వామికా గబ్బి (ఆంగ్లం: Wamiqa Gabbi) (జననం 1993 సెప్టెంబరు 29) ఒక భారతీయ నటి. ఆమె పంజాబీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు చిత్రాలలో నటించింది. హిందీ చిత్రం జబ్ వి మెట్ (2007)లో ఆమె చిన్న పాత్రతో తెరపైకి అడుగుపెట్టింది. కానీ యో యో హనీ సింగ్, అమ్రీందర్ గిల్‌లతో కలిసి తు మేరా 22 మెయిన్ తేరా 22 (2013) చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. పైగా ఆమెకు ఈ చిత్రంలో నటనకు పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ దక్కింది. ఆ తర్వాత ఆమె ఇష్క్ బ్రాందీ (2014), నిక్కా జైల్దార్ 2 (2017), పరహునా (2018), దిల్ దియాన్ గల్లాన్ (2019), నిక్కా జైల్దార్ 3 (2019) వంటి అనేక పంజాబీ చిత్రాలలో నటించింది.
వామికా గబ్బి 1993 సెప్టెంబరు 29న చండీగఢ్‌లోని పంజాబీ కుటుంబంలో జన్మించింది.[1][2][3] ఆమె తండ్రి గోవర్ధన్ గబ్బి హిందీ, పంజాబీ భాషలలో కవి, రచయిత. అతని కలం పేరు గబ్బి.[4][5] ఆమె తల్లి రాజ్‌కుమారి టీచర్.
ఆమె కథక్ నృత్యకారిణి. యో యో హనీ సింగ్, అమ్రీందర్ గిల్, తు మేరా 22 మై తేరా 22 పంజాబీ సినిమాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆమె మరో రెండు పంజాబీ చిత్రాలైన ఇష్క్ బ్రాందీ, ఇష్క్ హాజీర్ హైలో నటుడు దిల్జిత్ దోసాంజ్‌కి సహనటిగా నటించింది. తను తనీషాగా మొదటి మహిళా ప్రధాన పాత్రను రాజ్ పురోహిత్ దర్శకత్వం వహించిన హిందీ ఎరోటిక్ డ్రామా థ్రిల్లర్ చిత్రం సిక్స్‌టీన్ (2013)లో పోషించింది. తెలుగులో భలే మంచి రోజు అనే సినిమాలో కథానాయికగా నటించింది. వామికా గబ్బి తమిళ చిత్రం మలై నేరతు మయక్కం (2016)లో కథానాయికగా నటించింది.[6] ఆమె మలయాళ చిత్రం గోధాలో టోవినో థామస్‌తో కలిసి కథానాయికగా నటించింది.[7] 2017 మార్చిలో అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన కొత్త తమిళ చిత్రం ఇరవకాలమ్‌పై వామికా గబ్బి సంతకం చేసింది. ఇందులో శివాడ, ఎస్. జె. సూర్య సహ నటులు.[8]పృథ్వీరాజ్ సుకుమారన్, మమతా మోహన్‌దాస్ కూడా నటించిన 9 (2019 సినిమా)లో వామికా గబ్బి ప్రధాన పాత్ర పోషించింది.[9]
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ మాయి లో వామికా గబ్బి కనబరచిన నటనకు ‘లాంగ్వేజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పేరు గడించింది.[10]