మన్నవ భాస్కరనాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన్నవ భాస్కరనాయుడు ప్రముఖ కవి, కథారచయిత, ఉపన్యాసకుడు, పద్య కావ్య రచయిత, గేయ రచయిత, నాటక రచయిత. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయంలో రీడర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు.

బాల్య జీవితము[మార్చు]

మన్నవ భాస్కరనాయుడు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలానికి చెందిన బందర్ల పల్లి గ్రామములో 10-9-1936 వ సంవత్సరములో మంగమ్మ, సీతారామా నాయుడు దంపతులకు జేష్ట కుమారుడుగా జన్మించారు. వీరి తర్వాత ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి జన్మించారు. అప్పట్లో వీరిది 30 మంది సభ్యులు గల ఉమ్మడి కుటుంబము. ఆ రోజుల్లో ఊరూర పాఠశాలలు లేవు. బందర్లపల్లికి ఒక కిలోమీటరు దూరములో వున్న వడ్డేపల్లిలో వుండే ప్రాథమిక పాఠశాలలో వీరి విద్యాభ్యాసము జరిగింది. అక్కడ ఆరవ తరగతి వరకు చదివి, పూతల పట్టులో 8వ తరగతి వరకు చదివారు. ఆతర్వాత జిల్లాబోర్డు ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు. అంతకన్నా ఎక్కువ చదవడానికి సమీపములో కళాశాల విద్య అందుబాటులో లేక పోవుటచే అతని చదువు అంతటితో ఆగి పోయింది.

ఆతర్వాత ప్రాథమిక పాఠశాల ఉపాద్యాయునిగా ఉద్యోగములో చేరి ప్రైవేటుగా బి.ఎ. ఎం.ఏ (తెలుగు) పూర్తి చేశారు. ఆతర్వాత ఆదునిక కవిత్వంలో అలంకారం అనే అంశంమీద పరిశోధన చేసి పర్యవేక్షకుడు లేకుండానే శ్రీ వెంకటేశ్వార విశ్వ విద్యాలయానికి తన సిద్ధాంతా గ్రంథాన్ని సమర్పించి పి.హెచ్.డి. పట్టా పొందారు.

ఉద్యోగము[మార్చు]

1967 నాటికి డిగ్రీ పూర్తి కాగానే, తెలుగు భాషా పండితునిగా పదోన్నతి పొంది.... కాణిపాకం, పలమనేరు ఉన్నత పాఠశాలలో పనిచేశారు. 1969లో ఎం.ఏలో పట్టాపొందగానే, శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడుగా నియమితులయ్యారు. 1987 వ సంవత్సరంలో పి.హెచ్.డి పొందగానే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రీడరుగా పదోన్నతి కలిగింది. అక్కడే 1996 వరకు పనిచేసి 1996 వ సంవత్సరంలో పదవీ విరమణ గావించారు. మన్నవ భాస్కరనాయుడు 1961 వ సంవత్సరములో సంపూర్ణమ్మను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

తెలుగు సాహిత్యంలో అభిరుచి - కృషి[మార్చు]

మన్నవ భాస్కరనాయుడు గారికి విద్యార్థి దశనుండే తెలుగు సాహిత్యం పై మక్కువ ఎక్కువ. అలా 8 వ తరగతి చదువుకుంటున్నప్పుడే అప్పుడప్పుడే చందస్సులో ఓనమాలు దిద్దుకుంటున్నప్పుడే పద్యాలు వ్రాయడం మొదలు పెట్టాడు. అలా వారు వ్రాసిన పద్యాలు మచ్చుకు మూడు పద్యాలు.

 
1.చీకటుల్ల్ పారద్రోలి లోకమునకు
వెలుగు చూపించి రక్షించ దలచి నట్లు,
బాల భాస్కరుడదె పైకి వచ్చె
ప్రొద్దు మొలచిన దృశ్యము ముద్దు గూర్చె.

2.జొన్నచేనికాడ వన్నెలన్ వెలిగించు
చిన్నదాన అలుపు గొన్నదాన
వెన్నుమీద గువ్వ వెక్కిరించె చూడు
తొలగ ద్రోలవమ్మ తొందరగ.

3. ఎండ వానలకోర్చిమీ ఇంటివారు
పంట పండించు చున్నారు పాట్లు పడుచు,
పిచ్చుకలు తిని పోయిన బీదరైతు
చాల కష్టము పడునమ్మ తోలవమ్మ. 

ఉపాద్యాయుడిగా వున్నప్పుడు విద్యార్థులకవసరమైన పద్య కవితలు, గేయాలు, కథానికలు, రచించరు. అవి ఆనాడు చిత్తూరు నుండి వెలువడుతున్న దేవదత్తం, పాంచజన్యం, పల్లెసీమ, తొలకరి, కాలచక్రం మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యేవి. చిత్తూరు జిల్లా రచయితల సంఘం ప్రచురించిన ఈరేడు లోకాలు అనే సంపుటిలో వీరు వ్రాసిన అరటాకు , అనే కథ, చెక్ పోస్ట్ అనే నాటిక ప్రచురితమయ్యాయి.

టి.టి.డి స్వర్ణోత్సవ సంచికకు నాయుడు గారు సంపాదక బాధ్యతలు వహించారు. అందులోనే వీరు రచించిన గిరికథ అనే హరికథ ప్రచురితమైనది. అదే విధంగా శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల అభ్యర్థ మేరకు విశ్వవిద్యాలయం ప్రాభవాన్ని వివరించే ఒక బుర్ర కథను రచించారు. అది ప్రదర్శింప బడి స్వర్ణోత్సవములో ప్రచురింప బడింది.

శ్రీ వేంకటేశ్వరుని మీద అనేక శతకాలు వెలువడ్డాయి. వాటి సరసన నాయుడు గారు వ్రాసిన శ్రీ వేంకటేశ్వర సుమాంజలి శతకము కూడా చేరినది. ఇందులో 108 సీస పద్యాలున్నాయి. ఇందులో మకుటము మన్నవ సుమాంజిలింగొను మధుర మూర్తి విమల భావ ప్రకాశ శ్రీ వెంకటేశ దీన్ని 1967 లోనే వ్రాసినా అది అముద్రితముగానే వుండి ఇపోయింది. 1972 వ సంవత్సరంలో వీరి గురువు గారైన శంకరంబాడి సుందరాచారి ప్రోత్సాహంతో ముద్రణకు నోచుకున్నది.

మన్నవ భాస్కర నాయుడు రచించిన మరో పద్య కావ్యము స్వేద సూర్యోధయం. ఇందులో 437 పద్యాలున్నాయి. శ్రన - సమస్య ఇందలి కథా వస్తువు. ఇది శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహకారము తో ముద్రితమైంది. దీన్ని తన తల్లి దండ్రులకు అంకిత మిచ్చారు. వీరు మన్నవ ముత్యాల సరాలు అనే పేరుతో మాత్రా చందస్సులో ఒక శతకం వ్రాశారు. ఇందులోని విషయము సమకాలీనమైనది. ఇది 2001 లో ముద్రితమైనది. వీరు వ్రాసిన మరో పద్య కావ్యం హృధయోధయం ఇందులో 475 పద్యాలున్నాయి.

కళా జీవితము[మార్చు]

నాయుడిగారి నటనాభిలాష విద్యార్తి దశలోనే మొగ్గ తొడిగింది. విద్యార్తిగా వుండగానే, వై.కె.వెంకట నరసింహాచారి, శంకరంబాడి సుందరాచారి వంటి గురువులతో కలిసి భక్త రామదాసు, సత్య హరిచంద్ర, ప్రతాప రుద్రీయం, వంటి నాటకాలలో బాల వేషాలు వేశారు. అలా మొగ్గ తొడిగిన నాఠకాభిలాష నటనతో బాటు నాటక రచనలో కూడ వికసించింది. అలా ఆత్రేయ రచించిన గుమస్తా, ఎవరు దొంగ, పరివర్తన, ఒక రూపాయి, వంటి నాటకాల్లో అనేక భూమికలను పోషించారు.

పొందిన సత్కారాలు[మార్చు]

వీరు తన ప్రతిభకు అనేక సంస్థల నుండి అనేక సత్కారలను పొందారు. 1995 వ సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారినుండి ఉత్తమ ఉపాద్యాయ పురస్కారాన్ని అందుకున్నారు. తమిళనాడు, హోసూరులోని ఆంధ్ర సంస్కృతి సమితి వారు 2000 వ సంవత్సరంలో నాయుడి గారిని సత్కరించారు.

మరణం[మార్చు]

డా:మన్నవ భాస్కరనాయుడు(84) డిసెంబరు, 16 , 2019 సోమవారం నాడు తిరుపతిలో తన స్వగృహంలో మరణించాడు.(ఈనాడు, మంగళవారం, డిసెంబరు, 16, 2019)

మూలాలు[మార్చు]

[1] 2.ఈనాడు, 17,డిసెంబరు, 2019

  1. ఉప్పటి, విజయ భాస్కర్ (2010). మన్నవ భాస్కరనాయుడు రచనల పరిశీలన. తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. చాప్టర్ 7. Retrieved 29 July 2016.