దీపావళి

వికీపీడియా నుండి
(నరక చతుర్దశి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search


దీపావళి
దీపావళి
యితర పేర్లుదీపావళి
జరుపుకొనేవారుహిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు
రకంభారతదేశం, సంస్కృతి
2022 లో జరిగిన తేది25 అక్టోబర్ (మంగళవారం)
2023 లో జరిపే తేదీ29 నవంబర్ (ఆదివారం)
2024 జరగవలసిన తేదీ30 నవంబర్ (సోమవారం)
ఉత్సవాలుదీపాలు, అలంకరణలు, కొనుగోళ్లు, టపాకాయలు, పూజలు, ప్రార్థనలు, బహుమతులు, ఫలహారాలు

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి. దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు.

దీపాలంకరణ, లక్ష్మీ పూజ[మార్చు]

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోஉస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలొ దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది.దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.."నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.[1]

నరక చతుర్దశి[మార్చు]

కృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురడి సైన్యాలతో పోరాడుతున్న చిత్రం.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. నరకాసురుడు నే రాక్షసుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.

అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు,' పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్ఠమైంది.

నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

సత్యం-శివం-సుందరం[మార్చు]

పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని. ఈ అగ్ని ప్రాణికోటి మనుగడకు ఉపకరించే తేజస్సును, ఆహారాన్ని ఐహికంగాను, విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది. ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి. నీలము, పసుపు, తెలుపు- ఈ మూడు రంగులు మానవ మనుగడకు అవశ్యకమైన సత్త్వరజస్తమోగుణాల సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు. ఈ మూడు రంగులను జగతిని పాలించే లక్ష్మి, సరస్వతి, దుర్గలుగా భావిస్తారుట పౌరాణికులు. అంతేకాక సత్యం-శివం-సుందరం - అవి దీప ప్రజ్వలన ద్వారా త్రిజగన్మాతలను ఆరాధించినట్లును, మానవులకు విజ్ఞానం, వివేకం, వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా గైకొంటారు భారతీయులు.

అంధతమిస్రంచ దక్షిణాయనమేవచ

ఉత్తరాయణే తస్మా జ్యోతిర్దానం ప్రశస్వతే

అంధ తమ్స్రమనేది ఒక నరకం, దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమమైన కార్యంగా భావిస్తారు హైందవులు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బహుళ చతుర్ధశి, అమావాస్యలు పరమ పవిత్ర పర్వదినాలు. భక్తి విశ్వాసాలతో, ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలూ, పెద్దలూ అందరూ కలసి జరుపుకునే పండుగ రోజులివి.

దివ్వి దివ్వి (అనగా వెలుగు) దీపావళి[మార్చు]

దివ్వి దివ్వి దీపావళి మళ్ళీ వచ్చే నాగులచవితి అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. వెలుగులనిచ్చే దీపావళి అని అర్ధం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్ఠాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి, రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.

భగినీ హస్త భోజనం[మార్చు]

దీపావళి కొన్ని ప్రాంతాల్లో అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ భగినీహస్త భోజనంతో ముగుస్తాయి.దీపావళి అయిన రెండో రోజు చేసుకుంటారు.భారతదేశంతో పాటు నేపాల్‌లో కూడా జరుపుకొంటారు.ఈ రోజును పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, కాంతి ద్వితీయ, వంటి అనేక పేర్లతో పిలుస్తారు.భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తరదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీ హస్త భోజనం సోదరుని క్షేమానికి సంబంధించినది.

హరిత దీపావళి[మార్చు]

దీపావళి పండుగ తొలినాళ్ళ లో పూజ పునస్కారాలు చేసుకోవడం, దీపాలు వెలిగించుకోవడం, బంధుమిత్రులందరూ కలసి పిండివంటలు ఆరగించడం వరకు మాత్రమే పరిమితమై ఉండేది. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటి రాజైన [హర్షవర్థనుడు|హర్షుడు] తన సంస్కృత నాటకం 'నాగానందం'లో [దీపావళి] వేడుకలను దీప ప్రతిపదోత్వంగా వర్ణించాడు. విదేశీ యాత్రికుల రచనల్లో పర్షియన్ యాత్రికుడు ఆల్బెరూని పదకొండో శతాబ్దంలో, ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి పదిహేనో శతాబ్ది పోర్చుగిసు యాత్రికుడైన డొమింగో పాస్ పదహారో శతాబ్దంలో దీపావళి వేడుకలను వర్ణించారు. ఆ వర్ణనలలో దీపాలంకరణలు, విందు వినోదాలు, నృత్య గానాది సాంస్కృతిక కార్యక్రమాల వర్ణనే తప్ప బాణాసంచా వర్ణనే కనిపించదు. క్రీస్తుశకం 14 శతాబ్దం వరకూ ఏ రచనలలోను బాణాసంచా ప్రస్తావన కనిపించదు.[2]

బాణాసంచా చరిత్ర[మార్చు]

సూరేకారం గా జనసామాన్యం పిలిచే పొటాషియం నైట్రెట్ ను కనుగొన్న తర్వాత దీపావళి జరుపుకొనే తీరు మారింది. క్రీస్తుశకం 960-1279 కాలం లోని సాంగ్ వంశీయుల హయాంలో చైనీయులు సూరేకారం, గంధకం పొడి, బొగ్గు పొడి కలిపి గన్ పౌడర్ ను తయారు చేసారు.మంట అంటుకోగానే భారీ శబ్దంతో పేలే గన్ పౌడర్ ఆవిష్కరణ తో చరిత్ర గతిలో మార్పులు శరవేగాన్ని పుంజుకున్నాయి. క్రీస్తుశకం 14 వ శతాబ్దై నాటికి భారత భూ భాగం లో గన్ పౌడర్ ను యుద్ధాలలో వాడడం మొదలైంది. ఫిరంగుల్లో మందుగుండును దట్టించి పేల్చి శత్రువులను తరిమి కొట్టడం , దుర్భేధ్యమైన కోటలను ఫిరంగి గుళ్ళ దాడితో పడగొట్టడం మొదలైంది. వివిధ ప్రయోగాల ద్వారా రకరకాల బాణాసంచా తయారీ ప్రారంభమైంది, సురేకారం,గంధకం,బొగ్గుపొడి రకరకాల పాళ్ళలో కలిపి తక్కువ పేలుడు కలిగించేవి, రంగులు విరజిమ్మేవి మొదలైన వి ప్రారంభమైనవి.ఇవన్నీ చైనా లో దాదాపు క్రీస్తు శకం 12 వ శతాబ్ది నాటికే ప్రారంభమైనా, భారత దేశంలో మాత్రం 14 వ శతాబ్ది నుండే ప్రారంభమైనట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తుంది. క్రీస్తు శకం 1443 లో రాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి అబ్దుల్ రజాక్ విజయ నగర సామ్రాజ్యం లో జరిగిన దీపావళి వేడుకలను వర్ణించాడు. అవి మిరిమిట్లు గొలిపే కాతులతో ఉన్నట్లు వ్రాసాడు. దాదాపు అదే కాలం వాడైన ఇటాలియన్ యాత్రికుడు లుడోవికో డి వార్తెమా కూడా దీపావళి వేడుకల్లో బాణాసంచా ఉపయోగించినట్లు వ్రాసాడు.విజయ నగర సామ్రాజ్యం లొ చాలా మంది బాణాసమ్చా నిపుణులు ఉన్నట్లు వ్రాసాడు.వారి నైపుణ్యమును వర్ణించాడు.

బాణా సంచా తయారీ కేంద్రాలు[మార్చు]

స్వాతంత్ర్యానికి ముందు భాణా సంచా తయారీ కేంద్రం కలకత్తా ఐతే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్నాళ్ళకు తమిళనాడు లో శివకాశి ప్రధాన కేంద్రంగా మారింది.ఇప్పటికీ అదే కొనసాగుతుంది. 2018 సంవత్సరం లో భారత సుప్రీం కోర్టు బాణ సంచా వినియోగం పై ఆంక్షలు విధించింది.కొందరు పర్యావరణ వేత్తలు బాణాసంచాను పూర్తిగా నిషేధించాలని సుప్రీం కోర్టును కోరినప్పటికీ రెండు గంటలకు మించి కాల్చరాదని ఆంక్షలు విధించింది. దానికి బదులుగా పర్యావరణానికి అంతగా హాని చేయని బాణా సంచా కు అనుమతి నిచ్చింది. ఈ విషయంలో ప్రజలు కూడా స్వచ్చంంగా వాడకం తగ్గించడం ఒక శుభ పరిణామం. ఈ గ్రీన్ క్రాకర్స్ ను ప్రభుత్వ రంగానికి చెందిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సి ఎస్ ఐ అర్) శాస్త్రవేత్తలచే రూపొందించారు.ఇప్పటికే దేశంలో 165 బాణాసంచా తయారీ సంస్థలు ఉత్పత్తి ని ప్రారంభించాయి. మరి కొన్ని సంస్థలు తయారీకీ సిద్ధమవడం పర్యావరణ రీత్యా ముదావహం. సాధారణ బాణాసంచా కంటే ఇవి 30-35 శాతం మేరకు తక్కువ పార్టికులేట్ మేటర్ ఉద్గారాలను, 35 నుండి 40 శాతం తక్కువ నిస్తాయి

వాయు కాలుష్య ప్రమాదం[మార్చు]

బాణాసంచా కాల్పుల్లో వెలువడే పొగలో సీసం, రాగి, మెగ్నీషియం, జింక్,మాంగనీసు, సోడియం, పోటాషియం, బేరియం, అల్యుమినియం, కాడ్మియం, ఫాస్ఫరస్, వంటి పదార్థాలు ఉంటాయి.ఇవి జ్వరం ,వణుకు,కండరాల బలహీనత, నీరసమ్, దురదలు, ఎముకలు పెలుసు బారడం, దీర్ఘకాలం లో గుండె ,మెదడు, లివర్,కిడ్నీలకు హాని,పక్శ్ఃఅవాతం వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.బాణాసంచా పొగ వలన ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడతారు. భారత్ లో ఆయు కాలుష్యం ఏకంగా 50 శాతం దీపావళి తర్వాత పెరుగుతున్నట్లు శాస్త్ర వేత్తల అంచనా

శబ్ద కాలుష్యం[మార్చు]

భారీ శబ్దాలు చేసే బాణాసమ్చా పేలుళ్ళ వలన గుండె దడ, నిద్ర లేమి, మానసిక ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయి.పెంపుడు జంతువులు ఆందోళన చెంది అస్తిమితంగా ఉంటాయి. వీధుల్లో సంచరించే పశు పక్ష్యాదులదీ అదే పరిస్థితి. .పక్షులలో శబ్దాలకు మరణించే పరిస్థితి కూడా ఉంది.

నీటి కాలుష్య ప్రమాదం[మార్చు]

బాణా సంచా తయారీ లో విపరీతంగా ఉపయోగించే పెర్క్లోరేట్ రసాయనాలు నీళ్ళలో కరిగి,నదులను,సరస్సు లను కాలుష్య కాసారాలుగా మారుస్తాయి. తాగునీరు, సాగునీరు రెండూ కలుషితమవుతున్నాయి. .[3]

అపోహ[మార్చు]

వానా కాలం ముగింపు లో వచ్చే దీపావళి లో బాణాసంచా కాల్చడం వలన క్రిమి కీటకాలు నశిస్తాయని శతాబ్దాలుగా విశ్వసించేవారు. ఐతే వాయు కాలుష్యం గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతూ ఉంది.

మూలాలు[మార్చు]

  1. http://telugu.webdunia.com/religion/religion/vendiveluguladeepavali/0910/15/1091015085_1.htm
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-09-24. Retrieved 2022-06-16.
  3. https://www.thehindu.com/sci-tech/energy-and-environment/how-green-are-deepavali-crackers/article29807948.ece
"https://te.wikipedia.org/w/index.php?title=దీపావళి&oldid=3887065" నుండి వెలికితీశారు