వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2010 21వ వారం
జార్ఖండ్ లేదా ఝార్ఖండ్, భారతదేశంలో ఒక రాష్ట్రము. దీనికి ఉత్తరాన బీహార్, పశ్చిమాన ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తూర్పున పశ్చిమ బెంగాల్, దక్షిణాన ఒరిస్సా రాష్ట్రాలున్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రానికి రాజధాని పారిశ్రామికనగరమైన రాంచి. ఇంకా ముఖ్యనగరాలైన జంషెడ్‌పూర్, బొకారో, ధన్‌బాద్‌కూడా భారీగా పరిశ్రమలున్న నగరాలు. 2000 నవంబరు 15న బీహార్ రాష్ట్రంనుండి దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి జార్ఖండ్ ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేశారు. దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున జార్ఖండ్‌ను "వనాంచల్" అనికూడా అంటారు. అడవులే కాదు. అపారమైన ఖనిజసంపద కూడా ఝార్ఖండ్ రాష్ట్రపు ప్రత్యేకత.
బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రము.
కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా జార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. మగధ సామ్రాజ్యంకాలం నుంచీ ఉన్నది. ("ఝరీ" - అంటే పొద). చోటానాగపూర్ పీఠభూమి, సంథాల్ పరగణాలలో విస్తరించి ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము.