భారత జాతీయ సముద్రశాస్త్ర సంస్థ
దస్త్రం:Nio arabian sea.jpg | |
ధ్యేయం | సముద్రాల అధ్యయనం |
---|---|
స్థాపన | 1 జనవరి 1966 |
పరిశోధన రకం | అధునాతన శాస్త్ర సాంకేతికం |
పరిశోధనా రంగం | సముద్ర శాస్త్రం |
స్థలం | డోనా పౌలా, గోవా, భారతదేశం[1] 15°27′22″N 73°48′08″E / 15.4561°N 73.8021°E |
403 004 | |
ప్రాంతీయ కేంద్రాలు | |
యాజమాన్య సంస్థ | సి ఎస్ ఐ ఆర్ |
భారత జాతీయ సముద్రశాస్త్ర సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ), 1966 జనవరి 1న CSIR లో భాగంగా స్థాపించిన ప్రయోగశాలలలో ఒకటి.[2] ఇది ఒక స్వయం-పరిపాలక పరిశోధనా సంస్థ. ఉత్తర హిందూ మహాసముద్రపు ప్రత్యేక సముద్ర శాస్త్ర లక్షణాలపై శాస్త్రీయ పరిశోధన, అధ్యయనాలను నిర్వహిస్తుంది. గోవాలో దీని ప్రధాన కార్యాలయం ఉండగా, కొచ్చి, ముంబై, విశాఖపట్నంలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.[3]
చరిత్ర
[మార్చు]1950ల నాటికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర శాస్త్రవేత్తలు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల లక్షణాలను వివరించడంలో, అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించినప్పటికీ, హిందూ మహాసముద్రాన్ని ఎక్కువగా అన్వేషించలేదు. ఉత్తర హిందూ మహాసముద్రంలో రుతుపవనాల చక్రాలు, నీటి రసాయన లక్షణాలు, ఆహార వనరుల సమృద్ధి, పంపిణీకి సంబంధించి చేపల ఉత్పాదకత వంటి ప్రాథమిక సముద్ర శాస్త్ర సమస్యలను పరిష్కరించడం, సముద్ర గర్భ మ్యాపింగు, నమూనాల ద్వారా హిందూ మహాసముద్ర భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం.
ఇవి ప్రపంచ పరిశోధకుల సంఘానికి మాత్రమే కాకుండా, సాధారణంగా హిందూ మహాసముద్రం, ఉత్తర హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాలలో నివసించే జనాభాకు కూడా ముఖ్యమైనవి. ఫలితంగా, అంతర్జాతీయ సముద్ర శాస్త్రవేత్తల సంఘం హిందూ మహాసముద్ర ప్రాథమిక లక్షణాలను వివరించడానికి, అర్థం చేసుకోవడానికి 1959 నుండి 1965 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్‌పెడిషన్ (IIOE)ని నిర్వహించింది.[4] ఈ యాత్రకు భారత ప్రభుత్వం మద్దతునిచ్చింది. IIOE ముగింపుకు చేరుకున్నప్పుడు, యాత్రలో పాల్గొన్న భారతీయులు నేర్చుకున్న సముద్ర శాస్త్ర పరిశోధనా నైపుణ్యాలను ఉపయోగించుకోడానికి ఒక సంస్థ అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశీలనల ఫలితంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని (NIO) స్థాపించారు. డాక్టర్ NK పణిక్కర్, ఈ సంస్థకు డైరెక్టరుగా నియమితుడయ్యాడు. 1973 మే వరకు ఈ పదవిలో కొనసాగాడు.[5] నేడు, సంస్థలో దాదాపు 170 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు.
పరిశోధన సహకారం
[మార్చు]మహాసముద్రాల అన్వేషణలో భాగంగా NIO, 1981 జనవరి 26 న పశ్చిమ హిందూ మహాసముద్రంలో 4,800 మీటర్ల లోతు నుండి పాలీమెటాలిక్ నోడ్యూల్స్‌ను వెలికి తీసింది. ఇందుకోసం దాని మొదటి పరిశోధనా నౌక RV గవేషణిని ఉపయోగించుకుంది.
NIO పరిశోధనా కృషి కారణంగా ఇంటర్నేషనల్ సీ బెడ్ అథారిటీ "పయనీర్ ఇన్వెస్టర్" హోదా ఇచ్చింది. సంస్థ కృషి చేసిన కొన్ని సమస్యలు ఇవి: భారతీయ టెక్టోనిక్ ప్లేట్ల పరిణామం, ప్రభావాలు; భారత ఉపఖండంలో రుతుపవన వాతావరణానికి దారితీసే హిమాలయాలు పెరగడం ప్రారంభించిన సమయాన్ని నిర్ణయించడం; సముద్ర మధ్యంలో ఉండే చీలికల స్వభావం; సముద్ర అవక్షేపణల లక్షణాలు; సముద్ర అవక్షేప బడ్జెట్‌లో భారత ఉపఖండంలోని నదుల పాత్ర, అవక్షేప కోర్లలో దాగిన పురాతన శీతోష్ణస్థితి పరిణామపు పరిశీలన.
మేధో సంపత్తి
[మార్చు]ఎన్‌ఐవోకు దాదాపు 50 పేటెంట్లు ఉన్నాయి. వీటిలో 60% సముద్ర బయోటెక్నాలజీ పరిశోధనకు సంబంధించినవి. సముద్ర వాతావరణంలోని జీవులలో కొత్త ఔషధాల అభివృద్ధికి, ఇతర ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల అభివృద్ధికీ ఉపయోగపడే అణువులు ఉంటాయి. NIO పరిశోధకులకు ఇది కొత్త అధ్యయనం. వారి పరిశోధనల ఫలితంగా సంస్థకు పరిశోధనా పత్రాలు, మేధో సంపత్తి లభించింది.
సంస్థకు పేటెంట్‌లను సాధించిపెట్టిన మరొక పరిశోధనా విభాగం, మెరైన్ ఇన్‌స్ట్రుమెంటేషన్. మాయా AUV అనేది ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (AUV). [6]
సేవలు
[మార్చు]భారతదేశంలో పారిశ్రామిక రంగం కోసం ఎన్‌ఐవో అనేక ప్రాజెక్టులను చేపట్టింది. తన పరిశోధనా నౌక RV గవేషణిని కొనుగోలు చేసాక చేపట్టిన మొదటి ప్రాజెక్ట్‌లలో ఒకటి బాంబే హై వద్ద ఉన్న భారతదేశపు మొట్టమొదటి ఆఫ్‌షోర్ చమురు క్షేత్రం నుండి చమురును తీసుకువెళ్లడానికి పైప్‌లైన్ మార్గాన్ని గుర్తించడం. భారత ప్రభుత్వ రంగ చమురు, సహజ వాయువు కమిషన్ (ONGC) అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టింది. అప్పటి నుండి, NIO భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల కోసం అనేక ప్రాజెక్టులను నిర్వహించింది. NIO ఖాతాదారుల జాబితాలో ప్రధాన పెట్రోలియం కంపెనీలు, రేవులూ ఉన్నాయి. NIO సేవలను భరూచ్ ఎకో-ఆక్వా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కోస్టల్ మెరైన్ కన్స్ట్రక్షన్ & ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థలు తీర ప్రాంతాల అభివృద్ధిలో ఉపయోగించుకున్నాయి. NIO చేపట్టిన ప్రాజెక్టులలో ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (EIA), కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్, రిసోర్స్ సర్వేలు, బయోఫౌలింగ్, తుప్పు అధ్యయనాలు, సముద్ర పరికరాల అభివృద్ధి కూడా ఉన్నాయి.
ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తున్న సమస్య ఏమిటంటే, ఓడలు బల్లాస్ట్ కోసం ఉపయోగించే నీటిని బదిలీ చేయడం వలన జీవులను ఒక నౌకాశ్రయం నుండి మరొక నౌకాశ్రయానికి తరలించడం. ఇటువంటి బదిలీ కొన్నిసార్లు స్థానిక జీవావరణ శాస్త్రానికి పరాయి జీవుల అనియంత్రిత పెరుగుదలకూ దారితీస్తుందని నిరూపితమైంది. ఇది స్థానికంగా ఉండే మత్స్య సంపదను తుడిచిపెట్టగలదు. భారతదేశంలో ఈ సమస్యపై అవగాహన కల్పించడంలో NIO శాస్త్రవేత్తలు ప్రధాన పాత్ర పోషించారు. వారి కృషికి గుర్తింపుగా, భారత ప్రభుత్వ షిప్పింగ్ డైరెక్టరేట్ జనరల్, ప్రధాన భారతీయ ఓడరేవులలో బ్యాలస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ కోసం ప్రణాళికలను రూపొందించడానికి NIO సహాయం కోరింది.
పరిశోధన కోసం సౌకర్యాలు
[మార్చు]1973 నుండి 2009 వరకు సంస్థ జరిపిన సుమారు 1000 సముద్ర యాత్రలలో సేకరించిన డేటాను సులభంగా, సమర్ధవంతంగా పొందడం, తుది వినియోగదారులకు సరఫరా చేయడం కోసం సంస్థకు చెందిన డేటా సెంటర్ (NIODC), డేటాబేస్‌ను నిల్వ చేసి, నిర్వహిస్తుంది.
సంస్థ గ్రంథాలయంలో 35,000 పుస్తకాలు, జర్నల్‌లు ఉన్నాయి, ఇది సముద్ర శాస్త్ర రంగంలో దేశంలోనే అతిపెద్ద సేకరణ. ప్రింట్ సేకరణతో పాటు, లైబ్రరీకి ప్రత్యక్ష సభ్యత్వం ద్వారా లేదా కన్సార్టియంలో భాగంగా 3,000 కంటే ఎక్కువ జర్నల్‌లకు ఆన్‌లైన్‌లో చదువుకునే సౌకర్యం ఉంది. అంతర్జాతీయ కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఈ గ్రంథాలయం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు భారతీయ సముద్ర శాస్త్ర అధ్యయనాల గురించి సమాచారానికి వనరుగా మారింది.
పలు రంగాల్లో సంస్థ చేస్తున్న సముద్ర పరిశోధన కార్యక్రమాలకు మద్దతు నిచ్చేందుకు సంస్థ వద్ద మూడు పరిశోధనా నౌకలున్నాయి. వీటిలో అతి చిన్నది 23 మీటర్ల పొడవైన తీరప్రాంత పరిశోధనా నౌక CRV సాగర్ సూక్తి. 56.5 మీటర్ల పొడవు గల RV సింధు సంకల్ప్ ప్రధానంగా ఖండాంతర సరిహద్దుల్లో సేవలు అందిస్తుంది. అయితే ఇది విశాల సముద్ర ప్రయాణాలు కూడా చేయగలదు. 80 మీటర్ల పొడవైన పరిశోధనా నౌక RV సింధు సాధన, పూర్తిగా విశాల సముద్ర అధ్యయనాలను చేయగలదు.
మూలాలు
[మార్చు]- ↑ "Head Quarters". National Institute Of Oceanography. Retrieved 26 April 2019.
- ↑ CSIR India.
- ↑ CSIR-NIO. "NIO at a Glance". CSIR - National Institute of Oceanography (NIO) (in ఇంగ్లీష్). Retrieved 2022-04-05.
- ↑ CSIR-NIO. "IIOE, A historical perspective". CSIR - National Institute of Oceanography (NIO) (in ఇంగ్లీష్). Retrieved 5 April 2022.
- ↑ Illavia, Perin. "Goa's NIO: Unravelling the mysteries of the ocean for decades". Gomantak Times (in ఇంగ్లీష్). Retrieved 5 April 2022.
- ↑ "National Institute of Oceanography Bioinformatics Center, India". www.niobioinformatics.in. Retrieved 5 April 2022.