రైల్వే కోడూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోడూరు లేదా రైల్వే కోడూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లా, రైల్వే కోడూరు మండలం లోని గ్రామం. పిన్ కోడ్ నం. 516 101., ఎస్.టి.డి.కోడ్ = 08566. [1]

గ్రామ నామ వివరణ

[మార్చు]

కోడూరు అనే పదం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన. రైల్వే కోడూరులోని రైల్వే అన్న పదానికి రైలుదారి అన్న పేరు సుస్పష్టం.[2]

వైఎస్ఆర్ జిల్లాలో కోడూరు పేరుతో రెండు మండలాలు ఉన్నాయి. అయోమయ నివృత్తి కొరకు, ఒకటి బద్వేలు సమీపములో ఉన్నందును దానిని బి.కోడూరు గాను, ఇంకో ప్రాంతములో రైల్వే సౌకర్యం ఉన్నందున రైల్వే కోడూరు గానూ పిలుస్తారు. ఈ ప్రాంతము మామిడి పంటకు ప్రసిద్ధి గాంచింది. రైల్వే సౌకర్యం కూడా ఉండటంతో ఇక్కడ పెద్ద ఎత్తున మామిడి క్రయ విక్రయాలు జరుగుతాయి. స్వతంత్రమునకు పూర్వము ఈ గ్రామంలో కడప జిల్లాలోనే మొదటిసారిగా రైలు బండి ఆగడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ గ్రామం పేరును కోడూరు నుండి రైల్వే కోడూరు గా మార్చారు.

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఈ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో తిరుపతి, 100 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఉండటంతో మంచి వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది.


గుండాలకోన క్షేత్రం

[మార్చు]

మండలంలోని గుండాలకోన క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. భక్తుల సౌకర్యంకోసం వై. కోట నుండి ప్రత్యేకంగా బస్సులు నడుపుతారు.

శ్రీ భుజంగేశ్వరస్వామివారి ఆలయం

[మార్చు]

ఈ అలయానికి, కోడూరు పరిధిలో రు. 20 కోట్ల విలువ చేసే ఆస్తులున్నవి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి అప్పట్లో పెద్దలు భూరి విరాళాలిచ్చారు. ఎస్.వి.జూనియర్ కలాశాల వద్ద 1.7 ఎకరాలు, పాత బస్సుస్టాండు వద్ద 4.5 సెంట్లు, పాత బజారు వీధిలో ఒక ఇల్లు, మార్కెట్ వీధిలో 16 గదులు, ఇవి అన్నీ శివునికి చెందిన ఆస్తులు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ కృష్ణ చతుర్దశి (ఉగాది ముందురోజు) రోజున సాయంత్రం, పార్వతీ సమేత పరమేశ్వరుడు, చంద్రప్రభ వాహనంపై పుర వీధులలో భక్తులకు దర్శనమిచ్చును. ఈ కార్యక్రమం కోసం ఆలయ కమిటీ వారు పుష్ప రథం ఏర్పాటుచేసెదరు. ఆది దంపతులకు గ్రామస్థులు, నీరాజనాలు సమర్పించెదరు.

శ్రీ బలిజ గంగమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

పట్టణ పరిధిలోని బలిజ వీధిలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తారు. జిల్లా నుండి భక్తులు కుటుంబసభ్యులతో పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.

శ్రీ గంగమ్మ అమ్మవారి ఆలయం

[మార్చు]

కోడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో వెలసిన గంగమ్మ తల్లి ఆలయంలో, అమ్మవారి జాతర విభవంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం

[మార్చు]

కోడూరులోని లాలాపేటలో వెలసిన ఈ ఆలయం పురాతనమైనది కావడంతో మరమ్మత్తులు చేసి పూర్వ వైభవం తీసికొని రావడానికి కృషి చేస్తున్నారు.

గ్రామ విశేషాలు

[మార్చు]

మండల పరిధిలోని పారపరాచపల్లెకు వెళ్ళే దారిలో 400 సంవత్సరాల వయసు కలిగిన ఒక మర్రిచెట్టు ఉంది. చెట్టు చుట్టూ 50 అడుగుల వరకూ ఊడలు విస్తరించి ఉండటంతో, చూపరులకు ఆసక్తి కలిగించుచున్నది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు, ఈ వృక్షం వద్ద గల అక్కదేవతలకు పూజలు నిర్వహించుచుంటారు. ఈ వృక్షం ఇన్నేళ్ళుగా ఇక్కడ ఉండటంతో, పరిసర గ్రామాలవారు దేవతలకు పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్నదని గ్రామస్థులు అంటుంటారు.

శాసనసభ నియోజకవర్గం

[మార్చు]

పూర్తి వ్యాసం కోడూరు శాసనసభ నియోజకవర్గంలో చూడండి.

మూలములు

[మార్చు]
  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.
  2. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.

వెలుపలి లింకులు

[మార్చు]