మాఘీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాఘీ, మకరసంక్రాంతికి పంజాబీ రూపం.  శీతాకాలంలో  భారతదేశం మొత్తం మీద జరుపుకునే మకరసంక్రాంతిని వీరు మాఘీ పేరుతో చేసుకుంటారు.[1] పంజాబీ పంచాంగం ప్రకారం వచ్చే మాఘ మాస మొదటి రోజును మాఘీగా జరుపుకుంటారు. ఈ పండుగను పంజాబ్హిమాచల్ ప్రదేశ్హర్యానా ప్రజలు చేసుకుంటారు. సంప్రదాయంగా, కాలానుసారంగా, ఆధ్యాత్మికంగా పంజాబీలకు ప్రత్యేకమైన  పండుగ ఇది. వ్యవసాయ నూతన సంవత్సరంగా  జరుపుకునే ఈ  పండుగలో ఆటపాటలకు విశేష ప్రముఖ్యత ఉంటుంది.

సాంస్కృతిక పండుగ[మార్చు]

కాలానుగుణమైన పండుగ[మార్చు]

పగలు పెద్దగా ఉండటాన్ని సూచిస్తుంది మాఘీ[2]. శీతాకాల ప్రభావం తగ్గుముఖం పట్టే సమయంలో వస్తుంది ఈ పండుగ. దీనిని బారా దిన్(పొడవైన రోజు) అని కూడా వ్యవహరిస్తారు. శిశిరకాలం ప్రారంభ సూచనగా చేసుకుంటారు[3]. సూర్యమాన మాఘమాసంలో మాఘీ జరుపుకుంటే, చంద్రమాన మాఘమాసంలో బసంత్ పండుగను జరుపుకుంటారు పంజాబీలు. రెండు పండుగలూ కాలానుగుణంగానే జరుపుకుంటారు. బసంత్ కన్నా ముందు మాఘీ పండుగే వస్తుంది.

సంప్రదాయాలు[మార్చు]

ఆహారం[మార్చు]

భారతదేశంలో మిగిలిన ప్రదేశాల్లో లాగానే పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా శీతాకాలంలో వరిపంట పండదు.[4] శరదృతువులో పండే పంటను ఈ రోజునే ఇంటికి తెచ్చుకుంటారు. చెరకురసం, పాలలో ఉడికిన బియ్యాన్ని పరమాన్నం(పాయసం, ఖీర్)లా చేసుకుని ఈ రోజున ప్రసాదంలా తింటారు పంజాబీలు. "పోహ్ రిధీ, మాఘ్ ఖడీ" అనేది పంజాబీ నానుడి. పోహ్ మాసపు చివరి రోజున ఖీర్(పాయసం) చేసుకుని, దానిని మాఘమాసపు మొదటి రోజున తినాలి అని దానర్ధం. పంజాబ్ లోని కొన్ని ప్రదేశాల్లో పప్పులతో చేసుకునే కిచిడీని, చెరకు, బెల్లం కూడా తింటుంటారు ఈ రోజున.[2] ఇవన్నీ కూడా శీతాకాలపు పంటలే. నువ్వులతో చేసిన పదార్ధాలను తినడం కూడా ఆచారమే. బసంత్ పండుగకు మాత్రం కుంకుమ బియ్యం తింటారు.

గేదె పాలతో చేసిన అన్నం పరమాన్నం
చెరకుతోట


మోహ్-మాహీ[మార్చు]

పంజాబ్ లోని కొన్ని ప్రాంతాల్లో కన్నెపిల్లలు, ఇంటిలోని పెద్దవారిని(ముఖ్యంగా మహిళలు) కానుకలు అడగడం ఒక ఆచారం. ఈ సంబరాన్ని "మోహ్ మాహీ" అని అంటారు. మాఘీ పండుగ రోజున ఉదయం పూట ఈ సంబరం జరుపుకుంటారు.[2] ఈ సంబరంలో ఒక పాట కూడా పాడుతుంటారు:

మోహ్-మాహీ దే కే జా-దే కే జా దర్హీ ఫూల్ ఫువా కే జా-పువా కే జా దర్హీ తేరీ హరీ భరీ-హరీ భారీ ఫులా దే నాల్ జర్హీ బర్హీ-జర్హీ బర్హీ జే నా మోహ్-మాహీ దిట్టీ సు దుహుధార్హ్ దర్హీ పుట్టు సు

అనువాదం

నువ్వు వెళ్ళేముందు నా మోహ్ మాహీ నాకివ్వు నీ గడ్డంపై పూలు పెట్టు

నీ గెడ్డం వికసించింది

పూలతో నిండిపోయింది

నువ్వు నాకు మోహ్-మాహీ ఇవ్వకపోతే నీ గెడ్డం లాగేస్తాను నేను

మాఘీ-సంవత్సరాది[మార్చు]

సూర్యోదయం:పెద్దరోజుల ప్రారంభం

ప్రాథమికంగా సంవత్సరాన్ని కొలవడానికి ఉత్తర, దక్షిణాయనాలు, విషువత్తులను ఉపయోగిస్తారు. దక్షిణాయనం పూర్తయిన తరువాతి రోజునే సంవత్సరాదిగా భావించి మాఘీ పండుగను జరుపుకుంటారు పంజాబీలు.[5] నిజానికి దక్షిణాయనం వీరికి 23 డిసెంబరుతోనే అయిపోయినా, పంజాబీ పంచాంగం ప్రకారం వీరు ఈ మాఘీ పండుగను జనవరి 14న జరుపుకుంటారు.

పంజాబీ రైతులకు మాఘీ ఆర్థిక సంవత్సరాది కూడా. ఈ రోజు నుండే కౌలు లెక్కలు మొదలుపెడతారు అక్కడి రైతులు.[5]

కిచిడి
నువ్వులు
పంజాబ్ లోని బెల్లం పంట

మాఘీ వేడుకలు[మార్చు]

సంప్రదాయంగా, స్థానిక ప్రాంతాల్లో మాఘీ వేడుకలు, జాతరులు నిర్వహించుకుంటారు.[6][7] ఈ వేడుకల్లో వివిధ ఆటలపోటీలు జరుగుతాయి. పంజాబీ కబడ్డీ, కుస్తీ పోటీలు వంటి స్థానిక క్రీడాపోటీలు నిర్వహిస్తారు.

ఆధ్యాత్మిక వేడుకలు[మార్చు]

ఈ పండుగను హిందువులు, సిక్కులు కూడా జరుపుకుంటారు.

వారణాశి, గంగ ఒడ్డున ఉన్న దశ అశ్వమేధ ఘాట్ వద్ద మాఘీ వేడుకలు

హిందువులు జరుపుకునే వేడుకలు[మార్చు]

హిందువులు ఈరోజున తీర్ధస్నానాలు, మందిర దర్శనాలు చేస్తుంటారు. ఈ రోజున ముఖ్యంగా గంగానదీ స్నానం పవిత్రమైనదిగా భావిస్తారు. దాన, ధ్యాన, హవనాది పుణ్యకార్యక్రమాలకు మాఘమాసం పవిత్రమనదిగా చెబుతారు వీరు.[2] 

ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభాన్ని మాఘీగా వ్యవహరిస్తారు. నిజానికి శీతాకాలం పూర్తి అవడంతోనే ఈ పండుగను జరుపుకోవాలి కానీ, దక్షిణాయనం పూర్తి అయిన తరువాతే ఉత్తరాయణం మొదలు కావడంతో ఆ మరుసటి రోజునే మాఘీగా జరుపుకుంటారు. పోహ్ మాసంతో దక్షిణాయనం పూర్తయి, మాఘమాసపు మొదటి రోజుతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది.

హిందువులు మాఘీ రోజున నువ్వుల నూనె రాసుకుని, తరువాత తలంటు పోసుకుంటారు. నువ్వులు పాపాన్ని కడిగివేస్తాయన్నది భారతీయుల్లో ఉన్న ఒక నమ్మకం.[2] ఈరోజున భోగిమంటలు వెలిగించి  పంజాబీ  హిందువులు నువ్వులు మంటల్లో వేస్తూ ఆ మంటలకు  ప్రదక్షణం చేస్తారు. 

సిక్కులు మాఘీ జరుపుకునే పద్దతి[మార్చు]

సిక్కులు కోసం వారి గురువు గురు అమర్ దాస్ జీ ఎంపిక చేసిన మూడు పండుగల్లో మాఘీ ఒకటి(మిగిలిన రెండూ వైశాఖి, దీపావళి).[8]

శ్రీ గురు గ్రంధ్ సాహిబ్ జీ

మాఘమాసం జరుపుకునే పద్ధతిని శ్రీ గురు గ్రంధ్ సాహిబ్ ఇలా  తెలిపింది:

గురు పరంపరను, దేవుణ్ణి, సమాజాన్ని స్మరిస్తూ ఈరోజున పుణ్యస్నానాలు ఆచరించాలి. ఇలా చేయడం వల్ల పూర్వజన్మల్లోని పాపాలు నశించి, మనలోని గర్వం పోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాశ్చర్యాలనే ఆరు దుర్గుణాలు మనల్ని విడిచిపోతాయి . ఈ రోజున చేసే పుణస్నానం 68 పుణ్యనదుల్లో చేసే స్నానంతో సమానం.

గురు గ్రంధ్ సాహిబ్ లో పైన చెప్పిన వాక్యలను అనుసరించి మాఘమాస స్నానాలు ఆచరిస్తారు సిక్కులు. ఈ మాసంలో చేసే పుణ్యస్నానాల వల్ల తమను తాము పవిత్రం చేసుకున్నట్టుగా భావిస్తారు. [9]

ఈ పుణ్యస్నానాల వల్ల  తమలోని లోభం పోతుందని వీరి నమ్మకం.  చెడు కర్మలను పోగొట్టుకునేందుకు ఈ మాసం అత్యుత్తమమైనదిగా భావిస్తారు వీరు. ఈ మాసంలో ఎక్కువగా ధ్యానంలోనే గడుపుతారు సిక్కులు.[10]

మాఘీ, 40 ముక్తేలు[మార్చు]

మాఘీ రోజున సిక్కులు గురుద్వారాను సందర్శించి, వారి జాతి కోసం వీరోచితంగా పోరాడిన చాలీ ముక్తే(40మంది వీరులు)లకు నివాళులర్పిస్తారు. గురుగోబింద్ సింగ్ ముసుగులో శత్రు సైనికులు దాడికి పాల్పడినప్పుడు ప్రజలను కాపాడి, వారికోసం ప్రాణాలు అర్పించిన 40మంది వీరులే చాలీ ముక్తేలు. ఖిద్రనే డి ధాబ్ లోని సరస్సు వద్ద, 1705 డిసెంబరు 29(పోహ్ మాసపు ఆఖరి రోజున)న జరిగిందీ ఘటన. అందుకే ఆ తరువాతి రోజైన మాఘీని వారు పవిత్రదినంగా భావించి, ఆ పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ జరుపుకుంటారు.[11][12]

ముక్త్ సర్ మేళా[మార్చు]

గురుద్వారా ముక్త్ సర్ సాహిబ్

ముక్త్ సర్ లో మేళా మాఘీ పేరుతో ఒక పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ప్రదేశంలోనే ముక్త్ సర్ యుద్ధం, 40 ముక్తేల ప్రాణత్యాగం జరిగింది.[13] ఈ ముక్త్ సర్ ప్రదేశంలోని పవిత్రజలాల్లో పుణ్యస్నానం ఆచరించిన వారికి మోక్షం లభిస్తుందని సిక్కుల విశ్వాసం.[14]

ఇవి కూడా చూడండి[మార్చు]

References[మార్చు]

 1. Financial lessons you can learn this Makar Sankranti IIFL 14 January 2015 Rajiv Raj [1]
 2. 2.0 2.1 2.2 2.3 2.4 Sundar mundarye ho by Assa Singh Ghuman Waris Shah Foundation ISBN B1-7856-043-7
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2016-03-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-07-16. Cite web requires |website= (help)
 4. http://drdpat.bih.nic.in/Status%20Paper%20-%2002.htm
 5. 5.0 5.1 hazarasinghprofessor.org [2] Singh, Hazara: Seasonal Festivals and Commemorative Days.
 6. Bhai Nahar Singh, Bhai Kirpal Singh (1995) Rebels Against the British Rule.
 7. Parminder Singh Grover Moga, Davinderjit Singh Discover Punjab: Attractions of Punjab [3]
 8. Glimpses of Sikhism By Major Nahar Singh Jawandha
 9. See
 10. Hindustan Times There's more to Maghi 14 January 2015 Aneesha Bedi/Usmet Kaur [4]
 11. Hindustan Times Makar Sankranti 14 January 2014
 12. Business Standard 14 January 2015
 13. http://sikhism.about.com/od/Historic-Events/p/Battle-Of-Muktsar.htm
 14. History of Sikh Gurus Retold: 1606-1708 C.E Surjit Singh Gandhi
"https://te.wikipedia.org/w/index.php?title=మాఘీ&oldid=2825003" నుండి వెలికితీశారు