Jump to content

మ్యూనిక్ ఒప్పందం

వికీపీడియా నుండి
మ్యూనిక్ ఒప్పందం
{{{image_alt}}}
హిట్లరుతో సమావేశం తరువాత హెస్టన్ విమానాశ్రయంలో బ్రిటిషు ప్రధాని నెవిల్ చాంబర్లేన్
సంతకించిన తేదీ1938 సెప్టెంబరు 30
కక్షిదారులు

మ్యూనిక్ ఒప్పందం జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రెంచి థర్డ్ రిపబ్లిక్, ఇటలీ సామ్రాజ్యాల మధ్య 1938 సెప్టెంబరు 30 న మ్యూనిక్‌లో కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం చెకోస్లోవేకియా లోని సుడేటన్‌ల్యాండ్ భూభాగం జర్మనీకి ధారాదత్తమైంది. ఫ్రాన్స్, చెకోస్లోవాక్ రిపబ్లిక్ ల మధ్య 1924 నాటి కూటమి ఒప్పందం, 1925 నాటి సైనిక ఒప్పందాలు ఉన్నప్పటికీ, ఫ్రాన్సు ఈ ఒప్పందంపై సంతకం చెయ్యడంతో చెక్‌ ప్రజలు దీన్ని మ్యూనిక్ ద్రోహం అని నిరసించారు. [1] మ్యూనిక్ ఒప్పందం కుదరడంతో ఐరోపాలో చాలా భాగం సంబరాలు జరుపుకుంది. ఈ ఒప్పందం, ఖండంలో ఒక పెద్ద యుద్ధాన్ని నివారించిందని భావించారు. చెకొస్లవేకియా సరిహద్దు ప్రాంతంలో, 30 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు - ముఖ్యంగా జర్మన్లు - నివసించే సుడేటన్‌ల్యాండ్‌ను జర్మనీ ఆక్రమించేందుకు నాలుగు దేశాలూ అంగీకరించాయి. ఐరోపాలో భూభాగాలపై ఇదే తన చివరి దావా అని హిట్లర్ ప్రకటించాడు.

1938 సెప్టెంబరు 17 న చెకోస్లోవేకియాపై జర్మనీ స్వల్ప స్థాయి అప్రకటిత యుద్ధాన్ని ప్రారంభించింది. దానికి ప్రతిస్పందనగా సెప్టెంబరు 20 న, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్‌లు చెకోస్లోవేకియాను తన భూభాగాన్ని జర్మనీకి అప్పగించమని అధికారికంగా కోరాయి. దీని తరువాత, సెప్టెంబరు 21 న పోలండు, సెప్టెంబరు 22 న హంగరీలూ చెక్‌ భూభాగంపై తమతమ హక్కుల డిమాండ్లను లేవనెత్తాయి. ఇంతలో, జర్మనీ దళాలు చెక్ దేశం లోని చెబ్ జిల్లాను, జెసెనక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలనూ జయించాయి. కాని డజన్ల కొద్దీ ఇతర సరిహద్దు కౌంటీల నుండి వారికి ప్రతిఘటన ఎదురై, వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పోలండ్ తన సైనిక విభాగాలను చెకోస్లోవేకియా సరిహద్దుకు సమీపంలో సమీకరించింది. సెప్టెంబరు 23 న ఒక విఫల కుట్రకు ప్రేరేపించింది. హంగరీ కూడా తన సైనికులను చెకోస్లోవేకియా సరిహద్దు వైపు తరలించింది కానీ దాడి చెయ్యలేదు.

1938 సెప్టెంబరు 29-30 న జర్మనీలోని మ్యూనిక్‌లో ప్రధాన యూరోపియన్ శక్తుల అత్యవసర సమావేశం జరిగింది. ఆ సమయంలో చెకోస్లోవేకియా ప్రతినిధులు పట్టణం లోనే ఉన్నప్పటికీ, వాళ్ళను ఆ సమావేశానికి పిలవలేదు. ఫ్రాన్స్, చెకోస్లోవేకియాల మిత్రదేశమైన సోవియట్ యూనియన్ కూడా ఆ సమావేశంలో లేదు. హిట్లరు, తాను కోరుకున్న విధంగా తయారు చేసిన ఒక ఒప్పంద పత్రంపై జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ నాయకులు ఆ సమావేశంలో సంతకాలు చేసారు. జర్మనీని ప్రసన్నం చేసుకోవడానికి గాను, దానికి ధారాదత్తం చేసిన చెకోస్లోవాక్ పర్వత సరిహద్దు భూభాగం మధ్యయుగ కాలం నుండి చెక్, జర్మనీల మధ్య సహజమైన సరిహద్దుగా ఉంది. అంతేకాదు, చెక్‌పై జర్మనీ దాడి చేస్తే, ఇది దానికి సహజమైన అడ్డుగోడగా ఉంటుంది. సరిహద్దు దుర్గాలను నిర్మించి గణనీయంగా బలోపేతం చేసుకున్న సుడేటన్‌ల్యాండ్ ప్రాంతం చెకోస్లోవేకియాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది.

జర్మనీ, పోలండు, హంగేరీల సైనిక ఒత్తిడికి, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్సుల దౌత్యపరమైన ఒత్తిడికీ చెకోస్లోవేకియా లొంగిపోయి, మ్యూనిక్ నిబంధనల ప్రకారం జర్మనీకి తన భూభాగాన్ని వదులుకోవడానికి సెప్టెంబరు 30 న అంగీకరించింది. అప్పుడు, అక్టోబరు 1 న, పోలండు చేసిన భూభాగ డిమాండ్లను కూడా చెకోస్లోవేకియా అంగీకరించింది. [2]

మ్యూనిక్ ఒప్పందం కుదిరిన వెనువెంటనే, అక్టోబరు 1-10 మధ్య, సుడేటన్‌ల్యాండ్ జర్మనీలో కలిసిపోయిది. 1938 నవంబరు 2 న మొదటి వియన్నా అవార్డు ఉనికి లోకి వచ్చింది. దీని ప్రకారం దక్షిణ స్లోవేకియాలో హంగేరియన్లు ఎక్కువగా నివసించే భూభాగాలనూ, దక్షిణ సబ్‌కార్పాథియన్ రస్‌నూ చెకోస్లోవేకియా నుండి విభజించారు. చెకోస్లోవేకియా ఉత్తర భూభాగాలను పోలండు స్వాధీనం చేసుకుంది. 1939 మార్చిలో, మొదటి స్లోవాక్ రిపబ్లిక్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. కొంతకాలం తర్వాత, బోహీమియా మొరావియా ప్రొటెక్టరేట్ను ఏర్పాటు చేయడం ద్వారా, జర్మనీ మిగిలిన చెక్ భూభాగాలపై పూర్తి నియంత్రణ సాధించింది. తద్వారా ముఖ్యమైన సైనిక ఆయుధాగారం కూడా జర్మనీ చేజిక్కింది. తదనంతర కాలంలో పోలండు, ఫ్రాన్సులపై జర్మనీ చేసిన దండయాత్రలలో ఈ ఆయుధ సామాగ్రే ముఖ్యమైన పాత్ర పోషించింది. [3]

నేడు, మ్యూనిక్ ఒప్పందాన్ని ఒక విఫలమైన బుజ్జగింపు చర్యగా పరిగణిస్తారు. ఈ పదం "విస్తరణవాద నిరంకుశ దేశాలను బుజ్జగించడమనే వృథాప్రయాసకు పర్యాయపదం"గా నిలిచింది. [4]

నేపథ్యం

[మార్చు]

స్వయంపాలన కోసం డిమాండు

[మార్చు]
చెకోస్లోవేకియాలోని సుడేటన్ జర్మన్ పార్టీ (ఎస్‌డిపి) నాయకుడు కొన్రాడ్ హెన్లీన్
ఎడ్వర్డ్ బెనెస్, చెకోస్లోవేకియా అధ్యక్షుడు. ఆ తరువాత ప్రవాస చెకోస్లోవాక్ ప్రభుత్వ నేత

1918 లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయాన ఆస్ట్రో-హంగేరియన్ సామ్రాజ్యం పతనం తరువాత చెకోస్లోవేకియా ఏర్పడింది. సెయింట్-జర్మైన్ ఒప్పందం చెకోస్లోవేకియా స్వాతంత్ర్యాన్ని గుర్తించింది. ట్రయానాన్ ఒప్పందం కొత్త దేశపు సరిహద్దులను నిర్వచించింది, ఇది పశ్చిమాన బోహీమియా, మొరావియా ప్రాంతాలు తూర్పున స్లోవేకియా, సబ్‌కార్పాతియన్ రస్ ప్రాంతాలలో విస్తరించింది. ఇందులో ముప్పై లక్షల కంటే ఎక్కువ మంది జర్మన్లు ఉన్నారు. ఇది దేశపు మొత్తం జనాభాలో 22.95%. వారు చారిత్రికంగా సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్కువగా నివసించేవారు. ఆ ప్రాంతానికి వారు సుడేటన్లాండ్ అనే కొత్త పేరు పెట్టారు. ఇది జర్మనీకి, కొత్తగా సృష్టించిన ఆస్ట్రియా దేశానికీ సరిహద్దుల్లో ఉంది.

చెకోస్లోవేకియా పౌరులుగా ఉండాలని కోరుకుంటున్నారా అనే దానిపై సుడేటన్ జర్మన్లను ఎవరూ సంప్రదించలేదు. రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వానికి హామీ ఇచ్చినప్పటికీ, దేశాన్ని "చెక్, స్లోవాక్ జాతీయవాదపు సాధనంగా" మార్చే ధోరణి రాజకీయ నాయకులలో ఉండేది. [5] జర్మన్లను ఇతర మైనారిటీలనూ దేశంలో ఏకీకృతం చేయడంలో కొంత పురోగతి సాధించినప్పటికీ, వారికి ప్రభుత్వంలోను, సైన్యంలోనూ ప్రాతినిధ్యం తక్కువగా ఉండేది. అంతేకాకుండా, 1929 లో ప్రారంభమైన మహా మాంద్యం కారణంగా చెక్, స్లోవాక్ జనాభా కంటే ఎక్కువగా పారిశ్రామికీకరణ పైనా, ఎగుమతుల పైనా ఆధారపడిన సుడేటన్ జర్మన్‌లే ఎక్కువ దెబ్బతిన్నారు. 1936 నాటికి, చెకోస్లోవేకియా లోని నిరుద్యోగులలో 60 శాతం మంది జర్మన్లే. [6]

1933 లో, సుడేటన్ జర్మన్ నాయకుడు కొన్రాడ్ హెన్లీన్ "సమరశీలమైన, ప్రజాదరణ పొందిన, బహిరంగంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన" సుడేటన్ జర్మన్ పార్టీని (ఎస్డిపి) స్థాపించాడు. త్వరలోనే జర్మన్ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మూడింట రెండు వంతుల ఓట్లను ఆ పార్టీ సాధించింది. ఎస్డిపి ప్రారంభం నుండి నాజీ అనుబంధ సంస్థ గానే ఉందా లేక క్రమేణా అలా రూపొందిందా అనే దానిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయం ఉంది. [7] 1935 నాటికి, జర్మన్ల ఓట్లు ఈ పార్టీకే ఉన్నందున, చెకోస్లోవేకియాలో ఎస్డిపి రెండవ అతిపెద్ద రాజకీయ పార్టీ అయింది. చెక్, స్లోవాక్ ఓట్లు మాత్రం అనేక పార్టీల మధ్య పంపకమయ్యాయి. జర్మనీ ఆస్ట్రియాను ఆక్రమించుకుని తనలో కలిపేసుకున్న కొంతకాలం తర్వాత హెన్లీన్, 1938 మార్చి 28 న బెర్లిన్‌లో హిట్లర్‌తో సమావేశమయ్యాడు. ఎడ్వర్డ్ బెనెస్ నేతృత్వంలోని ప్రజాస్వామ్య చెకోస్లోవాక్ ప్రభుత్వానికి ఒప్పుకోలేని డిమాండ్లను లేవనెత్తాలని హిట్లరు అతన్ని ఆదేశించాడు. ఏప్రిల్ 24 న ఎస్డిపి, చెకోస్లోవేకియా ప్రభుత్వానికి వరసబెట్టి కొన్ని డిమాండ్లను జారీ చేసింది. దీనినే కార్ల్స్ బాడర్ ప్రోగ్రాం అని అంటారు [8] చెకోస్లోవేకియాలో నివసిస్తున్న జర్మన్‌లకు స్వయంప్రతిపత్తి వంటి డిమాండ్లను హెన్లీన్ పెట్టాడు. చెకోస్లోవాక్ ప్రభుత్వం స్పందిస్తూ, జర్మన్ మైనారిటీలకు మరిన్ని హక్కులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుపింది. స్వయంప్రతిపత్తి ఇవ్వడానికి మొదట్లో ఇష్టపడలేదు. 1938 మేలో ఎస్‌డిపి, జర్మన్ల ఓట్లలో 88% సాధించింది. [9]

జర్మన్లకు చెకోస్లోవాక్ ప్రభుత్వానికీ మధ్య ఉద్రిక్తత పెరగడంతో, 1938 సెప్టెంబరు 15 న బెనెస్, 6,000 చ.కి.మీ.ల చెకోస్లోవేకియా భూభాగాన్ని జర్మనీకి అప్పగించేందుకు రహస్యంగా అంగీకరించాడు. అందుకు బదులుగా చెక్, 15 నుండి 20 లక్షల మంది జర్మన్లను చెకోస్లోవేకియా నుండి బహిష్కరిస్తుంది; హిట్లరు వారిని జర్మనీ లోకి అనుమతించాలి అనేది అతడి ప్రతిపాదన లోని మరో అంశం. హిట్లర్ ఈ ప్రతిపాదనకు బదులివ్వలేదు. [10]

సుడేటన్ సంక్షోభం

[మార్చు]

గతంలో హిట్లరును బుజ్జగించిన విధంగానే ఇప్పుడూ చేసి, ఎలాగైనా యుద్ధాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఫ్రాన్స్ బ్రిటన్లు ఉన్నాయి. ఫ్రెంచి ప్రభుత్వం జర్మనీని ఒంటరిగా ఎదుర్కోవటానికి ఇష్టపడలేదు. నెవిల్ చాంబర్లేన్ నేతృత్వం లోని బ్రిటిష్ కన్జర్వేటివ్ ప్రభుత్వ ధోరణినే ఫ్రెంచి ప్రభుత్వం కూడా అవలంబించింది. సుడేటన్ జర్మన్ల వేదనలు సమర్థనీయమైనవేనని ఛాంబర్లేన్ భావించాడు. హిట్లరు ఉద్దేశాలు అంతవరకే పరిమితమని కూడా అతడు నమ్మాడు. అందువల్ల, జర్మనీ డిమాండ్లను అంగీకరించమని బ్రిటన్ ఫ్రాన్స్ రెండూ చెకోస్లోవేకియాకు సలహా ఇచ్చాయి. బెనెస్ దాన్ని ప్రతిఘటించాడు. మే 19 న, జర్మన్ దండయాత్రకు ప్రతిస్పందనగా పాక్షిక సమీకరణను ప్రారంభించాడు. [11]

మే 20 న హిట్లర్, చెకోస్లోవేకియాపై దాడి చేసే ముసాయిదా ప్రణాళికను తన సైనికాధికారులకు సమర్పించాడు, దీనికి ఆపరేషన్ గ్రీన్ అనే సంకేతనామం ఉంది. [12] "రెచ్చగొట్టడం" గాని, "ప్రత్యేకంగా అనుకూలమైన అవకాశం" గానీ "తగినంత రాజకీయ సమర్థన" గానీ లేకుండా చెకోస్లోవేకియాను సైనికంగా "ఛేదించనని" అతను గట్టిగా చెప్పాడు. [13] మే 28 న హిట్లర్, తన సైనిక ముఖ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, యు-బోట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించాడు. 1940 వసంత ఋతువు వరకు తన కొత్త యుద్ధనౌకలైన బిస్మార్క్, టిర్పిట్జ్ ల నిర్మాణాన్ని ముందుకు జరిపాడు. షార్న్‌హోర్స్ట్, గ్నిసెనాయు యుద్ధనౌకల ఫైర్‌పవర్‌ను పెంచే పనిని వేగవంతం చేయాలని డిమాండ్ చేశాడు. [14] బ్రిటన్‌తో పూర్తి స్థాయి నావికాదళ యుద్ధానికి ఇది ఇంకా సరిపోదని గుర్తించినప్పటికీ, ఇది తగినంత నిరోధకంగా ఉంటుందని హిట్లర్ భావించాడు. [15] పది రోజుల తరువాత, అక్టోబరు 1 లోపు చెకోస్లోవేకియాపై యుద్ధం ప్రారంభం కావాలని హిట్లర్ ఒక రహస్య ఆదేశంపై సంతకం చేశాడు. [11]

చెకోస్లోవేకియాను రక్షించడం కోసం ఫ్రాన్స్ జర్మనీకి వ్యతిరేకంగా వెళితే, "మేము అడ్డురాము" అని మే 22 న, ఫ్రాన్స్‌లోని పోలిష్ రాయబారి జూలియస్జ్ ఉకాసివిచ్ ఫ్రెంచి విదేశాంగ మంత్రి జార్జెస్ బోనెట్‌తో చెప్పాడు. చెకోస్లోవేకియాను జర్మనీ నుండి రక్షించడానికి సోవియట్ దళాలు ప్రయత్నం చేస్తే మాత్రం పోలండు వ్యతిరేకిస్తుందని కూడా యుకాసివిచ్ బోనెట్‌తో చెప్పాడు. ఫ్రాన్స్‌లోని సోవియట్ రాయబారి జాకబ్ సురిట్స్ తో ఫ్రెంచి ప్రధాని డలాడియర్, "మేము పోలిష్ వాళ్ళ మద్దతును లెక్కలోకి తీసుకోలేము. అంతే కాదు, పోలండు మమ్మల్ని వెన్నుపోటు పొడవదనే నమ్మకం మాకు లేదు" అని చెప్పాడు. [16] అయితే, చెకోస్లోవేకియాకు సహాయం చేయాలని ఫ్రెంచి వారు నిర్ణయించినట్లయితే జర్మనీతో పోరాడటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పోలిష్ ప్రభుత్వం అనేకసార్లు (1936 మార్చి, మే, 1938 జూన్ ఆగస్టులో) చెబుతూ ఇలా అంది: "బోనెట్కు బెక్ చేసిన ప్రతిపాదన, రాయబారి డ్రెక్సెల్ బిడిల్ వద్ద అతడు చేసిన ప్రకటనలు, వన్సిట్టార్ట్ పేర్కొన్న ప్రకటనలను బట్టి చూస్తే పాశ్చాత్య శక్తులు జర్మనీతో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటే, పోలిష్ విదేశాంగ విధానంలో సమూలమైన మార్పును చేపట్టడానికి విదేశాంగ మంత్రి సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. అయితే, జర్మనీని ప్రసన్నం చేసుకుని యుద్ధాన్ని నివారించడానికే పట్టుదలగా ఉన్న బ్రిటిషు, ఫ్రెంచి ప్రభుత్వాల నుండి ఈ ప్రతిపాదనలు ప్రకటనలకు స్పందనేమీ రాలేదు".

చెకోస్లోవేకియా 1935 నుండి 1938 వరకు నాజీ జర్మనీ యొక్క పెరుగుతున్న ముప్పుకు వ్యతిరేకంగా రక్షణాత్మక ప్రతిఘటనగా సరిహద్దు కోటల వ్యవస్థను నిర్మించింది.

చెకోస్లోవేకియాలో "పరిస్థితిని పరిష్కరించుకున్నాక", మూడు, నాలుగు సంవత్సరాల తరువాత బ్రిటన్, ఫ్రాన్స్‌లపై దాడి చేయాలన్న హిట్లర్ కొత్త ప్రణాళికలను చూసి "చాలా షాక్ అయ్యాను" అని హిట్లర్ సహాయకుడు, ఫ్రిట్జ్ వైడెమాన్ యుద్ధం తరువాత గుర్తుచేసుకున్నాడు. [17] జర్మనీ జనరల్ స్టాఫ్ చీఫ్ జనరల్ లుడ్విగ్ బెక్, శీఘ్రమే చర్య తీసుకోవాలని హిట్లర్ ఆలోచనల్లో వచ్చిన మార్పుకు కారణం, చెకోస్లోవాక్ రక్షణాత్మక చర్యలు అంతకంతకూ దృఢమౌతూ ఉండడమేనని అన్నాడు. 1941 లేదా 1942 నాటికి గాని బ్రిటిష్ పునరాయుధీకరణ పూర్తి కాదు. [15] మే 21 న చెకోస్లోవాక్ చేపట్టిన పాక్షిక సైనిక సమీకరణ కారణంగా హిట్లర్, ఆపరేషన్ గ్రీన్ చేపట్టడం కోసం మే 30 న కొత్త ఉత్తర్వులు జారీ చేసాడని జనరల్ ఆల్ఫ్రెడ్ జోడ్ల్ తన డైరీలో రాసుకున్నాడు. ఆ ఆదేశాలతో పాటు విల్హెల్మ్ కీటెల్ నుండి ఒక కవర్ లేఖ కూడా ఉందని, అందులో ఈ ప్రణాళికను అక్టోబరు 1 లోపు తప్పక అమలు చేయాలని ఉంది. [18]

ఇదిలా ఉండగా, మధ్యవర్తిని నియమించవలసినదిగా తమను అభ్యర్థించాలని బ్రిటిషు ప్రభుత్వం చెక్ అధ్యక్షుడు బెనెస్‌ను కోరింది. పశ్చిమ ఐరోపాతో తన ప్రభుత్వ సంబంధాలను తెంచుకోలేక బెనెస్, అయిష్టంగానే దానికి అంగీకరించాడు. మాజీ లిబరల్ క్యాబినెట్ మంత్రి లార్డ్ రన్‌సిమన్‌ను బ్రిటిష్ వారు మధ్యవర్తిగా నియమించారు. సుడేటన్ జర్మన్‌లకు ఆమోదయోగ్యమైన ప్రణాళికను అంగీకరించమని బెనెస్‌ను ఒప్పించటానికి అతడు ఆగస్టు 3 న ప్రాగ్ చేరుకున్నారు. [19] చెకోస్లోవాక్ చర్చలకు ఫ్రాన్స్ తన మద్దతును బహిరంగంగా ప్రకటిస్తుండగా, సుడేటన్‌ల్యాండ్‌పై యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా లేమని జూలై 20 న ఫ్రెంచి విదేశాంగ మంత్రి బోనెట్, పారిస్‌లోని చెకోస్లోవాక్ రాయబారికి చెప్పాడు. [19] ఆగస్టులో, జర్మనీ పత్రికల నిండా సుడేటన్ జర్మన్లపై చెకోస్లోవాక్ దురాగతాల గురించిన కథనాలే కనిపించాయి. రాయితీలు ఇవ్వమని చెకోస్లోవాక్‌పై ఒత్తిడి తెచ్చేందుకు పశ్చిమ దేశాలను బలవంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథనాలు వచ్చాయి. [20] దీనికి చెకోస్లోవాకులు నిరాకరిస్తారనీ, దాంతో వారి ఖర్మకు వారిని వదిలేసేందుకు పాశ్చాత్య దేశాలకు తగిన నైతిక మద్దతు లభిస్తుందనీ హిట్లర్ భావించాడు. [21] ఆగస్టులో జర్మనీ, చెకోస్లోవేకియా సరిహద్దులో 7,50,000 మంది సైనికులను అధికారిక సైనిక విన్యాసాలలో భాగంగా పంపింది. [21] సెప్టెంబరు 4 లేదా 5 న [19] బెనెస్ సమర్పించిన నాల్గవ ప్రణాళికలో ఒప్పందం లోని డిమాండ్లు దాదాపుగా అన్నిటినీ అంగీకరించాడు. కానీ, ఒప్పందం కుదరనీయకుండా చెయ్యాలని హిట్లర్ నుండి సుడేటన్ జర్మన్లకు ఆదేశాలు ఉన్నాయి. [21] సెప్టెంబరు 7 న ఎస్‌డిపి ఒస్ట్రావాలో ప్రదర్శనలు నిర్వహించింది. దానిపై పోలీసులు చర్య తీసుకున్నారు. వారి పార్లమెంటరీ సహాయకులు ఇద్దరిని అరెస్టు చేశారు. [19] సుడేటన్ జర్మన్లు ఈ సంఘటనను, ఇతర దురాగతాలు జరిగాయనే తప్పుడు ఆరోపణలనూ సాకుగా చూపి చర్చలను విచ్ఛిన్నం చేసారు. [19] [22]

హిట్లరు ఆరోపణలు

[మార్చు]
1938 సెప్టెంబరు 15 న బెర్గోఫ్ మెట్లపై హిట్లర్ చాంబర్లేన్‌ను పలకరించాడు

సెప్టెంబరు 12 న నూరెంబర్గ్‌లో జరిగిన నాజీ పార్టీ ర్యాలీలో హిట్లర్, సుడెటెన్ సంక్షోభంపై ప్రసంగించాడు. చెకోస్లోవేకియా ప్రభుత్వ చర్యలను అతడు ఖండించాడు. చెకోస్లోవేకియా ఒక మోసపూరిత దేశమని, జాతీయ స్వీయ-నిర్ణయాధికారాన్ని నొక్కిచెబుతున్న అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని అన్నాడు. జర్మన్లు, స్లోవాక్లు, హంగేరియన్లు, ఉక్రేనియన్లు, పోలిష్ ప్రజలూ వాస్తవానికి చెక్‌లతో కలిసే ఉండాలనే కోరుకుంటున్నారనీ, చెక్ ప్రభుత్వమే పడనీయడం లేదనీ అతడు ఆరోపించాడు. బెనెస్, సుడేటన్ జర్మన్లను క్రమంగా నిర్మూలించాలని అనుక్లుంటున్నాడని హిట్లర్ ఆరోపించాడు. చెకోస్లోవేకియా సృష్టించినప్పటి నుండి, 6,00,000 మంది జర్మన్లను వాళ్ళ ఇళ్ళనుండి బయటకు గెంటివేసారని, వెళ్ళకపోతే ఆకలితో చస్తారని బెదిరించారనీ అతడు ఆరోపించాడు. బెనెస్ ప్రభుత్వం హంగేరియన్లు, పోల్స్, స్లోవాక్లతో పాటు జర్మన్‌లను వేధిస్తోందని ఆరోపించాడు. దేశానికి విధేయత చూపకపోతే జర్మన్లను దేశద్రోహులుగా బెనెస్ పరిగణిస్తున్నట్లు ఆరోపించాడు. జర్మనీ దేశాధిపతిగా, సుడేటన్‌ల్యాండ్‌లోని తోటి జర్మన్‌ల స్వయం నిర్ణయాధికార హక్కుకు తాను మద్దతు ఇస్తానని ప్రకటించాడు. బెనెస్ ప్రభుత్వం ఇటీవల అనేక మంది జర్మన్ నిరసనకారులను ఉరితీయడాన్ని ఖండించాడు. యుద్ధం ప్రారంభమైతే, బెనెస్ జర్మనీ జర్మన్లకు వ్యతిరేకంగా సుడేటన్ జర్మన్లను పోరాడమని బలవంతం చేస్తాడని అతడు ఆరోపించాడు. చెకోస్లోవేకియా ప్రభుత్వం ఫ్రాన్స్ యొక్క క్లయింట్ పాలన అని హిట్లర్ ఆరోపించాడు. "జర్మనీపై మరింత తేలిగ్గా బాంబులు వేసి దాని ఆర్ధికవ్యవస్థను, పరిశ్రమలనూ నాశనం చేయాలంటే ఈ దేశం మాకు అవసరం" అని ఫ్రెంచి విమానయాన శాఖ మంత్రి పియరీ కాట్ అన్నాడని హిట్లరు ఆరోపించాడు.

చాంబర్లేన్ దౌత్యం

[మార్చు]
1938 సెప్టెంబరు 24 న బాడ్ గోడెస్బర్గ్ సమావేశం ప్రారంభంలో హిట్లర్ చాంబర్లేన్‌కు స్వాగతం పలికాడు

సెప్టెంబరు 13 న, చెకోస్లోవేకియాలో అంతర్గత హింస ఏర్పడిన తరువాత, యుద్ధాన్ని నివారించడానికి ఒక పరిష్కారాన్ని కనుగొనే ఉద్దేశాంతో చాంబర్లేన్, హిట్లర్‌తో వ్యక్తిగత సమావేశం కోరాడు. [23] చాంబర్లేన్ సెప్టెంబరు 15 న విమానంలో జర్మనీ చేరుకున్నాడు. బెర్చ్‌టెస్గాడెన్‌లోని హిట్లర్ నివాసానికి వెళ్ళాడు. హెన్లీన్ కూడా అదే రోజున జర్మనీ వెళ్లాడు. [23] ఆ రోజు, హిట్లర్, చాంబర్లేన్ చర్చలు జరిపారు. జాతీయ స్వయం నిర్ణయాధికార హక్కును వినియోగించుకోవడానికి, సుడేటన్‌లాండ్‌ను జర్మనీతో కలిపడంపైనా సుడేటన్ జర్మన్లకు స్వేచ్ఛ ఉండాలని హిట్లర్ పట్టుబట్టాడు. బ్రిటిషువరు చేస్తున్న "బెదిరింపులు" అని తాను భావించిన వాటి గురించి కూడా హిట్లర్, చాంబర్లేన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు. తాను "బెదిరింపులేమీ" జారీ చేయలేదని చెబుతూ చాంబర్లేన్, "నేను ఇక్కడకు వచ్చింది నా సమయాన్ని వృథా చేసుకోడానికా?" అని నిస్పృహతో హిట్లర్‌ను ప్రశ్నించాడు. హిట్లర్ స్పందిస్తూ, సుడేటన్ జర్మన్‌ల స్వీయ-నిర్ణయాధికారాన్ని అంగీకరించడానికి చాంబర్లేన్ సిద్ధంగా ఉంటే, ఈ విషయంపై చర్చించడానికి తానూ సిద్ధమేనని చెప్పాడు. చాంబర్లేన్, హిట్లర్లు మూడు గంటల పాటు చర్చలు జరిపారు. సమావేశం వాయిదా పడింది. చాంబర్లేన్ బ్రిటన్‌ తిరిగి వెళ్లి తన మంత్రివర్గంతో సమావేశమై ఈ అంశంపై చర్చించాడు.

ఆ సమావేశం తరువాత, ప్రాన్సు అధ్యక్షుడు దలాడియర్ సెప్టెంబరు 16 న లండన్ వెళ్లి బ్రిటిష్ అధికారులతో సమావేశమై తాము తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించాడు. జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధం చేయడం నుండి సుడేటన్‌ల్యాండ్‌ను జర్మనీకి అప్పగించడం వరకూ వివిధ ప్రతిపాదనలు ఫ్రెంచి వారి వద్ద ఉన్నాయి. బ్రిటిష్-ఫ్రెంచి వారు ఒక కచ్చితమైన ప్రణాళిక తయారుచేసుకుని చర్చలను ముగించారు. జర్మనీ జనాభా సుడేటన్‌లాండ్ మొత్తం జనాభాలో 50% పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని భూభాగాలను చెకోస్లోవేకియా జర్మనీకి ఇవ్వాలని బ్రిటన్, ఫ్రాన్సులు డిమాండ్ చేశాయి. ఆ రాయితీకి బదులుగా బ్రిటన్, ఫ్రాన్సులు చెకోస్లోవేకియా స్వాతంత్ర్యానికి హామీ ఇస్తాయి. ప్రతిపాదిత పరిష్కారాన్ని చెకోస్లోవేకియాతో పాటు బ్రిటన్ ఫ్రాన్స్‌లలో దాని వ్యతిరేకులు కూడా తిరస్కరించారు.

చర్చలలో పాల్గొనడానికి జర్మనీ వెళ్ళిన హెన్లీన్‌ను అరెస్టు చేసేందుకు చెకోస్లోవేక్ ప్రభుత్వం వారెంట్ జారీ చేయడంతో, చెకోస్లోవేకియాలో పరిస్థితి ఆ రోజు ఉద్రిక్తంగా మారింది.

తీర్మానం

[మార్చు]

సమస్య పరిష్కారం కోసం చాంబర్లేన్, హిట్లరుతో మరో సమావేశాన్ని కోరాడు. సెప్టెంబరు 29 న బ్రిటన్, ఫ్రాన్సు, ఇటలీ, జర్మనీలు సమావేశమయ్యాయి.[24]

మ్యూనిక్ ఒప్పందం తరువాత జరిగిన సంఘటనల క్రమం:
1. మ్యూనిక్ ఒప్పందం (1938 అక్టోబరు) ప్రకారం సుడేటన్‌ల్యాండ్‌ జర్మనీలో భాగమైంది.
2. 1919 లో (1938 అక్టోబరు) ఇరు దేశాలు యుద్ధం చేసిన పోలండు జావోల్జీని పోలిష్ బహుళత్వంతో కలుపుతుంది.
3. హంగేరియన్ మైనారిటీలతో సరిహద్దు ప్రాంతాలు (దక్షిణ స్లోవేకియాలో మూడవ వంతు భాగం, దక్షిణ కార్పాతియన్ రుథేనియా ) మొదటి వియన్నా అవార్డు (1938 నవంబరు) ప్రకారం హంగేరిలో భాగమయ్యాయి.
4. 1939 మార్చి 15 న, మిగిలిన చెక్ భూభాగాలపై జర్మన్ దండయాత్ర సమయంలో, హంగేరి మిగిలిన కార్పాతియన్ రుథేనియా (1938 అక్టోబరు నుండి స్వయంప్రతిపత్తి కలిగి ఉంది) ను కలుపుతుంది.
5. జర్మనీ 1939 మార్చి 16 న, తోలుబొమ్మ ప్రభుత్వంతో బోహేమియా మొరావియా ప్రొటెక్టరేట్ను స్థాపించింది.
6. 1939 మార్చి 14 న, హిట్లర్ అనుకూల కాథలిక్ - ఫాసిస్ట్ ప్రభుత్వం స్లోవాక్ రిపబ్లిక్‌ను యాక్సిస్ క్లయింట్ రాష్ట్రంగా ప్రకటించింది.
ఎడమ నుండి కుడికి: మ్యూనిక్ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు ఛాంబర్లేన్, డలాడియర్, హిట్లర్, ముస్సోలిని, సియానో. ఈ ఒప్పందంతో సుడేటన్‌ల్యాండ్‌ జర్మనీ హస్తగతమైంది.

సెప్టెంబరు 29 న జరిగిన సమావేశంలో అన్ని పక్షాలూ ఒక అంగీకారానికి వచ్చాయి. 1938 సెప్టెంబరు 30 రాత్రి 1:30 గంటలకు [25] అడాల్ఫ్ హిట్లర్, నెవిల్ చాంబర్‌లేన్, బెనిటో ముస్సోలిని, ఎడ్వర్డ్ దలాడియర్ లు మ్యూనిక్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పంద పత్రాన్ని ముస్సోలినీ అధికారికంగా ప్రవేశపెట్టాడు. అతని ప్రతిపాదన ఇలా ఉంది: జర్మనీ సైన్యం అక్టోబరు 10 నాటికి సుడేటన్‌లాండ్‌ను ఆక్రమిస్తుంది. ఇతర వివాదాస్పద ప్రాంతాల భవిష్యత్తును ఒక అంతర్జాతీయ కమిషన్ నిర్ణయిస్తుంది.

ఒప్పందం లోని నిబంధనలను అంగీకరించాలనీ లేదంటే నాజీ జర్మనీతో యుద్ధానికి ఒంటరిగానే తలపడమనీ బ్రిటన్, ఫ్రాన్స్‌లు చెకోస్లోవేకియాకు స్పష్టం చేసాయి. నాజీలతో ఒంటరిగా పోరాడలేమని గ్రహించిన చెకోస్లోవాక్ ప్రభుత్వం, అయిష్టంగానే లొంగిపోయి (సెప్టెంబరు 30), ఒప్పందానికి కట్టుబడి ఉండటానికి అంగీకరించింది. దాంతో అక్టోబరు 10 న సుడేటన్‌ల్యాండ్‌ జర్మనీ హస్తగతమైంది. దాన్ని దాటి మరింత ముందుకు వెళ్ళనంతవరకు, మిగిలిన చెకోస్లోవేకియాపై హిట్లరుకు డీఫ్యాక్టో నియంత్రణ కూడా దక్కింది. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత. సెప్టెంబరు 30 న, చాంబర్లేన్ హిట్లర్ వద్దకు వెళ్లి యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీల మధ్య ఒక శాంతి ఒప్పందంపై సంతకం చేయమని కోరాడు. హిట్లర్ అనువాదకుడు దానిని అనువదించిన తరువాత, అతను సంతోషంగా అంగీకరించాడు.

సెప్టెంబరు 30 న, బ్రిటన్కు తిరిగి వచ్చిన తరువాత చాంబర్లేన్, లండన్ ప్రజలకు "మన తరానికి శాంతి (పీస్ ఫర్ అవర్ టైం)" అనే తన వివాదాస్పద ప్రసంగాన్ని చేసాడు. [26]

స్పందనలు

[మార్చు]
1938 అక్టోబరులో సుడేటన్‌ల్యాండ్‌లోకి జర్మన్ సైన్యం రావడాన్ని సుడేటన్ జర్మన్లు స్వాగతించారు

బ్రిటిషు, ఫ్రెంచి వారు సంతోషించినప్పటికీ, బెర్లిన్ లోని ఒక బ్రిటిష్ దౌత్యవేత్త హిట్లర్ పరివార సభ్యుడి ద్వారా తనకు వచ్చిన సమాచారం అని చెబుతూ ఇలా చెప్పాడు: చాంబర్లేన్‌తో సమావేశం ముగిసిన వెంటనే హిట్లర్‌ కోపంగా "జెంటిల్మెన్, ఇది నా మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం. ఇదే చివరిదని కూడా మీకు భరోసా ఇస్తున్నా" అన్నాడు. [27] మరొక సందర్భంలో, అతను చాంబర్లేన్ గురించి ఇలా అనడం వినబడింది: "ఆ పిచ్చి ముసలాడు మళ్ళీ ఎప్పుడైనా ఆ గొడుగేసుకొచ్చి ఇక్కడ తల దూరిస్తే, అతన్ని మెట్ల మీద నుంది కిందకు ఒక్క తాపు తన్ని, ఫోటోగ్రాఫర్ల ముందే అతని పొట్ట మీదకి దూకుతా." [27] [28] [29] మ్యూనిక్ తరువాత తన బహిరంగ ప్రసంగంలో, హిట్లర్, "దేవుడి దయ వలన ఈ దేశంలో మనకు గొడుగు రాజకీయ నాయకులు లేరు" అని అన్నాడు. [27] [30]

వేసవిలో తాను లక్ష్యంగా పెట్టుకున్న "చెక్‌లపై పరిమిత యుద్ధం" జరగనీయకుండా తనను మోసగించారని హిట్లరు భావించాడు. [31] అక్టోబరు ఆరంభంలో, చాంబర్లేన్‌కు దేశీయంగా మద్దతును బలోపేతం చేయడానికి బ్రిటన్‌తో జర్మనీ మైత్రిని కోరుతూ బహిరంగంగా ప్రకటించాలని చాంబర్లేన్ ప్రెస్ సెక్రటరీ కోరాడు; హిట్లర్ దానికి బదులుగా చాంబర్లేన్ యొక్క "పాలనా జోక్యాన్ని" ఖండిస్తూ ప్రసంగాలు చేశాడు. [32] 1939 ఆగస్టు లో, పోలండు దండయాత్రకు కొంతకాలం ముందు, హిట్లర్ తన జనరల్స్‌తో ఇలా అన్నాడు: "మన శత్రువులు అల్ప పురుషులు, పనిమంతులు కాదు, పని చేయించే సమర్థులు కాదు. వాళ్ళు చిన్న చిన్న పురుగులు. వాటిని నేను మ్యూనిక్‌లో చూశాను." [33]

ఒప్పందానికి ఎల్లెడలా ప్రశంసలు వచ్చాయి. ఫ్రాన్స్ ప్రధాన మంత్రి దలాడియర్ "మూడు మిలియన్ల మంది జర్మన్లను చెక్ సార్వభౌమాధికారం కింద కొనసాగించడం కోసం ఐరోపా, యుద్ధాన్ని కొని తెచ్చుకోవడం సరైన పని అని అనుకోవడం లేదు" అని అన్నాడని ఒక పండితుడు చెప్పాడు. బ్రిటన్, ఫ్రాన్స్ అమెరికాల్లో జరిపిన గాలప్ పోల్స్ లో ఈ ఒప్పందానికి ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు. చెకోస్లోవేకియా అధ్యక్షుడు బెనెస్ 1939 లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషను పొందాడు.[34]

మ్యూనిక్ తరువాతి రోజుల్లో, చాంబర్లేన్‌కు 20,000 పైచిలుకు లేఖలు, టెలిగ్రామ్‌ల రూపంలో కృతజ్ఞతలు వచ్చాయి. డచ్ అభిమానులు అతనికి 6,000 బల్బులు పంపించారు. పోప్ ఒక శిలువతో సహా బహుమతులు పంపించాడు. [35]

మ్యూనిక్ ఒప్పందంపై న్యూయార్క్ టైమ్స్ హెడ్‌లైన్ "హిట్లరుకు తన సుడేటన్ డిమాండ్ల కన్నా తక్కువే దక్కింది" అని రాసింది. డలాడియర్‌ ఫ్రాన్స్‌కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఉత్సాహంగా గుమిగూడి హర్షం వ్యక్తం చేసారు, చాంబర్లేన్‌కు బ్రిటన్‌లో ప్రజలు హర్షాతిరేకలు వెలిబుచ్చారు అని రాసింది. [36]

చెక్ శరణార్థులు 1938 అక్టోబరు, శరణార్థుల కార్యాలయంలో సుడేటన్‌ల్యాండ్‌ నుండి బహిష్కరించబడ్డారు

మ్యూనిక్ ఒప్పందంతో జోసెఫ్ స్టాలిన్ కలత చెందాడు. నాజీ జర్మనీ దూకుడును అడ్డుకునే లక్ష్యంతో ఫ్రాన్స్ సోవియట్ యూనియన్ లు 1935 మే 2 న ఫ్రాంకో-సోవియట్ పరస్పర సహాయం ఒప్పందంపై సంతకం చేశాయి. [37] చెకోస్లోవేకియాతో పరస్పర సైనిక సహాయ ఒప్పందం కుదుర్చుకున్న సోవియట్, ఫ్రాన్స్ తనను మోసం చేసిందని భావించింది. ఫ్రాన్సుక్కుడా చెకోస్లోవేకియాతో పరస్పర సైనిక సహాయ ఒప్పందం ఉంది . [38] అయితే, బ్రిటిషు, ఫ్రెంచి వారు సోవియట్‌లను జర్మనీకి ముప్పుగా చూపించారు. మధ్య యూరోపియన్ దేశాన్ని జర్మన్లకు అప్పగించడానికి ఈ దేశాలు హిట్లర్‌తో చురుకుగా ఒప్పందం కుదుర్చుకున్నాయని, భవిష్యత్తులో వారు సోవియట్ యూనియన్‌కు కూడా ఇదే గతి పట్టిస్తారనీ, తమ దేశాన్ని పాశ్చాత్య దేశాల వాళ్ళు పంచుకుంటారనీ స్టాలిన్ నిశ్చయించుకున్నాడు. దీంతో సోవియట్ యూనియన్ జర్మనీతో సత్సంబంధాలు నెలకొల్పుకునే దిశగా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంది. చివరికి 1939 లో జర్మనీతో, మోలోటోవ్-రిబ్బెంత్రోప్ ఒడంబడికను కుదుర్చుకుంది. [39]

మ్యూనిక్ ఒప్పందంతో చెకోస్లోవాకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమావేశానికి వారిని ఆహ్వానించనే లేదు. బ్రిటిష్, ఫ్రెంచి ప్రభుత్వాలు తమను మోసం చేశాయని భావించారు. చెక్, స్లోవాక్ ప్రజలు మ్యూనిక్ ఒప్పందాన్ని మ్యూనిక్ ఆదేశం అని పిలుస్తారు. ఈ ఒప్పందంతో ఫ్రాన్స్‌తో చెకోస్లోవేకియా సైనిక పొత్తు చెల్లనిదై పోయింది కాబట్టి కొందరు దీన్ని మ్యూనిక్ ద్రోహం అని కూడా అంటారు. జర్మన్ చొరబాట్లకు వ్యతిరేకంగా చెకోస్లోవేక్ రిపబ్లిక్ ఎదురు తిరిగితే, పర్యవసానంగా వచ్చే యూరోపియన్ యుద్ధానికి బాధ్యత దానిదే అవుతుందనే అభిప్రాయాన్ని ఫ్రెంచి ప్రభుత్వం వ్యక్తం చెయ్యడం కూడా దీన్ని ప్రతిబింబిస్తుంది. [40] 1938 లో, సోవియట్ యూనియన్, ఫ్రాన్స్‌తో చెకోస్లోవేకియాతో పొత్తు పెట్టుకుంది. 1939 సెప్టెంబరు నాటికి, సోవియట్‌లు నాజీ జర్మనీతో పొత్తు కుదుర్చుకున్నారు, చెకోస్లోవేకియా స్థానంలో సోవియట్ యూనియన్‌ను పెట్టి మ్యూనిక్ ఒప్పందం లాంటిదే మరొకటి కుదురుతుందని స్టాలిన్ భయపడడమే దానికి కారణం. అందువల్ల, ఈ ఒప్పందం 1939 లో యుద్ధం ప్రారంభానికి పరోక్షంగా దోహదపడింది. [41]

"మా గురించి, మేం లేకుండా! " (చెక్ భాషలో: ఓ న్యాస్ బేజ్ న్యాస్) ఇదీ ఈ ఒప్పందం పట్ల చెకోస్లోవేకియా ప్రజల భావం. [42] సుడేటన్‌ల్యాండ్ జర్మనీకి వెళ్లడంతో, చెకో-స్లోవేకియాకు జర్మనీతో ఉన్న దాని రక్షణాత్మక సరిహద్దును, దాని కోటలను కోల్పోయింది. అవి లేకపోతే దాని స్వాతంత్ర్యం పేరుకు మాత్రమే స్వాతంత్ర్యం. చెకోస్లోవేకియా దాని ఇనుము / ఉక్కు పరిశ్రమలో 70%, విద్యుత్ శక్తిలో 70%, దాని పౌరులలో 35 లక్షల మందినీ కోల్పోయింది. [43] సుడేటన్ జర్మన్లు తాము విముక్తి చెందినట్లుగా సంబరాలు జరుపుకున్నారు. ముంచుకొచ్చిన యుద్ధం తప్పిపోయినట్లే ననిపించింది.

అభిప్రాయాలు

[మార్చు]

బ్రిటిషు ప్రజలు యుద్ధం ఖాయమైనట్లే భావించారు. ఆ సమయంలో ఈ ఒప్పందం కుదరడంతో అది చాంబర్లేన్ "రాజనీతిజ్ఞత" అని అతన్ని మొదట శ్లాఘించారు. బ్రిటిషు పార్లమెంటులో ఒప్పందాన్ని ప్రవేశపెట్టే ముందు రాజ కుటుంబం అతనిని హీరోగా పరిగణించి, అతన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని బాల్కనీకి ఆహ్వానించింది. రాజకుటుంబ ప్రోత్సాహం ఉన్నప్పటికీ, ఈ ఒప్పందంపై వచ్చిన సానుకూల స్పందన త్వరలోనే సన్నగిల్లింది. అయితే, మొదటి నుంచీ ఎంతో కొంత వ్యతిరేకత ఉంటూనే ఉంది. క్లెమెంట్ అట్లీ, లేబర్ పార్టీ, ఇద్దరు కన్జర్వేటివ్ ఎంపీలు, డఫ్ కూపర్ వైయన్ ఆడమ్స్ లు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు.

జర్మనీతోటి యుద్ధం వచ్చే ప్రమాదాలు మరింత స్పష్టంగా కనిపించడంతో, అభిప్రాయాలు మారాయి. 1940 గిల్టీ మెన్ వంటి పుస్తకాలలో "మెన్ ఆఫ్ మ్యూనిక్"లో ఒకరిగా చాంబర్లేన్ పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 1944 లో యుద్ధసమయంలో లార్డ్ ఛాన్సలర్‌గా ఉన్న విస్కౌంట్ మౌఘం ఈ ఒప్పందానికి అరుదైన మద్దతు పలికాడు. మునుపటి వివాదాల వెలుగులో గణనీయమైన జర్మన్ హంగేరియన్ మైనారిటీలతో సహా చెకోస్లోవాక్ రాజ్యాన్ని స్థాపించే నిర్ణయం ఒక "ప్రమాదకరమైన ప్రయోగం" అని మౌఘం భావించాడు. యుద్ధం చేసే పరిస్థితిలో లేని ఫ్రాన్స్, చెక్‌తో తాను చేసుకున్న ఒప్పంద బాధ్యతల నుండి బయట పడాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి అదే మూలకారణమనీ అతడు చెప్పాడు. [44] యుద్ధం తరువాత, చర్చిల్ రాసిన ది గాదరింగ్ స్టార్మ్ (1948) లో, మ్యూనిక్ లో హిట్లర్‌ను చాంబర్లేన్ ప్రసన్నం చేసుకోవడం తప్పు అని నొక్కిచెప్పాడు. హిట్లర్ దురాక్రమణ ప్రణాళిక గురించి తాను ముందస్తుగానే హెచ్చరికలను చేసినట్లు అతడు రాసాడు. వాయుసేనాధిపత్యం విషయంలో జర్మనీ బ్రిటన్‌తో సమానత్వం సాధించిన తరువాత కూడా బ్రిటన్ నిరాయుధీకరణను కొనసాగించడం మూర్ఖత్వమని అతడు అభిప్రాయపడ్డాడు. చాంబర్లేన్ ఉన్నతమైన ఉద్దేశ్యాల తోనే వ్యవహరించాడని చర్చిల్ అన్నప్పటికీ, చెకోస్లోవేకియాపై హిట్లర్‌ను ప్రతిఘటించి ఉండాల్సిందని, సోవియట్ యూనియన్‌ను కూడా కలుపుకునే ప్రయత్నాలు జరిగి ఉండాల్సిందనీ అతడు వాదించాడు.

బుజ్జగింపులకు వ్యతిరేకి అయిన చర్చిల్, తన యుద్ధానంతర జ్ఞాపకాలలో, పోలండు, హంగేరీలను విమర్శలతో ముంచెత్తాడు. ఈ రెండూ చెకోస్లోవేకియాలోని పోలిష్ ప్రజలు, హంగేరియన్లు ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. "చెకోస్లోవేకియా శవాన్ని పీక్కుతిన్న రాబందులు వీళ్ళిద్దరూ" అని అతడు వాటిని అభివర్ణించాడు. [45]

పరిణామాలు

[మార్చు]

ఒప్పందం కుదిరిన వెంటనే అక్టోబరు 1 న సుడేటన్‌ల్యాండ్‌ను జర్మనీ ఆక్రమించుకుంది. అక్టోబరు 10 కల్లా విలీనం పూర్తైంది. చెకోస్లోవేకియా పతనం అనివార్యమని గ్రహించిన బెనెస్, అక్టోబరు 5 న అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత, అతను లండన్లో చెకోస్లోవాక్ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 1938 డిసెంబరు 6 న, ఫ్రెంచ్-జర్మన్ పరస్పర అనాక్రమణ ఒప్పందంపై పారిస్‌లో ఫ్రెంచి విదేశాంగ మంత్రి బోనెట్, జర్మన్ విదేశాంగ మంత్రి జోకిమ్ వాన్ రిబ్బెంట్రాప్ లు సంతకాలు చేశారు. [46] [47] [48]

హంగరీకి మొదటి వియన్నా అవార్డు

[మార్చు]
1938 నవంబరులో కొసిస్‌లో హంగేరియన్ల విజయ ప్రవేశం సందర్భంగా అడ్మిరల్ హోర్తీ
1938 లో 36% పోలండు జాతీయులు నివసించే చెకోస్లోవేకియాలోని జాల్జీ ప్రాంతాన్ని పోలండు స్వాధీనం చేసుకుంది.
"600 సంవత్సరాలుగా మేము మీ కోసం ఎదురుచూస్తున్నాము (1335-1938)". 1938 అక్టోబరులో కార్వినాలో జాల్జీని స్వాధీనం చేసుకున్న పోలండుకు లభించిన స్వాగతం

1938 నవంబరు ప్రారంభంలో, మొదటి వియన్నా అవార్డు క్రింద చెకోస్లోవేకియా, హంగరీల మధ్య చర్చలు విఫలమైన తరువాత, మ్యూనిక్ ఒప్పందపు అనుబంధం ప్రకారం ప్రాదేశిక వివాదాలను పరిష్కరించడంలో భాగంగా, జర్మన్-ఇటాలియన్‌ల మధ్యవర్తిత్వ సంఘం దక్షిణ స్లోవేకియాను హంగరీకి అప్పగించాలని చెకోస్లోవేకియాను కోరింది. ఆ తర్వాత కొద్ది కాలానికే పోలండు, చిన్నపాటి ప్రాంతాలపై ఆధిపాత్యం పొందింది ( జాల్జీ).

తత్ఫలితంగా, బోహేమియా, మొరావియా, సిలేసియాలు తమ ప్రాంతంలో 38% జర్మనీకి కోల్పోయాయి. దాదాపు 28 లక్షల మంది జర్మన్లు 5,13,000 నుండి 7,50,000 [49] [50] మంది చెక్ వాసులు ఈ ప్రాంతంలో ఉన్నారు. హంగరీకి దక్షిణ స్లోవేకియా, దక్షిణ కార్పాతియన్ రుథేనియా లోని 11,882 కి.మీ2 (4,588 చ. మై.) ప్రాంతం దక్కింది. 1941 జనాభా లెక్కల ప్రకారం, ఈ ప్రాంత జనాభాలో 86.5% మంది హంగేరియన్లు. స్లోవేకియా 10,390 కి.మీ2 (4,010 చ. మై.) భూభాగాన్ని, 854,218 మంది ప్రజలను హంగేరీకి అర్పించుకుంది (చెకోస్లోవాక్ 1930 జనాభా లెక్కల ప్రకారం వీరిలో 59% మంది హంగేరియన్లు, 31.9% స్లోవాకులు చెక్లు [51] ).

ఇదిలా ఉండగా, పోలండు చెస్కీ టెచిన్ పట్టణాన్ని చుట్టుపక్కల ప్రాంతంతో సహా ఆక్రమించుకుంది (సుమారు 906 కి.మీ2 (350 చ. మై.), 250,000 ప్రజలు). వీరిలో పోలిషు ప్రజలు 36% ఉన్నారు. 1910 లో ఈ సంఖ్య 69%గా ఉండేది ) [52] ఉత్తర స్లోవేకియాలోని రెండు చిన్న సరిహద్దు ప్రాంతాలు, మరింత కచ్చితంగా చెప్పాలంటే స్పిక్, ఒరావా ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంది. ( 226 కి.మీ2 (87 చ. మై.), 4,280 నివాసులు, కేవలం 0.3% పోలిష్ ప్రజలు).

మ్యూనిక్ ఒప్పందం కుదిరిన వెంటనే, 1,15,000 చెక్‌లు, 30,000 మంది జర్మన్లు చెకోస్లోవేకియా అంతర్భాగానికి పారిపోయారు. ఇన్స్టిట్యూట్ ఫర్ రెఫ్యూజీ అసిస్టెన్స్ ప్రకారం, 1939 మార్చి 1 నాటికి శరణార్థుల సంఖ్య దాదాపు 1,50,000 గా ఉంది. [53]

1938 డిసెంబరు 4 న, రీచ్స్‌గౌ సుడెటెన్‌లాండ్‌లో జరిగిన ఎన్నికలలో వయోజన జనాభాలో 97.32% మంది నాజీ పార్టీకి ఓటు వేశారు. సుమారు 5 లక్షల మంది (సుడేటన్‌ల్యాండ్‌లోని జర్మన్ జనాభాలో 17.34% మంది) సుడేటన్ జర్మన్లు నాజీ పార్టీలో చేరారు (నాజీ జర్మనీలో ఇది 7.85% మాత్రమే). ఈ విధంగా, థర్డ్ రీచ్‌ మొత్తంలో, సుడేటన్‌లాండ్ అత్యంత "నాజీ అనుకూల" ప్రాంతంగా మారింది. [54]

మిగిలిన చెక్ భూభాగంపై జర్మనీ దాడి

[మార్చు]

చెకోస్లోవేకియా దాడి కోసం 1937 లో, వెర్మాక్ట్ (జర్మనీ సంయుక్త సాయుధ దళాలు) "ఆపరేషన్ గ్రీన్" అనే ప్రణాళికను రూపొందించారు. [55] 1939 మార్చి 15 న స్లోవాక్ దేశాన్ని ప్రకటించిన కొద్దికాలానికే దీన్ని అమలు చేసారు.

మార్చి 14 న, స్లోవేకియా చెకోస్లోవేకియా నుండి విడిపోయి, నాజీ అనుకూల దేశంగా మారింది. మరుసటి రోజున, కార్పాతో-ఉక్రెయిన్ కూడా స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. కానీ మూడు రోజుల తరువాత, దీన్ని హంగేరి పూర్తిగా ఆక్రమించుకుంది. చెకోస్లోవాక్ అధ్యక్షుడు ఎమిల్ హాకా బెర్లిన్ వెళ్లి హిట్లరుతో సమావేశం కోసం వేచి ఉన్నాడు. ఆక్రమణకు ఆదేశాలు అప్పటికే ఇవ్వబడ్డాయి. హిట్లర్‌తో జరిగిన సమావేశంలో, చెక్ దళాలు తమ ఆయుధాలను విడిచిపెట్టమని ఆదేశించనట్లయితే హాగ్ ప్రేగ్‌ లపై బాంబు దాడులు చేస్తానని హిట్లరు అతడిని బెదిరించాడు. దాంతో అతడికి గుండెపోటు వచ్చింది. హిట్లర్ వైద్యుడు చేసిన ఇంజెక్షనుతో అతడు కోలుకున్నాడు. మిగిలిన బోహేమియా మొరావియా ప్రాంతాన్ని జర్మనీ ఆక్రమించుకునేందుకు అంగీకరించే ప్రకటనపై సంతకం చేయడానికి హాకా అంగీకరించాడు, "తడిగుడ్డతో గొంతులు కోసే నాజీలకు కూడా ఇది చెప్పుకోదగిన విశేషమే". [56] జర్మన్ సైన్యాలు ప్రాగ్‌లోకి ప్రవేశించి, మిగిలిన దేశాన్నంతటినీ ఆక్రమించుకున్నాయి. దాంతో ఇది జర్మనీ సంరక్షణలో ఉన్న ప్రాంతంగా మారిపోయింది. 1939 మార్చి లో, కాన్స్టాంటిన్ వాన్ న్యూరాత్‌ను రీచ్‌స్ప్రోటెక్టర్‌గా నియమించారు. ప్రొటెక్టరేట్‌లో హిట్లర్ వ్యక్తిగత ప్రతినిధిగా అతడు పనిచేశాడు. ఆక్రమణ జరిగిన వెంటనే, అరెస్టుల తరంగం ప్రారంభమైంది, ఎక్కువగా జర్మనీ నుండి వచ్చిన శరణార్థులు, యూదులు చెక్ ప్రజా ప్రముఖులు వీరిలో ఉన్నారు. నవంబరు నాటికి, యూదు పిల్లలను వారి పాఠశాలల నుండి బహిష్కరించారు. తల్లిదండ్రులను వారి ఉద్యోగాల నుండి తొలగించారు. చెకోస్లోవేకియా ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రదర్శనలు ఇవ్వడంతో విశ్వవిద్యాలయాలు కళాశాలలను మూసివేసారు. 1200 మంది విద్యార్థులను నిర్బంధ శిబిరాలకు పంపారు. నవంబరు 17 న (అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం) తొమ్మిది మంది విద్యార్థి నాయకులను ఉరితీశారు.

బోహేమియా, మొరావియాలను స్వాధీనం చేసుకోవడంతో, అక్కడి నైపుణ్యం కలిగిన శ్రమశక్తి, భారీ పరిశ్రమలతో పాటు చెకోస్లోవాక్ సైన్యానికి చెందిన ఆయుధాలన్నిటినీ థర్డ్ రీచ్ హస్తగతం చేసుకుంది. 1940 నాటి ఫ్రాన్స్ యుద్ధంలో జర్మనీ వాడిన ఆయుధాలలో 25% చెక్ నుండి వచ్చినవే. చెకోస్లోవేకియా లోని బంగారు నిధిని కూడా థర్డ్ రీచ్ స్వాధీనం చేసుకుంది, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో నిల్వ చేసిన బంగారం కూడా ఇందులో ఉంది. ఉప్పు గనులలో యుద్ధం తరువాత దొరికిన మొత్తం 227 టన్నుల బంగారంలో, 1982 లో 18.4 టన్నులు మాత్రమే చెకోస్లోవేకియాకు తిరిగి ఇచ్చారు. కాని అందులో ఎక్కువ భాగం చెకోస్లోవేకియా నుండి వచ్చినదే. చెకోస్లోవేకియా 64.8 కోట్ల చెక్ కొరునాల విలువ గల యుద్ధ సామగ్రిని వెహర్‌మాక్ట్ కు"అమ్మవలసి" వచ్చింది. జర్మనీ ఆ అప్పును తిరిగి చెల్లించనే లేదు. 

ఇదిలా ఉండగా, ఇప్పుడు పోలండు చుట్టూ జర్మనీ భూభాగాలు ఉండడంతో నాజీ విస్తరణవాదపు తదుపరి లక్ష్యం పోలాండే కానున్నదని బ్రిటన్, పోలండుల్లో ఆందోళన తలెత్తింది. పోలిష్ కారిడార్ గురించి, డాన్జిగ్‌ నగరం గురించీ జర్మనీ లేవనెత్తిన వివాదంతో ఇది స్పష్టమై పోయింది. దీని ఫలితంగా ఆంగ్లో-పోలిష్ సైనిక పొత్తు ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం అండతో పోలండు ప్రభుత్వం, డాన్జిగ్ స్థితిపై జర్మనీ చేసిన చర్చల ప్రతిపాదనలను తిరస్కరించింది.

చెకోస్లోవేకియాను నాజీలు స్వాధీనం చేసుకోవడంతో తాను మోసపోయానని చాంబర్లేన్ భావించాడు. హిట్లర్ పట్ల తన బుజ్జగింపు విధానం విఫలమైందని గ్రహించి జర్మనీకి వ్యతిరేకంగా చాలా కఠినమైన విధానాన్ని అవలంబించడం ప్రారంభించాడు. బ్రిటిష్ సామ్రాజ్య సాయుధ దళాలను యుద్ధ ప్రాతిపదికన సమీకరించడం ప్రారంభించాడు. ఫ్రాన్స్ కూడా అదే పనిచేసింది. బ్రిటిషు, ఫ్రెంచి నౌకాదళాలను చూసి బెదరిన ఇటలీ, 1939 ఏప్రిల్ లో అల్బేనియాపై దండయాత్రను ప్రారంభించింది. సెప్టెంబరు 1 న హిట్లర్ పోలండుపై దాడి మొదలుపెట్టడంతో రెండవ ప్రపంచ యుద్ధం అధికారికంగా మొదలైంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Munich Pact September 30, 1938" చూడు
  2. Goldstein, Erik; Lukes, Igor (2012-10-12). The Munich Crisis, 1938: Prelude to World War II (in ఇంగ్లీష్). Routledge. ISBN 9781136328398.
  3. "Hoedl-Memoiren". joern.de. Retrieved 20 July 2019.
  4. "Munich Agreement", Encyclopædia Britannica. Retrieved 6 August 2018.
  5. Douglas, R. M. (2012), Orderly and Humane, New Haven: Yale University Press, p. 9
  6. Douglas, pp. 7-12
  7. Douglas, pp. 12–13
  8. Noakes & Pridham 2010, pp. 100–101, Vol. 3.
  9. Hruška, E. (2013). Boj o pohraničí: Sudetoněmecký Freikorps v roce 1938 (in చెక్). Prague: Nakladatelství epocha. p. 11.
  10. Douglas, p. 18
  11. 11.0 11.1 Noakes & Pridham 2010, p. 102, Vol. 3.
  12. Noakes & Pridham 2010, p. 101.
  13. Noakes & Pridham 2010, pp. 1001–1002.
  14. Noakes & Pridham 2010, p. 102.
  15. 15.0 15.1 Noakes & Pridham 2010, p. 104.
  16. Hehn, Paul N (2005). A Low, Dishonest Decade: The Great Powers, Eastern Europe and the Economic Origins of World War II, 1930-1941. Bloomsbury Academic. p. 89. ISBN 9780826417619.
  17. Noakes & Pridham 2010, pp. 102–103.
  18. Noakes & Pridham 2010, p. 104, Vol. 3.
  19. 19.0 19.1 19.2 19.3 19.4 Bell 1986, p. 238.
  20. Noakes & Pridham 2010, p. 201.
  21. 21.0 21.1 21.2 Noakes & Pridham 2010, p. 105.
  22. Noakes & Pridham 2010, p. 105, Vol. 3.
  23. 23.0 23.1 Bell 1986, p. 239.
  24. Santi Corvaja, Robert L. Miller. Hitler & Mussolini: The Secret Meetings. New York, New York, USA: Enigma Books, 2008. ISBN 9781929631421. Pp. 74.
  25. Gilbert & Gott 1967, p. 178.
  26. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-14. Retrieved 2021-07-13.
  27. 27.0 27.1 27.2 Kirkpatrick 1959, p. 135.
  28. Richard Overy, 'Germany, "Domestic Crisis" and War in 1939', Past & Present No. 116 (Aug., 1987), p. 163, n. 74.
  29. Robert Rothschild, Peace For Our Time (Brassey's Defence Publishers, 1988), p. 279.
  30. Roger Parkinson, Peace For Our Time: Munich to Dunkirk—The Inside Story (London: Hart-Davis, 1971), p. 78.
  31. Ian Kershaw, Hitler, 1936–1945: Nemesis (London: Penguin, 2001), pp. 122–123.
  32. Robert Self, Neville Chamberlain (London: Routledge, 2006), p. 344.
  33. John W. Wheeler-Bennett, The Nemesis of Power: The German Army in Politics 1918-1945 (London: Macmillan, 1964), p. 447.
  34. Douglas, pp. 14–15
  35. Faber, David. (2008), Munich. The 1938 Appeasement Crisis, Simon & Schuster, p. 421
  36. "Britain and Germany Make Anti-War Pact; Hitler Gets Less Than His Sudeten Demands; Polish Ultimatum Threatens Action Today". The New York Times. Retrieved 20 July 2019.
  37. Jabara Carley, Michael. "Who Betrayed Whom? Franco-Anglo-Soviet Relations, 1932–1939" (PDF). Université de Montréal.
  38. "Franco-Czech Treaty". Time. 7 January 1924.
  39. Hildebrand 1991.
  40. Kuklik, Jan. The validity of the Munich agreement and the process of the repudiation during the second world war as seen from a Czechoslovak perspective. p. 346.
  41. Sakwa, Richard (1999). The Rise and Fall of the Soviet Union 1917-1991. Routledge. p. 225. ISBN 0-415-12-289-9.
  42. "Czech Republic: Past Imperfect -- 64 Years Later, Munich 'Betrayal' Still Defines Thought (Part 5)". Radio Free Europe/Radio Liberty. 19 July 2002.
  43. Shirer 1960.
  44. Maugham 1944.
  45. Churchill, Winston S (2002). The Second World War. Vol. 1: The Gathering Storm. RosettaBooks LCC. pp. 289–290. ISBN 9780795308321.
  46. Gibler, Douglas M (2008). International Military Alliances, 1648-2008. CQ Press. p. 203. ISBN 978-1604266849.
  47. "The Franco-German Declaration of December 6th, 1938". Retrieved 11 June 2020.
  48. France Signs "No-War" Pact with Germany, Chicago Tribune, 7 December 1938
  49. "K otázce vysídlení občanů ČSR ze Sudet, Těšínska, Podkarpatské Rusi a Slovenské republiky v letech 1938/1939". Archived from the original on 2 December 2014. Retrieved 2 December 2014.
  50. "Fakta o vyhnání Čechů ze Sudet". bohumildolezal.cz. Retrieved 20 July 2019.
  51. http://www.forumhistoriae.sk/documents/10180/70153/hetenyi.pdf
  52. Siwek n.d.
  53. Forced displacement of Czech population under Nazis in 1938 and 1943, Radio Prague
  54. Zimmerman 1999.
  55. Herzstein 1980, p. 184.
  56. Noakes, J. and Pridham, G. (eds) (2010) [2001] Nazism 1919-1945, Vol 3, Foreign Policy, War and Racial Extermination, University of Exeter Press, Exeter, p.119