కె.జె.సరస
కె.జె.సరస | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | కరైకల్, పాండిచ్చేరి | 1937 మార్చి 10
మరణం | 2012 జనవరి 2 చెన్నై | (వయసు 74)
సంగీత శైలి | నాట్యం |
వృత్తి | భరతనాట్య గురువు |
కె.జె.సరస వళువూర్ బాణీకి చెందిన భరతనాట్య కళాకారిణి, నాట్య గురువు. ఈమె మొట్టమొదటి మహిళా నట్టువనార్ కూడా.
విశేషాలు
[మార్చు]ఈమె 1937, మార్చి 10వ తేదీన కరైకల్‌లో జన్మించింది. ఈమె తండ్రి నాదస్వర విద్వాంసుడు జగదీశన్ పిళ్ళై. ఈమె తొలుత ముత్తుకుమార పిళ్ళై వద్ద నాట్యాన్ని అభ్యసించింది. తరువాత మద్రాసు వెళ్ళి అక్కడ వళువూర్ బి. రామయ్య పిళ్ళై వద్ద గురుకుల పద్ధతిలో ఒక దశాబ్దం పాటు భరతనాట్యాన్ని అభ్యసించింది.[1] ఈమె ప్రదర్శనలు ఇవ్వడానికి కాకుండా భరతనాట్యం నేర్పించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. తన గురువు ఆజ్ఞపై ఈమె నట్టువాంగం కూడా నిర్వహించింది. తన తండ్రి మరణం తరువాత తన తల్లి, నలుగురు చెల్లెళ్ళను ఈమె పోషించింది.
ఈమె 1960లో "సరసాలయ" అనే నృత్య పాఠశాలను స్థాపించి అనేక మందికి భరతనాట్యం నేర్పించింది. ఈమె వద్ద శిష్యరికం చేసిన వారిలో వైజయంతిమాల బాలి, ట్రావెంకోర్ సిస్టర్స్ లలిత, రాగిణి, పద్మిని,బేబి కమల, శివశంకరి, రత్న కుమార్, ఊర్మిళా సత్యనారాయణన్, రఘురాం, కె.షణ్ముగసుందరం, మురుగశంకరి లియో, స్వర్ణమాల్య, సీత రత్నాకర్ మొదలైన వారున్నారు.
ఈమె 1000 మందికి పైగా నాట్యకళాకారిణులకు రంగప్రవేశం చేయించింది. 2000కు పైగా నాట్యప్రదర్శనలు ఏర్పాటు చేసింది. ఈమె కృష్ణపారిజాతం, ఆదిత్య హృదయం, శిలప్పదికారం, కున్రక్కుడి కురవంజి, దేశభక్తి, కుట్రాల కురవంజి మొదలైన నృత్యనాటికలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు పొందింది.
ఈమె అనేక పురస్కారాలను పొందింది. వాటిలో కళైమామణి, కాళిదాస ఉత్సవాల సందర్భంగా స్వర్ణకలశం అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డుమొదలైనవి ఉన్నాయి.
ఈమె 2012, జనవరి 2వ తేదీన చెన్నైలో తన 74వ యేట మరణించింది.
మూలాలు
[మార్చు]- ↑ Meera Srinivasan (2 January 2012). "Dance guru Sarasa passes away". The Hindu. Retrieved 20 April 2021.