Jump to content

పేపకాయల లక్ష్మణరావు

వికీపీడియా నుండి
(పి.లక్ష్మణరావు నుండి దారిమార్పు చెందింది)
పేపకాయల లక్ష్మణరావు

పేపకాయల లక్ష్మణరావు (పి.లక్ష్మణరావుగా సుపరిచితుడు) ప్రముఖ రంగస్థల నటుడు. ఆయన నాటకరంగంలోనూ, అభిమానుల్లోనూ సంపత్‌నగర్ లక్ష్మణరావు అన్న పేరు స్థిరపడింది.[1] పలుపౌరాణిక నాటకాలలో అనేక పాత్రలను పోషించిన ఈయనకు ఎన్‌టీఆర్ రంగస్థల అవార్డుకు ఎంపికయ్యారు.

జీవిత విశేషాలు

[మార్చు]

పి.లక్ష్మణరావు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎలుగుబంద గ్రామంలో 1943లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నపుడు చదువులో అంత శ్రద్ధ చూపకపోవడంతో తండ్రి అతడి మేనమామ సూర్యనారాయణ వద్దకు పంపడంతో అక్కడ ఆయనకు వ్యవసాయంలో సహాయం చేయడం చేస్తుండేవాడు. నాటకాలంటే ఉన్న శ్రద్ధను గమనించిన ఆయన రాజమండ్రి చింతా సుబ్బారావు గారి వద్ద శిష్యుడిగా చేర్పించారు. మూడేళ్ళు శిక్షణ పూర్తిచేసిన లక్ష్మణరావు తన 15వ యేట నాటకాల్లో అడుగుపెట్టాడు.

అక్కడా ఇక్కడా నేర్చిన పద్యాలు పాడుకుంటూండేవారు. చిన్నప్పుడు ఆళ్లూ ఈళ్లూ పాడిన పద్యాలు నెమరేస్తూ గొడ్లు గాచుకుంటూ తిరిగేవాడు. ఆయనలోని అసాధారణ ధారణశక్తిని, గాత్ర ధర్మాన్నీ గుర్తించిన వీర్రాజు అనే వ్యక్తి ఆయన చేత ‘శ్రీ రామాంజనేయ యుద్ధం’ నాటకంలోని పద్యాలను, సంభాషణలను పూర్తిగా బట్టీ పట్టించారు.[2] అవి విన్నవారు ఆయనను బలవంతంగా నాటకరంగానికి ఎక్కించడంతో నటునిగా జీవితం ప్రారంభించారు. ఆంజనేయుడి వేషంలో లక్ష్మణరావుని చూసి ఊళ్లో జనం ఆశ్చర్యపోయారు. ఆ వార్త ఆ నోట ఆ నోట చాలా వూళ్లకి పాకింది. అక్షర సంగీత జ్ఞానం లేకుండానే అమాంతంగా నాటకరంగంలోకి దూసుకొచ్చిన అతన్ని ఆపడం ఇక ఎవరివల్లా కాలేదు. అతని భాషకీ, బాణీకి వంకలు పెడుతున్న కొద్దీ చెలరేగిపోయాడు. మద్రాసు నుంచి గ్రాముఫోను కంపెనీ వాళ్లొచ్చి లక్ష్మణరావు పద్యాలను రికార్డు చేసి మార్కెట్లోకి వదిల్తే ఆ గొంతు విని ఆంధ్రదేశం అదిరిపడింది. చావుకీ పెళ్లికీ బారసాలకీ అన్నిటికీ మైకుల్లో ఇతగాడి రికార్డు పెట్టి ఊళ్లకి ఊళ్లు పద్యనాటక మైకంలో తూలిపడుతుండేవి. నేల ఈనిందా అన్నట్టు జనం పోటెత్తి మరీ అతని నాటకం చూడ్డానికి ఎగబడ్డారు. ఒక్క సారిగా లక్ష్మణరావు సూపర్ స్టార్ అయిపోయాడు. రేటు పెంచాడు. రోజుకో నాటకం, పూటకో ఊరు తిరుగుతూ ఉర్రూతలూగించాడు. వరస నాటకాలతో గొంతు రాసుకుపోయి బాధిస్తున్నా మహానుభావుడు ఆ బాధని దిగమింగి మరీ పద్యం అందుకుంటాడు గానీ ఏరోజూ మద్యాన్ని మందుగానైనా దరిచేరనివ్వలేదు.[3]

మరో సుప్రసిద్ధ నటులు షణ్ముఖి ఆంజనేయ రాజు శ్రీరామునిగా, లక్ష్మణ రావు ఆంజనేయునిగా ఎక్కువుగా నటించేవారు. వీరి నాటకం ఉందంటే పరిసర గ్రామాలనుంచి నాటకాభిమానులు వేలదిగా హాజరయ్యేవారు. తనతో పాటు ఎవరు శ్రీరాముని పాత్రలో నటించినా లక్ష్మణరావు నటనలో, ఏకాగ్రతలో లోపం ఉండేది కాదు. ఆంజనేయుడే ఆవహించినట్టు పాత్రలో లీనమైపోయేవారు. 1970ల నాటికే లక్ష్మణరావు రికార్డిస్టుగా పద్యనాటకాభిమానుల హృదయాలను చూరగొన్నారు.[2]

నాటకరంగ ప్రవేశం

[మార్చు]

లక్ష్మణరావు తన 15 వఏట నాటకాల్లో అడుగుపెట్టారు, తన గురువు సూర్యనారాయణ వద్ద మూడేళ్ళు సహాయకునిగా ఉంటూ తన మొదటి ప్రదర్శనను రాజమండ్రి దేవీచౌక్ వద్ద దసరా సంభరాలలో ఆంజనేయునిగా చూపరు. అప్పటి నుండి 50 ఏళ్ళపాటు సుమారు 15 వేల ప్రదర్శనలలో పాల్గొన్నారు. గత 55 సంవత్సరాలుగా రామాంజనేయ యుద్ధం నాటకాన్ని 15వేలకుపైగా ప్రదర్శనలను ఇచ్చి అందరి మన్ననలను లక్ష్మణరావు పొందారు. సంపతనగరం లక్ష్మణరావుగా రాష్ట్రప్రజలకు సుపరిచితుడైన ఆయన అంతగా చదువుకోకపోయినాగానీ శాస్ర్తియ సంగీతాన్ని నేర్చుకుని రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం నాటకాల్లో నటించారు.

పేరు తెచ్చిన పాత్రలు

[మార్చు]
  • ఆంజనేయుని పాత్ర, గయుని పాత్రలు

విగ్రహావిష్కరణ

[మార్చు]

ఆయన 2017 ఏప్రిల్ 28న మరణించాడు. ఎంతో ప్రతిభా పాటవాలు, పాండిత్యం ఉన్నా వ్యక్తిగత క్రమశిక్షణ లేక ఆర్థికంగా, శారీరకంగా క్షీణదశను అనుభవించిన ఎందరో కళాకారులు ఉన్న పౌరాణిక నాటక రంగంలో లక్ష్మణరావు ఎంతో క్రమశిక్షణతో మెలిగారు. లక్ష్మణరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ఎలుగుబందలో అభిమానులు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.[2]

అవార్డులు, సత్కారాలు

[మార్చు]

ఆధారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. కాజా, వెంకట మధుసూదనరావు. "Short notes on some of the most famous artists, whom i saw on stage". ఆంధ్రనాటకం.కాం. Archived from the original on 26 అక్టోబరు 2009. Retrieved 28 January 2016.
  2. 2.0 2.1 2.2 "నటగాయకుడు లక్ష్మణరావు విగ్రహావిష్కరణ -". www.andhrajyothy.com. Archived from the original on 2018-03-09. Retrieved 2018-03-26.
  3. పెద్ది, రామారావు (డిసెంబరు 2015). "రామబంటు లక్ష్మణుడు". యవనిక (1 ed.). హైదరాబాద్: ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్, ఆర్ట్స్ అండ్ టెక్నాలజీ. pp. 28–33. ISBN 978-93-5104-551-9.

బాహ్య లింకులు

[మార్చు]

ఆయన ఇంటర్వ్యూ వీడియోలు

[మార్చు]