బుక్కపట్నం రాఘవాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుక్కవట్నం రాఘవాచార్యులు కృష్ణా జిల్లా, పామర్రు మండలం,ఉరుటూరు గ్రామంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య నాటకాలను క్షుణ్ణంగా చదువుకున్న నాటక కళాకోవిదుడు. సంస్కృతం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాలను కూలంకషంగా చదివాడు. ఇతని ఆశయాలకు అనుగుణంగా స్వప్న వాసవదత్త, రాధాకృష్ణ, వేణీ సంహారం మొదలైన నాటకాలను ఆడించి ఆంధ్రదేశంలో అనేకమంది కళావేత్తల ప్రశంసలు అందుకున్నాడు[1].

నాటకరంగంలో శిక్షణ[మార్చు]

జీవితమంతా నాటక సమాజాలలోనే గడిపి అనేక మంది నటులకూ, ప్రయోక్తలకూ శిక్షణ ఇవ్వడంలోనే ఇతని కాలమంతా గడిచిపోయింది. నటునిలో ఏమాత్రం నిపుణత్వం ఉన్నా ఆ నటుడిని రత్నంలా తయారు చేసేవాడు. ఇతను బందరు రామమోహన్ థియేటరులోను, ఇండియన్ డ్రమెటక్ కంపెనీలోను, బాల భారత సంఘంలోను, మైలవరం బాలభారతీ నాటక సమాజంలోనూ నాట్యాచార్యులుగా ఉండి అనేక నాటకాలకు దర్శకత్వం వహించి, ఆనేకమంది నటులను తరిఫీదు చేశాడు. ఇతని శిష్యులలో డి.వి.సుబ్బారావు, పారుపల్లి సుబ్బారావు, జొన్నవిత్తుల శేషగిరిరావు, అద్దంకి శ్రీరామమూర్తి, పంచాంగం రామానుజాచార్యులు, గూడపాటి నరసింహారావు నాయుడు (గురజ నాయుడు), ఉప్పులూరి సంజీవరావు, తుంగల చలపతిరావు మొదలైన ఉద్దండులు ఉన్నారు.

ఎన్ని నాటక సమాజాలలో పనిచేసినా, ఎంతమంది నటులకు శిక్షణ ఇచ్చినా ఇతనికి ఏమాత్రం తృప్తి కలగలేదు. ఆనాటి నాటక కళావైఖరులు ఇతనికి ఏమాత్రం నచ్చలేదు. ఉద్దృతంగా సాగిన ఔత్సాహిక నాటక రంగ ఆదర్శాలు వృత్తినాటక సమూజాల స్థాయికి దిగజారడంతో విసుగెత్తి వేసారి పోయాడు. దానితో 1924 ప్రాంతంలో 'భరతముని బృందం' అనే పేరున విజయవాడలో ఒక నాటక కళాశాలను స్థాపించి ఎంతో మంది నటులకు, నాటక ప్రయోక్తలకు ఆదర్శంగా శాస్త్రీయ దృష్టితో శిక్షణ ఇచ్చాడు. ఇతనికి చేదోఁడు వాదోడుగా ఉండి గూడవల్లి రామబ్రహ్మం కూడా దోహదంచేశాడు. ఈ శిక్షణాలయం అజరామరంగా నడిచింది. ఆంధ్రదేశంలోనే కాక భారత దేశంలోనే ప్రప్రథమంగా నాటక విద్యాలయం స్థాపించిన ఘనత ఇతనికే దక్కింది. ఒక్కడే ఎంతో పట్టుదలతో నాటక విద్యాలయాన్ని కొంత కాలం నడిపాడు కానీ ఎటువంటకి ఆదరణా లేకపోవడంతో ఆ నాట్య విద్యాలయాన్ని మూసివేశాడు.

రచనలు[మార్చు]

నాటి ప్రదర్శనలనూ, వెరితలలు వేసిన నటుల నటనా విధానాలనూ దుయ్యబడుతూ సంగీత ఇంద్రసభ అనే ప్రహసనాన్ని రచించాడు. విమర్శనాత్మకమైన వాటి నాటక వైఖరులను చిత్రించిన ప్రప్రథమ నాటకం ఇదే. అంతేకాక నాటకరంగంలోని ప్రదర్శన ప్రయోగానికి కొవలసిన అన్ని సూత్రాలనూ వివరించే నాటక దీపిక గ్రంథాన్ని రచించాడు. అంతటితో ఊరుకోక గూడవల్లి రామబ్రహ్మంగారి "ప్రజామిత్ర" పత్రికలో నాటక కళోద్ధరణకు కావలసిన అన్ని మార్గాలనూ వివరిస్తూ అనేక వ్యాసాలు వాశాడు. భరత నాట్య శాస్త్రంలోని శాస్త్రీయమెన సూత్రాలన్నింటినీ నేటి నాటకరంగానికి అన్వయించాలని ఇతని అభిమతం. పైన పేర్కొన్నవే కాకుండా పెరుగుముంత, సతీ మారేడు అనే ప్రహసనాలను, చొక్కామీళ, ధనమా? - గుణమా?, కరుణ, మూడు ముళ్ల ముచ్చట, మీరాబాయి, చిత్ర రథ వీధి, భలే చింతామణి మొదలైన నాటకాలను వ్రాశాడు.

సినిమా రంగం[మార్చు]

ఇతడు నాటకరంగంలోనే కాక సినిమా రంగంలో కూడా ప్రవేశించి శ్రీకృష్ణ లీలలు, బాలయోగిని సినిమాలకు మాటలు, పాటలు వ్రాశాడు. నటులకు శిక్షణ ఇచ్చాడు.

మూలాలు[మార్చు]

  1. నటరత్నాలు - మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి - ఆంధ్రప్రభ వారపత్రిక - తేదీ: 1-3-1972, పేజీ: 17