Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2008 48వ వారం

వికీపీడియా నుండి

అంజు బాబీ జార్జ్ ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి. ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతదేశంలో అత్యున్నతమైన క్రీడా పురస్కారాలలో ఒకటైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు కూడా ఆమెకు బహుకరించారు. అంజు 1977, ఏప్రిల్ 19న కేరళలోని చంగనాస్సరిలో కోచిపరాంబిల్ కుటుంబంలో జన్మించింది. అంజు తండ్రి ప్రోత్సాహం మరియు పాఠశాల శిక్షకుడు తోడ్పాటుతో అథ్లెటిక్ రంగంలోకి ప్రవేశించింది. ఆమె హెప్టాథ్లాన్‌లో క్రీడాజీవితం ప్రారంభించినా ఆ తర్వాత లాంగ్‌జంప్, హైజంప్‌లపై శ్రద్ధ చూపించి 1996లో ఢిల్లీ లో జూనియన్ ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకం సాధించింది. 1999లో బెంగుళూరులో ట్రిపుల్‌జంప్‌లో జాతీయ రికార్డు సృష్టించింది. నేపాల్‌లో రజత పతకం సాధించింది. 2001లో లుధియానాలో జరిగిన జాతీయ క్రీడలలో ట్రిపుల్‌జంప్‌లో స్వర్ణం సాధించింది. 2002లో మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో అంజు 6.49 మీటర్లు లాంగ్‌జంప్ కాంస్యపతకం గెల్చింది. ఆ తర్వాత బుసాన్లో జరిగిన ఆసియా క్రీడలలో భారతదేశానికి స్వర్ణ పతకం సాధించి పెట్టింది.


2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ పోటీలలో 6.70 మీటర్ల దూరం దుమికి కాంస్య పతకం సాధించి దేశ అథ్లెటిక్ చరిత్రలోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ పోటీలలో పతకం గెల్చిన తొలి భారతీయ వ్యక్తిగా రికార్డు సృష్టించింది. 2005లో దక్షిణ కొరియాలో 16వ ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీలలో 6.65 మీటర్ల దూరంతో బంగారుపతకం గెల్చింది. అదే సంవత్సరం ఐ.ఎ.ఎ.ఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో 6.75 మీటర్లు దుమికి రజిత పతకం సాధించింది. ఇదే ఆమె ఆఖరి అత్యున్నత ప్రతిభ. 2006లో దోహలో జరిగిన 15వ ఆసియా క్రీడలలో లాంగ్‌జంప్‌లో రజత పతకం సాధించింది. 2008లో దోహాలో ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్ పోటీలలో రజతపతకం సాధించింది. అంజు జార్జి భర్త, బాబీ జార్జ్ కూడా క్రీడాకారుడే. మెకానికల్ ఇంజనీర్ అయిన అతడు ట్రిపుల్ జంప్‌లో జాతీయ క్రీడల చాంపియన్. అంజుకు క్రీడలలో ప్రాత్సాహమే కాకుండా మంచి శిక్షణ కూడా ఇచ్చాడు. 1998 నుంచి అంజుకు పూర్తి కాలపు కోచ్‌గా వ్యవహరించాడు. .....పూర్తివ్యాసం: పాతవి