బ్రహ్మపరివర్తన వేడుక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూరీ జగన్నాథ క్షేత్రం
పూరీ జగన్నాథ క్షేత్రం

పూరీ జగన్నాద్ క్షేత్రంలో ఆలయంలోని జగన్నాథుడి మూలవిరాట్టులో ఉండే బ్రహ్మ పదార్థాన్ని.. కొత్తగా రూపొందించిన దారుశిల్పంలోకి మార్చే ఉత్సవాన్ని బ్రహ్మపరివర్తన వేడుక అంటారు. ఇది జ్యేష్ఠ మాసపు కృష్ణ చతుర్దశి నాడు అర్ధరాత్రి 'బ్రహ్మం' మార్పిడి అత్యంత గోప్యంగా జరుగుతుంది, ఈ బ్రహ్మపదార్థం మార్పిడి పూర్తయితే కొత్త దారు విగ్రహాలకు జీవం వచ్చినట్టే భావిస్తారు. ఆ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు[1]

పక్రియ[మార్చు]

సాధారణంగా అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో పూరీలో కొయ్యతో చేసిన మూలవిగ్రహాలను ఖననం చేసేసి, కొత్తగా ఎంపిక చేసిన చెట్ల దారువుతో మూలవిరాట్టులను తయారుచేసి ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకను నవకళేబర అంటారు. పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు, ఇది ఇన్నేళ్లకోసారి జరుగుతుందని కచ్చితంగా చెప్పలేం. సాధారణంగా 8, 11, 19 సంవత్సరాలకోసారి వస్తుంది. సా.శ.1039లో 27 సంవత్సరాల వ్యవధి తీసుకుంది. 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996...తర్వాత మళ్లీ 2015 జూలై 15 న జరిగింది. ఈ శతాబ్దిలో ఇదే మొదటి యాత్ర.

నవకళేబరయాత్ర[మార్చు]

నవకళేబరయాత్రలో ప్రధాన ఘట్టం వనయాగయాత్ర. దేవతా విగ్రహాల తయారీకి కలపను అన్వేషించడమే యాత్ర లక్ష్యం. జగన్నాథ రథయాత్రకు 65 రోజుల ముందు, చైత్ర శుద్ధ దశమినాడు వనజగయాత్ర మొదలవుతుంది. దైతాపతులూ (దేవుని సేవకులూ, సేవాయతులూ), బ్రాహ్మణులూ, విశ్వకర్మలూ కలసి ఇందుకో ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అనంతరం నలుగురు ప్రధాన దైతాపతులు ఒక్కొక్కరుగా బలభద్రుడు, జగన్నాథుడు, సుభద్ర, చివరగా సుదర్శనుని వద్దకు వెళ్లి 'ఆజ్ఞామాల' తెచ్చుకుంటారు. అనంతరం, వీరికి జయవిజయుల మండపం దగ్గర కొత్తబట్టలు పెడతారు. దారు అన్వేషణ కార్యభారమూ అక్కడే అప్పగిస్తారు. ఆ బృందం మంగళ వాద్యాలతో బయల్దేరి ఆలయం వెలుపలికి వస్తుంది. అక్కడి నుంచే యాత్ర మొదలవుతుంది. పూరీ గజపతి మహరాజ్‌ దివ్యసింగ్‌దేవ్‌ శ్రీనహర్‌ దైతాపతులకు దుస్తులూ తాంబూలం అందించి, యాత్రకు అనుమతిస్తాడు. ప్రయాణమంతా ఎడ్ల బండ్ల మీదో కాలినడకనో సాగుతుంది. రెండో రోజు పూరీ పట్టణానికి ఈశాన్య ప్రాంతంలోని మా మంగళాదేవి ఆలయానికి చేరుకుంటారు. దేవి అనుగ్రహం అందితేనే దారు లభిస్తుందని విశ్వాసం. ఆ రాత్రి అక్కడే బస. దైతాపతుల దళపతికి అమ్మవారు కలలో కనిపించి విగ్రహాల తయారీకి అవసరమైన దారు ఎక్కడ దొరుకుతుందో ప్రతీకాత్మకంగా చెబుతారు. ఆ ప్రకారం, రెండొందలమంది దైతాపతులు కలప అన్వేషణకు బయల్దేరతారు. .

దారు వృక్షం[మార్చు]

పురాతనమైన వేపచెట్టునే దారు వృక్షంగా ఎంచుకుంటారు. మరొక్క కారణమూ ఉంది. పురాతనమైందే ఎందుకంటే...బాగా చేవ తేలి ఉంటుంది, ఛేదించిన వెంటనే విగ్రహం తయారీకి పనికొస్తుంది. దారు ఎంపికలో చాలా అంశాల్ని పరిశీలిస్తారు. ఊరికి వెలుపలా, నదికీ శ్మశానానికీ దగ్గర్లో ఆ చెట్టు ఉండాలి. ఇతర వృక్షాల కొమ్మలు దీంతో కలవకూడదు. మెరుపులూ ఇతర కారణాలతో ఎక్కడా కాలిన గుర్తులు ఉండకూడదు. పక్షుల నివాసాలూ అక్కడ కనిపించకూడదు. మొదలు పది నుంచి పన్నెండు అడుగులు వంకర లేకుండా ఉండాలి. తొర్రలుంటే పనికిరాదు. వృక్షం నాగేంద్రుని రక్షణలో ఉన్నట్టు చెట్టుకు సమీపంలో పుట్ట ఉండాలి. వృక్ష శాఖలనూ, రంగునూ దారు ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు. బలభద్రుని దారూ సుదర్శనుని దారూ ఎర్రగా, సుభద్ర దారు హరిత వర్ణంలో కానీ పసుపు వర్ణంలో కానీ ఉండాలి. జగన్నాథుని దారు మాత్రం కృష్ణ (నీలం) వర్ణంలో ఉండాలి.సుదర్శనుని దారుకు మూడు ప్రధాన శాఖలు ఉండాలి, గద గుర్తు కనిపించాలి. బలభద్రునికి ఏడు శాఖలూ నాగలి గుర్తు; సుభద్రకు ఏడు శాఖలూ పద్మం గుర్తు; జగన్నాథునికి నాలుగు శాఖలూ శంఖచక్రాల గుర్తులుండాలి.

మొదటి విడతలో, ఇలాంటి లక్షణాలున్న 105 చెట్లను గుర్తిస్తారు. దైతాపతులు పరిశీలించి, అందులోంచి పదిహేను చెట్లను మాత్రమే ఎంపికచేస్తారు. ఆతర్వాత మళ్లీ, అందులోంచి నాలుగు వృక్షాల్ని ఖరారుచేస్తారు. మొదటగా సుదర్శనుని వృక్షాన్నీ, అనంతరం బలభద్రుడు, సుభద్ర, చివరన జగన్నాథుని దారువృక్షాలనూ ప్రకటిస్తారు. ఆ ప్రక్రియ పూర్తయమ్యూంక, అదే

ప్రాంతంలో తాటాకులతో గుడిసెలు వేస్తారు. యజ్ఞం ప్రారంభమైన నాటి నుంచీ దారును ఛేదించి తరలించే వరకూ దైతాపతుల నివాసం ఇక్కడే. మూడురోజుల యజ్ఞం పూర్తిచేసి, పూర్ణాహుతి ఇచ్చాక దారు ఛేదన మొదలవుతుంది. మొదట బంగారు, వెండి గొడ్డళ్లను తాకిస్తారు. అనంతరం ఇనుప గొడ్డళ్లతో ఛేదిస్తారు. వృక్షం నేలకూలిన తర్వాత, అవసరమైన మేర కలపను తీసుకుని...అవశేషాలను గొయ్యి తీసి పాతేస్తారు. పూరీ దేవాలయ ఉత్తర ద్వారం వరకూ దారు తరలింపు మహా వేడుకగా సాగుతుంది. చింత, పనస, రావి చెట్ల కలపతో తయారు చేసిన బండినే తరలింపు కోసం వినియోగిస్తారు. దారును గుర్తించిన ప్రాంతంలోనే ఈ బండినీ తయారు చేస్తారు. స్వయంగా దైతాపతులే దారువులను బండిలోకి ఎక్కించి...చుట్టూ పట్టువస్త్రాలు కప్పుతారు. అక్కడి నుంచి పూరీ వరకూ ... భజనలూ భగవన్నామ స్మరణల మధ్య ఆ బండిని భక్తులు లాక్కువస్తారు. ఈ కార్యక్రమం మహత్తరంగా సాగుతుంది. దారిపొడవునా ఆయా గ్రామాల ప్రజలు ముగ్గులతో వీధుల్ని అలంకరిస్తారు. చీరలు పరచి దేవరూప దారువులను స్వాగతిస్తారు. పూరీ దేవాలయ ఉత్తరద్వారం గుండా 'కైవల్య మందిరం' (కొయిలీ వైకుంఠ, వైకుంఠ మండపం) చేరుస్తారు.[2]

పాత విగ్రహాలను ఖననంచేసే ముందు.. ఆలయ పూజారి కళ్లకు గంతలు కట్టుకుని, చేతికి వస్త్రం చుట్టుకుని.. జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలోకి మారుస్తారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఆ పదార్థం ఏమిటో ఎవ్వరు దానిని తయారు చేశారో..? ఎలా ఉంటుందో కూడా తెలుసుకునే అవకాశం కనీసం పూజారికి కూడా ఉండదు. కేవలం పూజారి దానిని ఒక వస్త్రం ద్వారా దానిని స్పర్శిస్తారే తప్ప తాకను కూడా తాకలేరు. ఇది అత్యంత రహస్యంగా జరగాల్సిన ప్రక్రియ

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.andhrajyothy.com/Artical.aspx?SID=119407&SupID=21[permanent dead link]
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-14. Retrieved 2015-06-15.

ఇతర లింకులు[మార్చు]