మాస్టర్ తారా సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తారాసింగ్ మల్హోత్రా
జననం(1885-06-24)1885 జూన్ 24
రావల్పిండి, పంజాబ్, బ్రిటీష్ రాజ్ (ప్రస్తుతం పాకిస్తాన్ లో)
మరణం1967 నవంబరు 22(1967-11-22) (వయసు 82)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుమాస్టర్ తారాసింగ్
వృత్తిరాజకీయ నాయకుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
20వ శతాబ్ది తొలి అర్థభాగంలోకెల్లా ప్రముఖ సిక్కు నాయకుడు
మాస్టర్ తారా సింగ్

'మాస్టర్ తారా సింగ్' (1885 జూన్ 24, in రావల్పిండి, పంజాబ్ – 1967 నవంబరు 22, చండీఘర్ లో) 20వ శతాబ్ది తొలి అర్థభాగంలోకెల్లా ప్రముఖ సిక్ఖు రాజకీయ, మత నాయకుడు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ నిర్వహణకు, భారత విభజన సమయంలో సిక్ఖుల వైఖరిని మలచడంలో కీలకమైన నాయకుడు. సిక్ఖు మతాధిక్య రాష్ట్రంగా పంజాబ్ ఏర్పాటు కోసం డిమాండ్ కు నేతృత్వం వహించారు. భారతీయ జర్నలిస్టు, రాజకీయ నాయకురాలు రాజిందర్ కౌర్ ఆయన కుమార్తె.

తారాసింగ్ బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ లో రావల్పిండి జిల్లాలోని హరిలాల్ గ్రామంలో 1885 సంవత్సరంలో జన్మించారు. కులపరంగానూ. వృత్తిపరంగానూ పట్వారీ అయిన బక్షీ గోపీ చంద్ కు జన్మించిన ఆయనకు చిన్ననాడు నానక్ చంద్ అని పేరు. హిందువులే అయినా కుటుంబంలో సిక్ఖు గురువులు, సంప్రదాయం పట్ల భక్తి ఉండేది. ఈ కుటుంబ నేపథ్యంలోని ఆయన సిక్ఖు మిషనరీ పాఠశాలకు వెళ్ళారు. చిన్నతనంలో తన గురువైన అత్తార్ సింగ్ మరణానంతరం ఖల్సా స్వీకరించి తారా సింగ్ గా మారారు. దాంతో వారి కుటుంబం హిందూ మతం నుంచి సిక్ఖు మతం స్వీకరించింది. ఆపైన 1903లో ఖల్సా కళాశాలలో చేరారు.

విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో కొనసాగిన తారా సింగ్, కొన్నాళ్ళు పబ్లిక్ సర్వీస్ లో ఉన్నారు. ఆయనను సిక్ఖు మత రాజకీయాలకు కురువృద్ధునిగా భావిస్తారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కీలకమైన సిక్ఖు రాజకీయవేత్తలకు ఆయన తొలిదశలో మార్గనిర్దేశం చేశారు. 1942లో భారతదేశానికి క్రిప్స్ రాయబారిగా వచ్చినప్పుడే ఆయన పంజాబ్ విభజనను ప్రతిపాదించారు. ఉమ్మడి పంజాబ్ లో ముస్లింలది మెజారిటీ కావడం, సిక్ఖులు, హిందువులు మొదలైన ముస్లిమేతరులు మైనారిటీలు కావడంతో నిజానికి పెద్ద సంఖ్యలో ఉన్న సిక్ఖు మతస్తులపై స్వాతంత్ర్యానంతరం పరిపాలన న్యాయబద్ధంగా జరగదంటూ పంజాబ్ ను రావి నది సరిహద్దుగా ముస్లిం సంఖ్యాధిక్య ప్రాంతం, ముస్లిమేతర సంఖ్యాధిక్య ప్రాంతంగా విభజించమని డిమాండ్ చేశారు.

ముస్లిం లీగ్ పంజాబ్ మొత్తంతో పాటు ప్రత్యేక దేశంగానో, లేక పంజాబ్ మొత్తం ముస్లిం సంఖ్యాధిక్య ప్రావిన్సుగా గ్రేటర్ పాకిస్తాన్ వంటి ప్రతిపాదనల్లో ముందుకు తీసుకువస్తూండడంతో దీన్ని వ్యతిరేకించడానికి తారాసింగ్ నేతృత్వంలోని అకాలీ దళ్ సిక్ఖు రాష్ట్రాన్ని దేశాన్ని డిమాండ్ చేశారు. 1947 మార్చి వరకూ పంజాబ్ లో కాంగ్రెస్, అకాలీ దళ్లు కలిసి ఖిజ్ర్ హయత్ ఖాన్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ వచ్చారు. మరోవైపు ముస్లిం లీగ్, అకాలీ దళ్, కాంగ్రెస్ ల మధ్య తీవ్రమైన సైద్ధాంతిక, రాజకీయ విభేదాల నేపథ్యంలో ముస్లిం లీగ్ ఖిజ్ర్ హయత్ ఖాన్ ప్రభుత్వాన్ని రాజీనామా చేయించి, తన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం ఏర్పరుచుకుంది.

ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినంతో ప్రారంభించిన హింసాయుత చర్యలు క్రమంగా కార్చిచ్చులా ఉపఖండంలోని పలు భాగాలకు పాకాయి. పంజాబ్ లో దేశ విభజన సమయంలో చెలరేగిన మతహింసలో లాహోర్ లోని తారాసింగ్ పూర్వీకుల భవంతి నేలమట్టమైంది, 59మంది ఆయన బంధువులు మృతులయ్యారు. భీంసేన్ సచార్, గోపిచంద్ భార్గవ, మహాషా క్రిషన్, మహాషా కుషాల్ చంద్ వంటి హిందువులతో కలిసి తారాసింగ్ నాయకత్వంలో సిక్ఖులు పాకిస్తాన్ వ్యతిరేక కూటమిగా ఏర్పడ్డారు.

స్వాతంత్ర్యానంతరం సిక్ఖులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పరిచేందుకు పంజాబ్ ను విభజించే ఉద్యమాన్ని అకాలీ నేతలతో కలిసి నడిపించారు. ఆ ఉద్యమంలో నేర్పుగా మతపరమైన విభజనగా చెప్పకుండా పంజాబీ భాష ప్రాతిపదికగా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈమేరకు పంజాబీ సుబా ఉద్యమం నడిచి తుదకు తూర్పు పంజాబ్ భాషా ప్రాతిపదికన పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లుగా విభజించబడింది.

మూలాలు

[మార్చు]