Jump to content

మడకశిర కృష్ణప్రభావతి

వికీపీడియా నుండి
(యం.కె.ప్రభావతి నుండి దారిమార్పు చెందింది)
మడకశిర కృష్ణప్రభావతి
ఎం.కె.ప్రభావతి
జననం (1946-08-06) 1946 ఆగస్టు 6 (వయసు 78)
దొడ్డద అళవట్ట, తుమకూరు జిల్లా, కర్ణాటక
మరణం2024 ఏప్రిల్ 30(2024-04-30) (వయసు 77)
విజయవాడ
విద్యబి.ఎస్.సి., ఎం.ఎ.(తెలుగు)
వృత్తిఉపాధ్యాయిని
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తొలి మహిళా అవధాని, రచయిత్రి
బిరుదుఅవధాన భారతి, అవధాన విద్యావిశారద
పురస్కారాలుఊటుకూరి లక్ష్మీకాంతమ్మ పురస్కారం,
తెలుగువిశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారం

మడకశిర కృష్ణప్రభావతి గారు తొలి తెలుగు మహిళా అవధానిగా ప్రసిద్ధి కెక్కినారు. ఈమె 108కి పైగా అష్టావధానాలను నిర్వహించినారు.

జీవితవిశేషాలు

[మార్చు]

ఈమె 1946, ఆగస్టు 6 వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా, మధుగిరి తాలూకాకు చెందిన దొడ్డదళవట్ట అనే గ్రామంలో కృష్ణమూర్తి, లలితమ్మ దంపతులకు జన్మించినారు. ఈమె హైస్కూలు విద్య ప్రకాశం జిల్లా, దొనకొండలో అభ్యసించి 1961లో ఎస్.ఎస్.ఎల్.సి. ఉత్తీర్ణురాలైనారు. తరువాత బళ్ళారి పట్టణంలోని వీరశైవ కళాశాలలో పి.యు.సి., బి.ఎస్.ఎసి. 1965లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. తరువాత ప్రైవేటుగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ.చదివినారు. సంతాన గోపాలకృష్ణ, దాదన చిన్నయ్య ఈమె గురువులు. ప్రముఖ అవధాని చక్రాల లక్ష్మీకాంతరాజారావు ఈమెకు అవధానంలోని మెళకువలను నేర్పించినారు. ఈమె 1967లో గుంతకల్లులోని మునిసిపల్ బాలికల పాఠశాలలో సైన్స్ అసిస్టెంటు ఉద్యోగంలో చేరి ఆరు సంవత్సరాలు పనిచేసినారు. తరువాత రైల్వే హైస్కూలులో సైన్స్ అసిస్టెంటుగా చేరి 20 సంవత్సరాలు గుంతకల్లులోనే పనిచేసినారు. 1992లో పదోన్నతి పొంది కాజీపేట రైల్వే జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసినారు. 1998లో గెజిటెడ్ హెడ్మాస్టర్‌గా పదోన్నతి పొంది గుంతకల్లు రైల్వే ఉన్నతపాఠశాలలో పనిచేస్తూ 2006లో పదవీ విరమణ గావించినారు[1]

అవధాన ప్రస్థానము

[మార్చు]

ఈమె 1991లో మొదటి అవధానం చేసినారు. అప్పటి నుండి నేటి వరకు 108 అష్టావధానాలు నిర్వహించినారు. ఈమె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల, ఆంద్రేతర ప్రాంతాలైన మైసూరు, బెంగళూరు, బళ్ళారి, హోసూరు, మధుర, ఢిల్లీ మొదలైన చోట్ల అవధానాలు చేసినారు. ఈమె అవధానాలలో పూరించిన పద్యాలు కొన్ని:

  • సమస్య: మామయు తాకగా మగువ మత్తుగ వాలెను వాని కౌగిటన్

పూరణ:

భామిని యెంతయో పొగిలె భర్తల ముందర జ్ఞప్తి గొంచునున్
వేమరు పడ్డ కష్టముల వెల్లువ సాగగ నంత భీముడున్
కామిని నూరడించె తన గాటపు ప్రేమను, భీము తండ్రియౌ
మామయు తాకగా మగువ మత్తుగ వాలెను వాని కౌగిటన్

  • సమస్య: మందు కొట్టిరి యువతులు మనసుతీర

పూరణ:

నేటి యువతులు పెడత్రోవ పోటి పడుచు
నీచ విధముల నడుచుచు నెగడు చుండ
రమణులిపుడు సాహితి మకరంద మనెడు
మందు కొట్టిరి యువతులు మనసుదీర

  • దత్తపది: క్రీస్తు, పాల్, మేరీ, జాన్ పేర్లతో భారతంలోని రాయబార ఘట్టంపై పద్యం.

పూరణ:

కేలుం మోడ్చుచువేడె క్రీడి హరి చక్రీస్తుత్యుం డీవయ్య గో
పాలుండా యికె నీవె దిక్కు మమ్ము నెప్పాటం దరింజేర్తువో
మేలుం గూర్పవె పాండుపుత్రులకు మమ్మేరీతి రక్షించెదో
వేళయ్యెం గద జానుగా ననుచు నా భీభత్సుడే వేడెగా!

  • వర్ణన: భారతీయ వనిత వస్త్రధారణము

పూరణ:

భారతనారి శిష్టతయు భవ్యమునైనది కట్టు బొట్టులన్
సారపు వస్త్రధారణయు సమ్ముదమిచ్చును చూచువారికిన్
నేరపు దృష్టి వృత్తి సైపదది నిర్మల భావము వృద్ధి చెందుగా
భారత స్త్రీల గౌరవము బంధురమయ్యెను కట్టుబాట్లచేన్...

రచనలు

[మార్చు]
  1. శ్రీ నరసింహ శతకము (సీసపద్యాలు)
  2. రామా నీ కథ వినుమా (కంద రామాయణము)
  3. చదువు (రేడియో కవితలు, ప్రసంగాలు)
  4. భాగవత వ్యాసాలు
  5. చాటువులు
  6. నవ్వు, నవ్వించు మొదలైనవి.

పురస్కారాలు

[మార్చు]

బిరుదులు

[మార్చు]
  • అవధాన భారతి
  • అవధాన విద్యావిశారద

ఇవి కూడా చదవండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. రాపాక, ఏకాంబరాచార్యులు. "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 516–521.
  2. అవధాన విశారద ‘కృష్ణప్రభావతి’ [permanent dead link]