ప్రతాపరుద్ర గజపతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రతాపరుద్ర గజపతి 1497 నుండి 1540 వరకు ఉత్తరాంధ్ర మరియు ఒడిషా ప్రాంతాలను పాలించిన మూడవ గజపతి వంశ చక్రవర్తి. పురుషోత్తమ గజపతి కుమారుడు. ఈయన తల్లి పద్మావతి లేదా రూపాంబిక. ఈయన తండ్రి మరణంతో 1497లో పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పటికి ఈయన తండ్రి పాలనలో కొండవీడు ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడు. ఆ తరువాత తన పెద్ద కొడుకు వీరభద్ర గజపతిని కొండవీటికి అధిపతిగా నియమించాడు.

శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైన వెంటనే 1510లో గజపతి దక్షిణ ప్రాంతాలను రక్షించుకోవడానికి సైన్యము తరలించాడు. ఇదే అదనుగా బెంగాల్ సుల్తాన్ హుస్సేన్ షా ఒడిషాపై దండెత్తి ప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయములోని విగ్రహాలను ధ్వంసము చేశాడు. ప్రతాపరుద్రుడు హుటాహుటిన బెంగాల్ సుల్తాన్ను ఎదిరించడానికి ఉత్తరానికి తిరిగి వచ్చినా హుస్సేన్ షా షరతులు అంగీకరించక తప్పలేదు.

1513లో కృష్ణదేవరాయలు, ప్రతాపరుద్ర గజపతి పై యుద్ధము ప్రకటించి దండెత్తినాడు. ఆరు సంవత్సరాల పోరాటము తరువాత 1519 లో రాయలకు తన కూతురు జగన్మోహిని (తుక్కా) నిచ్చి వివాహము చేసి సంధి చేసుకున్నాడు. సంధితో విజయనగర సామ్రాజ్యము వలన ముప్పుతొలగిపోయినా బహుమనీ సుల్తానులతో పోరాడవలసి వచ్చింది.[1] విజయనగరములో బందీగా ఉన్న ప్రతాపరుద్రుని పెద్ద కుమారుడు వీరభద్ర గజపతి చెరలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

సమకాలిక ఒరియా మరియు బెంగాళీ రచనలు ప్రతాపరుద్రునికి భానుమతి, విద్యుకాంతి, గౌరి మరియు చంద్రకళ అని నలుగురు భార్యలని చెబుతున్నాయి. అయితే సరస్వతీ విలాసము ప్రకారము ప్రతాపరుద్రునికి ముగ్గురు భార్యలు. వారి పేర్లు పద్మ, ఇళా మరియు లక్ష్మి.

ప్రతాపరుద్రుడు కళా పోషకుడు, సంస్కృత పండితుడు. ఈయన పాలనా యుగాన్ని ఒరియా సాహిత్యానికి సువర్ణ దశగా భావిస్తారు. సంస్కృత కవి పండితులను ఆదరించి పోషించాడు. ఈయన ఆస్థానములో సంస్కృత, ఒరియా కవులతో పాటు అనేక తెలుగు కవులు కూడా ఉన్నారు. సరస్వతీవిలాసం, ప్రతాపమార్తాండ, నిర్ణయసంగ్రహ మరియు కౌతుకచింతామణి కావ్యాలు ప్రతాపరుద్రుడు రచించాడని చెప్పబడుతున్నవి. కానీ అందులో మొదటిదైన సరస్వతీవిలాసం ఐదు ఉల్లాసాల ప్రసిద్ధ కావ్యం. దీనిని ప్రతాపరుద్రుని ఆస్థానంలోని ఆంధ్రకవి లొల్ల లక్ష్మీధర భట్టు రచించాడు. రెండవదైన ప్రతాపమార్తాండను కాశీకి చెందిన ఆస్థానకవి రామకృష్ణ భట్ట వ్రాశాడు. ప్రతాపమార్తాండ కావ్యాన్ని పరిశీలించిన రాజగురువు బలభద్ర మిశ్రా ఆయన్ను పండిత శిరోమణి అనే బిరుదుతో సత్కరించాడు.[2]

ప్రతాపరుద్రుడు గొప్ప వైష్ణవ భక్తుడు. ఈయన పూరీ జగన్నాథ ఆలయములోని సభా మండపాన్ని నిర్మింపజేశాడు. ఈయన సమకాలీకుడైన చైతన్య మహాప్రభువు ఆదరించి, ఆశీస్సులు అందుకున్నాడు. పూరీలోని జగన్నాథ రథయాత్రకు ముందుగా వెళుతూ బంగారు చీపురుతో స్వయంగా వీధులు ఊడ్చేవాడని చైతన్య చరితామృతంలో తెలుపబడింది.[3]

ప్రతాపరుద్ర గజపతి 1540లో మరణించాడు. ఆయన మరణం తర్వాత యుక్తవయసు రాని కుమారులు కులువ దేవ మరియు కఖరువ దేవ ఒకరి తర్వాత ఒకరు రాజ్యానికి వచ్చారు. వీరిద్దరిని హతమార్చి 1541లో ప్రతాపరుద్ర గజపతి వద్ద మంత్రిగా పనిచేసిన గోవింద విద్యాధరుడు రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ప్రతాపరుద్ర గజపతికి అనేక మంది కుమారులు కలరు. అయితే వారందరూ ప్రతాపరుద్రుడు చనిపోయిన తర్వాత హత్యచేయబడ్డారని కథనం.

మూలాలు[మార్చు]

  • ద హిస్టరీ ఆఫ్ ద గజపతి కింగ్స్ ఆఫ్ ఒడిషా - ప్రభాత్ ముఖర్జీ