వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 11వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. పంచాంగ శ్రవణం వింటారు.


చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం తెలుగు నూతన సంవత్సరం తమిళ నూతన సంవత్సరం సూర్యమానం ప్రకారం చైత్ర మాసం మొదటిరోజు. ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.


ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. ఉగాది పచ్చడిని తయారు చేసే పద్దతిలో ఉప్పు', వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు.

.... పూర్తివ్యాసం పాతవి