రావెళ్ళ నాయకులు

వికీపీడియా నుండి
(రావిళ్ల నాయకులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

రావెళ్ళ కమ్మ నాయకులు ఉదయగిరి కోట, కొచ్చెర్లకోట, తిరుమణికోట రాజధానిగా పాలించిన విజయనగర సామంతరాజులు.[1][2] ముసునూరి కమ్మ నాయకుల పతనం తరువాత వీరందరు విజయనగరము తరలిపోయిరి. విజయనగరమునకు వలస పోయిన పిమ్మట రావిళ్ల కమ్మ వంశీకులు సాళువ, తుళువ, అరవీటి రాజులకడ సేనానులుగా, సామంతరాజులుగా సేవచేసి యశః కీర్తులు పొందిరి. ముఖ్యముగా అరవీటి రాజులకాలములో శ్రీశైలమును, దూపాటిసీమను 1364 నుండి పరిపాలింఛిరి. రావిళ్ల కమ్మవారి ప్రస్తావన తొలుత 1257 లో మూడవ రాజరాజు పాలనలో కానవచ్చును.

రావెళ్ళ కమ్మ నాయకుల ఉదయగిరి కోట

వంశ వివరాలు

[మార్చు]

వీరు కమ్మ కులస్తులు. చలమర్తిగండ అను వీరి బిరుదుని బట్టి వీరు దుర్జయ వంశమునకు వల్లుట్ల గోత్రమునకు చెందినవారని విశదమగుచున్నది. రావిళ్ల వారి వంశ ప్రశస్తి, యుద్ధకౌశలము రత్నాకరము గోపాలకవి విరచితమగు సౌగంధికాప్రసవాపహరణము అను పద్యకావ్యములో పలువిధముల పొగడబడినవి.

మల్ల నాయుడు

[మార్చు]

సాళువ నరసింహరాయలకడ రావెళ్ళ మల్ల 1495 లో సేనాధిపతిగాయుండెను. గుడిపాడు వద్ద జరిగిన యుద్ధములో బహమనీ రాజగు కుతుబ్ షా ను ముక్కలుముక్కలుగా నరికివైచెను. మహారాజు మల్లకు 'రాజహ్రిదయభల్ల ప్రతాపప్రభవ' అను బిరుదునొసంగెను. రావెళ్ళవారి సైన్యము విడిది చేయుటకు విజయనగరమందు 1260 కుంటల స్థలము గలదు. మల్లుని సైన్యములో ఆరువేల సైనికులు, నాలుగు వందల అశ్వములు గలవు. ఈతని సంవత్సరాదాయము పదమూడువేల బంగారు వరహాలు. ఇందు మూడవ వంతు రాయలవారికి చెల్లించుచుండెను. 1527లో హైదరుజంగు తో జరిగిన యుద్ధములో వాసిరెడ్డి మల్లికార్జునునకు తోడ్పడి మరణించెను.

మల్ల నాయుని కుమారుడగు తిప్పా నాయుడు శ్రీక్రిష్ణదేవరాయలవారి ఉత్కళదేశ దండయాత్రలో (1513-1515) పాల్గొని గజపతి రాజును ఓడించుటకు తోడ్పడెను. తిప్పని పరాక్రమమునకు మెచ్చిన రాయల వారు బహువిధముల సత్కరించిరి. తిప్పా నాయుని కొడుకు పాపా నాయుడు రామరాయల సేనాధిపతిగా కర్నూలు వద్ద జరిగిన పోరులో ముస్లిము సేనలను తరిమివేసి కోటను స్వాధీనము చేసుకొనెను (వసుచరిత్రము). పాపయ కుమారుడు రెండవ తిప్ప, మనుమడు మొదటి లింగ కూడ మహాయోధులు. మొదటి లింగానాయుని కుమారుడగు కొండా నాయుడు సాళువ తిమ్మరాయల కొలువులోనుండి మానవపురికడ జరిగిన యుద్ధములో నౌదుల్ ఖాను ని ఓడించి ఆదోని కోటను సాధించెను.

అయ్యప్ప నాయుడు

[మార్చు]

క్రిష్ణరాయలవారి అల్లుడు రామరాయలవారికి సామంతునిగా నున్న అయ్యప్ప నాయుడు (రెండవ తిప్పానాయుని కుమారుడు) తిరుమాణికోట ను పాలించెను. గొల్లకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్షా (1611) సైన్యమునోడించి ఆదోని, పెనుగొండ కోటలను తిరిగి సాధించెను. ఈతనికి అశ్వరేవంత, పరబలభీమ, చలమర్తివరగండ, హత్తుమువ్వరగండ అను గొప్ప బిరుదులు గలవు. అయ్యప్ప మనుమడు రెండవ లింగ విజయనగర సేనలకు నాయకునిగా ఆదవాని, గండికోట, కర్నూలు కోటలను స్వాధీనపరచుకొనెను. రత్నాకరము గోపాలకవి ఈతని ఆస్థానములోనుండెను.

నెల్లూరు మండలములో దొరకిన శాసనములబట్టి అరవీటి రాజులకాలమందు కొచ్చెర్లకోటను తిమ్మా నాయుడు, పొదిలిని తిప్పానాయుడు పాలించుచుండిరి.

రావిళ్ల వేంకటరంగ అప్పస్వామి నాయుడు

[మార్చు]

తమిళదేశమున తిరునెల్వేలి మండలములో ఇలైయరసనందాల్ జమీందారీ రావిళ్ల వారిది. బ్రిటిష్ వారి పాలనలో వేంకటరంగ అప్పస్వామి నాయుడు బహుప్రశంసలు పొందిన జమీందారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

వనరులు

[మార్చు]
  • సౌగంధికా ప్రసవాపహరణము, రత్నాకరము గోపాలకవి, 17వ శతాబ్దము.
  • వసుచరిత్ర, రామరాజ.
  • భారతి, శుక్ల సంపుటము, పేజి 623.
  • క్రిష్ణరాజ విజయము, కుమార ధూర్జటి.
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006.* Forgotten Chapter of Andhra History, M. Somasekhara Sarma
  • Nilakanta Sastry, http://ia300234.us.archive.org/0/items/FurtherSourcesOfVijayanagaraHistory/TXT/00000337.txt
  • Vijayanagar Empire: A Forgotten Chapter of Indian History by Robert Sewel.
  • K. Iswara Dutt, Journal of Andhra Historical Research Society. Vol. 10, pp. 222–224
  • Sources of Vijayanagar History, S. K. Aiyangar, The University of Madras, 1919, Madras, p. 385.
  • Copper Plate and Stone Inscriptions of South India, Alan Butterworth and V. V. Chetty, Government of Madras, 1905, Madras, p. 437, 892, 1175, 1514.

మూలాలు

[మార్చు]
  1. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, పావులూరి పబ్లిషర్లు, గుంటూరు, 2006
  2. Nellore Inscriptions, No. 6