రామరాజభూషణుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామరాజభూషణుడు గా పేరుగాంచిన భట్టుమూర్తి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజాల లో ఒకడు. ఈయన 16వ శతాబ్దముకు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాయల ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు 'రామరాజభూషణుడు' అని పేరు వచ్చింది. ఒక గొప్ప ఆంధ్రకవి. ఈతని జన్మభూమి బల్లారికి సమీపము లోని పాలమండలము అను ప్రదేశమున ఉండెడు భట్టుపల్లె. ఇతడు శాలివాహనశకము 13 వ శతమాన మధ్యకాలమున జీవించి ఉన్నట్లు తెలియవచ్చుచు ఉంది. ఇతఁడు రచియించిన గ్రంథములు వసుచరిత్రము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, కావ్యాలంకారసంగ్రహము. అందు మొదటిది రెండవదానివలె శుద్ధశ్లేషమయము కాకపోయినను శ్లేషనే అనుజీవించి ఉండును. దీనివలె కఠినశైలి కలదిఁయు మధురము అయినదియు అగు శ్లేషకావ్యము మఱియొక్కటి తెనుఁగున లేదు. రెండవది కేవలశ్లేషమయమై హరిశ్చంద్రుని యొక్కయు నలుని యొక్కయు చరిత్రములను తెలుపుచు ఉంది. మూడవది కావ్యాలంకార లక్షణములను తెలుపునది. తెనుఁగునందు మేలైన అలంకార శాస్త్రము ఇది ఒక్కటియె కానఁబడుచు ఉంది. ఈతని కావ్యములు మిక్కిలి శ్లాఘనీయములుగా ఉన్నాయి. అయినను అవి ఇంచుక మతాంతరలక్షణమును తెలుపును. ఇతనికి రామరాజభూషణుఁడు, భట్టుమూర్తి అను బిరుదాంకము కృష్ణదేవరాయలచే ఇయ్యఁబడెను.

నెల్లూరు ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్రము, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాలీయము అని కావ్యములను రచించాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.

ఇతనిని గూర్చి పింగళి లక్ష్మీకాంతం ఇలా వ్రాసాడు - "ఈ కవి గాయకుడు. సంగీత కళానిధి. సంగీతమునకు, కవిత్వమునకు గల పొత్తును ఇతనివలె మరి యే కవియు గ్రహించలేదు. ఇతని పద్యములన్నియు లయ గమకములు గలవి. కీర్తనలవలె పాడదగినవి. అంతే గాక ఈ కవి గొప్ప విద్వాంసుడు. నానాశాస్త్ర నిష్ణాతుడైన బుద్ధిశాలి. పద్య రామణీయకత, ప్రౌఢ సాహిత్యము, విజ్ఞాన పటిమ ఇతని రచనలలో గోచరించును. .... ఇతనికే శ్లేష సహజము. రామరాజభూషణునివలె పద్యము వ్రాయగలవారు లేరు. .. కవులలోనింతటి లాక్షణికుడు లేడు.[1]

కావ్యాలంకారసంగ్రహము[మార్చు]

భట్టుమూర్తి రచించిన మొదటి గ్రంథము కావ్యాలంకార సంగ్రహము. ఇది 5 ఆశ్వాసాల అలంకార శాస్త్రము. నరసభూపాలీయమని దీనికి మరో పేరు. ఇది సంస్కృతంలో విద్యానాధుడు రచించిన ప్రతాపరుద్రయశోభూషణమును అనుసరించి వ్రాయబడిన గ్రంథము. కావ్య ధ్వని రసాలంకారముల గురించి, నాయికానాయకులను గురించి, గుణ దోషముల గురించి ఇందులో వివరించబడింది. నాలుక కదలనక్కరలేని అక్షరములతో రచించిన అలజిహ్వము_

భోగాంబువాహ వాహ విభాగేహాభావుకాంగభావభావమహా
భాగ మహీభాగమహాభోగావహబాహుభోగిపుంగవభోగా

అన్న పద్యంలో నాలుక కదపనక్కరలేని అక్షరాలున్నాయి. గర్భ కవిత్వము, బంధ కవిత్వము మొదలుగునవి కూడా నరసభూపాలీయములో భట్టుమూర్తి ప్రదర్శించాడు.

వసు చరిత్రము[మార్చు]

ఇది భారతములోని ఉపరిచర వసువు కథ, ఇది కవిత్రయము రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.

ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర వసువు తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలుడు అనే పర్వతము, సూక్తిమతి అనే నది ప్రేమలో పడతారు. కోలహలునికి, సూక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు. గిరికను వసు మహారాజు చూసి తనను గాంధర్వ విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు.

ఇది మూడు రోజుల్లో జరిగే కథ.

  • 1.ప్రథమాశ్వసము: కృతి భర్త వంశ చరిత్ర, కోలాహలం సూక్తిమతి నదికి అడ్డంపడటం.
  • 2.ద్వితీయాశ్వాసము: కోలాహలం సూక్తిమతుల ప్రేమ.
  • 3. తృతీయాశ్వాసము:గిరిక, వసుపదుల పుట్టుక???
  • 4. చతుర్థాశ్వాసము:
  • 5. పంచమాశ్వాసము:
  • 6. షష్ఠమాశ్వాసము:

హరిశ్చంద్రనలోపాఖ్యానము[మార్చు]

ఇది ఒక ద్వద్ది కావ్యము అంటే ఒకే పద్యములో రెండు అర్థాలు వస్తాయి, ఒకటీ నలుని పరంగా ఒకటీ హరిశ్చంద్రుడి పరంగా అన్వయించుకొని చదవాలి.

ఉదాహరణ పద్యాలు[మార్చు]

మ. హరిదం భోరుహ లోచనల్ గగన రంగాభోగ రంగత్తమో
     భర నేపధ్యము నొయ్య నొయ్య సడలింపన్ రాత్రి శైలూషికిన్
     వరుసన్మౌక్తిక పట్టమున్ నిటలమున్ వక్త్రంబునున్ దోఁచె నా
     హరిణాం కాకృతి వొల్చె రేకయి సగంబై బింబమై తూర్పునన్

గగన రంగాభోగం వేదిక. ఆభోగం అంటే విశాలమైనది. తమోనేపథ్యం అంటే చీకటి యవనిక. రాత్రి అనే శైలూషి (అంటే నటి). దిక్కులు అనే స్త్రీలు - హరిదంభోరుహ లోచనల్, హరిత్తులు అంటే దిక్కులు - ఆ చీకటి తెరనూ కొంచెం కొంచెం దించుతున్నారు. ముందు నిశాశైలూషి మౌక్తిక పట్టం కనిపించింది. తరువాత నొసరు కనిపించింది. ఆపైన ముఖం పూర్తిగా కనిపించింది. అలా క్రమక్రమంగా చంద్రబింబపు ఆకారం, ముందు రేఖలాగా, తర్వాత అర్ధచంద్రుని లాగా, ఆ తర్వాత పూర్ణ బింబంగా తూర్పు దిక్కున కనిపించింది. నటీమణులు నొసటిపైన ముత్యాల పట్టీ ధరించడం ప్రసిద్ధం. స్త్రీ నొసరు చంద్రరేఖలా ఉండడం, స్త్రీ వదనం పూర్ణ చంద్రునిలా ఉండడం కూడా ప్రసిద్ధ కవి సమయాలే. తాను నాటకాల్లో చూసిన నటీమణి రంగప్రవేశాన్ని మనసుకు తెచ్చుకొని, కవిత్వంలో దానికి అందంగా చంద్రోదయంతో పోలిక సంధించాడు, రామరాజ భూషణకవి. చాలా సహజంగా ఉంది కదా, పోలిక! జానపదుల నిత్యానుభవ దృశ్యాలు ప్రతిబింబించిన కవిత్వం ఎంత నిసర్గంగా ఉంటుందో ఈ పద్యం చెప్పకనే చెపుతున్నది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర
  2. ఈ మాట - అంతర్జాల పత్రిక - మార్చి 2009 - "నాకు నచ్చిన పద్యం" - చీమలమర్రి బృందావనరావు

బయటి లింకులు[మార్చు]


అష్టదిగ్గజములు
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు