Jump to content

రుంజ వాయిద్యం

వికీపీడియా నుండి
(రుంజ వాయిద్య విశేషము నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర దేశంలో అన్ని జానపద కళారూపాలతో పాటు, ఈ రుంజ వాయిద్య కళా రూపం కూడా విశిష్టమైంది. అయితే ఈ కళారూపం ఆంధ్ర దేశంలో అన్ని ప్రాంతాలలోనూ వున్నదని చెప్పలేం. కాని విశ్వబ్రాహ్మణులు ఏ మూల నున్నా ఈ కళా రూపం వారి దగ్గరకు చేరేది. విశ్వ బ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిని అరాధిస్తూ వారిపై ఆధార పడిన వారు రుంజ వారు. రుంజ అనే వాయిద్య పరికరానికి రౌంజ అనే నామాంతరం కూడా ఉంది. దీనికి సం బంధించిన ఒక కథ ఈ విధంగా ప్రచారంలో ఉంది.

రుంజలు

[మార్చు]

తెలుగు కులాలలోని కొన్ని కులాలను ఆశ్రిత (కులాలు) జాతులు ఉన్నాయి. వీటినే పరిశోధకులు, జానపదవృత్తి గాయకులు అని వ్యవహరిస్తుంటారు. వీరువిప్రవినోదులు, పుచ్చుకుంట్లు, రుంజలు, పొడాపోతలవారు, మాలమాష్టివారు మొదలగు కులాలు వారున్నారు. వీరు ఆయా దాతృకులాల వారిని ఆశ్రయించి గోత్రాలు పొగడి వారి వంశ చరిత్రలు పాది జీవనోపాధి పొందేవారు. ఉదా: బ్రాహ్మణులకు విప్రవినోది, వైశ్య (కోమటి) లకు వీరముష్టి, గొల్లలకు పొడపోతలు లేదా మందెచ్చులు వారు, మాల కులస్తులకు మాలమాష్టివారు మొదలగు వారున్నారు. అలాగే విశ్వ బ్రాహ్మణులకు (విశ్వకర్మ బ్రాహ్మణులు) గోత్రాలను, వంశానామాలను పొగడి విశ్వకర్మ పురాణం చెప్పేవారే రుంజలు. వారు కథ చెబుతూ వాయించే వాయిద్యమే రుంజ. చర్మ వాయిద్యాలలో చాలా పెద్దది రుంజ దీని శబ్దం కూడా రెండు, మూడు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. వృత్తి గాయకుల వాయిద్యాలలో ఇంత పెద్దది మరొకటిలేదు. రుంజ కారుడు మోయలేని బరువుగానే దీనిని మోస్తుంటరు. "నా సంసార బరువును అది మోస్తున్నపుడు దీని బరువును మెము మోయలేమా" అని ఆ కళాకారులంటారు.

రుంజ కథా గానం

[మార్చు]

విశ్వ బ్రాహ్మణ కులాలను ఆశ్రయించేవారు రుంజలు, పనసలు, కోమటి పనసలు అయితే పనసలు వాయిద్యం లేకుండానే కేవలం కథాగానం చేస్తారు. రుంజ కథకులు గ్రామానిని వెళ్ళీనపుడు ఊరిలో పెద్ద ఆచారి అంటే మను బ్రహ్మ సంతతి వారు ఇంటికి వెళ్ళీ లేక ఆ ఊరిలో మొదటిగా వచ్చి స్థిరపడిన ఆచారి ఇంటికి కథ చెబుతాడు. కొన్ని సందర్భాలలో గ్రామంలోని విశ్వబ్రాహ్మణులు అందరికీ కలిపి ఒక చోట కథ చెప్పడం, కొన్ని సందర్భాలలో పెద్ద ఆచారి ఇంట్లో కథ చెబితే మిగతావారు అక్కడకు చేరుకొని కథ విని పారితోషికాలు ఇస్తారు. ఉంజ కథకుడు కథను ప్రారంభించే ముందు ఏ ఇంటి ముందు కథ చెబుతాడో ఆ గృహస్థుని గోత్రం చెప్పి అతని వంశం చెప్పి అతని కుటుంబం ఇంకా వృద్ధి కావాలని దీవించి తర్వాత విశ్వబ్రాహ్మణుల వంశ గమనాన్ని, పంచ బ్రహ్మల జన్మ ప్రకారాలను వివరిస్తాడు. ఆ తర్వాతే ఏ కథ అయినా. వీరికి ఇచ్చే పారితోషికం నికరం ఉండదు. అయితే ఏ దాత కూడా వీరిని తక్కువ చేసి పంపించడు. డబ్బులు, భోజనం, బట్టలు కూడా పెడతారు. ఈ విధంగా ఒక అలిఖితమైన, అవగాహన, ఆచారం, సంబంధం ఆశ్రితులైన రుంజలకు, దాతలైన విశ్వబ్రాహ్మణులము మధ్య ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తోంది.

ఉత్తరాంధ్రలో రుంజ కళాకారులు

[మార్చు]

శ్రీకాకుళం జిల్లా లోని అంపోలు, మామిడివలస, ఆడవరం గ్రామాలలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మొన్నటివరకు 20 మంది కళాకారులు ఉండేవారు. ప్రస్తుతం ఈ కళను విడిచిపెట్టు యితర వృత్తులలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతానికి 6 గురు కళాకారులు ఉన్నట్లు అంచనా. ఇటీవల వీరు శ్రీకాకుళం జిల్లా కలెక్టరు ఎదుట ప్రదర్శనలు యిచ్చి ప్రశంశలు పొందారు. వీరిలో (1) విభూది కృష్ణమూర్తి (2) శాంతం కామరాజు (3) విడియాల ధర్మారావు (4) పొందూరు రాఘవయ్యలు ముఖ్యులు. వీరు రుంజ వాయిద్యం పట్టుకున్నప్పుడే వీరిని రుంజలు అంటారు. కాని కులం రీత్యా వీరు బేడ జంగాల కులానికి చెందినవారు. పనసలు, కోమటి పనసలు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తెలంగాణా జిల్లాలలో ఉన్నారు. ఈ రుంజ కళాకారులు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లలో విశ్వబ్రాహ్మణుల ఇంటికి వెళ్తారు. ఎక్కడకు వెళ్ళీనా ఒక సంస్కృత శ్లోకం చదివి తెలుగులో కథ చెబుతారు. సాధారణంగా ముగ్గురు ఉంటారు. ఒకరు కథ చెబితే, ఒకరు వాయిద్యం వాయిస్తే ఇంకొకరు వంతగా ఉంటారు.

రుంజలు చెప్పే కథలు

[మార్చు]

రుంజలు విశ్వకర్మ పుట్టుక, పంచ బ్రహ్మల పుట్టుక, దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం, రుంజల పుట్టుక, వీరబ్రహ్మం గారి చరిత్ర చెబుతారు. విశ్వబ్రాహ్మణుల లోని సానగ (కమ్మరాచారి), సనాతన (వడ్రపుపని), అభవనస (కంచరపుపని), ప్రత్నన (శిల్పాచారి), సువర్ణస (బంగారపు ఆచారి) గోత్రాల వారి ఇంటికి వెళ్తారు.

గంభీర నినాదం - రుంజవాయిద్యం

[మార్చు]

రౌంజ కాసురుడనే రాక్షసుడను సంహరించి వాడి శరీర భాగాలతో చేసిన వాయిద్యం కావున దీనిని రుంజం అనే పేరు వచ్చింది. రుంజ వాయించేవారు రుంజకళాకారులు. ఈ వాయిద్యాన్ని బలమైన కర్రపుల్లలతో వాయిస్తారు. రుంజను ఏటవాలుగా ముందుకు వంచి కదలకుండా మోకాలతో అదిమిపెట్టి, చెతులతో త్రాళ్ళను లాగి శ్రుతిచేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ మీద వీరణం, డప్పువాయిద్యం, తాషా, సప్తతాళాలు వాయిస్తారు.

రౌంజుకాసురుడు

[మార్చు]

ఈ రుంజ కథ త్రేతాయుగానికి చెందినదిగా చెపుతారు. ఆ కాలంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం జరిగిందనీ, అప్పుడు వాయిద్య విశేషాలు ఏమీ లేవనీ, అందువల్ల పార్వతీ దేవి కళ్యాణానికి, వాయిద్యాలు కావాలని విశ్వకర్మను కోరెననీ, అప్పుడు విశ్వకర్మ రౌంజ కాసురుడనే రాక్షసుని సంహరించి, వాని చర్మాన్ని రుంజగా చేసి, సప్త తాళాలనూ, ముప్పైరెండు వాయిద్యాలను ఈ రుంజపై పలికించాడనీ, ఈ రుంజ వాయిద్యం తోనే పార్వతీ దేవి కళ్యాణం రంగ రంగ వైభోగంగా దేవతలందరూ కలిసి చేశారనీ విశ్వకర్మ పురాణంలో వివరింప బడింది.

రుంజలు చెప్పే కథ తీరు

[మార్చు]

రుంజ కథ ఓంకారంతో, అంబాస్తుతితో ప్రారంభమవుతుంది. తరువాత దక్షయజ్ఞం, పార్వతీ కళ్యాణం మొదలగు కథలు చెప్పి పారితోషికం తీసుకొని దీవెనలు యిస్తారు.

రుంజు

[మార్చు]

రౌంజుకుడనే రాక్షసుని చర్మాన్ని రుంజు వాయిద్యానికి వినియోగించడం వల్ల, రౌంజ అనే పేరు ఏర్పడి, కాలక్రమేణ అది రుంజగా రూపాంతరం చెందింది. రుంజను ఇత్తడితో తయారు చేస్తారు, ఈ వాయిద్యాన్ని బలమైన కఱ్ఱపుల్లలతో వాయిస్తారు. ఏట వాలుగా ముందుకు వంచి, కదలకుండా మోకాలితో అదిమి పట్టి, చేతులతో త్రాడును లాగి, శ్రుతి చేసి, తాళం ప్రకారం వరుసలతో ఉధృతంగా వాయిస్తారు. రుంజ వాయిద్యకులను రుంజ వారని పిలవటం కూడా వాడుకలో ఉంది. రుంజ వాయిద్యకులు ఒక వేళ వ్వవసాయాన్ని కలిగి వున్నా, ప్రధానంఆ రుంజ వాయిద్యాన్నే వృత్తిగా స్వీకరిస్తారు. బాల్యం నుంచీ, విద్యాభ్యాసముతో పాటు ఈ విద్యను కూడా కట్టుదిట్టంగా నేర్చు కుంటారు. ప్రతి వారూ ఈ విద్యలో ఉత్తీర్ణ్లులై, గ్రామాలకు యాత్రలు సాగిస్తారు. సఆంసారాలతో పాటు ఎడ్లబండ్లలో బయలు దేరుతారు. నిత్య జీవితానికి కావలసిన వంట పాత్రలు మొదలైనవ వాటిని కూడా వారితోనే వుంచు కుంటారు.

ఏ గ్రామానికి చేరుకున్నా వారు విశ్వ బ్రాహ్మణులను మాత్రమే యాచిస్తారు. విశ్వ బ్రాహ్మణులు వీరిని ఎంతగానో ఆదరించి వారికి ధన ధన్యాలను దానం చేస్తారు. రుంజ వాద్యకులు, వారి వాయిద్యాలతో, గానంతో, కథలతో వారిని రంజింప చేస్తారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన సప్తతాళాల్నీ, ముప్పైరెండు రాగాలనూ వారి ప్రదర్శనాల్లో ప్రదర్శిస్తారు. ముఖ్యమైనవి. మూల స్తంభం, పంచముఖ బ్రహ్మావిర్భావము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య శ్రావ్వమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపాలలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదారవిదములకూ అనే పారంపర్యంగా వచ్చే మంఘళ హారతినే వీరూ అనుకరిస్తారు.

ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోక మీసా లోకమనియా
లాకులేక కోక కరుణాతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ||ఓం||
పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................||ఓం||
ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రితి లేదని నిలిచి కొలిచిన......................||ఓం||

రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ ఉంది. రుంజ కథకులు అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తారు. సర్కారాంధ్ర దేశంలో తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ పాశం పాలలోచనుడు, జీడి కంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నానాటికి శిథిలమై పోతున్న రుంజ వాయిద్య కళారూపం విశిష్టమైనది. దీనిని పరిరక్షించాల్చిన అవసరం ఎంతో ఉంది. రుంజ వాయిద్యకులు ఒక గ్రామానికి వచ్చారంటే, ముందుగా భేరి మోతలతో రుంజ వాయిద్యాన్ని ఉధృతంగా అగమకాలనిస్తూ వాయించడంతో రుంజ వారు గ్రామంలోకి వచ్చారనేది అందరికీ అర్థమైపోతుంది.

పల్లెల్లో ప్రదర్శన

[మార్చు]

గ్రామంలో ప్రవేశించిన రుంజ వారు ఒక రాత్రి విశ్వ బ్రాహ్మణులకు కథను వివరిస్తారు. పంచ బ్రాహ్మలను గురించి, వారి యొక్క వంశోత్పత్తిని గురించీ చెపుతూ, పాంచ భౌతికమైన ఈ శరీరం హొక్క అస్థిత్వాన్ని గూర్చి, పంచ భూతముల యొక్క ల్విధులనూ వివరంగా వివరిస్తారు. పంచ బ్రహ్మలంటే మనువు, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ మొదలైన వారి విధుల గురించి ఈ విధంగా వివరిస్తారు. మనువుకు ఇనుప పనీ, వద్దు కర్రపనీ, త్ర్వష్టకు ఇత్తడి పనీ, శిల్పికి రాతి పనీ, విశ్వజ్ఞనికి బంగారు పనీ ఈ విధంగా వేరు వేరు విధులను వివరిస్తారు. తరువాత ఓంకార స్వరూపాన్ని స్తుతిస్తారు. వారు చెప్పే కథలు పార్వతీ కళ్యాణము, దక్షయజ్ఞము, విశ్వగుణా దర్శనము, వీర భద్ర విజయం, విశ్వకర్మ, బ్రాహ్మణ వంశాగమనము, దేవ బ్రాహ్మణ మాహోత్మ్యము, మూల స్తంభము, సనారి విశ్వేశ్వర సంవాదము, విశ్వ ప్రకాశ మండలం మొదలైన వాటిని కథలుగా చెపుతారు. వీటిన్నిటికి పద్దెనిమిది అశ్వాసాలు గలిగి సంస్కృత శ్లోకాల మయమైన, తాళ పత్ర గ్రంథం, మూల స్తంభం అధారమని చెపుతారు.

ఉదాహరణలు

[మార్చు]

ఉదాహరణకు వారి అంబాస్తుతి ఈ విధంగా ఉంటుంది.

అంబా స్తుతి
కాంభోజి రాగం.
కంబుకాంధారీరాయాం
కాశీం హరీం రాం
బీంబోధారీ రాం

అంభుజాక్షీవేలా................................||అంబా||

ముజ్జగము లేలేటి
మోక్షదాయీ మహమ్మాయీ
సజ్జన రక్షాగాల్

గజ్జలు ఘల్మనంగ.....................||అంబా నీవిందు రావే||

అని మోక్షదాయకమైన ముజ్జగము లేలు మాతను స్మరించి తరువాత చేతులతో ఒక తాళాన్ని వాయిస్తారు. ఆ తరువాత పంచ ముఖోద్భవ బ్రహ్మలనూ, వారి వారి విధులనూ, శ్రోతలకు వివరిస్తారు. ఈ ప్రపంచాన్ని విశ్వ కర్మ రక్షిస్తున్నాడఆంటూ సకల విశ్వం యొక్క కర్తవ్వాన్ని సంక్షిప్తంగా వివరిస్తారు.... అలాగే..................

ఇండ్లు కట్టేదెట్లో ... పెండ్లి చేయుట యెట్లో
కృషి యెట్లో శకటాద్రి క్రీడ లెట్లో
కూప ఖననం బెట్లో... ఘోర సార్జన మెట్లో
పాకఆంబు లెట్లో.... జలోపాత్ర లెట్లో
దేవతార్చన లెట్లో... దేవాలయము లెట్లో
భారకు నగలెట్లో ... పండమంచము లెట్లో
మంగళసూత్రము ... మద్దెలెట్లో
నిజము మాచేతి ... పనులనన్నిటిని లెస్స
వివరముగ లెక్క పెట్టగ య్వరి తరము
తెలివి గలిగి కృతజ్ఞలైన తెలియవలయు
శాశ్వత పదాభిలేశ... విశ్వ ప్రకాశ

అంటూ, ఈ పదంలో పంచముఖ బ్రహ్మలోనర్చే అనేకమైన పనులను వివరిస్తూ వీరు లేక పోతే జగత్తు జరగదనీ వివరిస్తూ ఉంది. పద్యాలనూ, శ్లోకాలనూ, తాళ వాద్య గతుల్నీ, చిన్నతనం నుంచే వారి వారి పిల్లలకు నేర్పుతారు. అంతే గాక వారికి జీవనాధారం అదే గనుక ఈ విద్యను ఎంతో భక్తి భావంతో వారు నేర్చుకుంటారు. వారి తాళగతి ఏ విధంగా వుంటుందో ఈ క్రింది ఉదాహరణ చూస్తే మనకు అర్థమౌతుంది.

1.తక్కు ధిక్కు, ధిక్కు తకథిక్కు తకయని
అంభుజాసనుడు తాళంబు వేయ

అంటూ వేగంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ, కాలలలో తాళం వేస్తారు.

2. కిటతక ధిమ్మి కిటతక ధిమ్మి
కిటతక ధింధిమ్మి యనుచు
కకకాంబరుడు మృదఆంగమును గొల్పి
కిటతక ధిమ్మి యని చేతులతో ల్ఘాతవేసి
తాళము చూపును మృధంగ ధ్వన్యను కరణ చేయును.

3. సరిగస్స సరిగమ ... పదనిస యని
వాణీ మహాదేవీ వీణమీట
అని తాళము చూపును.

4. కకుందకు ధరికిట తుతుందక ల్యని
వాణీ మహాదేవి శబ్దములు బాడ
తాండవము చేయుచుండే గురుతులు నెలదాల్చు

అని చదివి వివిధ ధ్వనులతో చక్కగా మృదంగ వాయిద్యఆం లాగా వాయిస్తార విశేషం రామానుజాచార్యులు గారు నాట్య కళ పత్రికలో ఉదహరించారు. అనుకరించి వాయిస్తారు. అంతే కాక మిలిటరీ సైనికుల బూట్ల చప్పుడు మాదిరిగానూ, గుఱ్ఱ కాలి డెక్కల ధ్వని మాదిరిగానూ, మార్చింగ్ బ్యాండు వాయిద్యంగానూ, వీరంగం సమయంలో వాయించే డప్పు ధ్వనులను అత్యద్భుతంగా ఈ రుంజు వాయిద్యంలో వినిపిస్తారు. తమ రంజ వాయిద్య సందర్భంలో నాథ బ్రహ్మను ప్రశింసించే ఈ క్రింది శ్లోకాన్ని కూడా వల్లిస్తారు.

శ్లోకం


<poem>చైతన్యం సర్వభూతానాం
నిర్వతిర్జ గదాత్మనాం
నాదబ్రహ్మస్తదానందం
అద్వితీయ ముపాస్మహే.

ఈ విధంగా సంగీతం యొక్క ప్రధాన్యాన్ని ఈ శ్లోకంలో వర్ణిస్తారు. తరువాత రుంజపై చేతితో అత్యద్భుతంగా ధ్వనులను పలికించి ప్రేక్షకులకు ఆనందాన్ని కలుగ జేస్తారు. అవే కాక నాథ బ్రహ్మను ప్రణవ స్వరూపాన్నీ, అంగికా స్వాన్ని సమష్టిగా రాగ యుక్తంగా పాడుతూ, అపూర్వ సమ్మేళనాన్ని వివరిస్తారు.

చెప్పే కథలు

[మార్చు]

ఇలా ఒక గంట కాలం అనేక రకాలైన శ్లోకాలతో, పాటలతో వచనాలతో, వివిధ రకాలైన ధ్వనులను వినిపించి, కథను పూర్తి చేస్తారు. వీ చెప్పే కథల్లోముఖ్యమైనవి. మూల స్తంభం, పంచముఖ బ్రహ్మావిర్భావము, పార్వతీ కళ్యాణము మొదలైన కథలను చెప్పటమే కాక, మధ్య మధ్య శ్రావ్వమైన కీర్తనల్నీ పాడుతూ, వాయిద్య నైపుణ్యాన్ని రుంజుపై పలికిస్తారు. మాములుగా మన భాగవత కాలక్షేపాలలో, కథాంతంలో, మంగళ సూచికంగా, పవనామా సుతుని బట్టి పాదారవిదములకు అనే పారంపర్యంగా వచ్చే మంఘళ హారతినే వీరూ అనుకరిస్తారు.

ఓం హ్రీం రాట్టుకూ మంగళం
ఓం హ్రీ రాట్టుకూ మంగళం
లోక మీసా లోకమనియా
లాకులేక కోక కరుణాతో
వాక్కు తెలిసియు వాక్కు చేరవు
రాక లేకను రాకరాకృతి........................ ||ఓం||
పంచతత్వ ప్రపంచములను
నది యొంత శిక్షించునో ఘనభువి
పంచదాయ లనేటి పంచ
బ్రహ్మల చాటించి పల్కె.........................||ఓం||
ఖ్యాతి కెక్కిన పోతులూరీ
దాతలింగా ప్రణమ బ్రహ్మ
జ్యోతి బింబము కన్న మిక్కిలి
ప్రితి లేదని నిలిచి కొలిచిన......................||ఓం||

రుంజు వాయిద్యకులు త్రేతా యుగానికి చెందిన వారనీ, విశ్వ కర్మ సృష్టించిన రుద్ర మహేశ్వరుల సంతతి వారనీ ఇతి హాసం తెలియచేస్తూ ఉంది.

రుంజ కథకులు అక్కడక్కడ మచ్చుకు మాత్రమే కనిపిస్తారు. సర్కారాంధ్ర దేశంలో తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ పాశం పాలలోచనుడు, జీడి కంటి సత్యనారాయణ అనే వారు ఈ నాటికీ రుంజ వాయిద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నానాటికి శిథిలమై పోతున్న రుంజ వాయిద్య కళారూపం విశిష్టమైనది. దీనిని పరిరక్షించాల్చిన అవసరం ఎంతో ఉంది.

అంతరించిపోతున్న కళ

[మార్చు]

ఈ కళ వీరితోనే అంతరించిపోతున్నది. వీరి పిల్లలు ఎవ్వరూ ఈ కళను నేర్వడంలేదు. వీరికి ఇంతవరకూ ప్రభుత్వం గుర్తింపుకానీ, నివాస గృహాలు గానీ లేవు. కళాకారులకిచ్చే పించన్లు కూడా లేవు. ఈ కళాకారులను ప్రోత్సహించి ఈ కళను గ్రంథస్తం చేయవలసి యున్నది.

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]

మూలం: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.