Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 06వ వారం

వికీపీడియా నుండి

సిక్కిం భారత దేశపు హిమాలయ పర్వతశ్రేణులలో ఒదిగి ఉన్న ఒక రాష్ట్రము. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం (అన్నింటికంటే చిన్నది గోవా). 1975 వరకు సిక్కిం "చోగ్యాల్" రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశము. 1975లో ప్రజాతీర్పు (రిఫరెండం) ను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఈ చిన్న రాష్ట్రానికి పశ్చిమాన నేపాల్, తూర్పున, ఉత్తరాన టిబెట్ (చీనా), ఆగ్నేయాన భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉంది.


సిక్కిం అధికారిక భాష నేపాలీ. రాజధాని గాంగ్టక్ అన్నింటికంటే పెద్ద పట్టణం. హిందూమతము, వజ్రయాన బౌద్ధము ప్రధానమైన మతాలు. చిన్నదే అయినా సిక్కింలో పలువిధాలైన భూభౌతిక ప్రాంతాలన్నాయి. దక్షిణ ప్రాతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్లలో విస్తరించి ఉంది. ఎంతో ప్రకృతి సౌందర్యాలను ఒనగట్టుకొన్నందువల్లా, ప్రశాంత రాజకీయ స్థిరత్వం వల్లా సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.


సిక్కిం ఆర్ధిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. ఏలకులు, నారింజకాయలు, యాపుల్పళ్ళు, తేయాకు, ఆర్చిడ్ పూలు ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. భారతదేశంలో ఏలకుల ఉత్పత్తిలో సిక్కిందే అగ్రస్థానము. ఇటీవలి కాలంలో పర్యాటక రంగంపై శ్రద్ధ, పెట్టుబడులు పెరిగాయి. ఇందుకు సిక్కింలో ఎన్నో ఆకర్షణలున్నాయి. ....పూర్తివ్యాసం: పాతవి