రుయ్యాడి పీర్ల పండుగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిలాబాదు జిల్లా రుయ్యాడి పీర్ల పండుగ
ఆదిలాబాదు జిల్లా రుయ్యాడి పీర్ల పండుగ
మొహర్రం పండుగ
అధికారిక పేరుమొహర్రం
యితర పేర్లుసవార్లు
జరుపుకొనేవారుహిందువులు, ముస్లింలు
ప్రారంభంఇస్లాం సంవత్సరాది మొదటి నెల
జరుపుకొనే రోజుపక్షం రోజుల మహోత్సవం

రుయ్యాడి పీర్ల పండుగ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో కుల మతాలకు అతీతంగా హిందువులు జరుపుకునే హస్సేన్ హుస్సేన్ పండుగ రుయ్యాడి పీరీల పండుగ.[1][2][3]

చరిత్ర

[మార్చు]

రుయ్యాడి [4] [5]పీర్లపండుగకు రెండు వందల యేండ్ల చరిత్ర ఉంది.ఆదిలాబాద్, భీంసరి చింతల్ల దొరికిన హాసన్ ప్రతీకతో ఇచట పీర్ల పండుగ మొదలైందని పెద్దలు చెబుతారు.ఈ ఊర్లో ముస్లిం కుటుంబాలు లేవు.గ్రామస్తులు ఒక ముస్లిం కుటుంబాన్ని తీసుకోవచ్చి తమలో కలుపుకొని సవార్లు ప్రారంభించారు. రుయ్యాడి ఒక మారుమూల పల్లె .ఏ పురాణంలోనూ దాని ప్రస్తావన లేదు.చరిత్రలో ఆ ఊరి ఖైఫియ్యతులేవీ కన్పించవు.కాని ఆ ఊరిది ఒక గొప్ప విశేషము.మానవత్వంతో కూడిన భక్తిభావం పరిమళించే ఆది గొప్ప పుణ్యస్థలం. ఆదిలాబాద్ అడవుల్లో మహారాష్ట్ర సరిహద్దుల్లో నెలవైన చిన్న పల్లెటూరు రుయ్యాడి.

పండుగ ప్రారంభం

[మార్చు]

రుయ్యాడి సవార్లు జాతర పక్షం రోజుల మహోత్సవం. ఈ ఉత్సవం మొహర్రం నెల చంద్రోదయంతో మొదలై పౌర్ణమి నాటికి ముగుస్తుంది.మొహర్రం మరునాడు వేకువ జామున హన్మాండ్ల గుడి ముందర ముస్లిం భక్తుడు అరబ్బీ మంత్రం చదవి పీర్లు కొట్టుడు పోవడాన్ని ప్రకటిస్తాడు.స్త్రీలు అమరవీరులకు పాలు సమర్పించి పుట్నాలు- పేలాలు పైన చల్లుతారు. పురుషులు గుండం తొక్కి వావిలి కొమ్మలు గుచ్చుతారు. అప్పటి నుండి రోజంతా అసోయ్ ధూలా,ధూలా ధూలా, డడంగ్ ధూలా నినాదాలు మధ్య ఆటపాటలతో పండుగ వేడుకలు జరగుతాయి.

పండుగ నియమాలు

[మార్చు]

రుయ్యాడి గ్రామంలో పీర్ల పండుగ ప్రారంభమయ్యే వారం రోజులు ముందు నుండే ఉర్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంటుంది.మహిళలు ఇంటిని,ఇంటి గోడల్ని కడిగి శుభ్రపరుచుకుంటారు.ఇంట్లో ఉన్న బట్టలను ఉతికి శుభ్రపరుచుకుంటారు. పండుగ ప్రారంభం నుండి ముగింపు వరకు నేల మీద పడుకునేందుకు ఇష్టపడుతారు. పీర్ల గుండం పెల్ల తీసింది మొదలు పండుగ పరిసమాప్తమయ్యే వరకు రుయ్యాడి ప్రజలు మద్యం ముట్టుకోరు. దేవుని సేవలో నిమగ్నమయ్యే వందల మంది భక్తులు ఈ పక్షం రోజులు చెప్పులు వేసుకోరు.పీర్ల బంగ్లా పరిసరాల్లో కూడా చెప్పులు వేసుకొని రారు. నెలసరి సమయంలో మహిళలు దేవుని బంగ్లా ఛాయలకే రారు.భక్తులు హసన్-హుసేన్ దీక్ష స్వీకరిస్తారు. ఈ దీక్ష నే ఫకీరు దీక్ష అంటారు. జాతర సమయంలో భక్తులు ముడుపులు,కొబ్బరి కాయలు, పుట్టు వెంట్రుకలు వంటి మొక్కులు చెల్లించుకుంటారు.

ఆలయాల అలంకరణ

[మార్చు]

రుయ్యాడి పీర్ల పండుగ సందర్భంగా దేవస్థానానికి రంగులు వేసి విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు.ఊర్లో పోస్టర్లతో, ప్లెక్సీలతో,కటౌట్లతో పెద్ద యెత్తున ప్రచారం నిర్వహిస్తారు. ఆలయ కమిటీ అందరికి సాదరంగా ఆహ్వానం పలుకుతుంది.ఈ పండుగ సందర్భంగా గ్రామానికి చెందినవారు ఎక్కడ ఉన్నా పండుగ సమయంలో ఇంటికి వస్తారు.

దేవుడికి మొక్కులు

[మార్చు]

మొహర్రం రోజును మలీదలు అని పిలుచుకుంటారు.వేకువ జాము నుండే భక్తులు నిమ్మకాయల దండలు వేసి ఊదు,బెల్లం చదివించి మాలీద ముద్దలు కిచిడీ నివేదించి పీర్లకు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ రోజు దాదాపు లక్షమంది పైన దైవదర్శనం చేసుకుంటారు.దూర ప్రాంతాల నుండే వచ్చే భక్తులకు ఆకలిదప్పులు తీర్చేందుకు గ్రామస్తులు సర్వసన్నద్ధంగా ఉంటారు.

ప్రోత్సాహక బహుమతులు

[మార్చు]

దేవుడి సేవలో అత్యంత కష్టపడి పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరినీ రుయ్యాడి పీరీల దేవస్థాన కమిటీ అధ్యక్షప్రధాన కార్యదర్శులు,గౌరవ సభ్యులు ఆధ్వర్యంలో ఉత్సవాలు ముగింపు రోజున ఈ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించిన యువకులకు, గ్రామస్తులకు, ప్రోత్సాహక నగదు బహుమానాల తో ప్రోత్సహిస్తు ముఖ్య అతిథులచే వారికి సాలువతో సత్కరించడం విశేషం .

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ మొహర్రం పండుగకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తో పాటు నిజామాబాద్,కరీంనగర్,వరంగల్,మహారాష్ట్ర లోని నాందేడ్ ,ఎవత్మాల్,చంద్రపూర్ మొదలగు జిల్లాల నుండి భక్తులు అధికంగా వస్తారు.జిల్లా కేంద్రం నుండి 18 కిమీ దూరంలో ను ,మండల కేంద్రం నుండి రెండు కిమీ దూరంలోను ఉంటుంది. ఆదిలాబాద్ బస్సు డిపో అధ్వర్యంలో ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు నడుపుతుంది.

మూలాలు

[మార్చు]
  1. Mahender, Adepu (2018-09-21). "Muharram is hindu festival here". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-07.
  2. Desam, A. B. P. (2023-07-31). "Adilabad Ruyyadi Hassain Hussain Devasthanam: వేలాదిగా తరలివచ్చిన భక్తులు". telugu.abplive.com. Retrieved 2024-04-07.
  3. ABN (2022-08-09). "రుయ్యాడిలో ఘనంగా పీరీల పండుగ". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-07.
  4. "H-M synthesis in Andhra Pradesh: Hindus join Muslims in observing Muharram". such.forumotion.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-07.
  5. Correspondent, D. C. (2014-11-03). "Muharram draws state attention". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-04-07.