పింగళి దశరధరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పింగళి దశరధరామ్, పత్రికా సంపాదకుడు. దశరధరామ్ తన స్వీయ సంపాదకత్వంలో విజయవాడ సత్యనారాయణపురం నుండి ఎన్‌కౌంటర్ అనే పత్రిక నడిపేవాడు. ఈ పత్రిక 1980లో వందకు లోపల కాపీలతో మొదలు పెట్టబడింది. ఈ పత్రికలో పింగళి దశరధరామ్ ఎన్నో సంచలాత్మకమైన విషయాలను, ముఖ్యంగా మంత్రుల వ్యక్తిగత విషయాలు, వారికుటుంబ విషయాలు ప్రచురించి పేరు తెచ్చుకున్నాడు. భయమంటే ఎరుగని వ్యక్తి. ఆవతలి వ్యక్తి ఎంత పై స్థాయిలో ఉన్నప్పటికి తాను వ్రాయదలుచుకున్నది వ్రాసి తీరేవాడు. అతని భాషా శైలి దాదాపుగా మాట్లాడుకునే భాషగా ఉండేది. భాషలో సభ్యతాలోపం గురించి చాలా మంది ఫిర్యాదు చేసేవారు. ఇతని సంచలాత్మకమైన సంపాదక శైలి అనేక ఇతర పత్రికలకు స్ఫూర్తినిచ్చిందని చెప్పుకుంటారు. ఎన్‌కౌంటర్ పత్రిక అప్పట్లో అందులో వ్రాయబడే సంచలనాత్మక విషయాల వల్లనగాని, వ్రాసే విధానం వల్లన గాని రాష్ట్రంలో మూల మూలలకు పాకి పోయిందట. దాదాపు 5 లక్షల కాపీలవరకు అమ్ముడు పోయేదని చెప్పుకుంటారు.

సంపాదక/రచనా శైలి[మార్చు]

దశరధరామ్ యెల్లో జర్నలిజానికి తెలుగు నాట బీజాలు వేశాడు. తెలుగులో 'కాగడా' వంటి పత్రికలు యెల్లో జర్నలిజాన్ని అంతకు ముందే అనుసరించినా, అవి సినిమా వార్తలకు మాత్రమే పరిమితమైనవి. ఎన్‌కౌంటర్లో దశరధరామ్ రాజకీయ విషయాలు, రాజకీయ నాయకుల గురించి ఆ పద్ధతిలో వ్రాయటం మొదలు పెట్టి, తెలుగులో రాజకీయ యెల్లో జర్నలిజంకు తెర తీశాడు. వ్రాసే భాష చాలా మొరటుగా ఉండి, 'మర్యాద' 'గౌరవప్రద' వ్రాత పద్ధతులకు ఆమడ దూరాన ఉండటం వల్ల, వ్రాశే విషయాలు నిజమై ఉండటానికి అవకాశమున్నప్పటికీ, అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందలేదు. పలుకుబడిగల పెద్ద పెద్ద రాజకీయనాయకుల వ్యక్తిగత విషయాలు దాదాపు చీదర పుట్టేట్టు వ్రాశేవాడు. అలా వ్రాసి వ్రాసి ప్రాణంమీదకు తెచ్చుకున్నాడని అంటారు.

దశరధరామ్ యువతరం గురించీ ఎన్నో కలలు కన్నాడు. భగత్ సింగ్ ను "బాంబులతో బంతెఉలాడుకొన్న జాతి హీరో" అని ప్రశసించి అతని స్ఫూర్తితో యువతరం ధైర్యంగా, నిజాయితీగా ఈ వ్యవస్థను పునర్నిర్మిస్తుందని ఆశించేవాడు. సినిమా అభిమాన సంఘాల్లో, ఇతరేతర వ్యాపకాల్లో మునిగి ఉన్న వాళ్ళను తీవ్రంగా విమర్శించేవాడు ("ఉరేయ్ ! ఇకనైనా కళ్ళు తెరవండ్రా!"). కమ్యూనిజం పట్ల వ్యతిరేకత, ఆర్.ఎస్.ఎస్ పట్ల మరింత వ్యతిరేకత ఉండేవి. "దేశ విద్రోహక ఆరెస్సెస్" అని ఒక పుస్తకం కూడా రాసాడు. అలాగే కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తూ ఒక పుస్తకం వ్రాశాడు. రాజకీయ నాయకుల్లో ఒక జయప్రకాష్ నారాయణను తప్ప మరెవరినీ గౌరవించలేదు.

యెల్లో జర్నలిజం అంటే[మార్చు]

ఇంగ్లీషు వికీపీడియా ప్రకారం యెల్లో జర్నలిజం అంటే:

 • భయం పుట్టించేటటువంటి పెద్ద పెద్ద పతాక శీర్షికలు, ఎక్కువసార్లు అల్పమైన విషయాల గురించి
 • బొమ్మలు లేదా ఊహా చిత్రాల అతి వాడకం
 • కల్పిత ఇంటర్వ్యూలు, తప్పుదారి పట్టించే పతాక శీర్షికలు, సైన్సులాగ కనిపించే విధంగా వ్రాయటం, నిపుణులుగా పిలవబడే వారిచే పనికిరాని తప్పుడు విజ్ఞానం
 • ఆదివారపు అనుబంధాలను (సాధారణంగ వ్యంగ్య చిత్రమాలికలతో ) పూర్తి రంగులలో వేయాలన్న పట్టుదల
 • సంఘ పద్ధతులకు వ్యతిరేకంగా సామాన్య వ్యక్తి మీద అవసరానికి మించి అసాధారణ సానుభూతి.

పైన ఉదహరించిన విషయాలలో దాదాపు అన్నిటిలోనూ ఎన్‌కౌంటర్ ముందుండేది. ప్రస్తుతం, ముఖ్యంగా తెలుగులో కొన్ని వార్తా ఛానెల్స్‌ ఈ విధమైన ఒరవడిలో వెళ్ళటానికి ప్రయత్నం చేయటానికి కారణం, అప్పట్లో 'ఎన్‌కౌంటర్‌'కు వచ్చిన పేరు అయి ఉండవచ్చు.[ఆధారం చూపాలి]

వ్యక్తిగత జీవితం[మార్చు]

దశరధరామ్ అనుమానాస్పద పరిస్థితులలో 1985వ సంవత్సరం అక్టోబరు 21వ తేదీన హత్యకావించబడటం అప్పట్లో చాలా సంచలనం సృష్టించింది. చంపబడేప్పటికి అతని వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే. ఇతని అభిమానులు, సత్యనారాయణపురం(విజయవాడ)లో మరణాననంతరం అతని విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతిష్ఠించబడిన కొద్ది రోజులకే గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని తవ్వి ధ్వంసం చేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని దశరధరామ్ చౌక్‌గా పిలుస్తారు. పింగళి హేరంబ చలపతిరావు (భారత జండా రూపకర్త పింగళి వెంకయ్య చిన్న కుమారుడు) దశరధరాం తండ్రి. వీరు సైన్యంలో పనిచేశారు. దశరధరామ్ కు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఈయన భార్య సుశీల విజయవాడలో ఒక హాస్టల్‌లో మాట్రన్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారట.[1] దశరధరామ్ మరణించిన తర్వాత ఆయన భార్య ఎన్‌కౌంటర్ పత్రికను కొంతకాలం నడిపారు గానీ అందుకు తగిన వనరులూ, వ్యక్తులూ లేక పత్రిక ఆగిపోయింది. ఈయన కుమార్తె పింగళి చైతన్య రచయిత్రిగా పేరు సంపాదించింది. ఈమె వ్రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ నుండి 2016లో యువ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

రచనలు[మార్చు]

ఇతను తన పత్రిక నడపటమే కాక కొన్ని రచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. అతని రచనలో కొన్ని:

 1. కమ్యూనిస్టు దేశాల్లో మతమౌఢ్యం 1982
 2. మతం+మనిషి=అజ్ఞాని 1982
 3. విషసంస్కృతిలో స్త్రీ - 1982
 4. ముమ్మిడివరం బాలయోగి బండారం - 1983
 5. స్వేచ్ఛ అంటే ఏమిటి? - 1983
 6. బాబాలు-అమ్మలు - 1983
 7. దేశ విద్రోహక ఆరెస్సెస్
 8. కృష్ణా-క్రీస్తు ఒకడేనా?

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]