మోటూరి సత్యనారాయణ
మోటూరి సత్యనారాయణ | |
---|---|
దస్త్రం:Moturi Satyanarayana.jpg | |
జననం | ఫిబ్రవరి 2, 1902 కృష్ణా జిల్లా దొండపాడు గ్రామం |
మరణం | మార్చి 6, 1995 |
పదవి పేరు | రాజ్య సభ సభ్యులు |
పదవీ కాలం | 1954 -1966 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ |
రాజకీయ ఉద్యమం | హిందీ ప్రచార ఉద్యమం |
మతం | హిందువు |
తల్లిదండ్రులు | పెద పిచ్చయ్య, రత్తమ్మ |
Honours | భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ , పద్మ భూషణ్ |
మోటూరి సత్యనారాయణ (ఫిబ్రవరి 2, 1902 - మార్చి 6, 1995) దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన పండితులు, స్వాతంత్ర్య సమరయోధులు.[1] భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మ భూషణ్ పురస్కారాలు పొందిన వ్యక్తి.
జననం
[మార్చు]వీరు 1902, ఫిబ్రవరి 2 వ తేదీన కృష్ణా జిల్లా దొండపాడు గ్రామంలో పెద పిచ్చయ్య, రత్తమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య అనంతరం తెలుగు, సంస్కృతం అభ్యసించాడు. వీరు ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉన్నతమైన గురువుల వద్ద జాతీయ శిక్షణ పొంది హిందీ బాగా అభ్యసించారు. తర్వాత ఇంగ్లీషు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మొదలైన భాషలు కూడా నేర్చుకున్నారు. వీరికి రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక, ఐతిహాసిక, వైజ్ఞానిక, సాంకేతిక విషయాలలో లోతుగా ప్రవేశం ఉండేది.
హిందీ భాషా సేవ
[మార్చు]వీరు హిందీ ప్రచారంతో జీవితాన్ని ప్రారంభించి క్రమాభివృద్ధి పొందారు. మొదట సంఘటకులుగా, కార్యదర్శిగా, చివరకు 1938లో హిందీ ప్రచార సభకు ప్రధాన కార్యదర్శి అయి 1961 వరకు కొనసాగారు. ఆ సంస్థ ప్రథమ ప్రధాన కార్యదర్శి పండిత హరి హర శర్మకు కుడిభుజంగా ఉండి సహకరించారు. వారి దూరదృష్టి, అవగాహన వల్లనే ఈ సభ హిందీ సాహిత్య సమ్మేళనం, ప్రయాగవారి బంధనం నుండి విముక్తి పొంది 1927లో స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది.
వీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నంతకాలం దక్షిణ భారత హిందీ ప్రచార సభ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగినది. 1936లో ప్రచారసభకు 4 రాష్ట్రాలలో, 4 ప్రాంతీయ శాఖల నిర్మాణం వీరి దూరదృష్టిని నిరూపిస్తుంది. వీరు మహాత్మాగాంధీ, రాజేంద్ర ప్రసాద్ లకు అత్యంత విశ్వాస పాత్రులు. 1946లో జరిగిన సభ రజతోత్సవానికి బాపూజీ 12 రోజులు ఉండి సమావేశాలు జరిపించారు. ప్రతి దినం గాంధీ ప్రార్థనా సమావేశాలలో వేలాదిమంది పాల్గొనేవారు. మద్రాసు కార్పొరేషన్ నుండి త్యాగరాయ నగరంలో సుమారు ఐదున్నర ఎకరాల భూమిని సంపాదించి అప్పటి అవసరాలకనుగుణంగా భవనాలను నిర్మించారు. ముద్రణాలయం, పుస్తక ప్రచురణ, పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆదాయం సమకూర్చారు. హిందీ ప్రచారాన్ని పెంపొందించడానికి ప్రతి రాష్ట్రంలోను, కొన్నిజిల్లాలలోను, మండలాల వారీగా సంరక్షకులను ఏర్పాటుచేసి నూతన ప్రణాళికల ద్వారా దక్షిణ భారతమంతా మారుమూలల వరకు హిందీని వ్యాపింపజేశారు. వీరి నేతృత్వంలో ప్రజలలో హిందీ పట్ల ప్రేమ, గౌరవం పెరిగింది.
వీరు తెలుగు భాషా సమితి స్థాపక కార్యదర్శిగా 'తెలుగు విజ్ఞాన సర్వస్వం' 16 భాగాలలో ప్రచురించారు. అదే విధంగా హిందీ వికాస సమితిని కూడా స్థాపించి హిందీలో 'విశ్వవిజ్ఞాన సంహిత' పేరుతో హిందీ విజ్ఞాస సర్వస్వాలను ప్రచురింపచేశారు.
స్వాతంత్ర పోరాటంలో
[మార్చు]వీరు 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్య సమరయోధులుగా తామ్రపత్ర గ్రహీతలయ్యారు.
వీరు రాజకీయ రంగంలో కూడా విలువైన సేవలు అందించారు.
1946 లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్కు (మొదటి పార్లమెంట్) సభ్యునిగా మద్రాస్ ప్రొవెంషియల్ నుండి ఎన్నికై భారత రాజ్యంగ రచనలో రాజ్య భాషా కమిటికి అద్యక్షులుగా పనిచేసారు, హిందీ భాషను రాజభాషగా అమోదిస్తూ భారత రాజ్యాంగ చట్టంలో 17వ భాగం రాజభాష అధ్యాయ నిర్మాణంలోను, దాని డ్రాఫ్టింగ్, రాజ్యాంగ సభలో నెగ్గించడంలో వారి సహకారం ఎంతో ఉంది.
1950-52 మద్య ఏర్పడ్డ తొలి పార్లమెంట్ లో సభ్యునిగా కొనసాగారు.
1952- 54 మద్య మద్రాసు శాసన సభలో సభ్యునిగా ఉన్నారు
వీరు రాష్ట్రపతి ద్వారా రాజ్య సభకు వరుసగా రెండుసార్లు నామినేట్ చేయబడ్డారు. 1954 నుండి 1966 వరకు 12 సవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసారు.
1956లో రాజభాషా కమిషన్ కు సభ్యులుగా పనిచేశారు.
మరణం
[మార్చు]వీరు 1995 సంవత్సరం మార్చి 6 వ తేదీన పరమపదించారు.
పురస్కారాలు
[మార్చు]ఆంధ్ర విశ్వవిద్యాలయం వీరికి కళాప్రపూర్ణతో గౌరవిస్తే, కొన్ని విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి. భారత ప్రభుత్వం వీరికి పద్మశ్రీ (1958), పద్మభూషణ్ (1962) పురస్కారాల్ని ఇచ్చి గౌరవించింది. వీరి సేవలను పురస్కరించుకుని హైదరాబాదులో రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన 1957 పెద్ద ఎత్తున అభినందన సభ జరిపి అభినందన గ్రంథం సమర్పించారు.
మూలాలు
[మార్చు]- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- పద్మభూషణ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- 1902 జననాలు
- 1995 మరణాలు
- హిందీ పండితులు
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- కృష్ణా జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు
- కృష్ణా జిల్లాకు చెందిన రాజ్యాంగ పరిషత్తు సభ్యులు
- రాజ్యసభ సభ్యులు
- రాజ్యాంగ పరిషత్తు సభ్యులు