పోల్కంపల్లి శాంతాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోల్కంపల్లి శాంతాదేవి
జననంపోల్కంపల్లి శాంతాదేవి
1942
మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలం,శ్రీరంగాపూర్ గ్రామం
ప్రసిద్ధితెలుగు నవలా రచయిత్రి
మతంహిందూ
తండ్రిసూగూరు హనుమంతరావు
తల్లిసీతమ్మ

పోల్కంపల్లి శాంతాదేవి సామాజిక సమస్యలను, స్త్రీల అవస్థలను తన నవలలో చిత్రీకరిస్తూ సామాజిక చైతన్యాన్ని కలిగిస్తున్న ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి. సహజత్వంతో, వాస్తవికతకు దగ్గరగా, తాత్వికతతో కూడిన రచనలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపూర్ ఈమె స్వస్థలం. ఈమె కథలపై శరత్ ప్రభావం ఎక్కువ. 1942లో జన్మించింది. సీతమ్మ, సూగూరు హనుమంతరావులు ఈమె తల్లిదండ్రులు.[1] వీరి పూర్వికులు, తండ్రిగారు కూడా వనపర్తి సంస్థానాధీశుల దగ్గర ఉన్నతోద్యోగులుగా పనిచేశారు. విద్యార్థి దశ నుండే రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు. 1961లో వీరి మొదటి రచన ముక్తిమార్గం కుసుమహరనాథ పత్రికలో అచ్చైంది. ప్రజామత వారపత్రికలో ధారావాహికగా వీరి మొదటి నవల పాణీగ్రహం వచ్చింది.అదే పత్రికలో ఆ తరువాత కాలపురుషుని హెచ్చరిక వచ్చింది. ఈమె 40 కు పైగా నవలలు రాశారు. చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం,పచ్చిక, పూజాసుమం, ప్రేమ బంధం, జీవన సంగీతం, సుమలత, దేవదాసి, పుష్యమి, వరమాల వీరి నవలలలో కొన్ని. 7 కథాసంపూటాలు వెలువరించింది. 1974లో ముళ్ళగులాభి అను కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకవచ్చింది. జీవన సంగీతం, ప్రేమబంధం నవలలకు ఆంధ్రప్రభ నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. చండీప్రియ, పుష్యమి, వరమాల, పచ్చిక నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. ఉజ్జ్వల. నవజ్యోతి, నవసాహితీ వంటి పలు సంస్థలు వీరి రచనలను ముద్రించాయి. జ్యోతి, జాగృతి వంటి పలు పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఈమె మంచి వక్త కూడా. ఆదర్శగృహిణి. అల్లికలు,చిత్రలేఖనం, సాహిత్య కార్యక్రమాలాలో పాల్గొనడం ఆమె అభిరుచులు.

పురస్కారాలు

[మార్చు]
  1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2

మూలాలు

[మార్చు]
  1. మహబూబ్ నగర జిల్లా సర్వస్వం, సం.బి.ఎన్. శాస్త్రి, మూసి పబ్లికేషన్స్, హైదరాబాద్,1993, పుట - 663