బ్రహ్మ ప్రకాష్
డా. బ్రహ్మ ప్రకాష్ (1912 ఆగస్టు 21 – 1984 జనవరి 3) ప్రసిద్ధ మెటలర్జిస్టు. భారత్‌లో అణు పదార్థాల విషయంలో ఆయన చేసిన కృషికి గాను ప్రఖ్యాతి గాంచాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]బ్రహ్మ ప్రకాష్ పాకిస్తాన్‌లోని లాహోరులో జన్మించాడు. రసాయన శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకుని, పంజాబ్ యూనివర్సిటీలో పరిశోధన చేసాడు (1942). మరింత ఉన్నత పరిశోధనల సందర్భంగా శాంతి స్వరూప్ భట్నాగర్‌తో కలిసి పనిచేసాడు. 1940-45 కాలంలో అసిస్టెంట్ మెటలర్జిస్టుగా పనిచేసాడు. 1946 లో రెండవ ప్రపంచ యుద్ధం ముగియగానే అమెరికా వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించాడు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెటలర్జీ విభాగంలో చేరాడు. మినరల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ థెర్మోడైనమిక్స్ లో పి.హెచ్.డి తీసుకున్నాడు.
భారత్ తిరిగి రాగానే ముంబైలో అణుశక్తి విభాగంలో మెటలర్జిస్టుగా చేరి 1948 నుండి 1950 వరకూ పనిచేసాడు.
ఉద్యోగ జీవితం
[మార్చు]1950 చివర్లో భారతీయ శాస్త్ర విజ్ఞాన సంస్థలోని మెటలర్జీ విభాగం అధిపతిగా చేరాడు. ఆ సమయంలో అణుశక్తి కమిషను వారి మెటలర్జికల్ లాబరేటరీల స్థాపన తొలిదశల్లో ఉంది. అక్కడ పని పుంజుకోగానే ప్రకాష్ ముంబై తిరిగి వెళ్ళి అక్కడ చేరాలనేది ప్లాను.
1951 జనవరిలో ఐఐఎస్‌సిలో బాధ్యతలు స్వీకరించినపుడు మెటలర్జికల్ విభాగం ఇంకా శైశవ దశలో ఉంది. ప్రయోగశాల సౌకర్యాలు పరిమితంగా ఉండేవి. 1946, 1949 మధ్య MIT లో ప్రకాష్ సాధించిన అనుభవం ఇక్కడ ఒక సమగ్రమైన మెటలర్జీ పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో ఉపయోగపడింది. ఆరేళ్ళ పాటు ప్రకాష్ నేతృత్వంలో పని చేసిన ఈ విభాగం పరిమాణంలోను, పరిశోధనా కార్యక్రమాల్లోనూ స్థిరంగా పురోగమించింది. బయటినుండి వచ్చిన ఆర్థిక సాయం, బయటి స్పాన్సర్ల కార్యక్రమాలు కూడా ఇందులో ఉన్నాయి.
పరిశోధన
[మార్చు]బెంగళూరులోని విద్యా సంబంధ కార్యక్రమాలతో పాటు, భారత అణుశక్తి కార్యక్రమంలో స్పాన్సర్డ్ పరిశోధననూ చేపట్టాడు. జిర్కోనియమ్, హాఫ్నియమ్‌ల విడతీత, అణుస్థాయి జిర్కోనియమ్ యొక్క మెటలర్జీపై పరిశోధన ఇందులో ఉన్నాయి
1955 లో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన "శాంతియుత కార్యాల కోసం అణుశక్తిపై కాన్ఫరెన్సు" కు ఒక సెక్రెటరీగా ఎంపికయ్యాడు. ఈ కాన్ఫరెన్సు 1955 లో జెనీవాలో జరిగింది. న్యూయార్కులో ఉంటూ కాన్ఫరెన్సు కోసం తయారీ పనులు చేపట్టాడు.
బ్రహ్మ ప్రకాష్ ఆ కాన్ఫరెన్సులో సమర్పించిన "వేపర్ ఫేజ్ డిక్లోరినేషన్ ఆఫ్ జిర్కోనియమ్", దాని ఒరిజినాలిటీకి గాను ప్రశంసలను అందుకుంది. 1958 లో జెనీవాలో జరిగిన తరువాతి కాన్ఫరెన్సులో జిర్కోనియమ్ క్లోరైడు రిడక్షన్ ఫలితాలను సమర్పించాడు. జిర్కోనియమ్ కార్యక్రమంలో సాధించిన ప్రగతి, ముంబైలో చేపట్టిన పెద్ద కార్యక్రమానికి పునాది వేసింది. అలాగే 1971 లో హైదరాబాదులో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు స్థాపనకూ దారితీసింది. ప్రాజెక్టు డైరెక్టరుగా బ్రహ్మ ప్రకాష్ పెద్దయెత్తున జిర్కోనియమ్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సౌకర్యాల కల్పనకు పని చేసాడు.
1957 లో బ్రహ్మ ప్రకాష్‌ను ముంబైకి పిలిచారు. 1957 నుండి 1972 వరకూ ఆయన అణుశక్తి శాఖలో అత్యున్నతమైన పని చేసాడు.
అంతరిక్ష కార్యక్రమం
[మార్చు]1972 నుండి 1979 వరకు బ్రహ్మ ప్రకాష్ ఇస్రోలో పనిచేసాడు. తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేద్రానికి మొదటి డైరెక్టరుగా 1972 లో పని మొదలుపెట్టాడు. ఇస్రో వారి వాహకనౌకల, ఉపగ్రహాల కార్యక్రమాలను విజయవంతం చెయ్యడంలో పాత్ర పోషించాడు. 1984 లో మరణించేవరకూ అంతరిక్ష కమిషనులో సభ్యునిగా పనిచేసాడు. రాకెట్ల మోటార్ల కోసం 15 CDV-6 కు బదులుగా కొత్త తరం మేరేజింగ్ స్టీల్‌ను వాడాలనే నిర్ణయం తీసుకోవడంలో ఆయనది ప్రధానపాత్ర. దేశీయంగా తయారుచేసే మేరేజింగ్ స్టీల్ 250, ఎంతో సమర్ధంగా పనిచేస్తూ, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విలన్నిటిలోనూ వాడబడుతూ ఉంది.
ప్రత్యేక లోహాలు, మిశ్రమలోహాల అభివృద్ధి
[మార్చు]బ్రహ్మ ప్రకాష్ ప్రతిపాదనల మేరకు ప్రత్యేక లోహాలు, మిశ్రమ లోహాల తయారీ కోసం భారత ప్రభుత్వం హైదరాబాదులో మిశ్ర ధాతు నిగమ్ (మిధాని) ను స్థాపించింది. అనేక మిశ్రమ లోహాలు, టైటానియం, టైటానియమ్ మిశ్రమ లోహాలు, మేరేజింగ్ స్టీల్ వగైరా అనేక ప్రత్యేక లోహాలను ఇక్కడ తయారు చేస్తారు. 1980 ఏప్రిల్ 7 నుండి 1984 జనవరి 24 న మరణించే వరకూ ఆయన ఈ సంస్థకు ఛైర్మనుగా పనిచేసాడు.
పురస్కారాలు
[మార్చు]1961 లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది.[2] రెండేళ్ళ తరువాత, 1963 లో శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం లభించింది.[3] 1968 లో పద్మభూషణ్ పురస్కారం లభించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ A.P.J. Abdul Kalam, Former President of India Wings of Fire : An Autobiography of APJ Abdul Kalam (1999)
- ↑ 2.0 2.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "Padma Awards" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Brief Profile of the Awardee". CSIR. 2016. Retrieved August 31, 2016.