయారు చేశారు. ఈరోజు "నాట్కో క్యాన్సర్ మందుల ఉత్పత్తిలో నెంబర్ ఒన్ గా నిలిచింది.[3]
టైం రిలీజ్ టెక్నిక్
[మార్చు]అమెరికాలో ఉద్యోగం చేస్తూనే వెంకన్న చౌదరి ఒక పరిశోధకుడిగా 'టైం రిలీజ్ టెక్నిక్' పైన దృష్టి పెట్టారు. మామూలుగా మందు బిళ్లలు వేసుకున్నాక వాటి రసాయనాన్ని ఒకేసారి ఏకమొత్తంగా విడుదల చేస్తాయి. ఈ టైమ్‌డ్ రిలీజ్ మందులు అలా కాకుండా ఒక చాలా సమయం పాటు మెల్లమెల్లగా, తక్కువ మోతాదులో మందును విడుదల చేస్తూ ఉంటాయి.
క్యాన్సర్ మందుల తయారీ
[మార్చు]నాట్కో సంస్థ క్యాన్సర్ వ్యాధిని నయం చేసే కొన్ని మందులను తయారు చేసింది. బ్లడ్ క్యాన్సర్ వీనాట్ తో పాటు, బోర్టెజోమిబ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కి జెప్టినాట్ ఎర్లోనాట్ మందుల్నీ, మూత్ర పిండాల క్యాన్సర్ కి సొరాఫినాట్ మందులనీ తయారు చేస్తోంది.
అమెరికాలో నాట్కో ఫార్మా కేన్సర్ ఔషదాలు
[మార్చు]కొన్ని రకాల క్యాన్సర్ వ్యాదులను అదుపు చేయడానికి ఉపయోగపడే లెనిలిడోమైడ్ జనరిక్ ఔషదాన్ని అమెరిక విపణిలో విడుదల చేసేందుకు నాట్కో ఫార్మా అనుమతి సంపాదించింది. అదే విదంగా 'ఎవరోలిమశ్ 'అనే మరొక ఔషదానికి నాట్కోఫార్మా అమెరికా వారి ఎఫ్.డీ.ఏ అనుమతి సంపాదించింది.[4]
సమాజ సేవ
[మార్చు]వెంకన్న చౌదరి వ్యాపార వేత్తగానే కాకుండా, ప్రజల కుపయోగపడే పనులను కూడా చేశాడు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో 35 కోట్లు ఖర్చు చేసి తన తల్లిదండ్రుల పేరున అధునాతన క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని నిర్మించాడు. అక్కడే 10 కోట్ల ఖర్చుతో పిల్లల చికిత్సా కేంద్రాన్ని సరిక్రొత్తగా ఆధునీకరించాడు. హైద్రాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో కొత్త ఒ.పి.డి. బ్లాక్ కట్టించాడు. నాట్కో ప్లాంటు ఉన్న రంగారెడ్డి జిల్లా కొత్తూరులోను, అదే విదంగా వీరి సొంత ఊరు గోళ్ళమూడిపాడులోను, ఆధునిక వసతులతో నాట్కో బడులను ఏర్పాటు చేశారు. కాఊరులో తాను చదువుకున్న పాఠశాలలో కొత్త భవనాలను నిర్మించాడు. అంతే కాదు వైద్యులు సిఫార్సు చేస్తే క్యాన్సర్ రోగులకు ఉచితంగా మందులను అందిస్తున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-05-25. Retrieved 2021-05-25.
- ↑ ఈనాడు ఆదివారం 29 నవబరు 2020
- ↑ ఈనాడు ఆదివారం 29 నవంబరు 2020
- ↑ ఈనాడు మే 23,2021