మాసిలామణి
ఏబెల్ బోయనెర్గెస్ మాసిలామణి ఏ.బి.మాసిలామణి ఒక క్రైస్తవ భక్తకవి.
జీవిత విశేషాలు
[మార్చు]ఈయన 1914 నవంబర్ 30 న పిఠాపురంలో జన్మించారు. తల్లిదండ్రులు గెర్షెం పాల్, శారమ్మలు. వీరి పూర్వీకులు విశ్వబ్రాహ్మణ కుటుంబం. కర్నాటక నుండి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడ్డారు. మాసిలామణి గారి తండ్రి పిఠాపురంలో కెనెడియన్ బాప్టిస్టు వైద్యశాలలో కాంపౌండరుగా పనిచేసేవారు. తల్లి ఉపాధ్యాయురాలు. మాసిలామణి గారు చిన్నతనంలోనే హార్మోనియం నేర్చుకొని నాటకరంగంలో ప్రవేశించారు. కాకినాడ బైబిలు సెమినరీలో వేదాంత విద్యను అభ్యసిస్తూ అక్కడ వేదాంత కళాశాల అధ్యాపకులు చెట్టి భానుమూర్తి గారి ప్రోత్సాహంతో పాటలు రాశారు.1938 లో రామచంద్రాపురంలో బాప్టిష్టు సంఘ గురువుగా పనిచేసారు. 1945 లో విమలమ్మను వివాహమాడారు. తరువాత సిరంపూరులో బాచులర్ ఆఫ్ డివినిటి, 1950 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఎమ్. ఏ., 1953 లో మాస్టర్ ఆఫ్ థియాలజీ పట్టా పొందారు. 1954-58 వరకు కాకినాడలో కెనెడియన్ బాప్టిస్టు సెమినరీ ప్రధానాచార్యులుగా పనిచేశారు. 1963 -69 వరకులో ఆంధ్రప్రదేశ్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేశారు. 1973 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్. డి. పట్టాన్ని పొందారు. 1974 లో కెనడాలోని మెక్ మాస్టర్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ “డాక్టర్ ఆఫ్ డివినిటి”ని పొందారు. “ఏషియా బాప్టిష్టు ఫెలోషిప్”కు అధ్యక్షులుగా పనిచేసి 'బిల్లీగ్రెహం అఫ్ ద ఈస్ట్' గా పేరొందారు.రవి, కాపరి, గృహజ్యోతి అనే క్రైస్తవ మాసపత్రికలకు సంపాదకుడిగా పనిచేశారు. “ప్రతిఫలం” అనే నవల రాశారు. మంచి సంగీత ప్రియులు, వక్త. వీరి మొట్టమొదటి రచన 1936 లో వచ్చిన “నమో క్రీస్తునాథ”, “నడిపించు నానావ”, “రండి సువార్త సునాదముతో”లాంటి అనేక అనే కీర్తనలు తెలుగునాట ప్రాచుర్యం పొందాయి.