పుచ్చా పూర్ణానందం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుచ్చా పూర్ణానందం
జననం1910
మరణం1993
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ., ఎల్.ఎల్.బి.
విద్యాసంస్థబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
వృత్తిప్లీడరు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
హాస్య రచయిత, రంగస్థల నటుడు, సినిమా నటుడు
జీవిత భాగస్వామిత్రిపుర సుందరి

పుచ్చా పూర్ణానందం సుప్రసిద్ధ తెలుగు హాస్యరచయిత, నటుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు గుంటూరు జిల్లా, పెద్ద కొండూరు గ్రామంలో 1910, ఆగష్టు 10వ తేదీన జన్మించాడు[1]. ఇతడు దుగ్గిరాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకూ చదివి, రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో బి.ఏ., బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మదన్ మోహన్ మాలవ్యా వైస్ ఛాన్సలర్‍గా వుండగా ఎమ్.ఎ., ఎల్.ఎల్.బి., చదివాడు. ఇతడు ఆంధ్ర మహాసభ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఇతనికి టంగుటూరి ప్రకాశంతో పరిచయం, స్నేహం ఏర్పడింది. వీర సావర్కర్ అంటే గౌరవాభిమానావల్ల గాంధేయవాద సిద్ధాంతాలకు కొంత దూరంగా నడిచాడు. రాజమండ్రిలోనే భమిడిపాటి కామేశ్వరరావుతో పరిచయం కలిగి, ఆయన రచించిన నాటకాల్లో వేషాలు వేశాడు. ఇతని కోసమే భమిడిపాటి కొన్ని పాత్రలు సృష్టించాడు కూడాను[1].

నాటక రంగం[మార్చు]

ఇతడు పద్య నాటకాలు ఎక్కువ వేయలేదుగానీ ద్రౌపదీ వస్త్రాపహరణంలో భీష్ముడిగా వేశాడు. అనార్కలి నాటకంలో సలీం, వాపస్, ఆడది, పుట్ట, సంభవామి యుగేయుగే, టీకప్పులో తుఫాను, దంతవేదాంతం వంటి రంగస్థల నాటకాల్లో వేశారు. ప్రాచుర్యం పొందిన చిలకమర్తి రేడియో నాటకం “గణపతి”లో ఉపాధ్యాయునిగా, ఇంకా కంఠాభరణం, వయోలిన్ మాస్టారు, ఇంటినెంబరు, మృచ్ఛకటికం వంటి రేడియో నాటకాల్లో నటించాడు. బందా కనకలింగేశ్వరరావు, కాశ్యప, విన్నకోట రామన్న పంతులు, బళ్లారి రాఘవ, స్థానం నరసింహారావు వంటి వారితో పరమ ఆప్తుడిగా, ఆత్మీయుడిగా మసిలాడు[1].

సినిమా రంగం[మార్చు]

1942లో సినిమారంగం హీరోగా ఇతనికి అవకాశం వచ్చినా కాదని తన లాయరు వృత్తిని వదలలేదు. కానీ జంధ్యాల పట్టుబట్టగా ఆనందభైరవి, రెండు రెళ్ళు ఆరు, శ్రీవారి శోభనం, మదన గోపాలుడు, హై హై నాయకా మొదలైన చిత్రాలలో నటించాడు[1].

ఇతడు మొదట తెనాలిలో ప్లీడర్‍గా ఖ్యాతిపొంది, త్రిపురనేని రామస్వామి చౌదరికి సన్నిహితుడిగా, త్రిపురనేని గోపిచంద్ సహధ్యాయిగా ఉన్నాడు. 1944లో విజయవాడకు వచ్చి లాయర్‌గా ప్రాక్టీసు కొనసాగించాడు. ఇతడు మరణించే వరకూ కూడా హాస్య రచయితగా, నటునిగా, ప్రసిద్ధ లాయరుగా రాణించాడు[1].

రచనలు[మార్చు]

  • కవి నియంత (1951)
  • ఆవకాయ - అమరత్వం (1966)
  • ఆషాఢ పట్టీ (1971)
  • మీసాల సొగసులు (1984)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 సుధామ (2010). "హాస్య సాహితీమూర్తి – పుచ్చా పూర్ణానందం". ఆంధ్రభూమి మాసపత్రిక. Retrieved 1 April 2018.

బయటి లింకులు[మార్చు]