పెన్నేపల్లి గోపాలకృష్ణ
పెన్నేపల్లి గోపాలకృష్ణ | |
|---|---|
| జననం | 1937 నవంబరు 22 పెన్నేపల్లి, నాయుడుపేట మండలం, నెల్లూరు జిల్లా |
| మరణం | 2011 మే 27 (వయసు: 73) |
| చదువు | బి.ఎల్ |
| పాఠశాల/కళాశాలలు | వి.ఆర్.కళాశాల, నెల్లూరు మద్రాసు |
| వృత్తి | న్యాయవాది, పాత్రికేయుడు, సంపాదకుడు |
పెన్నేపల్లి గోపాలకృష్ణ (1937-2011) ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు, సంపాదకుడు, పాత్రికేయుడు. నెల్లూరు జిల్లా, నాయుడుపేట సమీపంలోని పెన్నేపల్లిలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన నెల్లూరు వి.ఆర్.కళాశాల, మద్రాసు న్యాయకళాశాలలో చదివాడు. చదువుకునే రోజుల నుంచి సాహిత్యం మీద ఇష్టం పెంచుకున్నాడు. నెల్లూరులో న్యాయవాదిగా పనిచేస్తూనే పత్రికా సంపాదకుడుగా, ప్రచురణ కర్తగా కూడా వ్యవహరించాడు. నెల్లూరు ప్రముఖ వారపత్రిక జమీన్ రైతు సంపాదకవర్గంలో సభ్యుడిగా పనిచేసి "జమీన్ రైతు గోపి" అని ప్రసిద్ధి పొందాడు. ఉదయం, వార్త దినపత్రికల్లో కూడా చాలాకాలం పనిచేశాడు. 2011 మే 27న మరణించాడు. కొన్నేళ్ళు ఆకాశవాణికి నెల్లూరుజిల్లా విలేకరి, హయిదరాబాదు ఆకాశవాణికి వార్తలు రాశాడు.
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]గోపాలకృష్ణ నెల్లూరుజిల్లా, నాయుడుపేటకు సమీపంలోని పెన్నేపల్లిలో ఒక వ్యవసాయ కుటుంబంలో 1937లో జన్మించాడు. తల్లి రుక్మిణమ్మ, తండ్రి చెంచువెంకట సుబ్రహ్మణ్యం నాయుడు. నెల్లూరు వి.ఆర్ కళాశాలలో విద్యాభాసం కొనసాగిస్తున్న రోజుల్లోనే నటన మీద, సాహిత్యం మీద అభిరుచి కలిగింది. అప్పటి వి.ఆర్.క ళాశాల మేనేజర్ శ్రీ టి. వి. రమణారెడ్డి శిక్షణలో నాటకప్రదర్శనల్లో, సాహిత్యంలో అభిరుచి పెంచుకున్నాడు. మద్రాసులో బి.యల్ విద్యార్థిగా ఉన్నకాలంలో కవులు, కళాకారులు, పాత్రికేయుల పరిచయాలవల్ల గోపాలకృష్ణలో సాహిత్యంపట్ల ఉత్తమాభిరుచి పెంపొందింది. నాటక కళాపరిషత్తులు జరిపే నాటక పోటీలకు జడ్జిగా కొన్నేళ్ళు వ్యవహరించాడు.
సాహిత్యం, పాత్రికేయ రంగం
[మార్చు]నెల్లూరులో న్యాయవాదిగా పనిచేస్తూ, యల్.వి.కృష్ణారెడ్డి నెలకొల్పిన యూత్ కాంగ్రెస్ స్థానిక వారపత్రికలో సంపాదకుడుగా 8 సంవత్పసరాలు పనిచేశాడు. 1966లో మిత్రులతో కలిసి "యువభారతి" సాంస్కృతిక సంస్థ నెలకొల్పి, నెల్లూరు ప్రజలకు ప్రసిద్ధ సంగీత, నృత్య కళాకారుల కళను పరిచయం చేసాడు.
1971 నవంబర్లో నెల్లూరు వారపత్రిక జమీన్ రైతు సంపాదకవర్గ సభ్యుడుగా చేరి, వారం వారం "మాటకచేరి" శీర్షికను నిర్వహించి, "గోపి" కలం పేరుతో 'కాలం' రాయడంవల్ల "గోపి, జమీన్ రైతు గోపి" అని నెల్లూరులో ప్రసిద్ధిపొందాడు. "మాటకచేరి కాలం"లో జిల్లా స్థానిక చరిత్ర, సాహిత్యం, సినిమాలు, సంస్కృతి మీద 13 ఏళ్ళు వ్యాసాలు రాసాడు. కావలి జవహర్ భారతి కళాశాల ప్రధానాచార్యులు యం.పట్టాభిరామిరెడ్డి స్థాపించిన ఆంద్రప్రదేశ్ చరిత్ర సభల(1976) సంస్థాపక సభ్యుడుగా ఆ సంస్థ జయప్రదం కావడానికి జమీన్ రైతులో వ్యాసాలు రాసి సహకరించాడు. A.P. History Congress సభలకు కొన్నేళ్ళు వరసగా హాజరయి, పరిశోధన పత్రాలు సమర్పించాడు.* .నెల్లూరులో మిత్రులతో కలిసి 1974 లో ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్(ప్రొఫిల్మ్) అనే పేరుతొ ఫిల్మ్ సొసైటీ నెలకొల్పి, ఆ సొసైటీ ప్రదర్శించిన గొప్ప గొప్ప, జాతీయ, అంతర్ జాతీయ కళాఖండాలమీద జమీన్ రైతులో సమీక్షలు రాసి నెల్లూరు ప్రజల సినిమా కళాభిరుచికి దోహదం చేశాడు*. నెల్లూరు కెమెరా క్లబ్, త్యాగరాజ సంస్మరణోత్సవాలు, తదితర సాంస్కృతిక విషయాలమీద, జిల్లాలో మహానీయుల మీద గొప్ప వ్యాసాలు రాశాడు. అనేక నాటక పరిషత్తుల్లో న్యాయ నిర్ణేతగా చాలా సంవత్సరాలు పాల్గొన్నాడు.
ప్రచురణకర్త
[మార్చు]1969లో నెల్లూరు వర్ధమాన సమాజ గ్రంథాలయం కార్యదర్శి పదవి చేపట్టిన తరవాత, ఆ సంస్థ తరఫున డెక్కన్ పోయెట్స్, ఫిడేలు రాగాల డజన్, కయిత నా దయిత, కవిత్రయ కవితా వైజయంతి గ్రంథాలు ప్రచురించాడు. పుస్తకాలు అందంగా, నిర్దుష్టంగా ప్రచురించడంలో ఆయన విశేషప్రజ్ఞ కలిగినవాడు. ఒకనాటి పార్లమెంట్ సబ్యులు ఆర్.యల్.రెడ్డి షష్టిపూర్తి సావనీర్ కు సంపాదక బాధ్యత వహించి, అచ్చు వేశాడు. 1974 జూలై 18 న షష్టిపూర్తిసంఘం నిర్వహించిన సభలో కవిపండితులు చదివిన పద్యాలను, సన్మానపత్రాలను " షష్టిపూర్తి-పుష్పవృష్టి" పేరుతొ పుస్తకంగా అచ్చువేశాడు. నెల్లూరు నగరంలో అభ్యుదయ వేదిక, హేతువాదసమాజం, తదితర సమాజ హిత కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, పత్రికా రచయితగా ఆ ఉద్యమాలను ప్రోత్సహించాడు. జమీన్ రైతులో శివారెడ్డి వారం వారం రాసిన పద్యాలన్నీ సేకరిచి "శివారెడ్డి పద్యాలు" పేరుతో ఒక పుస్తకం తీసుకొనివచ్చాడు. తన మేనమామ గూడూరు రాజేంద్రరావు రచించిన, భారతి తదితర తెలుగు పత్రికలలో ప్రచురించిన కథలను సేకరించి "గూడూరు రాజేంద్రరావు కథలు" పేరుతొ కథాసంకలనాన్ని ప్రచురించి, దానికి మంచి పరిచయాన్ని రాశాడు. విప్లవ రచయిత కె.వి.రామణారెడ్డి జైలు డైరీ ముద్రాపకుడుగా, కేవీఅర్ తోపాటు గోపాలకృష్ణ కూడా క్రిమినల్ కోర్ట్ కేసులను, పోలీసు వేధింపులను భరించవల్సి వచ్చింది. ఒంగోలులో మాననష్టం కేసులో మూడేళ్లు కోర్ట్ చుట్టూ తిరిగాడు. చివరకు కేసు కొట్టివేయబడింది.
నెల్లూరులో మదర్ థెరీసా "నిర్మల హృదయ భవన్" నెలకొల్పినపుడు, ఆ అనాథ ఆశ్రమం స్థాపన కృషిలో ఉత్సాహంగా పాల్గొని తనవంతు సేవా సహకారాలు అందించాడు.
1977-83 సంవత్సరాల్లో ఆకాశవాణి, దూరదర్శన్ నెల్లూరు జిల్లా విలేకరిగా ఉన్నాడు*. వర్ధమాన సమాజ కార్యదర్శిగా ఉన్నకాలంలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్య్డుడుగా ఎన్నికయి మూడేళ్ళు అకాడమి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.*
ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం
[మార్చు]గోపాలకృష్ణ 1971నవంబరులో జమీన్ రైతు వారపత్రికలో సహాయ సంపాదాకులుగా చేరాడు.* ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో సమైక్యవాదిగా జమీన్ రైతు పత్రికతోపాటు అనేక ఇబ్బందులను, కష్టాలను చవిచూచినా, తన అభిప్రాయాల ప్రకారం నిర్భయంగా నిలబడ్డాడు. జమీన్ రయితు సంపాదకుల విధానాలను అధిగమించి, చెరబండరాజు అమరుడయినప్పుడు, ఆయనమీద ప్రత్యేకంగా వ్యాసం రాయించి ప్రచురించినందుకు ఆ పత్రిక నిర్వాహకుల ఆగ్రహానికి లక్ష్యమయి, ఉద్యోగం వదులుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డా తొణకలేదు. నెల్లూరులో వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్, డాక్టర్ రవూఫ్ వంటి యువకవులను అభిమానించి, వారి కవితలను జమీన్ రైతులోప్రచురించి ప్రోత్సహించాడు. నెల్లూరులో ఉన్నకాలంలో గూడూరు సంస్కృతి సమ్మేళనం, నెల్లూరు నెఫ్జా నాటక పరిషత్, జల్లాలో నాటక పరిషత్తు ఎక్కడజరిగినా గోపాలకృష్ణ న్యాయనిర్ణేతగా ఉండేవాడు.
1983 అక్టోబరులో హైదరాబాదువెళ్లి ఉదయం దినపత్రికలో సీనియర్ పాత్రికేయుడుగా జీవితం ప్రారంభించాడు#. రాజకీయ విషయాలమీద కన్నా సాహిత్యం, సినిమా వంటి వాటిమీదనే తన దృష్టి ఉండేది. ఉదయంలో ఉన్నప్పుడు, తర్వాత వార్త దినపత్రికలో పనిచేసినపుడు ఆయన రాసిన వ్యాసాలూ, నిర్వహించిన శీర్షికలు ఆయన ఉత్తమ అభిరుచులను తెలియజేస్తాయి. ఈరొజుల్లొనే కొంతకాలం హైదరాబాద్ దూరదర్శన్ కు తెలుగులో వార్తలు రాసిపెట్టాడు*.
తిరుపతిలో 'ఉదయం' దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్నసమయంలో మిత్రులు త్రిపురనేని, భూమన్, సాకం నాగరాజ, భాస్కర చౌదరి, భూమన్ వంటి వారితో కలిసి 1991 లో "కన్యాశుల్కం" శతజయంతి ఉత్చవాలు చాలా ఘనంగా, ఏడాది పాటు నిర్వహించాడు. ప్రతి ఆదివారం ఒక విద్యాసంస్థకు వెళ్లి ఈ బృందం సబ్యులు గురజాడ రచనలను విద్యార్థులకు చదివి వినిపించారు.* 1993 ఆగస్ట్ లో యస్.వి.యూనివర్సిటీలో మహాకవి గురజాడ అప్పారావు మిద గొప్ప సెమినార్ నిర్వహించాడు. విజయనగరంలో 'వెలుగు' సంస్థ తరఫున శాసపు రామినాయుడు నిర్వహించిన "కన్యాశుల్కం నూరేళ్ళపండుగ" ఉత్సవాలలో కే.వి.ఆర్, చలసాని వంటి ప్రముఖులతో కలిసి పాల్గొన్నాడు.
గురజాడమీద పరిశోధన
[మార్చు]1989 నుండి గోపాలకృష్ణ తన మిత్రుడు కాళిదాసు పురుషోత్తంతో కలిసి ఆంద్రప్రదేశ్ స్టేట్ Archives, హైదరాబాద్ లో భద్రపరచిన గురజాడ రాతప్రతులను, రికార్డ్ ను పరిశీలించడం అలవాటుగా మార్చుకున్నాడు. విశాలాంధ్ర ప్రచురణ సంస్థ గురజాడ రచనలను అవసరాల సూర్యారావుచేత తెలుగులోకి అనువదింపచేసి ప్రచురించింది గాని, గురజాడ ఇంగ్లీష్ రచనలను ఇంగ్లీష్ లో ప్రచురించలేదు. ఏ రచయిత రచనలయినా ముందు ఆయన ఏభాషలో రాస్తాడో, ఆభాషలోనే ఆ రచనలు అచ్చుకావాలని, గురజాడ విషయంలో అందుకు భిన్నంగా జరిగిందని, గురజాడ ఇంగ్లీషు రచనలు యధాతధంగా ఎప్పటికయినా ప్రచురణ కావాలని ఆయన ఆకాంక్షిచాడు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సహకారంతో హైదరాబాదు స్టేట్ Archives లోని గురజాడ రికార్డును స్కాన్ చేయించి, డిజిటల్ కాపీ సంపాదించి, గురజాడ దినచర్యలను పరిశీలించి, కాపీచేసి, ఒక ప్రతిని అచ్చుకు సిద్ధం చేసాడు. A.P. Oriental, Manuscripts Library, and Research Institute, Hyderabad సంస్థ 2009 లో , "Diaries of Gurajada" పుస్తకాన్ని గోపాలకృష్ణ notesతో, పాదసూచికలతో అచ్చువేసింది.* గోపాలకృష్ణ గురజాడ ఇంగ్లీష్ ఉత్తర ప్రత్యుత్తరాల రాతప్రతులను పరిశీలించి, ఎత్తిరాసి ముద్రణకు సిద్ధం చేయడానికి పూనుకున్న సమయంలో "మనసు ఫౌండేషన్" యం. వి. రాయుడు గురజాడ సమగ్ర రచనల సంపుటాన్ని ప్రచురించడానికి ముందుకు వచ్చారు. గోపాలకృష్ణ శ్రమించి సిద్దం చేసిన 'గురుజాడలు' "గురజాడ లబ్ధ సమగ్ర రచనల సంపుటం" గురజాడ 150వ జయంతి రోజు, విజయనగరంలో విడుదల చేసారు కాని ఆ సంపుటాన్ని చూడడానికి ఆయన లేడు. అనారోగ్యంతో ఆయన 2011 మే 27న 73వ ఏట చనిపోయాడు1.. 'గురుజాడలు' 2000 పుటల గ్రంథాన్ని శ్రీమతి ఉమా గోపాలకృష్ణచేత మనసు ఫౌండేషన్ విజయనగరం మహారాజా కాలేజీ హాల్లో జరిపిన సభలో విడుదలచేయించింది. గోపాలకృష్ణ ఇద్దరు కుమారులు అమెరికాలో స్థిరపడ్డారు.
గోపాలకృష్ణ నెల్లూరులో జరిగిన అనేక రాజకీయ నాయకుల ఉపన్యాసాలు బహిరంగసభల్లో అనువదించి గొప్ప పేరు తెచ్చుకొన్నారు. మదర్ థెరిస్సా, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ వంటిజాతీయ నాయకుల ఉపన్యాసలను అనువదించి, అనువాదకులుగా ప్రశంశలు పొందారు. .
ఇతర రచనలు, పరిశోధనలు
[మార్చు]ఐక్యరాజ్య సమితిలో వర్ణవివక్ష నిర్మూలన శాఖలో సహాయ కార్యదర్శి పదవిలో ఉన్న ఏనుగు శ్రీనివాసులురెడ్డి ప్రోత్సాహంతో, మహాత్ముని నాయకత్వంలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణ ఆఫ్రికాలో జరిగిన పోరాటాలలో, ఉద్యమంలో భారతీయులు నిర్వహించిన పాత్రను, అందులో పాల్గొన్న భారతీయుల అశేష పోరాటాల, త్యాగాల చరిత్రను "ఇంద్రధనుస్సులో ఏడోరంగు" పరిశోధన గ్రంథంలో గోపాలకృష్ణ గొప్పగా వివరించాడు. అమెరికాలో ఉన్నపుడు, అనేక గ్రంథాలయాల్లో ఈ పుస్తకానికి అవసరమయిన విషయసేకరణ చేసాడు. ప్రజాశక్తి ప్రచురణ సంస్థ 2003 లో దీన్ని ప్రచురించగా, నెల్లూరులో డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి వైద్యశాలలో(PPC) ఏర్పాటయిన సభలో, ఆ వైద్యశాల ప్రధాన వైద్యులు డాక్టర్ జెట్టి శేషారెడ్డి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాడు*. 2006 జనవరి మాసం చివర శాంతినికేతనం విశ్వవిద్యాలయంలో జరిగిన Indian History Congressకు గోపాలకృష్ణ హాజరయ్యాడు.*
గోపాలకృష్ణ పాత్రికేయ జీవితంలో ఆయన పని చేసిన చివరి పత్రిక 'ఈ భూమి' వారత్రికను ఆయన మిత్రులు కే.సి.రెడ్డి స్థాపించాడు. ఈ పత్రిక సంపాదక వర్గంలో సభ్యుడుగా ఉండి, 'ఈ భూమి'లో ఒక 'కాలం' నిర్వహించడమేగాక, అనేక సాహిత్య సామాజిక సంబంధమైన వ్యాసాలు రాశాడు. గోపాలకృష్ణ గురజాడ సృష్టి "మధురవాణి "ఊహాత్మక ఆత్మకథ"ను ఒక కాల్పనిక రచనగా చేశాడు*. విమర్శకులు తెలుగు సాహిత్యంలో దీన్ని నూతన ప్రక్రియగా, జాండ్రాగా భావించారు. ఈ పుస్తకాన్ని "ఈ భూమి" పత్రికాధిపతి కే.సి.రెడ్డి అచ్చువేశారు. ఇది తెలుగు సాహిత్యంలో కొత్త ప్రక్రియగా ప్రసిద్ధి పొందింది. ఇటీవల ప్రజాశక్తి ప్రచురణ సంస్థ దీనికి ద్వితీయ ముద్రణ తెచ్చింది.
గోపాలకృష్ణ జూలియా థామస్ గ్రంథం "Letters from a lady"ని తెలుగులోకి అనువదించి, అచ్చుకు సిద్ధం చేశాడుగానీ పుస్తకం ముద్రణ కాకముందే చనిపోయాడు. ఆయన రాతప్రతి లభించలేదు. మొదటి draft తాలూకు రాతప్రతిలో కొంతభాగం లభించినంతపోను, మిగతా భాగాన్ని కాళిదాసు పురుషోత్తం పూర్తి చేశాడు. ఈ పుస్తకాన్ని "ఆమె లేఖలు" పేరుతొ ఎమెస్కో, ఏ.పి హిస్టరీ కాంగ్రెస్ సంయుక్తంగా 2019లో ప్రచురించాయి.
మూలాలు
[మార్చు]- 1.మరణవార్త, జమీన్ రైతు౩-6-2011, "గోపి మరణం!" శీర్షికతో వార్త. సంతాపసభ వార్త, 2011 june 3rd జమీన్ రైతుపత్రిక 3వపేజిలో ఉంది..
- *26-11-71 జమీన్ రైతులో గోపి కాలమ్ "మాట కచ్చేరి" అరంభమయింది.
- నెల్లూరు వర్దమాన సమాజం ప్రచురణలు 1.ఫిడేలు రాగల డజన్, 2.కవిత్రయ కవితా వైజయంతి, 3.వేమన పాశ్చాత్త్యులు
- యూత్ కాంగ్రెస్ వారపత్రిక సంపుటాలు
- ఎం.వి.ఎస్.ప్రసాద్, న్యూస్ ఎడిటర్, ఆకాశవాణి, విజ్జయవాడ కేంద్రం.
- గోపాలకృష్ణ ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్య సంచిక 'వివిధ'లో, వార్త, ఉదయం దినపత్రికల్లో, ఈ భూమి వారపత్రికలో, రాసిన వ్యాసాలు.
- గోపాలకృష్ణ పుస్తకాలు: 1.ఇంద్రధనుస్సులో ఏడోరంగు,2.మధురవాణి ఊహాత్మక ఆత్మకథ, 3.ఆమె లేఖలు, 4.డైరీస్ ఆఫ్ గురజాడ, 5.గురుజాడలు
- గోపాలకృష్ణ, మన్నం రాయుడు, కాళిదాసు పురుషోత్తం సంపాదకులుగా మనసు ఫౌండేషన్ ప్రచురించిన 'గురుజాడలు', గురజాడ లబ్ధ రచనల సమగ్ర సంపటం,2012.
- #జమీన్ రైతులో తన కాలమ్ "మాట కచేరీ" చివరి వ్యాసం 26-8-1983 న ప్రచురించబడింది, కనుక అక్కడ ఉద్యోగం మానుకొని హైదరాబాదు, ఉదయంలో చేరినట్లు అనుకోవచ్చు.
- ఈ వ్యాసరచయిత ఆత్మీయ మిత్రుడుగా, గోపాలకృష్ణ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలు, నెల్లూరు జమీన్ రైతు పత్రికలో వార్తలు, వర్దమాన సమాజం గ్రంథాలయం మినిట్స్ బుక్, కె.వి.ఆర్ జైలు డైరీలో పేర్కొన్న అంశాలు ఈ రచనకు ఉపయోగించుకోన్నాను.