Jump to content

చతుర్దశి

వికీపీడియా నుండి

చతుర్ధశి చంద్రమానం ప్రకారం పక్షము (కృష్ణ పక్షం/శుక్ల పక్షం) రోజులలో పదునాలుగవ తిథి చతుర్దశి[1]. అధి దేవత - శివుడు. సంస్కృతం అర్థం ప్రకారం "చతుర్" అనగా నాలుగు, "దశి" అనగా 10వ రోజు. భాషా పరంగా "చతుర్థశి" అనగా 14వ రోజు అని అర్థం. [2]

ప్రతీ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ని మాస శివరాత్రి గా చెబుతారు. ప్రతీ మాస శివరాత్రి రోజున, శివార్చన చేసి, శివునికి అభిషేకం చేయడం వలన సర్వ గ్రహ బాధలు తొలగి పోవడమే కాకుండా అపమృత్యు దోషం కూడా తొలగిపోతుంది. శివారాధన చేసి అత్యంత ఉత్తమమైన ఫలితాలు పొందేందుకు, కొన్ని ప్రత్యేక దినాలు, సమయాలు ఉన్నట్లుగా పలు పురాణాలలో చెప్పబడింది. ప్రతి అమావాస్యకు ముందువచ్చే చతుర్దశిని మాసశివరాత్రి అంటారు.

ఏదైనా శుభకార్యాలకు గాని , మరి ఇతర వాటికి గాని చతుర్దశి రోజుని శుభ సూచకంగా భావిస్తారు.[3]

మాఘమాసం లొ వచ్చే చతుర్దశి ప్రాశస్త్యం:

మాఘమాసంలో, కృష్ణ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి గా పిలుస్తారు. ఈరోజు పరమ శివుని అర్చించడానికి ఉత్కృష్టమైన రోజు. అందునా లింగోద్భవ కాలంలో చేసే శివారాధనకు, శివాభిషేకానికీ విశేషమైన ఫలితం లభిస్తుందని ప్రతీతి. అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ (దీనినే లింగోద్భవ కాలం అంటారు) అగ్ని లింగం బ్రహ్మ విష్ణువుల సమక్షంలో ఆవిర్భవించినట్లు శివపురాణం చెబుతోంది. అందుకే మాఘమాసం లో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి ని మహా శివరాత్రి గా పిలుస్తారు. ఈ మహా శివరాత్రి నాడు చేసే శివార్చనకు , అభిషేకాలకు అయితే విశేషమైన ఫలం లభిస్తుందని విశ్వాసం.

ఆషాఢ మాస శుక్ల చతుర్దశి విశేషం:

అలాగే ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్దశి అనగా ఆషాడ శుద్ధ చతుర్దశి నాడు ఈశ్వరుని దుర్వా గడ్డితో పూజించడం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. [4]

భాద్రపద మాస శుక్ల చతుర్దశి విశిష్టత :

భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్దశి నాడు చేసే వ్రతాన్ని అనంత పద్మనాభ వ్రతం అంటారు. ఈరోజున శ్రీ మహావిష్ణువుని అనంత పద్మనాభ స్వామి రూపంలో పూజిస్తారు. ఈ అనంత పద్మనాభ వ్రతం గురించి శ్రీ కృష్ణ పరమాత్మ, ధర్మరాజు కి వివరించినట్లుగా భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. [1]

ఆశ్వీయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి ప్రాముఖ్యత:

దీపావళికి ముందు వచ్చే బహుళ చతుర్దశి రోజున, మూడు లోకాలనూ పీడించిన భయంకరడైన నరకాసురుడు అనే రాక్షసుడు అంతమొందిన దినంగా ఎక్కువమంది ప్రజలు "నరక చతుర్దశి" గా జరుపుకొంటే, పశ్చిమ బెంగాల్‌ లోని కొందరు ప్రజలు మాత్రం దీనిని ‘భూత చతుర్దశి’గా పాటిస్తారు. భూత చతుర్దశి రోజు రాత్రివేళ ఇంటి ముంగిళ్లలో మట్టి ప్రమిదల్లో పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఈ పద్నాలుగు దీపాలూ పద్నాలుగు లోకాలలో ఉండే తమ పూర్వీకుల ఆత్మలకు దారి చూపుతాయని, తద్వారా వారు తమ ఇళ్లలోకి దుష్టశక్తులు చొరబడకుండా నిలువరిస్తారు అని నమ్ముతారు.[4]

కార్తీకమాసం లో వచ్చే చతుర్దశి ప్రత్యేకత:

కార్తీక మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశి నాడు అయితే పాషాణ చతుర్దశి వ్రతం చేయడం కూడా ప్రసిద్ధి.

పండుగలు

[మార్చు]
  1. మాఘ బహుళ చతుర్దశి - మహాశివరాత్రి
  2. ఆశ్వయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి [5]
  3. భాద్రపద శుద్ధ చతుర్దశి - [[అనంత పద్మనాభ చతుర్దశి]]
  4. వైశాఖ శుద్ధ చతుర్దశి - నృసింహ జయంతి

మూలాలు

[మార్చు]
  1. 1 2 Klostermaier, Klaus K. (2007-07-05). A Survey of Hinduism: Third Edition (in ఇంగ్లీష్). SUNY Press. p. 493. ISBN 978-0-7914-7082-4.
  2. Garg, Gaṅgā Rām (1992). Encyclopaedia of the Hindu World (in ఇంగ్లీష్). Concept Publishing Company. p. 173. ISBN 978-81-7022-374-0.
  3. "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. Retrieved 2025-12-18.
  4. 1 2 04 -11- 2018 ఈనాడు ఆదివారం పుస్తకం
  5. Claus, Peter; Diamond, Sarah; Mills, Margaret (2020-10-28). South Asian Folklore: An Encyclopedia (in ఇంగ్లీష్). Routledge. p. 160. ISBN 978-1-000-14353-9.
"https://te.wikipedia.org/w/index.php?title=చతుర్దశి&oldid=4885603" నుండి వెలికితీశారు