Jump to content

పరుచూరి రాజారామ్

వికీపీడియా నుండి
(పరుచూరి రాజారామ్‌ నుండి దారిమార్పు చెందింది)
పరుచూరి రాజారామ్‌
దస్త్రం:Paruchuri rajaram.jpg
డా. పరుచూరి రాజారామ్‌
జననంపరుచూరి రాజారామ్‌
(1940-03-13)1940 మార్చి 13
India ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తెనాలి పట్టణం
మరణం2001 నవంబరు 5
వృత్తివైద్యులు (చర్మవ్యాధి నిపుణులు)
ప్రసిద్ధికథా రచయిత, నవలా రచయిత, పాపులర్ సైన్స్ రచయిత
మతంహిందూ
భార్య / భర్తసుశీల
పిల్లలుఅజిత, కవిత, మమత
తల్లిదండ్రులుసీతారామయ్య, శివరావమ్మ

డాక్టర్ పరుచూరి రాజారామ్ ప్రముఖ తెలుగు రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

వృత్తిరీత్యా వైద్యులు అయిన వీరు 1940, మార్చి 13వ తేదీన సంవత్సరంలో తెనాలిలో పరుచూరి సీతారామయ్య, శివరావమ్మ దంపతులకు జన్మించారు. వీరు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ నుండి ఎం.బి.బి.ఎస్. డిగ్రీని 1965లో పొందిన తర్వాత 'డిప్లమా ఇన్ డెర్మటాలజీ' చేసి గుంటూరులో చర్మవ్యాధుల నిపుణులుగా ప్రాక్టీసు చేశారు. 1970వ దశకంలో కోస్తాంధ్ర ప్రాంతంలో ఈయన ఒక్కరే ఏకైక పూర్తి స్థాయి చర్మవ్యాధి నిపుణులు. ఈయన పేద రోగులపాలిట దైవంగా కొనియాడబడి యువ డాక్టర్లకు ఒక మోడల్‌గా నిలిచారు. గుంటూరులోని పొగాకు కంపెనీలలో వీరు కార్మికులకు ఒక దశాబ్దం పైగా గౌరవ సలహాదారుగా సేవలనందించారు. వీరు వైద్యులుగానే కాకుండా నవలా రచయితగా, కథారచయితగా, పాపులర్ సైన్స్ రచయితగా కూడా తమ పేరును నిలుపుకున్నారు. వైద్యులుగా, రచయితగానేకాక నిర్వహణాదక్షుడుగా నిరూపించుకున్న రాజారామ్ 1970 దశకంలో జరిగిన ‘అభ్యుదయ రచయితల సంఘం’ పునర్నిర్మాణంలో చురుగ్గా పాల్గొన్నారు. 1973లో అరసం మహాసభలు దిగ్విజయంగా జరగటంలో ముఖ్యభూమికను పోషించారు. అరసం గుంటూరుజిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వివిధ హోదాలలో సేవలందించారు. ఎందరో యువ రచయితలను ప్రోత్సహించి, అరసం కార్యకర్తలుగా తీర్చిదిద్దారు.

రచనలు

[మార్చు]

వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నవలలు ధారావాహికలుగా వెలువడ్డాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వీరి కథలు, వివిధ చర్మవ్యాధులపై అనేక ప్రసంగాలు ప్రసారమైనాయి. వీరు ఇంగ్లీషు నుండి తెలుగు భాషలోకి అనేక పుస్తకాలను తర్జుమా చేశారు. వీరి గ్రంథాలలో కొన్ని:

  1. చల్లని మంట (కథా సంపుటి)
  2. ఇది నా పువ్వు (కథా సంపుటి)
  3. కల్పన కన్నా వాస్తవం మిన్న(కథా సంపుటి)
  4. వీళ్ళూ మనుషులే (నవల)
  5. మబ్బు విడిచిన వెన్నెల (నవల)
  6. పునరావృత్తం (నవల)
  7. జపమాల (నవల)
  8. లెనిన్ - సాహిత్య వివేచన
  9. సిగ్మండ్ ఫ్రాయిడ్ జీవితం - కృషి
  10. అవయవాల ఆత్మకథలు
  11. వ్యాధులు - వైద్యం
  12. చర్మ వ్యాధులు - చికిత్స
  13. చర్మ సౌందర్యం
  14. ఆహారం - ఆరోగ్యం
  15. వైద్యం - శాస్త్రజ్ఞులు
  16. వింత ప్రాణులు
  17. వ్యాధుల-నివారణ
  18. సమర్థుని జైత్రయాత్ర (నవల)

పురస్కారాలు

[మార్చు]
  • 1996లో కాకతీయ కళాపరిషత్ వారు వీరి రచనలకు గుర్తింపుగా 'కొడవటిగంటి నవలా అవార్డు' ఇచ్చి గౌరవించారు.
  • 1977లో 'వీళ్ళూ మనుషులే' నవలకు విశాలాంధ్ర నవలల పోటీలో బహుమతి లభించింది.
  • 'మబ్బు విడిచిన వెన్నెల' నవలకు 1984లో నాగార్జున విశ్వవిద్యాలయం వారి ఉన్నవ లక్ష్మీనారాయణ నవలల పోటీలో బహుమతి పొందారు.
  • వీరి రచన 'లెనిన్ సాహిత్య వివేచన'కు సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారం లభించింది.

మరణం

[మార్చు]

నిరంతర చింతన, నిత్యచైతన్యం మూర్తిమంతమైన డాక్టర్ పరుచూరి రాజారామ్ గారు 2001, నవంబర్ 15న మరణించారు. వీరు 2001, నవంబరు 5న మరణించారు[1].

మూలాలు

[మార్చు]
  • కథా కిరణాలు : మన తెలుగు కథకులు, పైడిమర్రి రామకృష్ణ, పైడిమర్రి కమ్యూనికేషన్స్, ఖమ్మం, 2002.

బయటి లింకులు

[మార్చు]