Jump to content

ప్రొబీర్ సేన్

వికీపీడియా నుండి
ప్రొబీర్ సేన్
1952 జూన్‌లో ఎలిజబెత్ రాణికు షేక్‌హ్యాండు ఇస్తూ ప్రొబీర్ సేన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ప్రొబీర్ కుమార్ సేన్
పుట్టిన తేదీ(1926-05-31)1926 మే 31
కొమిల్లా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిషు భారతదేశం (ప్రస్తుత బంగ్లాదేశ్)
మరణించిన తేదీ1970 జనవరి 27(1970-01-27) (వయసు 43)
కోల్‌కతా
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రవికెట్ కీపరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 43)1948 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1952 డిసెంబరు 12 - పాకిస్తాన్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 14 82
చేసిన పరుగులు 165 2,580
బ్యాటింగు సగటు 11.78 23.24
100లు/50లు 0/0 3/11
అత్యధిక స్కోరు 25 168
వేసిన బంతులు 150
వికెట్లు 7
బౌలింగు సగటు 15.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/4
క్యాచ్‌లు/స్టంపింగులు 20/11 108/36
మూలం: CricInfo, 2019 మార్చి 13

ప్రొబీర్ కుమార్ "ఖోఖాన్" సేన్ (1926 మే 31 - 1970 జనవరి 27) 1948 నుండి 1952 వరకు 14 టెస్టుల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటరు.[1] అతను ప్రముఖ వ్యాపార కుటుంబంలో అమియా సేన్, బసంతి సేన్ దంపతులకు జన్మించాడు.

జీవిత చరిత్ర

[మార్చు]

"ఖోఖాన్" అని పిలువబడే ప్రోబీర్ సేన్, టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి బెంగాలీ, భారతదేశం తరపున వికెట్లు కీపింగ్ చేసిన మొదటి బెంగాలీ. 20 క్యాచ్‌లు, 11 స్టంపింగ్‌లు చేసాడు.

సేన్ తన మొదటి ఫస్ట్-క్లాస్ క్రికెట్ గేమ్‌ను 1943లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఆడాడు. అప్పటికి అతనికి 17 సంవత్సరాల వయసు. అప్పుడే లా మార్టినియర్ పాఠశాల చదువు పూర్తైంది. బలిష్టమైన కుడిచేతి వాటం వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ అయిన సేన్, మొదటిసారిగా 1947-48లో ఆస్ట్రేలియాలో భారత జట్టుతో కలిసి పర్యటించాడు, అక్కడ అతను జెన్నీ ఇరానీకి రిజర్వ్ కీపర్‌గా వ్యవహరించాల్సి ఉంది. ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో ఆకట్టుకున్న తర్వాత అతను 1948 కొత్త సంవత్సరం రోజున మెల్‌బోర్న్‌లో తన తొలి టెస్టు ఆడడానికి మూడవ టెస్ట్‌కు జట్టులోకి వచ్చాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఐదో టెస్టులోనూ నాలుగు క్యాచ్‌లు పట్టాడు. ఆస్ట్రేలియా 575 పరుగులు చేసినప్పటికీ అతను నాలుగు బైలు మాత్రమే ఇచ్చాడు. అతను 1947-48లో దక్షిణ ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు-రోజుల మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మాన్‌ను స్టంప్ చేసిన ఏకైక భారతీయ వికెట్ కీపర్. 1948-49లో వెస్టిండీస్ భారతదేశంలో పర్యటించినప్పుడు అతను స్వదేశంలో తన మొదటి టెస్టు సిరీస్‌ ఆడాడు. మొత్తం ఐదు టెస్టుల్లోనూ ఆడాడు.

1951-52లో మద్రాస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టు అతని అత్యుత్తమ క్షణం. ఆ చారిత్రాత్మక విజయంలో సేన్ చెప్పుకోదగ్గ పాత్ర పోషించాడు. వినూ మన్కడ్‌ బౌలింగులో ఐదు స్టంపింగ్‌లు చేశాడు. అందులో మొదటి ఇన్నింగ్స్‌లో చేసినవి నాలుగు. జట్టు ప్రసిద్ధ విజయాన్ని సాధించడంలో అది సహాయపడింది. 1952లో ఇంగ్లండ్ పర్యటన, 1952-53లో పర్యాటక పాకిస్థాన్ జట్టుతో జరిగిన రెండు టెస్టుల తర్వాత అతను జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు.

బ్యాట్‌తో సేన్ దిగువ వరుసలో ఆడేవాడు. అతను టెస్టుల్లో అర్ధ శతకం కూడా చేయలేదు. అప్పుడప్పుడు బౌలింగు చేసేవాడు. 1954-55లో ఒరిస్సాతో జరిగిన రంజీ ట్రోఫీ గేమ్‌లో బౌలర్‌గా అతను హ్యాట్రిక్ సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో కేవలం ఇద్దరు వికెట్ కీపర్లు మాత్రమే బౌలింగులో హ్యాట్రిక్‌లు సాధించారు. వారు: 1954–55లో కటక్‌లో ఒరిస్సాపై బెంగాల్ తరఫున ప్రొబిర్ సేన్ ఒకరు కాగా, మరొకరు 1965లో క్లాక్టన్‌లో ఎసెక్స్‌పై వార్విక్‌షైర్ తరఫున అలన్ స్మిత్.

ప్రొబీర్‌ అతను తన రంజీ ట్రోఫీ కెరీర్‌ను 30.44 సగటుతో 1796 పరుగులతో ముగించాడు.

సేన్ 1970లో కలకత్తాలో ఒక క్రికెట్ మ్యాచ్‌ ఆడిన తర్వాత గుండెపోటు వచ్చి మరణించాడు. అతనికి భార్య రీనా సేన్, కుమార్తె మధుశ్రీ ధర్, కుమారుడు అభిజిత్ సేన్ ఉన్నారు. అతని సోదరుడు రణబీర్ సేన్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, బెంగాల్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

వారసత్వం

[మార్చు]

సేన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కోల్‌కతాలో 'పి. సేన్ మెమోరియల్ ట్రోఫీ' నిర్వహిస్తారు. ఇందులో అగ్రశ్రేణి భారతీయ అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులు పాల్గొంటారు. [2] [3]

మూలాలు

[మార్చు]
  1. "How many players have started their careers with three successive fifties in ODIs?". ESPN Cricinfo. Archived from the original on 25 May 2021. Retrieved 25 May 2021.
  2. Sarkar, Sandip (24 June 2023). "ইডেনে দুরন্ত সেঞ্চুরি শাকিরের, ভবানীপুরকে হারিয়ে পি সেন ট্রফি চ্যাম্পিয়ন মোহনবাগান" [Shakir's stunning century at Eden, P Sen Trophy champions Mohun Bagan beat Bhawanipore]. bengali.abplive.com (in Bengali). Kolkata: Anandabazar Patrika. Archived from the original on 25 June 2023. Retrieved 25 June 2023.
  3. Sen, Debasish (24 June 2023). "টানটান ম্যাচে ভবানীপুর ক্লাবকে হারিয়ে পি সেন ট্রফির চ্যাম্পিয়ন মোহনবাগান" [P Sen Trophy champion Mohun Bagan beat Bhawanipore Club in a tight match]. sangbadpratidin.in (in Bengali). Kolkata: Sangbad Pratidin. Archived from the original on 25 June 2023. Retrieved 25 June 2023.