Jump to content

బొబ్బిలి బ్రహ్మన్న

వికీపీడియా నుండి
బొబ్బిలి బ్రహ్మన్న
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం ఉప్పలపాటి సూర్యనారాయణరాజు
రచన పరుచూరి సోదరులు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
రావుగోపాలరావు
నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

బొబ్బిలి బ్రహ్మన్న కృష్ణంరాజు, జయసుధ, రావు గోపాలరావు ప్రధాన పాత్రధారులుగా గోపీకృష్ణా మూవీ క్రియేషన్స్ పతాకంపై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నిర్మించిన 1984 నాటి తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి సోదరులు అందించారు. బ్రిటీష్ కాలంలోని కథగా టైటిల్స్ లో చూపించిన ఈ సినిమా బొబ్బిలి ప్రాంతంలోని కోటిపల్లి అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. గ్రామంలోని ఏ నేరానికైనా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన బొబ్బిలి వంశీకుడు బ్రహ్మన్న విచారించి తీర్పు చెప్తూంటారు. ఆ గ్రామ పొలిమేరల్లో పోలీసులు కూడా అడుగుపెట్టరు. ఊళ్ళో చేనేత కార్మికుల పొట్టకొడుతున్న రాయుడి దుర్మార్గాన్ని బయటపెట్టి బ్రహ్మన్న తమ్ముడు రవి కస్తూరి, స్వరాజ్యం అనే చేనేత కార్మికులతో ఓ చేనేత పరిశ్రమ పెట్టిస్తారు. స్వరాజ్యాన్ని చెరబట్టబోయి గొంతు పోగొట్టడంతో రాయుడి కొడుకు బుల్లబ్బాయి ఆమెను వివాహం చేసుకోవాలని బ్రహ్మన్న తీర్పునిస్తాడు. బ్రహ్మన్నకు సుశీల అనే ఆమెకు మధ్య తప్పు సంబంధాన్ని బుల్లబ్బాయి కక్షతో అంటగట్టగా బ్రహ్మన్న భార్య సావిత్రికి గతంలో తాను తప్పుగా చెప్పిన తీర్పు కారణంగా సుశీల భర్త చనిపోవడం, దాంతో తాను ఆమెను చెల్లెలిగా భావించి ఆశ్రయమిచ్చి పిల్లలను చదివించడం చెప్తారు. తప్పనిసరి పరిస్థితిలో స్వరాజ్యాన్ని బుల్లబ్బాయి పెళ్ళి చేసుకుంటారు. కస్తూరి-రవి ప్రేమించుకుంటూండగా, సుశీల కుమారుడు రాంబాబు బ్రహ్మన్న కూతురు రాజేశ్వరి ఒకరినొకరు ఇష్టపడుతూంటారు. ఆ విషయం రవి ద్వారా తెలుసుకున్న బ్రహ్మన్న తన కూతురికి, రాంబాబును ఇచ్చి పెళ్ళిచేయడానికి ఒప్పుకుంటారు. కానీ రాజేశ్వరి ఉయ్యాల ఊగుతుంటే ఆ ఊయల తాడు తెగ్గోసే ప్రయత్నం చేసిన నారాయణ అనే మనిషిపై పొరపాటున పడి ఆమె కళ్ళు పోగొట్టిందని రాయుడు అభియోగం తెస్తాడు. దాంతో బ్రహ్మన్న ఆమెను నారాయణకి ఇచ్చి పెళ్ళి చేయాలన్న తీర్పును ఇస్తారు. ఆ తీర్పు వ్యతిరేకించి రవి దగ్గరుండి రాజేశ్వరి-రాంబాబుల పెళ్ళి జరిపిస్తారు. ఆగ్రహించిన బ్రహ్మన్న వారిని ఊరి నుంచి వెళ్ళగొడతారు. చివరకి నారాయణ కళ్ళుపోలేదని తెలుసుకుని బ్రహ్మన్న-రవి రాయుడి ఆటకట్టిస్తారు.

1983లో పరుచూరి సోదరులను పిలిపించి కె.రాఘవేంద్రరావు కృష్ణంరాజు కథానాయకునిగా తీర్పులు చెప్పే ఊరిపెద్ద పాత్రను ఆధారం చేసుకుని కథ రాయమని కోరారు. రకరకాలుగా ప్రయత్నించాకా చివరకు పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన సుకన్యోపాఖ్యానం కథకు ఓ పాఠాంతరం నుంచి స్ఫూర్తిపొంది ఈ సినిమా కథను తయారుచేశారు వెంకటేశ్వరరావు. సినిమాలో ప్రధాన భాగం గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు.

రామనాథం అనే బ్రాహ్మణుడు చాలామంది బ్రాహ్మణులు తరుముతూండగా ప్రాణభయంతో పారిపోయి కోటిపల్లి అనే ఊళ్ళోకి వెళ్తారు. అది బ్రహ్మన్న గారి ఊరు అంటూ వారందరూ పొలిమేరల్లోనే ఆగిపోతారు. రామనాధం మార్కండేయశాస్త్రి అనే కోటిపల్లి గ్రామ పూజారి ఆశ్రయం తీసుకుంటారు. గ్రామంలోకి అప్పటివరకూ పోలీసులు అడుగుపెట్టింది లేదు. కొత్త ఎస్సై నేరస్థుడైన రామనాథం కోసం కోటిపల్లికి రాబోతూండగా పొలిమేరల వద్ద బ్రహ్మన్న అడ్డుకుని అతను నేరస్తుడో కాదో నేను తేలుస్తాను, తీర్పు వినడానికి మీరు సాధారణ పౌరునిగా రండి అని పిలుస్తారు. తర్వాతి రోజు సామాన్యపౌరునిగా వచ్చిన ఎస్సైకి కస్తూరి (జయసుధ), స్వరాజ్యం ధర్మపీఠం గొప్పదనం, బ్రహ్మన్న వంశస్థులు స్వరాజ్యం కోసం చేసిన పోరాటం వంటివి బుర్రకథగా చెప్తారు. ధర్మపీఠం దగ్గర బ్రహ్మన్న బ్రాహ్మణుడిగా పుట్టి తిండికి గతిలేని స్థితిలో మాంసం కొట్టు పెట్టుకున్న రామనాథానిది తప్పు కాదని ధర్మశాస్త్రాల ప్రమాణంగా తీర్పునిస్తాడు బ్రహ్మన్న. అయితే పొరుగూరి నుంచి వచ్చిన వ్యక్తికి నేరస్తుడో కాదో నిర్ధారణగా తెలుసుకోకుండా ఆశ్రయమిచ్చినందుకు శాస్త్రిని ఆలయ పూజకు దూరంచేస్తూ శిక్ష విధిస్తారు. బ్రహ్మన్న తీర్పును సామాన్య పౌరుని హోదాలో విన్న ఎస్సై ఆయనను కలిసి అభినందిస్తారు.
గ్రామంలోని మీసాల పెద వెంకటరాయుడు, క్షురకుడు ముత్యాలు, రాయుడి కొడుకు బుల్లబ్బాయి, పూజారి శాస్త్రి వంటివారు బ్రహ్మన్నకు వ్యతిరేకులుగా ఉంటూ, అక్రమాలు, తప్పుడు పనులు చేస్తూంటారు. వంద మంది చేనేత కార్మికుల పేరు మీద రాయుడు లోన్లు తీసుకున్నాడని రవి కనిపెట్టడంతో కస్తూరి, స్వరాజం, ఇతర చేనేత కార్మికులు రాయుడు ఇంటిముందు నిరసన వ్యక్తం చేస్తారు. రాయుడు బుకాయించబోగా రవి అతని నిజస్వరూపం బయటపెడతాడు. రవి సహకారంతో కస్తూరి, స్వరాజ్యం కుటీర పరిశ్రమ ఏర్పాటుచేసుకుని దాన్ని బ్రహ్మన్న చేతులమీదుగా ప్రారంభింపజేస్తారు.
బుల్లెబ్బాయి స్వరాజ్యాన్ని మాయచేసి శ్మశానం దగ్గరకి రప్పించి అత్యాచారం చేయబోగా ఆమెకు గొంతు పోతుంది. రవి బలవంతంపై రాయుడు అతన్ని ధర్మపీఠం వద్దకు తీసుకువస్తారు. సాక్ష్యాల్ని విచారించిన బ్రహ్మన్న బుల్లబ్బాయి స్వరాజ్యాన్ని పెళ్ళాడాలని, లేని పక్షంలో రాయుడు కుటుంబం ఊరు విడిచి పోవాలని తీర్పు ఇస్తాడు. బుల్లబ్బాయి బ్రహ్మన్నను సుశీల అనే ఆమె ఇంటికి వెళ్ళడం చూసి వారిద్దరి మధ్య సంబంధం ఉందన్న పంకజం అనే వేశ్యమాటలు నమ్మి ఊళ్ళో ప్రచారం చేస్తారు. రాయుడు పదిమందినీ తీసుకువెళ్ళి బ్రహ్మన్నా నీకూ సుశీలకూ ఏమిటి సంబంధం అంటూ ఏకవచనంతో పిలిచి మరీ అడుగుతాడు, ఈ విషయం తెలిసి సావిత్రి తెల్లబోతుంది.
బ్రహ్మన్న సావిత్రికి గతంలో జరిగింది వివరిస్తాడు. గతంలో సుశీల భర్తను దేవాలయ నగలు దొంగలించాడని తాను వేసిన శిక్ష, తద్వారా అతని ఆత్మహత్య, పాముకాటు వల్ల చనిపోతున్న పూజారి తానే దొంగనన్న నిజం చెప్పడం తన తప్పు తీర్పు వల్ల జరిగిన దారుణాన్ని చూసి చలించిన బ్రహ్మన్న పొరుగూళ్ళో ఉన్న సుశీలను కాపాడి, పిల్లల్ని చదివించి విద్యాధికుల్ని చేయడం చెప్తాడు. ఇన్నాళ్ళూ స్వంత చెల్లెలిలా చూసుకున్నానని, అందుకే ఆమె పిల్లలతో మావయ్యా అని పిలిపించుకున్నానని వివరిస్తాడు బ్రహ్మన్న. దాంతో సావిత్రికి బ్రహ్మన్నపై గౌరవం మరింత పెరుగుతుంది.
గత్యంతరం లేక స్వరాజ్యాన్ని బుల్లబ్బాయి పెళ్ళి చేసుకుంటారు. బ్రహ్మన్న కుమార్తె రాజేశ్వరి, సుశీల కొడుకు రాంబాబు ప్రేమించుకుంటున్న విషయం రవి తెలుసుకుని బ్రహ్మన్న దగ్గరకు తీసుకువెళ్తాడు. బ్రహ్మన్న వాళ్ళ ప్రేమను అంగీకరించి, త్వరలోనే పెళ్ళి చేస్తానని చెప్తారు. ఇంతలో రాయుడు ఆ పెళ్ళి జరగడానికి వీలు లేదని అడ్డువస్తారు. అంతకుముందు రాజేశ్వరి నది ఒడ్డున ఊయలవూగుతుంటే నారాయణ కత్తితో చెట్టుకు కట్టిన తాడు తెంచివేస్తారు. ఆమె నారాయణపైనే ఊగుతూ పడడంతో అతని కళ్ళుపోతాయి. నారాయణ తల్లిదండ్రులు కొడుకే ఆధారంగా జీవిస్తున్నామని న్యాయం అడగడంతో తర్వాతిరోజు న్యాయవిచారణ ఏర్పాటుచేస్తారు బ్రహ్మన్న.
ధర్మపీఠం వద్ద రవి రాజేశ్వరి పక్షాన, రాయుడు నారాయణ పక్షాన వాదిస్తారు. చివరకు తన వల్ల కళ్ళుపోయిన నారాయణతోనే రాజేశ్వరి పెళ్ళి కావాలని, ఆమె వారి తల్లిదండ్రుల్ని అతన్నీ చూసుకోవాలని తీర్పునిస్తాడు. రవి ఆ తీర్పును వ్యతిరేకించి రాంబాబు, రాజేశ్వరిల పెళ్ళి చేస్తారు. ఆ విషయం బ్రహ్మన్నకు తెలియగా అన్నదమ్ముల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతుంది. ధర్మపీఠం మీది కత్తిని బయటకులాగి తమ్ముణ్ణి నరుకుతానని ఆవేశంగా ప్రయత్నిస్తారు బ్రహ్మన్న. సావిత్రి మరిదిని ఊరొదిలి వెళ్ళడానికి ఒప్పించి, భర్తను గ్రామబహిష్కార శిక్ష వేయాల్సిందిగా కోరుతుంది. బ్రహ్మన్న వారికి గ్రామబహిష్కారం శిక్షగా వేస్తారు. రవి రాంబాబు-రాజేశ్వరిలను తీసుకుని సుశీల ఆశీర్వాదానికి వెళ్ళగా ముందు బ్రహ్మన్న గారి ఆశీర్వాదం తీసుకుని రండని పంపేస్తుంది. బ్రహ్మన్న దగ్గరకు ఆశీర్వాదానికి రాగా ఏమవుతుందో తెలుసా అని ఆయన హెచ్చరిస్తారు. మాది పొరుగూరు మీ చల్లని దంపతుల ఆశీర్వాదానికి వచ్చామని నాటకీయంగా చెప్పగా, ఇప్పుడు నా చేతులు చల్లగా లేవు మా ఇంట తమ్ముడు, కూతురు చనిపోగా సూతకం అని పంపేస్తారు.
అత్యంత నాటకీయ స్థితిగతుల్లో నారాయణకు కళ్ళుపోలేదని తెలిసిపోతుంది. వివిధ మలుపుల తర్వాత శాస్త్రి పాము కాటుకు, రాయుడు ధర్మఖడ్గానికి చేయి పోగొట్టుకుని బండల కింద పడి మరణించడం జరుగుతుంది. చివరికి రాజేశ్వరి, రాంబాబుల పెళ్ళిని అంగీకరించిన బ్రహ్మన్న ధర్మఖడ్గాన్ని రవికి ఇచ్చి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాన్ని క్రమబద్ధీకరించమని అనడంతో కథ ముగుస్తుంది.[1]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

కె.రాఘవేంద్రరావు తన దర్శకత్వంలో కృష్ణంరాజు కథానాయకునిగా చేసే గోపీకృష్ణా సంస్థ చిత్రానికి రచయితలుగా అప్పటికి ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పరుచూరి సోదరులను తీసుకున్నారు. అలా బొబ్బిలి బ్రహ్మన్న రచయితగా పరుచూరి సోదరులు, దర్శకునిగా కె.రాఘవేంద్రరావు కలసి చేసిన తొలి చిత్రం అయింది. చిత్రానికి కథాచర్చలు హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్లో జరిగాయి. ఊళ్ళో తీర్పులు చెప్పే ఓ గ్రామపెద్ద కథానాయకునిగా కథ రాయమని పరుచూరి సోదరులను రాఘవేంద్రరావు అడిగారు. అప్పట్లో పరుచూరి సోదరుల పని విభజన ప్రకారం చిత్రానికి కథను పరుచూరి వెంకటేశ్వరరావు ప్రధానంగా అభివృద్ధి చేసేవారు కావడంతో ఈ సినిమాకు రకరకాలుగా కథను ఆయనే అభివృద్ధి చేస్తూ రాఘవేంద్రరావుకు వినిపించారు. అయితే ఆ కథలేవీ ఆయనకు నచ్చకపోవడంతో ఆ సిటింగ్ లో కథ ఏదీ తేలలేదు.
వెంకటేశ్వరరావు తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన సోదరుడు గోపాలకృష్ణను పురాణాల్లోని తీర్పుకు సంబంధించిన సంఘటన కోసం అడగితే ఆయన సుకన్యోపాఖ్యానాన్ని కొద్ది మార్పుతో చెప్పారు. ఆ మార్పుచోటుచేసుకున్న కథ ప్రకారం సంయాతి మహారాజు కుమార్తె సుకన్య అడవిలోని పుట్టలో రంధ్రాల గుండా వెలుగు వస్తూంటే ఏదో పాము మణి నుంచి వస్తోందనుకుని సైనికుల నుంచి రెండు కత్తులు తీసుకుని పుట్టలో పొడుస్తుంది. నిజానికి ఆ తేజస్సు చ్యవన మహర్షి తపస్సు వల్ల వెలువడ్డ తేజస్సు, దాంతో ఆ పొడిచిన కత్తులు నేరుగా చ్యవన మహర్షి కళ్ళకు తగిలి కన్నులు పోతాయి. చ్యవన మహర్షి శాపం వల్ల సైనికులు బాధపడుతూండడంతో కూతురు ద్వారా నిజం తెలుసుకున్న రాజు చ్యవనుడి వద్దకు వెళ్ళి క్షమించమని కోరుతాడు. మరి నీ కూతురు వల్ల అంధుణ్ణయ్యాను నాకు న్యాయమేంటని మహర్షి అడిగితే, నా కూతురు వల్ల మీ చూపు పోయింది కనుక మీకు భార్యయై దారిచూపుతుందని తీర్పునిస్తాడు రాజు.
సుకన్యోపాఖ్యానంలోని ఈ పాఠాంతరీకరణ నచ్చడంతో రాఘవేంద్రరావును మరో రోజు గడువు అడిగాడు. అప్పుడు రాసిన కథ ప్రకారం బ్రహ్మన్న కుమార్తె ఉయ్యాల ఊగుతూ రాజవర్మ అనే వ్యక్తి మీద పడి అతని కళ్ళుపోవడం, కళ్ళు తన కూతురి వల్లే పోయాయి కనుక ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేసేట్టు బ్రహ్మన్న తీర్పునివ్వడం, ఈ తీర్పును వ్యతిరేకిస్తూ తమ్ముడు ఆమెను తాను ప్రేమించిన వ్యక్తికిచ్చి పెళ్ళిచేయడం, తద్వారా కూతురునీ, తమ్ముడిని ఊరి నుంచి బహిష్కరించడం వంటి సన్నివేశాలు ఉంటాయి. ఈ వెర్షన్ నచ్చడంతో రాఘవేంద్రరావు సినిమా కథ అంగీకరించారు.[1]

చిత్రీకరణ

[మార్చు]

బొబ్బిలి బ్రహ్మన్న సినిమా చిత్రీకరణ ప్రధానంగా గోదావరి నదీ పరిసర ప్రాంతాల్లో జరిగింది.[2]

కథనం, శైలి

[మార్చు]

సినిమా ప్రధానంగా నాటకీయ దృష్టికోణంతో సాగుతుంది. ప్రారంభం నుంచి చివరి వరకూ నాటకీయ దృష్టికోణమే ప్రధానంగా సాగగా, బ్రహ్మన్న పూర్వీకుల కథను బుర్రకథగా పాడి కథానాయిక, ఆమె సోదరి చెప్పే సందర్భంలో మాత్రం ప్రథమపురుష దృష్టికోణంలోకి కొద్దిసేపు మారుతుంది.[3]

విడుదల

[మార్చు]

స్పందన

[మార్చు]

సినిమా మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా కృష్ణంరాజు నట జీవితంలో బొబ్బిలి బ్రహ్మన్నగా పోషించిన కథానాయక పాత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయింది.[1]

ప్రభావాలు, థీమ్స్

[మార్చు]

బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో పోలీసులు గ్రామంలోకి అడుగుపెట్టరన్నది నియమంగా చూపించడంతో సెన్సారు వారి అభ్యంతరాల మేరకు ప్రారంభంలో ఇది బ్రిటీష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో జరిగిన కథ అని వేశారు.[3] సినిమా కథలో ప్రధానమైన మలుపైన బ్రహ్మన్న కుమార్తె వల్ల కళ్ళుపోయినవానికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేయాలని బ్రహ్మన్న తీర్పునివ్వడం సుకన్యోపాఖ్యానానికి వాడుకలో ఉన్న ఓ పాఠాంతరం నుంచి స్వీకరించారు రచయితలు.[1]

అవార్డులు

1: ఉత్తమ నటుడు , నంది అవార్డు , కృష్ణంరాజు.

2: ఉత్తమదర్శకుడు , నంది అవార్డు , కె.రాఘవేంద్ర రావు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
నటీనటులు ధరించిన పాత్రలు
కృష్ణంరాజు బ్రహ్మన్న, గోపిగా ద్విపాత్రాభినయం
శారద సావిత్రి, బ్రహ్మన్న భార్య
జయసుధ కస్తూరి
రావు గోపాలరావు మీసాల పెదవెంకట్రాయుడు
కైకాల సత్యనారాయణ బుల్లబ్బాయి
ముచ్చెర్ల అరుణ రాజేశ్వరి, బ్రహ్మన్న కుమార్తె
అన్నపూర్ణ సుశీలమ్మ
అల్లు రామలింగయ్య
నూతన్ ప్రసాద్ శాస్త్రి
కృష్ణవేణి స్వరాజ్యం

పాటల జాబితా

[మార్చు]

1:అబ్బా నాతో పెట్టుకోమాక, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

2: ఓ రాతిమనిషి నీతి మనిషీ , రచన: వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3: చలిగాలి వీచింది సన్నజాజి, రచన :వేటూరి , పి సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం

4: తద్దినక తద్దినక మల్లెలు , రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5: బొబ్బిలి బ్రహ్మన్న వీరగాధల,(బుర్రకథ), గానం పి సుశీలబృందం

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 పరుచూరి, గోపాలకృష్ణ (డిసెంబరు 2008). "బొబ్బిలి బ్రహ్మన్న". లెవంత్ అవర్ (2 ed.). హైదరాబాద్: వి టెక్ పబ్లికేషన్స్. pp. 24–33.
  2. సాక్షి, విలేకరి (9 జూలై 2015). "ప్రభాస్ పుష్కరాలకి వస్తాడో రాడో..." సాక్షి. Archived from the original on 14 ఆగస్టు 2015. Retrieved 17 November 2015.
  3. 3.0 3.1 పరుచూరి, గోపాలకృష్ణ (ఆగస్టు 2008). తెలుగు సినిమా సాహిత్యం కథ-కథనం-శిల్పం (4 ed.). హైదరాబాద్: వి-టెక్ పబ్లిషర్స్. Retrieved 17 November 2015.

4..ఘంటసాల గళామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్