మోహినియాట్టం

వికీపీడియా నుండి
(మోహినీ ఆట్టం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మోహినియాట్టం కేరళ రాష్ట్రానికి చెందిన, కేవలం మహిళలచే ప్రదర్శించబడే పాక్షిక సాంప్రదాయ నృత్యరీతి. మోహిని అంటే చూసే వారిని సమ్మోహితుల్ని చేయగల స్త్రీ. ఆట్టం అంటే సున్నితమైన శరీర కదలికలతో చేసే నాట్య ప్రదర్శన. మోహినియాట్టం అంటే జగన్మోహిని చేసే నృత్యం అని అర్థం. ఈ నాట్యంలో శృంగార రసం పాలు ఎక్కువగా ఉంటుంది. [1]ఇది కథాకళి కన్నా ప్రాచీనమైనదిగా చెప్పబడుతోంది.[2] ఈ నాట్యాన్ని ప్రదర్శించే నృత్యకారిణిని చూడగానే ఆమెలో ప్రకృతి సిద్ధమైన సౌందర్యం తొణికిసలాడుతున్నట్లు అనిపిస్తుంది. అత్యద్భుతమైన భంగిమలతో, లయబద్దమైన విన్యాసాలతో, సున్నితమైన కదలికలతో చూపరులను సమ్మోహితుల్ని చేయగల శక్తి దీనికి ఉంది. [3]

ప్రాచీనత

[మార్చు]

ఈ నాట్యం యొక్క ప్రాచీనతను గురించి పండితుల్లో విభిన్న అభిప్రాయాలున్నాయి. వీరిలో చాలా మంది 16 వశతాబ్దానికి చెందిన స్వాతి తిరునాళ్ కాలంలోనే ప్రస్తుతమున్న రీతిని సంతరించుకుందని నమ్ముతున్నారు. ట్రావెంకూర్ మహారాజు గొప్ప కళా ప్రియుడు. ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న గాయకుల్ని, నృత్య కళాకారుల్ని తన సభకు ఆహ్వానించి ప్రదర్శనలు ఏర్పాటు చేసేవాడు. ఇదే కాలంలో ఆయన తమిళనాడు కు చెందిన తంజావూరు ప్రాంతం నుంచి భరతనాట్య శిక్షకులని ఆహ్వానించాడు. వీరితో పాటు వచ్చిన కళాకారులు అప్పటికే అక్కడ ఉన్న ప్రాంతీయ నృత్యంపై తమ ప్రభావం చూపడం వలన మోహియాట్టం ప్రస్తుత రీతిని పొందినట్లు భావిస్తున్నారు. అంతే కాక ఆయన గొప్ప పద్మనాభుని భక్తుడు. ఆయనపై హిందుస్తానీ, కర్ణాటక సంగీత కృతులను, పదాలనూ, వర్ణాలనూ కూర్చాడు. మోహినీయాట్టం నృత్య ప్రదర్శనలో ఆయన పదాలు, వర్ణాలు సర్వ సాధారణం.

గ్రంథాలు

[మార్చు]

18వ శతాబ్దంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన చేర రాజులు సాహిత్యానికి, కళలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేవారు. వీరి వంశానికి చెందిన మహారాజా కార్తీక తిరునల్ రామ వర్మ రచించిన బలరామభారతం అనే కావ్యంలో ఈ నాట్యాన్ని గురించిన విపులంగా వివరించబడి ఉంది. ఈయన గొప్ప పండితుడే కాక సంగీతం, నృత్యం మొదలైన కళల్లో అత్యంత శ్రద్ధను కనబరిచేవాడు. మంచి కవి కూడా. కథాకళి కి ఈయన చేసిన కృషి అపూర్వం. ఇంకా ఈ గ్రంథంలో మోహినియాట్టం ప్రదర్శన గురించిన కొన్ని సాంకేతిక విషయాలు వివరించబడి ఉన్నాయి. [3]


మూలాలు

[మార్చు]
  1. http://www.mohiniattam.com/mohiniattam/mohiniattam.html[permanent dead link]
  2. http://india.gov.in/knowindia/mohiniattam.php Archived 2008-11-20 at the Wayback Machine భారత ప్రభుత్వ వెబ్ సైటు, భారతదేశాన్ని గురించి తెలుసుకోండి
  3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-07. Retrieved 2008-09-30.