బుగ్గన రాజేంద్రనాథ్
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (జననం 1970 సెప్టెంబరు 27) ఒక భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, ప్రణాళిక, శాసన వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు.[1] 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ధోన్ నియోజకవర్గానికి శాసన సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2016-19 వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (ఇండియా) (పిఎసి) ఛైర్మన్‌గా కూడా పనిచేశాడు.
దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన ఐటీ, పరిశ్రమల శాఖలను కూడా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ ఇచ్చారు.[2]
జీవిత విశేషాలు
[మార్చు]బుగ్గన రాజేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా లోని బేతంచర్ల లో బుగ్గన రామనాథరెడ్డి (ఐఐటి ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్, బేతంచర్ల గ్రామ సర్పంచి), పార్వతీ దేవి దంపతులకు జన్మించాడు. సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు కె.వి రెడ్డి బుగ్గనకు తాతయ్య.[3]
బుగ్గన రాజేంద్రనాథ్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించాడు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత 1992 లో బళ్లారిలోని రావు బహదూర్ వై మహాబలేశ్వరప్ప ఇంజనీరింగ్ కళాశాల (పూర్వం విజయనగర ఇంజనీరింగ్ కళాశాల) నుండి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టభద్రుడయ్యాడు. అతను తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ భాషలలో నిష్ణాతుడు.
రాజకీయ జీవితం
[మార్చు]స్వాతంత్య్రానికి పూర్వం నుండి భారత రాజకీయాలతో ముడిపడి ఉన్న కుటుంబ నేపథ్యం ఉన్నందున అతను తన కుటుంబ వారసత్వాన్ని అనుసరించడానికి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు. బేతంచెర్ల గ్రామ పంచాయతీకి అతను వరుసగా రెండు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశాడు.
2014 లో వైఎస్‌ఆర్‌సిపి తరపున ధోన్ (అసెంబ్లీ నియోజకవర్గం) నుంచి పోటీ చేసి 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాడు. 2016-19 కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మనుగా పనిచేసాడు. [4]
మృధుస్వభావి, సంస్కారవంతుడైన రాజేంద్రనాథ్ శాసనసభ చర్చల్లో సరళమైన, ఛలోక్తులతో, విషయపరిఙ్ఞానంతో కూడిన ప్రసంగాలు చేసాడు. స్వపక్ష, ప్రతిపక్ష సభ్యులందరి మన్ననలను చూడగొన్నాడు. విలువలు, సంప్రదాయాలు, సంస్కారంతో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు.[ఆధారం చూపాలి]
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు,[5] మంత్రిత్వ శాఖల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 31 అక్టోబర్ 2021న ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[6] ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7] 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.[8]
సామాజిక సేవ
[మార్చు]2008 లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక బాలిక పాఠశాల బ్లాక్‌ను నిర్మించాడు. దీనిని దివంగత సిఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రారంభించాడు.
ఈ ప్రాంతంలో త్రాగునీటి పరిస్థితిని ఆయన గుర్తించాడు. అనేక చెక్ డ్యామ్‌ల నిర్మాణానికి భరోసా ఇవ్వడం ద్వారా సౌకర్యాల పరిస్థితులను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.
మూలాలు
[మార్చు]- ↑ https://www.timesofindia.indiatimes.com%2Findia%2Fjaganmohan-reddy-sworn-in-as-andhra-pradesh-chief-minister%2Farticleshow%2F69574758.cms&psig=AOvVaw0agRlGEDb0n7LwdqqxBp1j&ust=1559310684289708
- ↑ "మంత్రి బుగ్గనకు మరికొన్ని శాఖలు కేటాయింపు". andhrajyothy. Retrieved 2022-03-14.
- ↑ "Buggana Rajendranath Reddy Political Profile". 20 June 2018. Archived from the original on 27 జూలై 2019. Retrieved 22 జనవరి 2020.
- ↑ "Buggana Rajendranath MLA of DHONE Andhra Pradesh contact address & email". nocorruption.in.
- ↑ Sakshi (30 July 2020). "మంత్రుల బాధ్యతల స్వీకరణ". Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
- ↑ Sakshi (31 October 2021). "AP: ఇద్దరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ". Archived from the original on 31 October 2021. Retrieved 31 October 2021.
- ↑ Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
- ↑ "ఎలక్షన్ కమీషన్ వెబ్ సైట్".