మందరపు హైమవతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మందరపు హైమవతి
Mandarapu hymavathi.jpg
జననం (1956-02-18) 1956 ఫిబ్రవరి 18 (వయస్సు 66)
విజయవాడ,కృష్ణా జిల్లా
ఆంధ్రప్రదేశ్ India
నివాస ప్రాంతంవిజయవాడ
తండ్రిమందరపు కాసులు
తల్లిమందరపు దుర్గాంబ

మందరపు హైమవతి కవయిత్రి.

విశేషాలు[మార్చు]

ఈమె విజయవాడలో 1956, ఫిబ్రవరి 18న జన్మించింది[1]. ఈమె తండ్రి మందరపు కాసులు, తల్లి దుర్గాంబ. సాహితీ ప్రియుడైన తండ్రి తనతోపాటు చేయిపుచ్చుకుని సాహితీ సభలకు తీసుకువెళ్ళడం వల్ల ఈమెకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగి కలిగింది. గుణదల లోని బిషప్‌ హజ్జరయ్య పాఠశాలలో చదివేటప్పుడు తెలుగు మాస్టారు దేవరకొండ చిన్నికృష్ణశర్మ చెప్పిన పాఠాలు ఈమెకు తెలుగుభాష మీద ఆసక్తిని పెంచాయి. ఆయన తాను రాసిన పద్యాలు విని, పద్యాల పట్ల మక్కువ ఏర్పడి పద్యాలు వ్రాయడం మొదలు పెట్టింది. వరంగల్లు లోని ఓరియంటల్‌ కాలేజిలో చేరేవరకూ పద్యాలే వ్రాసింది. ఆ తర్వాత ఎక్కువగా ఆధునిక కవిత్వం, వచన కవిత్వం చదివింది. శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం, తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి మొదలైనవి చదివింది. ఆ రచనల ప్రభావంతో వచన కవిత్వం వ్రాయడం ఆరంభించింది. ఈమె తను వ్రాసే కవిత్వాన్ని స్త్రీ వాద కవిత్వం అని అనుకోలేదు కానీ విమర్శకులు ఈమెకు స్త్రీవాద కవయిత్రిగా గుర్తింపునిచ్చారు. ఈమె తెలుగు భాషలో భాషాప్రవీణ ఉత్తీర్ణురాలయ్యింది. తెలుగు పండితురాలిగా ఉద్యోగం చేసింది.

ఈమె వ్రాసిన "నిరుపహతి స్థలం", "నిషిద్ధాక్షరి", "సర్పపరిష్వంగం", "సంతకాలు చేద్దాం రండి", "వాయిదా", "సిలబస్‌ మార్చలేమా" మొదలైన కవితలు ఈమెకు బాగా పేరును తెచ్చిపెట్టాయి. ఈమె అనేక పైగా కవితలను వ్రాసింది. వాటిలో 43 కవితలతో నిషిద్ధాక్షరి కవితా సంపుటిని ప్రకటించింది. ఈ కవితా సంపుటి అనేక బహుమానాలను, పురస్కారాలను తెచ్చిపెట్టింది. ఈ పుస్తకానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు, సినారె పురస్కారం, శ్రీశ్రీ కవితా పురస్కారం లభించాయి. ఈమె కవితలు హిందీ, కన్నడ, ఆంగ్ల, తమిళ, మలయాళ భాషలలోకి తర్జుమా అయ్యాయి. ఈమె పలు జాతీయ కవి సమ్మేళనాలలో పాల్గొని తన కవితలను వినిపించింది[2].

రచనలు[మార్చు]

  • వానచినుకులు
  • నిషిద్ధాక్షరి
  • సూర్యుడు తప్పిపోయాడు
  • నీలిమేఘాలు

రచనల నుండి ఉదాహరణ[మార్చు]

ఈమె కవిత్వం నుండి మచ్చుకు ఒక కవిత:

అనాసక్త సాయంత్రం[3]
ఏ అందమైన మేఘాల లిపి లేని
అనుత్సాహకరమైన
ఒకలాంటి బూడిద రంగు
ఆకాశ నేపధ్యంలో
దిగులు చీకటి ముసిరినట్లు
గుబులు గుబులుగా మనసు
పూర్తిగా సాయం సమయం కాకుండానే
కొడిగట్టిన దీపంలా
ఎఱ్ఱమందారంలా
అతి సాధుస్వభావిలా
అతి చల్లని సూరీడు
@ @ @
నాలుగు వైపులూ మూసుకుపోయిన
నల్లరంగు విషాదపు తెరల గుడారంలో
బిక్కుబిక్కుమంటూ
ఒక్కదానే్న వున్న భావన
ఎన్నో పనుల ఒత్తిడివున్నా
ఏ పనీ చేయబుద్ధి పుట్టని
అనాసక్త సాయంత్రం
కిటికీలు తలుపులు బిగించి
బద్ధకపు దుప్పటి కప్పుకొని
వెచ్చని కలలు కంటూ
పడుకొంటే ఎంత బాగుండు
ఈ చలి సంజలో...

మూలాలు[మార్చు]

  1. Kartik, Chandra Dutt (1999). Who's who of Indian Writers, 1999: A-M (1 ed.). New Delhi: Sahitya Acadamy. p. 467. ISBN 81-260-0873-3. Retrieved 21 April 2017.
  2. వి.శాంతి, ప్రబోధ (1 September 2014). "రగులుతుండే అగ్ని గోళం – మందరపు హైమవతి కవిత్వం". భూమిక. Archived from the original on 17 ఫిబ్రవరి 2018. Retrieved 21 April 2017. {{cite journal}}: Check date values in: |archive-date= (help)
  3. మందరపు, హైమవతి (12 January 2015). "అనాసక్త సాయంత్రం". ఆంధ్రభూమి. {{cite journal}}: |access-date= requires |url= (help)