Jump to content

రాజాపేట సంస్థానం

వికీపీడియా నుండి
రాజాపేట సంస్ధానం కోట ముందు భాగం
రాజాపేట సంస్ధానపు కోట

తెలంగాణా ‘దక్షిణ మహా ద్వారం’ గా పిలువ బడే రాజాపేట సంస్థానం మన రాష్ట్రం లో విశిష్టమైనది. ఈ సంస్థానం  ప్రసిద్ధి చెందిన సంస్థానాలలో ప్రముఖ మైనది. ఇది యాదాద్రి -భువనగిరి జిల్లాలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రాజాపేట సంస్థానానికి ముఖ్యకేంద్రం. ఇక్కడ కాకతీయుల కాలం నాటి కోటలు ఇప్పటికీ మనం చూడవచ్చును. రాజాపేట యొక్క చారిత్రక కట్టడాలు శిధిలావస్థలో ఉన్నప్పటికీ మనకు సజీవ సాక్ష్యాలుగా ఎన్నో విశేషాలను కళ్ళకు కడుతున్నవి. ఈ కోటను 1775లో రాజా రాయన్న అనే రాజు నిర్మించడమేగాక గ్రామాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొదట ఈ గ్రామం "రాజా రాయన్నపేట" గా పిలువబడి, కాలక్రమేణా "రాజా పేట"గా మారింది.[1] సంస్థానపు పాలకులు రెడ్డి కులానికి చెందినవారు, కానీ వీరికి రావు బహుద్దూర్ అనే బిరుదు ప్రదానం చేయడం వలన పేరు వెనుక రావు అని పేరుపెట్టుకున్నారు. రాజా రాయన్న తరువాత సంస్థానాన్ని వెదిరె వెంకటనారాయణరావు పాలించాడు. వెంకటనారాయణరావు కొంత భూమిని వెంకటేశ్వర మఠానికి, మరికొంత పురాతన గుడికి దానం చేశాడు. ఇవి రెండూ నేటికీ ఉన్నవి.[2] వెదిరె వెంకటనారాయణరావు, సంస్థాన్ నారాయణపూర్ ను స్థాపించాడు. అందువలన ఈ సంస్థానాన్ని నారాయణపురం సంస్థానం అని కూడ వ్యవహరిస్తారు.

రాజాపేట సంస్ధానపు కోట ముఖద్వారం

రాజాపేట సంస్థానం, నిజాం పరిపాలన కాలం నాటి హైదరాబాదు రాజ్యంలో ఉండినటువంటి 14 సంస్థానాలలో ఒకటి.[1] ఈ ప్రాంతానికి 250 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడ చారిత్రక కట్టడాలయిన ఎన్నో భవంతులు, అద్దాల మేడలు, తోటలు, సైనికుల కవాతు ప్రదేశాలు, విశాల మైన రహదారులు ఇప్పటికీ చూడవచ్చు. కోట చుట్టూ 18 అడుగుల ఎత్తుతో శత్రు దుర్భేద్యమైన రాతి గోడను కట్టించారు. శత్రువుల దాడి నుండి తప్పించుకోవడానికి కోట లోపలి నుంచి రహస్య సొరంగ మార్గాలు తవ్వించారు. కోట లోపల అతి సుందర రాజ భవనాలు, రాణుల అంతఃపురాలు, మంత్రులు, సేనాపతుల ఆవాసాలతో పాటు, స్నానవాటికలు నిర్మించారు. శత్రుసైన్యం లోపలికి ప్రవేశించకుండా కోట గోడల ముందు 20 అడుగుల లోతైన పెద్ద కందకం తవ్వించి అందులో ఎల్లప్పుడూ నీరు ఉండటానికి వీలుగా ఎగువన పడమటి వైపు గోపాలచెర్వు నుంచి కందకంలోకి నీరు నిరంతరం పారించారు. అందులో వారు మొసళ్ళను పెంచేవారు. విష సర్పాలను వదిలేవారు. కోట ముఖ ద్వారానికి 32 అడుగుల ఎత్తయిన ధృడమైన ద్వారాలను అమర్చారు. మొదటి ముఖ ద్వారం నుంచి మూడో ముఖ ద్వారం వరకు విశాలమైన సుదీర్ఘమైన రాచమార్గం ఉంది. రెండున్నర శతాబ్ధాల క్రితం నిర్మించిన రాజు నివాసం, అంతఃపురం, అద్దాల మేడ, అతిథి గృహాలు, స్నానవాటికలు, గిరిగిరిమాల్‌, ఎత్తైన బురుజులు, కారాగారం, మంచినీటి కొలను, నాటి సైనికుల శిక్షణ స్థలం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అడుగడుగునా సైనికుల పహారా నిరంతరం కొనసాగడానికి వీలుగా నిర్మించిన కట్టడాలు మనల్ని అబ్బురపరుస్తాయి.

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం సమీపంలో గల ఈ రాజాపేట గడీ కోటను తెలంగాణ హెరిటేజ్ పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడం జరుగుతుందనీ తెలంగాణా ప్రభుత్వం గతంలో ప్రకటించడం చాల విశేషం.[1]

1914 ఫిబ్రవరి 16న రాజాపేట సంస్థానాధీశుడు రాజేశ్వరరావు మరణించాడు. అప్పటికి ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు (నైనాబాయి, ఐత్రాబాయి), యుక్తవయసు కుమారుడు జస్వంత్ రావు ఉన్నారు.[3] సంస్థానపు పాలన అప్పుడు నిజాం ప్రభుత్వపు కౌన్సిల్ ఆఫ్ వార్డ్స్ కు వెళ్ళింది. పరిస్థితిని సమీక్షించిన మండలి, పన్నులు తగ్గించి, 2,09,708 రూపాయలు ఉన్న అప్పుభారాన్ని 5,400 రూపాయలకు తగ్గించారు. అయినా, రాజాపేట సంస్థానం ఇంకా నివారించగలిగిన అనేక ఆర్ధిక సమస్యలలో కూరుకుపోయి ఉంది. కౌన్సిల్ ఆఫ్ వార్డ్స్ నివేదికలో "రాజాపేట సంస్థానంలో, అప్పుల తీర్చివేత, వారసునికి వివాహం, వారసునికి ఒక కారు కొనుగోలు చేయటం వంటి అనేక అసమంజసమైన అనవసరపు ఖర్చులు, సంస్థానపు అభివృద్ధికి చేయవలసిన శాశ్వత పెట్టుబడులకు ధనాన్ని మిగల్చలేదని" పేర్కొన్నది. రాజేశ్వరరావు కూతుర్లిద్దరూ వెస్లేయన్ మిషన్ బాలికల పాఠశాలలో చదువుకున్నారు. వ్యవహారాలు చక్కబడిన తర్వాత కౌన్సిల్ ఆఫ్ వార్డ్స్ 1928లో సంస్థానపు పాలనా బాధ్యతలు రాజేశ్వరరావు కుటుంబానికి తిరిగి అప్పగించింది[3]

రాజేశ్వరరావు తర్వాత ఈయన భార్య జానకమ్మ సంస్థానాన్ని చాలాకాలం పాలించి 97 ఏళ్ల వయసులో మరణించింది. ఈమె కుమారుడు జస్వంత్ రావు. జస్వంత్ రావు కుమారుడు భోపాల్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేశాడు. ఈయనకు ఇద్దరు కుమారులు వజేందర్ రావు, వేణువినోద్ రావు. వజేందర్ రావు అగ్రో కంపెనీకి అధినేత, వేణువినోద్ రావు ఎల్&టి కంపెనీలో అధికారి. వీరు 70 ఎకరాల భూమిని ప్రజలకు దానం చేశారు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "కనుమరుగవుతున్న సజీవ సాక్షాలు..శిధిలావస్థకు చేరుకుంటున్న రాజాపేట కోట". దిశ డెయిలీ. 24 January 2024. Retrieved 25 August 2024.
  2. 2.0 2.1 Muneer, Dr. Syed (September 2023). "Rajapeta Gadee: Historical Significance" (PDF). International Journal of Current Science. 13 (3): 817–822. Retrieved 26 August 2024.
  3. 3.0 3.1 Cohen, Benjamin B (2007). Kingship and Colonialism in India’s Deccan 1850–1948. Palgrave Macmillan. p. 115. Retrieved 26 August 2024.