చక్రాల లక్ష్మీకాంతరాజారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చక్రాల లక్ష్మీకాంతరాజారావు కవి, పండితుడు, అవధాని, గ్రంథ రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1946, మార్చి 13 వ తేదీకి సరియైన పార్థివ నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి నాడు అనంతపురం జిల్లా, వజ్రకరూరు గ్రామంలో ఆదిమూర్తిరావు, రుక్మిణమ్మ దంపతులకు జన్మించాడు. ఇతడు హైస్కూలు విద్యవరకు వజ్రకరూరులో చదువుకొన్నాడు. తరువాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివాడు. తరువాత ప్రైవేటుగా చదివి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. చదివాడు. ఇతని ప్రధాన గురువులలో తండ్రి ఆదిమూర్తిరావు, చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ, గౌరిపెద్ది రామసుబ్బశర్మ, సి.వి.సుబ్బన్న శతావధాని, దాదన చిన్నయ్య, మాచిరాజు శివరామరాజు మొదలైనవారు ఉన్నారు. ఇతడు గుంతకల్లు లోని పురపాలోన్నత పాఠశాలలో 1966 నుండి అవిచ్చిన్నంగా 37 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేసి 2003లో పదవీ విరమణ చేశాడు. ఇతడు దాదన చిన్నయ్యతో కలిసి "దాదన - చక్రాల కవులు" పేరుతో కొంతకాలం జంటకవులుగా కొన్ని అష్టావధానాలు చేశాడు.[1]

అవధాన రంగము

[మార్చు]

ఇతడు 110కి పైగా అవధానాలు చేశాడు. వాటిలో 4 ద్విగుణత అష్టావధానాలు, 2 చతుర్గుణిత అష్టావధానాలు ఉన్నాయి. ఇతడు గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, యాడికి, వజ్రకరూరు, కొనకొండ్ల, రాయలచెరువు, గుత్తి, ఉరవకొండ, ఆదోని, పత్తికొండ, ఆలూరు, కర్నూలు, కావలి, నెల్లూరు,హైదరాబాదు, తిరుపతి, గద్వాల, బళ్ళారి మొదలైన చోట్ల తన అవధాన విద్యను ప్రదర్శించాడు. ఇతని అవధాన పద్యాలు మచ్చుకు కొన్ని:

 • సమస్య: గజనీ కౌగిటఁ జిక్కి శంకరుఁదు సౌఖ్యంబందె దక్షాపురిన్

పూరణ:

నిజమే యిద్ది ఘనాత్మశంకరుఁ డటుల్ నిన్నున్ దలన్ గంగఁ దా
నిజమౌ ప్రేముడిఁ దాల్చెఁ గాని మదిలో నీకే స్థిరస్థానమున్
ఋజువౌ పద్ధతి నిచ్చె వీడు వగవున్ హే పార్వతీ! మేన కాం
గజ! నీ కౌగిటఁజిక్కి శంకరుఁడు సౌఖ్యంబందె దక్షాపురిన్

 • దత్తపది: కమాన్ - కిస్మి - లౌలీ - లేడీ అను పదములతో సీత రావణునికి చేసిన ధర్మోపదేశము.

పూరణ:

 రాక మానందు రాముండు రాక్షసేంద్ర!
అతనికి స్మితము గూర్చెడు సతిని నేను
నిన్నుఁజంపు మేలౌలీల నన్ను గాచు
చాలు లేడీలు విడి రామ! శరణు మనుము

 • వర్ణన:తుంగభద్రా నది వర్ణన

పూరణ:

రాయలసీమలో మసలు రత్నము లన్నియు నీదు ధారచే
సోయగమంది రాజిలు యశోభరితమ్మగు ద్రవ్యరాసులన్
రాయలవారి కిచ్చెఁ గవిరాజగు రాయలు కావ్యకర్తకున్
గాయక నృత్యపండితుల కంజకరమ్ముల నుంచె నీదయన్

 • ఆశువు: తెలుగు తీపి

పూరణ:

సాకరీను తీపి, చాకిలెట్టులు తీపి
లడ్డు తీపి, తేనె జిడ్డు తీపి
మగువ మనసు తీపి, మలుగూబ కడుతీపి
తెలియు డంతకన్న తెలుగు తీపి

 • న్యస్తాక్షరి:1వ పాదం 13వ అక్షరం ధ్యా, 2వ పాదం 2వ అక్షరం బిందు పూర్వక ప,3వ పాదం 9వ అక్షరం ర్ణ, 4వ పాదం 12వ అక్షరం ము హంపీ వైభవమును వర్ణించుట

హంపీరాజ్య మహాధివైభవ కళాధ్యాయమ్ము సర్వమ్మువ
ర్ణింపన్ శేషుడు చాల డన్విధముగన్ శ్రీకృష్ణురాయండు మేల్
పెంపౌ పాలన చేసె, స్వర్ణయుగమౌ పేర్కొన్న, సత్యమ్ము, శో
ధింపన్ హంపికి, బోయి నీహృదయముద్దీపింప వీక్షింపుమా

తొలి తెలుగు మహిళావధాని’ ని తయారు చేసిన ఘనత: వీరు అవధానాలు చేసే కాలంలో గుంతకల్లులో, రైల్వే హైస్కూల్లో ఉపాధ్యాయినిగా ఉన్న శ్రీమతి మడకశిర కృష్ణ ప్రభావతి, పద్యాలను వ్రాస్తూ చూపిస్తూ ఉండేది. ఆమె పద్యాల్లో ప్రతిభ సంపాదించిన తర్వాత వీరు, దాదన చిన్నయ్య కలిసి ఆమెచేత తొలి అవధానం చేయించారు. ఆమె రాణిస్తుందని భావించి, ఇంకా అనేక చోట్ల చేయించారు.  ప్రేరణ మాత్రం చక్రాలవారే అన్నది ఆమె కూడా ఒప్పుకున్న సత్యం

రచనలు

[మార్చు]
 1. లేపాక్షి శిల్పము
 2. లలితా శతకము
 3. అష్టదిగ్గజముల కవితావైభవము
 4. వ్యాసావళి
 5. శ్రీరామ కథాతరంగిణి (360 ఛందస్సులు)
 6. శ్రీవేంకటేశ్వర కల్యాణం (420 ఛందస్సులు)
 7. రుక్మిణీ కల్యాణం (460 ఛందస్సులు)
 8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రగీతం
 9. మా గుంతకల్లు పాట
 10. మా వజ్రకరూరు పాట
 11. మా జిల్లా పాట
 12. కస్వాపురం ఆంజనేయస్వామి - 200 పాటలు
 13. శ్రీ కన్యకాపరమేశ్వరీ సుప్రభాతం (సంస్కృతము)

బిరుదులు, సత్కారాలు

[మార్చు]
 • ఛందోవైవిధ్యనిష్ణాత
 • కవిగండపెండేర గ్రహీత
 • స్వర్ణకంకణ గ్రహీత
 • ఛందస్సవ్యసాచి
 • అవధాన భారతి
 • సాహితీ చతురానన
 • సమస్యారాక్షస మొదలైనవి

మూలాలు

[మార్చు]
 1. రాపాక, ఏకాంబరాచార్యులు (2016-07-16). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (ప్రథమ ed.). హైదారాబాదు: రాపాక రుక్మిణి. pp. 504–511.