వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 07వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేరియం

బేరియం ఒక రసాయనిక మూలకం. ఈ మూలకం పరమాణు సంఖ్య 56. ఈ మూలకం యొక్క సంకేత నామాక్షరము Ba. మూలకాల ఆవర్తన పట్టిలలో రెండవ సముదాయానికి చెందిన 5 వ మూలకం. చూడటానికి వెండి వన్నె కలిగిన ఈ మూలకం ఒక క్షారమృత్తిక లోహము. బేరియం అధిక రసాయన ప్రతిచర్య కారణంగా, ప్రకృతిలో స్వచ్ఛమైన రూపంలో లభ్యం కాదు.

బేరైట్ (బేరియం సల్ఫేట్), విథరైట్ (బేరియం కార్బొనేట్) బేరియం ఎక్కువగా లభించే ఖనిజాలు. బేరియం అనే పదం భారమైనది అని అర్థం కలిగిన బేరిస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీన్ని ఒక ప్రత్యేకమైన మూలకంగా 1774 లో గుర్తించారు. 1808 లో విద్యుద్విశ్లేషణ సహాయంతో దీన్ని ఒక లోహంగా గుర్తించారు.

పారిశ్రామికంగా బేరియం ను వాక్యూం ట్యూబుల్లో గెటరింగ్ చేయడానికి వాడతారు. టపాకాయలలో దీనిని కలపడం వల్ల వాటిని కాల్చినపుడు పచ్చరంగు కాంతి వెలువడుతుంది. బేరియం సల్ఫేట్ ను చమురు బావుల తవ్వకంలో కరగని ద్రావణంగా వాడతారు. దాని స్వచ్ఛమైన రూపంలో పేగు లోపలి భాగాలను చిత్రీకరించేందుకు రేడియో కాంట్రాస్ట్ ఏజెంటుగా ఉపయోగిస్తారు. అత్యధిక ఉష్టోగ్రత కలిగిన సూపర్ కండక్టర్లలో ఇది ఒక భాగం. ఎలక్ట్రోసిరామిక్స్ లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఇనుము, ఉక్కు లోహాలను పోత పోసేటప్పుడు బేరియాన్ని కలపడం వలన లోహాలలోని కర్బన అణువుల కణపరిమాణం తగ్గుతుంది. నీటిలో కరిగే బేరియం సమ్మేళనాలు విషపూరితాలు. అందుచే వీటిని ఎలుకలమందుగా వాడతారు.
(ఇంకా…)