మర్సకొల కళావతి
మర్సకొల కళావతి | |
---|---|
జననం | తోషం, గుడిహత్నూర్ మండం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ |
నివాస ప్రాంతం | ఆదిలాబాదు |
ప్రసిద్ధి | జానపద గాయని |
మతం | హిందూ |
భార్య / భర్త | నారాయణ |
పిల్లలు | ముగ్గురు కుమార్తెలు (యశోద, సుశీల, గోపిక) ఇద్దరు కుమారులు (ప్రభుదాస్, కిష్టు) |
తండ్రి | తొడసం భీంరావు |
మర్సకొల కళావతి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద గాయని. గోండు పురాణాలు, మహాభారత ఘట్టాలు, వీరగాథలను గానం చేస్తున్న కళావతి 2022లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]
జననం
[మార్చు]కళావతి, ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండం, తోషం గ్రామంలోని ‘తోటి’ కళాకారుల కుటుంబంలో జన్మించింది. తండ్రి తొడసం భీంరావు ‘తోటి’ కళాకారుడు. ఈ కళాకారులు గోండురాజులకు, కొలాములకు ఆశ్రిత కులంగా వారి సంస్కృతి, చరిత్రను తెలిపే ప్రాచీన గాథలు, పురాణాలు, వీరుల కథలను పాడడం వీరి కులవృత్తి.[2]
కళారంగం
[మార్చు]తండ్రి ప్రతిరోజూ తన ముందర కూర్చోబెట్టుకొని కళావతికి పాటలు, కథలు, పురాణాలు నేర్పించాడు. ‘తోటి’ కళాకారుల బృందాల్లో మగవాళ్ళు మాత్రమే పాటలు పాడుతుండగా ఆడవాళ్ళు బాజాలు వాయించడమో, కోరస్ ఇయ్యడమో చేసేవారు. ఆ సమయంలో తాను కూడా పాడతానని కళావతి ముందుకొచ్చింది. అప్పుడు మగవాళ్ళంతా కళావతిని తిట్టారు, ‘‘ఆడోళ్ళు పాటలు పాడకూడదని’’ అవమానించారు. అయినాకానీ, కళావతి ఎవరికి భయపడలేదు, పాడడం ఆపలేదు. జీవితాంతం పాటలు పాడతానని నాయనకిచ్చిన మాటను నేర్చుకుంటోంది.
గోండురాజులు, కొలాముల ఇళ్ళల్లోని పెళ్లి, చావు, పూజ మొదలైన సందర్భాలలో ‘తోటి’ కళాకారులు తమ కళను ప్రదర్శిస్తుంటారు. కళావతి తన ఇద్దరు కొడుకులతో కలిసి తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాల్లోని పల్లెలకు వెళ్ళి, అక్కడ సందర్భాన్ని బట్టి పాటలు పాడి, వారు ఇచ్చిన కానుకలు తీసుకుంటుంది.[2][3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కళావతికి నారాయణతో వివాహం జరిగింది. నారాయణ కూలికి మేకలు మేపుతాడు. వారికి ముగ్గురు కుమార్తెలు (యశోద, సుశీల, గోపిక), ఇద్దరు కుమారులు (ప్రభుదాస్, కిష్టు) ఉన్నారు.
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2022.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (7 March 2022). "పలు రంగాల్లో సేవ చేసిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు". Archived from the original on 8 March 2022. Retrieved 17 March 2022.
- ↑ 2.0 2.1 వెంకటేష్, కె (2022-03-16). "పాటే నా చదువు నాన్నే నా గురువు". andhrajyothy. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-17.
- ↑ telugu, NT News (2022-04-24). "Thoti Tribes | గోండుల ఇండ్లల్లో పెండ్లయినా.. చావైనా.. వీళ్లు రావాల్సిందే !!". www.ntnews.com. Retrieved 2024-07-16.
- ↑ Namasthe Telangana (7 March 2022). "మహిళలకు విశిష్ట పురస్కారాలు". Archived from the original on 8 March 2022. Retrieved 17 March 2022.
- ↑ Hindustantimes Telugu (8 March 2022). "వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలకు అవార్డులు.. జాబితా ఇదే." Archived from the original on 8 March 2022. Retrieved 17 March 2022.