ప్రత్యక్ష కార్యాచరణ దినం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1946లో డైరెక్ట్ యాక్షన్ డే లేదా 'ప్రత్యక్ష కార్యాచరణ దినం' హిందూ, ముస్లిం గుంపుల కలహాలుగా పరిణమించాకా గాయపడ్డ, మరణించినవారు

ప్రత్యక్ష కార్యాచరణ దినం లేదా డైరెక్ట్ యాక్షన్ డే (16 ఆగస్టు 1946), గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అన్న మరోపేరుతోనూ ప్రసిద్ధమైన రోజున బ్రిటీష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్సుకు చెందిన కలకత్తా నగరంలోని హిందూ, ముస్లిముల మధ్య విస్తృతంగా దాడులు, దోపిడీలు, నరమేధం చోటుచేసుకున్నాయి.[1] పొడవైన కత్తుల వారం (ద వీక్ ఆఫ్ లాంగ్ నైవ్స్)గా పేరుపొందిన రక్తసిక్తమైన వారానికి ఇదే ప్రారంభదినంగా నిలిచింది.[2][3] బ్రిటీష్ వారు దేశాన్ని సమైక్యంగానే వదిలివెళ్ళిపోతే హిందూ ఆధిక్యత వల్ల తాము నష్టపోవాల్సి వస్తుందంటూ బ్రిటీష్ వారికీ, కాంగ్రెస్ పార్టీ నాయకులకూ ముస్లింల భావాల బలాన్ని ప్రదర్శించడానికి ముస్లిం లీగ్ కౌన్సిల్ ప్రత్యక్ష కార్యాచరణను ప్రకటించింది. దీని ఫలిగతంగా బ్రిటీష్ ఇండియాలో అంతకుముందు ఎప్పుడూ చూడని దారుణమైన మతకల్లోలాలను దేశం చూసింది.

1946 ఇండియా క్యాబినెట్ మిషన్ భారతదేశానికి డొమినియన్ స్థాయిని, అధికార బదిలీని ఇచ్చే ప్రతిపాదనలపై భారతదేశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్, ముస్లిం లీగ్ చర్చల్లో పాల్గొన్నాయి. వాయువ్య ప్రాంతం, పంజాబ్, సింధ్, బెలూచిస్థాన్ ఒక గ్రూప్, మద్రాస్, బొంబాయి, మధ్యభారత్, యునైటెడ్ ప్రావిన్స్ వంటివన్నీ మరో గ్రూపు, బెంగాల్, అస్సాం మరో గ్రూపుగా ఏర్పాటుచేసి వీటితో భారత డొమినియన్ తయారుచేయాలని, ఏ గ్రూపైనా దేశం నుంచి విడిపోదలుచుకుంటే విడిపోవచ్చనీ, గ్రూపు నుంచి విడివిడి రాష్ట్రాలూ విడిపోవచ్చనీ వివిధ ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్నిటిని లీగ్, మరికొన్నిటిని కాంగ్రెస్ అంగీకరించలేకపోయాయి. చివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా మిషన్ వీగిపోయింది. పాకిస్థాన్ ఏర్పాటును ఏకైక లక్ష్యంగా పేర్కొంటూ జిన్నా ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపునిచ్చారు.[4]

అప్పట్లో బెంగాల్ మతపరమైన స్థితి చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రావిన్సులో ముస్లిములు జనాభాలో అధిక సంఖ్యలో ఉండేవారు (56% ముస్లింలు, 42% హిందువులు), ముస్లింలు ప్రధానంగా తూర్పుప్రాంతంలో ఉండేవారు.[5] ఈ జనాభా నిర్మాణం, మరికొన్ని ఇతర కారణాల ఫలితంగా 1935లో ప్రాంతీయ ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తి పథకం కింద ఏర్పరిచిన ప్రభుత్వాల్లో ముస్లిం లీగ్ పూర్తిస్థాయి అధికారాన్ని పొందిన ఏకైక ప్రావిన్సుగా బెంగాల్ నిలిచింది. బెంగాల్ ప్రావిన్సులో కాంగ్రెస్, కమ్యూనిస్టు, హిందూ మహాసభ పార్టీలను తట్టుకుని మరీ ప్రభుత్వానికి అవసరమైన సీట్లు సాధించింది. హిందూ జాతీయవాది పార్టీ అయిన హిందూ మహాసభను మధ్య కలకత్తా ఆర్థిక వ్యవస్థను శాసించేస్థితిలో ఉన్న, రాజస్థాన్ నుంచి వలసవచ్చిన సంపన్నులైన మర్వాడీ వ్యాపార వర్గం మద్దతు కలిగివుంది.[6] వీటన్నిటి ఫలితంగా కలకత్తా నివాసులైన 64 శాతం హిందువులు, 33 శాతం ముస్లిములు రెండు తీవ్ర విరోధ సమూహాల్లో తయారయ్యాయి.[5] ఈ నేపథ్యంలో ప్రత్యక్ష చర్యకు పిలుపునివ్వడం కలకత్తాలో విస్తారమైన దాడులు, అల్లర్లకు కారణమైంది.[7][8]

ఈ హింస చుట్టుపక్కల ప్రాంతాలైన నౌకాలీకి అక్కడి నుంచి బీహార్, యునైటెడ్ ప్రావిన్సులు (ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతం), పంజాబ్ నుంచి వాయువ్య సరిహద్దు ప్రావిన్సుకు మతపరమైన అల్లర్లుగా వ్యాపించింది. ఈ ఘటనలు తర్వాతి భారత విభజనకు బీజాలు వేశాయి.

నేపథ్యం[మార్చు]

రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం నుంచీ బ్రిటీష్ ప్రభుత్వం దేశ స్వాతంత్ర్యాన్ని తేల్చకుండా యుద్ధంలోకి భారతీయులను దించడం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకత కనబరిచింది. యుద్ధానికి రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు వచ్చిన క్రిప్స్ మిషన్ విఫలమైంది. ఆపైన కాంగ్రెస్ వారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో బ్రిటీష్ వారికి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో సహకరించి, ప్రభుత్వం అందించిన సహకారంతో ముస్లిం లీగ్ దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తరించింది.

1946లో బ్రిటీష్ రాజ్కు వ్యతిరేకంగా చేస్తున్న భారత స్వాతంత్ర్యోద్యమం కీలకమైన దశకు చేరుకుంది. భారత దేశ స్వాతంత్ర్యానికి అనుకూలుడైన లేబర్ పార్టీ నాయకుడు, బ్రిటీష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ భారతదేశం కామన్వెల్త్ దేశల్లో చేరి డొమినియన్ హోదాలో స్వాతంత్ర్యాన్ని పొందడానికి బ్రిటీష్ రాజ్ నుంచి భారతీయ నాయకత్వానికి అధికార బదిలీకి సంబంధించిన ప్రణాళికలు చర్చించడానికి ముగ్గురు సభ్యుల క్యాబినెట్ మిషన్ కమిటీని భారతదేశానికి పంపారు.[5] అప్పటికే జరిగిన రాజ్యాంగ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ సాధారణ నియోజకవర్గాల్లో ఎక్కువశాతాన్ని గెలుచుకోగా, ముస్లిం లీగ్ ముస్లిం ప్రత్యేక నియోజకవర్గాల్లో తిరుగులేని మెజారిటీ సాధించింది. ముస్లిం లీగ్ పిలుపుకు భారత ముస్లింలు స్పందిస్తున్నారని, ముస్లింలలో పార్టీకి గట్టి మద్దతు ఉందని పరోక్షంగా నిరూపితమైంది.[9] మే 16, 1946న జరిగిన రాజ్యాంగ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీలుగా నిలిచిన కాంగ్రెస్, ముస్లింలీగ్ లను సమావేశపరిచి మిషన్ భారత డొమినియన్, దాని ప్రభుత్వాలకు సంబంధించిన ప్రణాళికల గురించి వివరించారు.[8][10] జూన్ 16న, మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి మిషన్ హిందూ-ఆధిక్య భారతదేశం, ముస్లిం-ఆధిక్య పాకిస్తాన్లుగా దేశాన్ని విభజించే ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రతిపాదించింది.[11] దీని ప్రకారం భారతదేశపు సంస్థానాలు రెండు డొమినియన్లలో ఏదో ఒకదానిలో చేరడానికో, స్వాతంత్ర్యాన్ని పొందడానికో అధికారం ఉంటుంది.

ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా కేబినెట్ మిషన్ జూన్ 16 ప్రణాళికను అంగీకరించగా, కాంగ్రెస్ పూర్తిగా తిరస్కరించింది.[8][12] ఐతే అట్లీ మే నెలలో చేసిన ప్రణాళికను కాంగ్రెస్ ఆమోదించింది. అట్లీ ఆ ప్రణాళికలో ఏ పార్టీకి అనుకూలమైన అంశాలను ఆ పార్టీకి చెప్తూ ప్రణాళికను రెండు పక్షాలతోనూ ఆమోదింపజేసుకుని, క్యాబినెట్లోకి ఇరుపక్షాల వారూ చేరేందుకు ఒప్పించారు.[4] జూలై 10న జవహర్‌లాల్ నెహ్రూ బొంబాయిలోని పత్రికా సమావేశం ఏర్పరిచి కాంగ్రెస్ రాజ్యాంగ సభలో చేరేందుకే అంగీకరించిందని, కేబినెట్ మిషన్ ప్లాన్లో పాకిస్థాన్ ఏర్పాటుకు అనుకూలమైన అంశాలు అంగీకరించలేమని, ఆ ప్రకారం మార్పులుచేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.[12]

రాజ్యంగ సభలో హిందూ ఆధిపత్యానికి భయపడుతూ[13], జిన్నా బ్రిటీష్ క్యాబినెట్ మిషన్ ను ఖండించి, రాజ్యంగ సభలో చేరబోమంటూ, కాంగ్రెస్, బ్రిటీష్ వర్గాలపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమయ్యారు.[14] జూలై 1946లో జిన్నా బొంబాయిలోని తన గృహంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించి పాకిస్థాన్ ఏర్పాటే తన ఉద్దేశమని చాటారు. ముస్లిం లీగ్ ఓ పోరాటాన్ని ప్రారంభించేందుకు సంసిద్ధమవుతోందని, అందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుందని ప్రకటించారు.[14] రాజ్యాంగ సభను బాయ్ కాట్ చేసేందుకు నిర్ణయించుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ లు కలిసివున్న మధ్యంతర ప్రభుత్వానికి అధికారాన్ని బదిలీ చేసే బ్రిటీష్ ప్రణాళికను వ్యతిరేకించారు. ఒకవేళ ముస్లిములకు పాకిస్థాన్ ఇవ్వకుంటే ప్రత్యక్ష కార్యాచరణను ప్రారంభించగలనని చెప్పారు.[14] ప్రత్యక్ష కార్యాచరణ అంటే ఏమిటో నిర్ధారణగా చెప్పమని విలేకరి కోరినప్పుడు: "కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వారి ప్రణాళికల గురించి అడగండి. వారు మిమ్మల్ని నమ్మితే, నేనూ నమ్ముతాను. మీరెందుక నన్ను మాత్రమే చేతులు జోడించి కూర్చోవాలని ఆశిస్తారు? నేనూ సమస్యలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాను."[14]

తర్వాతి రోజున జిన్నా ముస్లిములు ప్రత్యేక రాజ్యాన్ని సాధించుకునేందుకు 1946 ఆగస్టు 16 ప్రత్యక్ష కార్యాచరణ దినం అని ప్రకటించారు.[14] గ్రేట్ డివైడ్ అన్న గ్రంథంలో హెచ్.వి.హడ్సన్, " (ముస్లిం లీగ్)వర్కింగ్ కమిటీ (జిన్నాను) అనుసరించి 16 ఆగస్టును ప్రత్యక్ష కార్యాచరణ దినంగా పాటించాలని భారత దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లింలను కోరింది. ఆ రోజున దేశవ్యాప్తంగా లీగ్ తీర్మానాన్ని వివరించే సమావేశాలు జరగగలవు. ఈ సమావేశాలు, ఊరేగింపులు కేంద్ర లీగ్ నాయకుల ఉద్దేశాల మేరకు ఒక సాధారణ స్థలం కాక, తక్కువ కల్లోలాలతో జరిగాయి - ఒక్క విస్తారమైన, విషాదకరమైన మినహాయింపు తప్ప.. అందరికీ అనూహ్యమైనది జరిగిపోయింద"ని గుర్తుచేసుకున్నారు.[15]

ప్రారంభం[మార్చు]

11-14 కలకత్తా అల్లర్ల నుంచి మతపరమైన ఉద్రిక్తతలు పైస్థాయిలో ఉన్నాయి. హిందూ, ముస్లిం దినపత్రికలు ప్రజల భావోద్వేగాలను విభజనకరమైన, రెచ్చగొట్టే వార్తాకథనాలతో రెండు వర్గాల మధ్య విభేదాలను తీవ్రతరం చేశాయి[16]

ఆగస్టు 16ను జిన్నా ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించడంతో అప్పటి బెంగాల్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎల్.వాకర్ సలహాతో ముస్లిం లీగ్ కు చెందిన అప్పటి బెంగాల్ ప్రధానమంత్రి హుస్సేన్ షాహీద్ సుహ్రవర్దీ బెంగాల్ గవర్నర్ సర్ ఫ్రెడెరిక్ బరోస్ ను ఆ రోజున పబ్లిక్ హాలిడే (సెలవుదినం) ప్రకటించాలని కోరారు. గవర్నర్ బారోస్ దీనికి అంగీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలు, షాపులు మూసివుండడంతో వాటివద్ద పికెటింగ్ చేసే అవకాశం, వాటి ధ్వంసం వంటివి తప్పుతాయన్న ఆలోచనతో వాకర్ ఈ ప్రతిపాదన చేశారు.[1][17][18] సెలవు రోజున ఖాళీగా ఉన్నవారు ముస్లింలీగ్ నాయకత్వం సందేహాస్పందంగా ఉన్న ప్రదేశాల్లో హర్తాళ్ళు నిర్వహించేందుకు వీలవుతుందంటూ సెలవు దినంగా ప్రకటించడాన్ని బెంగాల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది. తమ సంకుచిత లక్ష్యాలను సాధించుకునేందుకు మతపరమైన పాలసీల్లో మునిగితేలుతూన్నదని లీగ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఆరోపించింది.[19] సెలవు దినం ప్రకటిస్తే తమ సమర్థకుల షాపులు కూడా మూసివేయక తప్పనిస్థితి వస్తుందనీ, తద్వారా ముస్లిం లీగ్ ప్రకటించిన హర్తాళ్ లో అనిష్టంగా తప్పసరి స్థితిలో చేయివేసినట్టవుతుందని కాంగ్రెస్ నాయకులు భావించారు. [17] ఆగస్టు 14న, బెంగాల్ చట్టసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు కిరొణ్ శంకర్ రాయ్ ఆ రోజు వ్యాపారాలు నిర్వహించుకోదలచిన హిందూ వ్యాపారస్తులను సెలవు పాటించకుండా కూడా హర్తాళ్ ను వ్యతిరేకిస్తూ వ్యాపారాలు తెరిచేవుంచమనీ విజ్ఞప్తి చేశారు.[20] ఎప్పుడూ హర్తాళ్ళు, సమ్మెలు వంటివి కాంగ్రెస్ పార్టీయే నిర్వహించడంతో ఈసారి తాము నిర్వహించడంలో కాంగ్రెస్ కు వాటిపై గల గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్టు ఓ గర్వాతిశయం కూడా ముస్లింలీగ్ లో ఉంది.[17] ఏదేమైనా లీగ్ తన తీర్మానంపై ముందుకువెళ్ళింది, ముస్లిం వార్తాపత్రికలు ఆరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా ప్రచురించాయి.

కలకత్తా నుంచి ముస్లిం లీగ్ ఎమ్మెల్యే అయిన రఘిబ్ ఆహ్సన్ తన సంపాదకత్వంలోని ప్రభాశీలమైన స్థానిక ముస్లిం వార్తాపత్రిక స్టార్ ఆఫ్ ఇండియాలో ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలను సవివరంగా ప్రచురించారు. కార్యక్రమం అత్యవసర సేవలు తప్పిస్తే సామాజిక, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన అన్ని స్థాయిల్లోనూ హర్తాళ్, సాధారణ సమ్మె చేయాలని పిలుపునిచ్చింది. ఊరేగింపులు కలకత్తా, హౌరా, హుగ్లీ, మెటిబ్రుజ్, 24 పరగణాలకు చెందిన పలు ప్రాంతాల నుంచి ఊరేగింపులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఓక్టెర్లోనీ స్తూపం (ప్రస్తుత షహీద్ మినార్) వరకు పాదయాత్ర చేసి అక్కడ కలవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి హుసేన్ షహీద్ సుహ్రావర్దీ నేతృత్వం వహించే సంయుక్త భారీ ర్యాలీ సాగుతుంది. జుమా ప్రార్థనలకు కొద్దిసేపు ముందు లీగ్ సూచిస్తోన్న కార్యాచరణను వివరించేందుకు ప్రతీ వార్డులోనూ ఉన్న మసీదు వద్ద 3 పనివాళ్ళను నియమించాలని స్థానిక శాఖలకు సూచించారు. పైగా ప్రతీ మసీదు వద్ద శుక్రవారం జుమా ప్రార్థనల అనంతరం ముస్లిం ఇండియా స్వాతంత్ర్యం కోసం అంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. [21] ప్రత్యక్ష కార్యాచరణ దినం పవిత్ర రంజాన్ మాసంలో రావడాన్ని ప్రస్తావిస్తూ మహమ్మద్‌ ప్రవక్త విగ్రహారాధకుల (హీథెనిజం)తో ఘర్షణ పడడం, వెనువెంటనే మక్కాపై విజయం, అరేబియాలో స్వర్గ రాజ్యాన్ని నెలకొల్పడంతో రానున్న నిరసన కార్యక్రమాలను పోలుస్తూ ఖురాన్ నుంచి దివ్య ప్రేరణ ఉన్నట్టుగా రాశారు.[21]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 3. L/I/1/425. The British Library Archives, London.
 4. 4.0 4.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 5. 5.0 5.1 5.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 6. The Calcutta Riots of 1946 Archived 2016-05-14 at the Wayback Machine The Encyclopedia of Mass Violence
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 8. 8.0 8.1 8.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 9. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 10. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 11. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 12. 12.0 12.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 13. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 14. 14.0 14.1 14.2 14.3 14.4 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 15. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 16. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 17. 17.0 17.1 17.2 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Tsugitaka అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 18. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 19. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 20. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 21. 21.0 21.1 ప్రోగ్రాం ఆఫ్ డైరెక్ట్ యాక్షన్, స్టార్ ఆఫ్ ఇండియా, ఆంగ్లం, Published: 13 ఆగస్టు 1946.