Jump to content

రత్నపాప

వికీపీడియా నుండి
రత్న అనిల్ కుమార్
రత్న కుమార్ చిత్రం
జననం
రత్నపాప

1946
ఇతర పేర్లురత్న కుమార్
విద్యఎం.ఎ (ఇంగీషు)
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నృత్యకారిణి
జీవిత భాగస్వామిఅనిల్ కుమార్
పిల్లలుచేతన్, కేదార్
తల్లిదండ్రులు
బంధువులుదేవులపల్లి కృష్ణశాస్త్రి
వింజమూరి సీతాదేవి
వింజమూరి వెంకటరత్నమ్మ

రత్నపాప (రత్న కుమార్ గా సుపరిచితులు) (Ratna kumar) (Ratna Anil Kumar) ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నాట్యకారిణి.[1] ఆమె కూచిపూడి నృత్యం విభాగంలో 2010 లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె చెన్నై నగరంలో ప్రముఖ గాయకురాలు వింజమూరి అనసూయ, ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత, సినిమా నటుడు అవసరాల శేషగిరిరావు దంపతులకు 1946లో జన్మించారు. ఆమె బాల్యనామం "రత్నపాప". ఆమె ప్రారంభంలో కె.జె.సరస గారి వద్ద నుండి భరతనాట్యాన్ని అభ్యసించారు. కూచిపూడి నృత్యాన్ని వేదాంతం జగన్నాథశర్మ, వెంపటి చినసత్యం వద్ద అభ్యసించారు. తరువాత చెన్నై లో కూచిపూడి ఆర్ట్ అకాడమీలో అభ్యసించారు. ఆమె వెంపటి చినసత్యం శిష్యురాలిగా ప్రసిద్ధ కళాకారిణిగా ఎదిగారు. ఆమె చెన్నైలోని స్టేల్లా మారియా కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ డిగ్రీని పొందారు. ఆమె జర్మన్, హిందీ భాషలను చేర్చుకున్నారు.

ఆమె 1970లలో భరతనాట్యం కళాకారుల లో ప్రథమురాలిగా ఉండేవారు. ఆమె తరువాత యు.ఎస్.ఎ కి వెళ్ళీపోయారు. ఆమె అక్కడ 1975లో అంజలి సెంటర్ ఫర్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి అనేక మందికి నాట్యంలొ శిక్షణనిచ్చారు. 1994 లో హోస్టన్ లో సంస్కృతి సొసైటీ ఫర్ ఇండియన్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ సంస్థను స్థాపించారు. ఆమె అమెరికాలోని రైస్ విశ్వవిద్యాలయంలో 2020 లో నాట్య శిక్షకురాలిగా తన సేవలనందించారు. ఆమె అనేక సంస్థలకు, కమిటీలలో శిక్షకురాలిగా, సభ్యురాలిగా ఉన్నారు. ఆమె అమెరికాలో భారతీయ నృత్య కళలను అభివృద్ధి చేసిన ఘనతను పొందారు.[3] ఆమె సుమారు 2000 మంది విద్యార్థులను నాట్యకళాకారులుగా తీర్చిదిద్దారు.[4]

రచనలు

[మార్చు]

ఆమె రెండు పుస్తకాలను ప్రచురించారు. ఆ పుస్తకాలలో భరతనాట్యం, కూచిపూడి నాట్యరీతులలో ప్రాథమిక మెళుకువలను గూర్చి వ్రాసారు. ఆ పుస్తకాలు "అడవు", "కూచిపూడి అడవు సమ్ము". ఆమె క్లాడీ లామోరిస్సే దర్శకత్వంలో పారిస్ లోని హెలెన్‌విజన్ ద్వారా నిర్మితమైన పురస్కారాలు పొందిన డాక్యుమెంటరీ లో ఆమె కనిపించారు. ఆమె అనేక అంతర్జాతీయ కళా సదస్సులలో పాల్గొన్నారు. ఆమె లిస్బన్ లో కళావిద్యపై జరిగే మొట్టమొదటి ప్రపంచ సదస్సులో ఆమె పాల్గొన్నారు. తరువాత హాంగ్ కాంగ్ లో జరిగిన సదస్సులో ఆమె కీలకమైన వక్తగా వ్యవహరించారు.

సినిమాలలో

[మార్చు]

సినిమాలలో చిన్న పాత్రలు కూడా ధరించిన రత్నపాప కోన ప్రభాకర రావు గారి చిత్రం ‘ముగ్గురు కొడుకులు’, రూపవతి, జెమినీ వారి ‘సంసారం’ చిత్రంలో బాలనటిగా నటించారు.[5]

పురస్కారాలు

[మార్చు]

ఆమె భారతదేశం, అమెరికా దేశాలలో అనేక పురస్కారాలను పొందారు. టెక్సాస్ సంస్థ నుండి కళా విద్య కు తోడ్పడినందుకు పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాదు లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ను పొందారు. కూచిపూడి నాట్య విభాగంలో 2010 లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 1975లో "అనిల్ కుమార్" ను వివాహమాడారు. ఆమె అనిల్ కుమార్ తో కలసి బాల నటులుగా సంసారం (1950 సినిమా)సంసారం చిత్రంలో నటించారు. ఆయన వీడియో వర్క్స్ యొక్క వ్యవస్థాపకుడు. సంస్కృతి సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరక్టరు. అంజలీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సంస్థకు కూడా ఎగ్జిక్యూటివ్ డైరక్టరు గా తన సేవలనందించారు. ఆయన 1970 లలో అమెరికా వచ్చి స్థిరపడ్డారు. ఈ దంపతులు అమెరికాలోని హోస్టన్ లో ప్రసిద్ధిపొందిన సెలబ్రిటీలు. ఆయన ఫిబ్రవరి 13 2015 న మరణించారు. వారికి ఇద్దరు కుమారులు చేతన్, కేదార్. వారి మనుమరాండ్రు కరిస్సా, అంజలి.[6]

కుటుంబం

[మార్చు]

ఆమె కుటుంబం అంతా ప్రముఖ సాహితీకారులు, గాయకులు, సంగీతకారులు, రంగస్థల కళాకారులు. ఆమె తల్లి వింజమూరి అనసూయ దక్షిణ భారతదేశంలో ఫోక్ మ్యూజిక్ దర్శకురాలిగా ఉన్న మొట్టమొదటి మహిళ, రచయిత. ఆమె తండ్రి అవసరాల శేషగిరిరావు తెలుగు సినిమా నటుడు. ఆయన సుమంగళి (1940) చిత్రంలో నటించారు. ఆయన రంగస్థల కళాకారులూ, ఆల్ ఇండియా రేడియో లో వ్యాఖ్యాత. ఆమె అమ్మమ్మ వింజమూరి వెంకటరత్నమ్మ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పత్రిక "అనసూయ" స్థాపకురాలు, రచయిత్రి. ఆమె తాతగారు (తల్లి యొక్క తండ్రి) వింజమూరి వెంకట లక్ష్మీనరసింహారావు ప్రఖ్యాత రంగస్థల కళాకారులు, రచయిత. ఆయన భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె యొక్క అమ్మమ్మ యొక్క సోదరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి భావకవిగా సుప్రసిద్ధుడు, పద్మవిభూషణ పురస్కార గ్రహీత.[1] ఆమె సోదరి సీత రత్నాకర్ కూడా ప్రసిద్ధ నాట్యకారిణి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Form and feeling". ARUNA CHANDARAJU. The Hindu. 13 January 2012. Retrieved 4 June 2016.
  2. "SNA Awards & FellowsYuva PuraskarTagore Awards & Fellows". Archived from the original on 2016-05-26. Retrieved 2016-06-04.
  3. "RATHNA KUMAR Akademi Award: Kuchipudi". Archived from the original on 2016-03-09. Retrieved 2020-01-15.
  4. "Anjali Center for Performing Arts". Archived from the original on 2016-06-07. Retrieved 2016-06-04.
  5. "సమాన అనసూయ ఆలపించిన జీవనరాగం". Archived from the original on 2016-04-11. Retrieved 2016-06-04.
  6. "Anil Kumar passes away". special correspondent. India Herald. 18 February 2015. Retrieved 4 June 2016.

ఇతర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రత్నపాప&oldid=3210039" నుండి వెలికితీశారు