Jump to content

పావురాళ్ళకొండ

అక్షాంశ రేఖాంశాలు: 17°53′19″N 83°26′14″E / 17.88861°N 83.43722°E / 17.88861; 83.43722
వికీపీడియా నుండి
(పావురాలకొండ నుండి దారిమార్పు చెందింది)
  ?పావురాళ్ళబోడు
పావురాళ్ళకొండ బౌద్ధవిహారము
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
భీమునిపట్నం వద్దనున్న పావురాళ్ళకొండపై ఉన్న యక్షుని శిల్పం
భీమునిపట్నం వద్దనున్న పావురాళ్ళకొండపై ఉన్న యక్షుని శిల్పం
భీమునిపట్నం వద్దనున్న పావురాళ్ళకొండపై ఉన్న యక్షుని శిల్పం
అక్షాంశరేఖాంశాలు: 17°53′19″N 83°26′14″E / 17.88861°N 83.43722°E / 17.88861; 83.43722
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
సమీప నగరం విశాఖపట్నం
జిల్లా (లు) విశాఖపట్నం జిల్లా


పావురాళ్ళకొండ లేదా పావురాళ్ళబోడు విశాఖపట్టణానికి 25 కిలోమీటర్లు ఉత్తరాన భీమునిపట్నం వద్ద నరసింహస్వామి కొండగా ప్రసిద్ధమైన కొండ యొక్క స్థానికనామం. ఈ కొండ సముద్రమట్టానికి 150 మీటర్ల ఎత్తున ఉంది.

పావురాళ్ళకొండ, ఆంధ్రప్రదేశ్ బౌద్ధమత క్షేత్రాల్లో అవశేషపు ధాతువుల దొరికిన ముఖ్య క్షేత్రం

పావురాళ్ళకొండలో బౌద్ధ విహారం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇక్కడ క్రీ.పూ మూడవ శతాబ్దం నుండి సా.శ. రెండవ శతాబ్దం వరకు జనవాసాలు ఉండి ఉండవచ్చని అంచనా. ఉత్తర తీరాంధ్రలోని అతిపెద్ద బౌద్ధ విహార క్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ కొండపై నున్న క్షేత్రంలో హీనయాన బౌద్ధం ప్రభవించి ఉండవచ్చు.

1990-91లో జరిగిన తొలివిడత తవ్వకాల్లో అనేక అవశేషాలు లభ్యమయ్యాయి. రెండు బ్రాహ్మీ లిపి సూచక శాసనాలు, విహారాల యొక్క పునాదులు, వృత్తాకార చైత్యాలు, మొక్కుబడి స్థూపాలు, హాలులు తదితరాలు ఈ శిథిలాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ వారు ఈ ప్రదేశం నుండి నాణేలు, మెరుగుబెట్టిన పాత్రలు, పూసలు మొదలైన వస్తువులను సేకరించారు.[1] ఈ కొండపై వర్షపునీటిని నిలువచేసుకోవటానికి రాతిలో చెక్కిన దాదాపు పదహారు తొట్లను కనుగొన్నారు. ఇలాంటి తొట్ల వల్లే పేరు సంతరించుకొన్న బావికొండ, తొట్లకొండల కంటే ఎక్కువ తొట్లు ఇక్కడే ఉండటం విశేషం.[2] పావురాళ్ళకొండలో ఇంకా త్రవ్వకాలు, పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి.

ఈ క్షేత్రానికి సమీపంలో గోస్తనీ నది ప్రవహిస్తున్నది. ఇక్కడి నుండి సముద్రతీరం యొక్క దృశ్యం కూడా అందంగా ఉంటుంది. విశాఖపట్నం జిల్లాలోని ఇతర బౌద్ధ క్షేత్రాలైన బావికొండ, తొట్లకొండలకు పావురాళ్ళకొండ క్షేత్రం కూడా సమకాలీనమైనది.

ఒక విహారము, ఒక వరండా 2012 వేసవిలో జరిగిన తవ్వకాల్లో బయల్పడ్డాయి. బౌద్ధ క్షేత్రాలలో తరచుగా కనిపించే అర్ధచంద్రాకారపు శిలలు విహారాలలో అడుగుపెట్టే స్థలంలో స్వాగతం పలుకుతున్నాయి. ఒక నాగ శిల్పం, ధాన్యం నిలువచేసుకోవటానికి ఉపయోగించిన ఒక పెద్ద కుండ, చిన్న కుండ, శిలాస్థంబాల మండపాలు, అవశేషపు భోషాణము, ఒక రోమన్ నాణేం, రెండు శాతవాహన నాణేలు, పుష్ప ఫలకాలు ఇప్పటివరకు లభ్యమైన వస్తువులలో కొన్ని. తీరానికి దగ్గర ఉండటం వల్ల ఇక్కడ దేశంలోని వివిధ ప్రాంతాలతోనే కాక విదేశాలతో కూడా వర్తక సంబంధాలు ఉండేవని తెలుస్తున్నది.

ఈ చారిత్రక స్థలం డచ్చి వారి అతిధిగృహం నిర్మించడం వల్ల పాక్షికంగా చలించబడింది. జీర్ణావస్థలో ఉన్న అతిధిగృహంలో ఎలాంటి శాసనాలు దొరకలేదు. కానీ గోడలు మాత్రం పటిష్ఠంగానే ఉన్నాయి. బౌద్ధ క్షేత్ర నిర్మాణంలో ఉపయోగించిన కొన్ని ఇటుకలు ఈ డచ్చి అతిధిగృహం నిర్మాణంలో పునరుపయోగించినట్టు తెలుస్తున్నది.

పావురాళ్ళకొండలో ఇప్పటివరకు నాలుగు శాసనాలు లభ్యమైనవి. అందులో ఒకటి క్రీ.పూ మూడవ శతాబ్దానికి చెందినదైతే మిగిలిన మూడు శాసనాలు సా.శ. ఒకటి నుండి రెండవ శతాబ్దానికి చెందినవి. చివరి మూడింట్లో ఒకటి పాల అనే గ్రామవాసులు బౌద్ధ ఆరామానికి ఛత్రం, తొట్టి, మండపం దానం చేసిన విషయం ప్రస్తావిస్తుంది. మిగిలినవి అనేక బౌద్ధ సన్యాసుల పేర్లు పేర్కొంటున్నవి.[3]

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

పావురాళ్ళకొండ అనగానే పావురాలు ఉండే కొండ అని అనుకోవటం పరిపాటే కానీ ఈ కొండపై జరిపిన కొన్ని అధ్యయనాల వల్ల ఇక్కడ లభ్యమయ్యే తెల్ల రాళ్లను స్థానికులు పావురాళ్ళు అంటారు. అవి కొండపై ఉండటం వల్ల పావురాళ్ళకొండ అయి ఉండవచ్చు. అయితే ఈ పేరు వ్యవహారం మరింతగా పరిశోధించవలసి ఉంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-02-09. Retrieved 2012-11-28.
  2. "A delight of historians - The Hindu Aug 12, 2002 Metro Visakhapatnam". Archived from the original on 2012-11-08. Retrieved 2012-11-29.
  3. Archaeology Of Early Buddhism By Lars Fogelin