వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం/నివేదిక/భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ప్రధాన పేజీ | చర్చ | కార్యక్రమ ప్రణాళిక | కమిటీలు | సన్నాహక సమావేశాలు | స్కాలర్షిప్స్ | నివేదిక | భావి కార్యాచరణ |
తెవికీ పండగ 2024ను తెలుగు వికీపీడియా ప్రారంభించి రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా జరుపుకునేప్పుడు వేడుకలు, గుర్తింపు, సరదాతో పాటుగా గడచిన రెండు దశాబ్దాల కృషిపై విమర్శనాత్మక విశ్లేషణ, భవిష్యత్తు వ్యూహరచన కూడా జరగాలని ఈ వేడుక నిర్వాహకులైన తెవికీ సముదాయమూ, సీఐఎస్-ఎ2కెలు నిర్ణయించుకున్నాయి. ఈ సందర్భంగా విశ్లేషణ అన్నది వివిధ పద్ధతుల్లో జరిగింది:
- తెవికీ పండగ 2024 రెండవ రోజున పాతిక మంది వరకూ తెలుగు వికీమీడియన్లు తెవికీలో తమ ప్రస్థానం, తెవికీ గురించి ఆలోచనలూ, అభిప్రాయాలూ పంచుకున్నారు.
- తెవికీ పండగ 2024 తొలిరోజు మధ్యాహ్నం తెలుగులో విజ్ఞాన సృష్టి, ప్రసారాల్లో భాగమైన అతిథులతో తెలుగు వికీమీడియన్లు ఐదు గ్రూపులుగా ఏర్పడి భవిష్యత్తులో తెలుగులో విజ్ఞానం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి, ఆ విషయంలో వ్యక్తులు, సంస్థలతో ఎలా భాగస్వాములు కావచ్చు వంటివి చర్చించారు.
- సీఐఎస్-ఎ2కె ఆహ్వానం మేరకు తెలుగు అంతర్జాల రచయితల బృందం వారు ఒకటి స్వచ్ఛందంగా తెలుగు వికీపీడియా వ్యాసాల నాణ్యతపై స్వచ్ఛందంగా ఒక నిష్పాక్షికమైన పరిశీలన చేసి నివేదికను తయారుచేశారు.
- ఎ2కె ఉద్యోగిని, పంజాబీ వికీమీడియన్ నితేష్ గిల్ తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం జరిగిన ఆన్‌వికీ, ఆఫ్‌వికీ కార్యక్రమాలను పరిశీలించి ఈ కార్యక్రమాల మంచి చెడులపై నివేదిక తయారుచేశారు.
ఈ ఐదు చర్చలు, నివేదికలను పరిశీలించి, విశ్లేషించి వాటి సారాంశాన్ని స్వీకరించి భవిష్యత్ కార్యాచరణ రూపంలో చేరుస్తున్నాము. అయితే, ఈ భవిష్యత్ కార్యాచరణలోని అంశాలూ, వాటి ప్రాధాన్యతా క్రమం, ఆలోచనలు అత్యంత ప్రధానంగా తెవికీమీడియన్ల అంతర్గత చర్చ (మొదటి పాయింటు) ఆధారంగా రూపొందింది. ముఖ్యంగా ఏది ప్రాధాన్యత, ఏం చేయాలి అన్నది అంతర్గత చర్చ ఫలితంగానే వచ్చింది. నివేదికలు, చర్చలు దానికి సమర్థనగానూ, ప్రాజెక్టు ఆలోచనలను, చేయగల కార్యకలాపాలను అందించే వనరులుగానూ ఉపయోగపడ్డాయి.
స్థూలంగా చూస్తే - తెవికీమీడియన్ల సంఖ్య పెంచాలి, తెవికీపీడియాలో నాణ్యత, వైవిధ్యం పెరగాలి, ప్రణాళికాబద్ధంగా సహాయం, శిక్షణ, ప్రోత్సాహం సాగాలి, వేధింపులు, దాడులను అరికట్టి, నిర్వహణను మెరుగుపరచాలి, సాంకేతిక అంశాలపై పనిచేయాలి, సోదర ప్రాజెక్టులపై కృషి, అవగాహన పెంపు జరగాలి, వైవిధ్యాన్ని పెంపొందించాలి అన్న ఏడు వ్యూహాత్మక అంశాలు భవిష్యత్ కార్యాచరణకు దిశగా ఏర్పడ్డాయి. వాటి గురించి, అవి తయారుకావడం వెనుక పై చర్చలను విశ్లేషించిన విధం గురించి ఈ పేజీలో చూడవచ్చు.
ఈ అంశంపై సముదాయ సభ్యుల అభిప్రాయాలను చర్చా పేజీలో ఆహ్వానిస్తున్నాము.
భవిష్యత్ కార్యాచరణ
[మార్చు]1. తెవికీమీడియన్ల సంఖ్య పెంచాలి చురుగ్గా ఉన్న తెవికీమీడియన్ల సంఖ్య ఇప్పుడున్నదాని కన్నా చాలా రెట్లు పెరగాలన్న లక్ష్యంతో పనిచేయాలి.
- అవుట్‌రీచ్ కార్యక్రమాల విస్తృతి పెరగాలి: కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 2013 తర్వాత రాయడం మొదలుపెట్టినవారిలో అత్యధికులు వ్యక్తులు కానీ, సంస్థలు కానీ నిర్వహించిన అవుట్‌రీచ్ కార్యక్రమాల ఫలితంగానే తెవికీలో ప్రారంభించడమో, పునఃప్రారంభించడమో జరిగింది. కాబట్టి, తెవికీమీడియన్ల సంఖ్య పెంచడానికి ఇంకా విస్తృతమైన అవుట్‌రీచ్ కార్యక్రమాలు చేపట్టాలి.
- ఫోకస్‌డ్ అవుట్‌రీచ్ కార్యక్రమాలు: తెలుగు నేర్చుకునే డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులు, బోధించే ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులు వంటి తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం, నైపుణ్యాలు ఎక్కువ ఉన్న గ్రూపులకు అవుట్‌రీచ్ చేయాలి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారం ఈ అంశంలో స్వీకరించవచ్చు.
- తెవికీ గురించి అవగాహన పెంపు: తెవికీ గురించి, తెవికీలో రాయడం గురించి సమాజంలో ఎప్పటికప్పుడు అవగాహన పెంచేలాంటి కృషిచేస్తూండాలి. ఇందుకోసం మీడియాలో తరచు తెవికీ గురించి వచ్చేలా చేయడమూ, తెవికీపీడియన్లు తెవికీని సోషల్ మీడియాలో ప్రచారం చేయడమూ, తెవికీలో కృషి గురించి పుస్తకాలు తేవడమూ ఇందులో కొన్ని పద్ధతులు.
2. తెలుగు వికీపీడియాలో నాణ్యత, వైవిధ్యం పెంపు తెలుగు వికీపీడియాపై పరిశీలన చేసిన బృందం అయినా, తెవికీలో రాస్తున్న వాడుకరులైనా, దీర్ఘకాలంగా పనిచేస్తున్న నిర్వాహకులైనా తెవికీ నాణ్యత మరింత మెరుగుపడాలన్న విషయంపై ఏకీభవించారు.
- భాషాపరమైన నాణ్యత తెలుగు వికీపీడియాలోని వ్యాసాలను తీసుకుని నాణ్యతా పరిశీలన చేసిన తెలుగు అంతర్జాల రచయితల బృందం వెలువరించిన నివేదిక ప్రకారం తెలుగు వికీపీడియాలోని వ్యాసాల్లో భాషాపరమైన నాణ్యతలో తీవ్రమైన లోపాలున్నాయి. వీటిని సరిదిద్దడానికి, కొత్తగా రాసేవారు మెరుగైన భాష రాసేలా చూసేందుకు కృషిచేయాలి.
- మౌలిక పరిశోధన తగ్గాలి, ఆధారాలు చూపడం పెరగాలి: మూలాలు అందుబాటులో లేకపోవడమూ మౌలిక పరిశోధనతో వ్యాసాలు రాయడమూ ఒకదానికొకటి ముడిపడిన సమస్యలు. దానికితోడు మూలాల సాయంతో వ్యాసాన్ని నిర్మించే నైపుణ్యాలు సంతరించుకోవడం మరో సమస్య. ఈ మూడిటిపైనా శ్రద్ధపెట్టి కృషిచేయాలి. ఈ విషయంలో మనసు ఫౌండేషన్ వంటి ఆర్కైవల్ సంస్థ సహకారమూ, అన్వేషి వంటి రీసెర్చ్ గ్రూప్ సహాయమూ తీసుకోవచ్చు.
- వివిధ ప్రాజెక్టులు: ఈ సందర్భంగా చర్చకు వచ్చిన వివిధ ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి:
- అ) 2025 సంవత్సరంలో మొదటి పేజీలో వచ్చే 53 వారాల ప్రదర్శిత వ్యాసాలనూ మంచి వ్యాసాలే ఉండేలా మంచి వ్యాసాలు రూపొందించి, నిగ్గుదేల్చడం
- ఆ) ప్రస్తుతం ఉన్న వర్గీకరణ అస్తవ్యస్తంగా ఉన్నదనీ, దాన్ని హేతుబద్దీకరించి వర్గీకరణ కోసం ఒక సమగ్రమైన ప్రాజెక్టు నిర్వహించడం
- ఇ) మనసు ఫౌండేషన్ వారి సహకారంతో తెలుగు సినిమాలు, తెలుగు సినిమా పాటల ప్రాజెక్టు నిర్వహించి సినిమాల గురించి ఉన్న సమాచారాన్ని కచ్చితంగా, నాణ్యంగా రూపొందించడం.
- ఈ) చారిత్రక సందర్భం, సినిమాలూ, సాహిత్యం, భౌగోళిక ప్రదేశాలు - ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకుని, దానికి సంబంధించిన వ్యాసాలన్నిటిలోనూ సమగ్ర సమాచారాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టు చేపట్టి పూర్తిచేయడం.
3) ప్రణాళికాబద్ధంగా సహాయం, శిక్షణ, ప్రోత్సాహం సభ్యుల్లో అత్యధికులు తాము తెవికీలో నిలదొక్కుకోవడం వెనుక తోటి సముదాయ సభ్యుల ప్రోత్సాహం, సహాయం ఉందనీ, అయితే ఈ సహాయం సరిపోదనీ ఇంకా కావాలని చెప్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే ఎవరికి తోచినట్టు వారు సహాయం, శిక్షణ, ప్రోత్సాహం చేస్తూనే ఉన్నా, ప్రణాళికాబద్ధంగా చేయాలి. ఈ విషయంలో చేయదగ్గ ప్రాజెక్టుల్లో కొన్ని:
- అ) సహాయం పేజీలను నవీకరించడం, ఇప్పుడు సహాయం అందుబాటులో లేని అనేక అంశాలకు సృష్టించడం.
- ఆ) తెవికీలో కృషి ఏం చేయాలి, ఎలా చేయాలన్నదానిపై వీడియోలు సృష్టించడం
- ఇ) కొత్తవాళ్ళను అనుభవజ్ఞులైన వికీమీడియన్లు వికీదత్తత తీసుకోవడం
- ఈ) తెవికీ బడి నడిపి తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో రాయడం గురించి, పలు అంశాల గురించి వీడియో తరగతులు తీసుకోవడం
- ఉ) కచ్చితమైన ప్రమాణాలు పెట్టి ఈనెల వికీపీడియన్/ఈ ఏడాది వికీపీడియన్ వంటి టైటిల్స్ ఇచ్చి ప్రోత్సహించడం
4) వేధింపులు, దాడులను అరికట్టి, నిర్వహణను మెరుగుపరచాలి: ఆఫ్‌వికీ కార్యక్రమాల్లో జరిగే వేధింపులు, ఆన్‌వికీలో నిర్వాహకులపై దాడులు, చర్చల్లో గౌరవప్రదమైన భాష వాడకపోవడం, దురుసుతనం వాడుకరులను నిరుత్సాహపరుస్తున్నాయి. వీటిని కట్టడిచేయడానికి తీసుకుంటున్న చర్యల వల్ల కొందరు సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు, అయితే ఈ చర్యలే వద్దంటే నిర్వహణ సాధ్యం కాదని ఇతరులు చెప్తున్నారు. నిర్వాహక చర్యలు తీసుకునే నిర్వాహకుల సంఖ్య, చర్చల్లో చురుగ్గా పాల్గొనే వాడుకరుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. వీటన్నిటిపై లోతుగా కృషిచేయాల్సి ఉంది. దీని విషయంలో వచ్చిన కొన్ని ప్రాజెక్టు ఆలోచనలు:
- అ) మరింతమంది కొత్తవారిని నిర్వాహకులను చేయాలి. ఇందుకోసం నిర్వాహకుల బడిని ఏర్పరిచి ఎవరు నిర్వాహకత్వం స్వీకరిస్తామన్నా ప్రస్తుత నిర్వాహకులు వారికి ఒక క్రమపద్ధతిలో నిర్వహణ విలువలు, అంశాలు నేర్పించి నిర్వాహక ప్రతిపాదనలో నెగ్గగలిగేలా చేయాలి.
- ఆ) ఎక్కువమంది సభ్యులు చర్చల్లో పాల్గొనేందుకు ప్రణాళికలు తయారుచేయాలి.
- ఇ) ఐపీ నిరోధాల గురించి సరిగా చర్చించి పరిష్కార మార్గం చూడాలి.
- ఈ) వేధింపులు, దాడుల గురించి అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూడాలి.
5) సాంకేతిక అంశాలపై పనిచేయాలి సాంకేతిక సమస్యలు, సాంకేతిక అభివృద్ధి వల్ల భావి సవాళ్ళు, అవకాశాలు - వీటన్నిటిపైనా పనిచేయడం ప్రారంభించాలి. కొన్ని ప్రాజెక్టు ఆలోచనలు:
- అ) మొబైల్ ఎడిటింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయడం
- ఆ) ఎర్రలింకులకు రీడైరెక్టులు సృష్టించినప్పుడు సృష్టించినవారికి సందేశం పంపే వ్యవస్థ ఏర్పాటు
- ఇ) ట్వింకిల్ టెంప్లెట్ సరిదిద్దడం
- ఈ) విజువల్ ఎడిటర్ డీఫాల్ట్ అయ్యాకా పనిచేయడం ఆగిపోయిన ఉపకరణాలను సరిదిద్దడం
- ఎ) వికీడేటా - వికీపీడియా సమాచారపెట్టెల మధ్య ఇటునుంచి అటు, అటునుంచి ఇటు డేటా ఆటోమేటెడ్‌గా వెళ్ళడం
- ఏ) తెలుగులో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు చూసిపెట్టే ఉపకరణం రూపకల్పన
6) సోదర ప్రాజెక్టులపై కృషి, అవగాహన పెంపుతెలుగు వికీపీడియా మీద ఉన్న దృష్టి ఇతర ప్రాజెక్టులపై లేకపోవడం ఒక లోటు. దాన్ని పూరిస్తూ అవగాహన, కృషి పెంచాలి. ఇందుకోసం చేయదగ్గ ప్రాజెక్టులు:
- ఆ) మనసు ఫౌండేషన్ స్కాన్ చేసిన పుస్తకాల్లో కాపీహక్కులు లేనివాటిని ఎంచి వికీసోర్సులో చేర్చి డిజిటలీకరించడం
- ఆ) ప్రతీ తెలుగు వికీపీడియా వ్యాసంలోనూ తప్పకుండా తగిన బొమ్మలు ఉండేలా కృషిచేయాలి. ఇప్పటికే కామన్స్‌లో ఉన్నవి తెవికీలో చేర్చడం, లేకపోతే ఆ ఫోటోలు కామన్స్‌లోకి చేరేలా కృషిచేయడం
- ఇ) ఆడియో పుస్తకాలు, ఆడియో వ్యాసాల తయారీకి కృషి
7) వైవిధ్యాన్ని పెంపొందించాలి తెవికీలో మహిళల భాగస్వామ్యం పెరగడం కోసం కృషిచేయాలి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వల్పసంఖ్యాకుల భాషలకు (గోండి, కొలామి, బంజారా, వగైరా) తెవికీ సముదాయం తన అనుభవం, పరిచయాలు, నైపుణ్యాలను ఉపయోగించి సహాయం చేయాలి. ఇప్పటిదాకా తెవికీమీడియన్లు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తెవికీ గురించి అవగాహన పెంపొందించాలి.
విశ్లేషణ
[మార్చు]- తెలుగులో వికీమీడియన్లు ఎలా ప్రారంభిస్తున్నారు?
కార్యక్రమంలో మాట్లాడినవాళ్ళు 25 మంది. వీరిలో 2003-10 మధ్యకాలంలో ప్రారంభించినవారు ఆరుగురు, 2011-15 మధ్యకాలంలో ప్రారంభించినవారు నలుగురు, 2016-19 మధ్యకాలంలో మొదలుపెట్టినవారు నలుగురు, 2020 తర్వాత ప్రారంభించినవారు పదకొండుమంది ఉన్నారు.
- వీరిలో వ్యక్తులు సంస్థలు పరిచయం చేస్తే వికీపీడియాలో రాయడం ప్రారంభించినవారు అత్యధికులు (14), అనుకోకుండా ఇంటర్నెట్‌లో వెతికి వచ్చినవారి సంఖ్య రెండో స్థానంలో ఉంది (6), ఇంగ్లిష్ వికీపీడియాలో ప్రారంభించి తెలుగులోకి వచ్చినవారు, బ్లాగుల ద్వారా చేరినవారు చెరో ముగ్గురూ ఉన్నారు. గమనించవలసిన విషయం ఏమిటంటే, 2010 తర్వాత నుంచి తెవికీలో అవుట్‌రీచ్ ఊపందుకుంది. ఈ 2010-23 మధ్యకాలంలో తెవికీలో రాయడం ప్రారంభించిన ఈ సభ్యుల్లో 74 శాతం మందికి పైగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంస్థాగత కార్యకలాపాలపరంగా చేసిన అవుట్‌రీచ్ ద్వారా వచ్చినవాళ్ళే. 2003-10 మధ్యకాలంలో బ్లాగుల నేపథ్యం ద్వారానో, బ్లాగుల ద్వారానో తెవికీలోకి వచ్చినవారు ఎక్కువ.
- ఎలాంటి స్ఫూర్తితో పనిచేస్తున్నారు? ఏ కారణాల వల్ల మానేయబోయారు?
- అన్నిటికన్నా పెద్ద స్ఫూర్తి తమతో కలసి పనిచేస్తూ, తమను ప్రోత్సహిస్తూ, చర్చిస్తూ, సాయపడుతూండే సముదాయం ఉండడమేనని అత్యధికులు అభిప్రాయపడ్డారు. 100వికీడేస్, రోజుకు పదివ్యాసాలు, 1000వికీకామన్స్ డేస్ - ఇలాంటి సవాళ్ళు కొత్తవారు వికీమీడియన్లు కావడానికి (ఇద్దరు అలా చేరారు), కొత్తగా చేరినవారు వికీమీడియా ప్రాజెక్టుల్లో నిలదొక్కుకోవడానికి స్ఫూర్తిని కలిగించాయి.
- తెలుగులో సమాచారం పెరగాలన్న ఆలోచనే తనకు స్ఫూర్తి అని ఒకరు, జాతీయస్థాయి కార్యక్రమంలో పలు భాషల్లో, ఎంతో కృషిచేస్తున్న వికీమీడియన్లను కలవడం తన వికీ ప్రస్థానంలో మలుపు అని మరొకరు, వికీపీడియాపై కోర్సు పూర్తిచేసి డిజిటల్ సర్టిఫికెట్ పొందాలన్న తపన స్ఫూర్తిగా నిలిచిందని ఇంకొకరు చెప్పారు.
- ట్రిపుల్ ఐటీ (8), సీఐఎస్-ఎ2కె (7) వంటి సంస్థలు నిర్వహించిన కార్యకలాపాల ద్వారా తెవికీలో చేరి కొనసాగుతున్నవారు మాట్లాడినవారిలో సగానికి పైచిలుకు ఉన్నారు. ముఖ్యంగా సమావేశానికి హాజరైన మహిళలు అందరూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ గ్రాంట్ల ద్వారా సంస్థలు కానీ, వ్యక్తులు కానీ నిర్వహించిన కార్యక్రమాల వల్ల తెవికీ గురించి తెలుసుకుని ప్రారంభించినవారే.
- మొత్తంగా ముగ్గురు వికీమీడియన్లు గతంలో ఖాతా సృష్టించుకుని, దాని సంగతి మరచిపోయి ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత పునఃప్రారంభించారు. ముగ్గురూ పునఃప్రారంభించడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. కానీ, వారికి తెవికీలో మళ్ళీ రాయడానికి బలమైన సహాయం కనీసం ఒకరి నుంచి లభించడం వల్ల కొనసాగగలిగామని సూచించారు.
- వికీమీడియా ప్రాజెక్టుల్లో కొనసాగి కృషిచేస్తున్న ఈ సభ్యుల్లో అత్యధికులు తెవికీలో తమకు సహాయం అందిందని పేర్కొన్నారు. అత్యధికులు కనీసం ఒకరిద్దరి పేర్లు పేర్కొన్నారు. కనీసం ఏడుగురు అనుభవజ్ఞులైన వాడుకరుల పేర్లు ముగ్గురు కన్నా ఎక్కువమంది వికీమీడియన్లు తమకు సాయపడ్డారని చెప్పారు. అయితే, విరివిగా సాయం అందిస్తున్నవారందరూ పురుషులే కావడం, ఆరుగురు నిర్వాహకులు కావడం గమనార్హం.
- ఈ పరిశీలన ఆధారంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లోకి వస్తున్న కొత్తవారికి తగినంత సహాయం అందుతుందని చెప్పడం సాధ్యం కాదు. కానీ, వికీమీడియా ప్రాజెక్టుల్లో నిలబడ్డవారందరూ తోటి సభ్యుల నుంచి సహాయం, ప్రోత్సాహం పొందినవారేనని చెప్పవచ్చు. తోటివారికి సాయం అందించే సభ్యుల సంఖ్య పెరగకపోతే ఎక్కువమంది కొత్తవారు నిలబడడం సాధ్యం కాదు.
- వికీలో పనిచేయడం మానేద్దామనుకున్నారా అన్న ప్రశ్నకు ఐదుగురు సభ్యులు అవునని జవాబిచ్చారు. బయటి కార్యక్రమాల్లో వ్యక్తిగత దాడులు, తెవికీపై కొందరు అన్యాయంగా చేస్తున్న దుష్ప్రచారం, ఆన్‌లైన్‌లో తమపై ఆరోపణలు, మొదట్లోనే తాము రాసిన వ్యాసాలపై నిర్వహణ మూసలు పెట్టడం, వాటిని తీసేసేలా అభివృద్ధి ఎలా చేయాలన్నది తెలిపేవారు లేకపోవడం వంటి కారణాలున్నాయి.
- వీరిలో నాలుగేళ్ళ కన్నా తక్కువ వికీ వయసు ఉన్నవారు ఇద్దరు కాగా, పదేళ్ళకన్నా ఎక్కువ ఉన్నవారు ముగ్గురు. మహిళలు ఇద్దరు, పురుషులు ముగ్గురు.
- వికీలో ఎప్పుడూ మానేయదలుచుకోలేదు అని చెప్పినవారి సంఖ్య తొమ్మిది మంది (ఏడుగురు మగవారు, ఇద్దరు మహిళలు) కాగా ముగ్గురు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. బ్రేక్ తీసుకున్నవారి కారణాలు రెండే: ఒకటి - ఉద్యోగంలో బిజీ, రెండోది చదువులు, పరీక్షల్లో బిజీ.
- వికీలో నచ్చనిది ఏమిటి?
- వికీలో నచ్చనిదేమిటి అన్నదానికి అత్యధికులు నాణ్యతాలోపాన్ని, వైవిధ్యలోపాన్ని కారణంగా చెప్పారు. వ్యాసాల్లో భాష బాగోకపోవడమూ, పేర్లు తప్పుగా సృష్టించడమూ, మొలక వ్యాసాలు ఎక్కువ సృష్టిస్తూండడమూ, మొదటిపేజీలోనే ఆంగ్ల వ్యాసాల లింకులుండడమూ, సైన్స్ గురించీ, టెక్నాలజీ గురించీ వ్యాసాలు తక్కువ ఉండడమూ, మౌలిక పరిశోధన చేయడమూ, మూలాలు వాడకం రాకపోవడం - ఇలాంటి కారణాలు చెప్పారు.
- నిర్వహణలో సమస్యలు, నిర్వహణకు సమస్యలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఉదాహరణకు ఐపీ నిరోధాల విస్తృతి, తద్వారా తాము లాగిన్ కాలేకపోవడం కొందరు ప్రస్తావిస్తే, వికీపీడియాలో చర్చల్లో చురుకుగా లేకపోవడం మరికొందరు ప్రస్తావించారు. ఇక వికీలోనూ, వికీ బయట వేధింపులు, దురుసు వ్యాఖ్యలు, వికీలో దురుసు చర్చలు, దాడులు వంటివి కూడా వికీలో నచ్చనివిగా ప్రస్తావనకు వచ్చాయి.
- వికీపీడియన్ల సంఖ్య తక్కువ ఉండడం, సమాజంలో వికీ గురించి అవగాహన తక్కువ ఉండడాన్నీ కొందరు సభ్యులు వికీలో నచ్చని సంగతులుగా చెప్పారు. సరిగ్గా ఈ అంశమే భవిష్యత్తులో వికీ ఎలా ఉండాలన్నదానిలో పెద్దపీట వేసుకున్నది.
- భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏం చేయదలిచారు?
- తెవికీమీడియన్ల సంఖ్య పెంచాలి ఇప్పుడు చురుకుగా ఉన్న సభ్యులకు చాలారెట్లుగా సంఖ్య పెరగాలని ఆశించారు. ఇందుకోసం అవుట్‌రీచ్ కార్యక్రమాలు విస్తృతంగా చేయాలనీ, శిక్షణ కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరగాలనీ అభిప్రాయపడ్డారు.
- ఈ లక్ష్యానికి తగ్గట్టే అవుట్ రీచ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని, శిక్షణ ఇస్తామనీ చాలామంది వికీపీడియన్లు వచ్చే ఏడాది చేయనున్న పనిగా నిర్ణయించుకున్నారు.
- తెవికీలో నాణ్యత, వైవిధ్యం పెంపు తెవికీ సభ్యుల సంఖ్య పెరగాలన్న అంశం తర్వాత ఎక్కువమంది సభ్యులు ప్రస్తావించిన అంశం ఇదే.
- ఈ అంశాన్ని ప్రస్తావించినవారు తెలుగు వికీపీడియాలో భాష నాణ్యత పెంచాలనీ, వర్గీకరణను క్రమబద్ధీకరణ చేయాలనీ, మంచి వ్యాసం ప్రాజెక్టు చేపట్టాలనీ వగైరా ఆలోచనలు పంచుకున్నారు.
- మీరు వచ్చే ఏడాది ఏ అంశాలపై పనిచేయదలిచారన్న ప్రశ్నకు అత్యధికులు చెప్పిన సమాధానం - తాము నాణ్యత, వైవిధ్యం పెరుగుదలపై పనిచేస్తామని. ప్రత్యేక పేజీల్లో ఉండే సమస్యాత్మకమైన వికీ పేజీలను పరిశీలించి మెరుగుపరచయడం, మంచి వ్యాసాలపై పనిచేయడం, ఔషధ మొక్కలపై వ్యాసాల సృష్టి వంటివి చేయాలనుకుంటున్నట్టు పలువురు వికీపీడియన్లు చెప్పారు.
- సహాయం, శిక్షణ, ప్రోత్సాహం ప్రణాళికాబద్ధంగా జరగాలి కొత్తవారు తెవికీలో నిలదొక్కుకోవడానికీ, ఉన్నవారు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికీ ప్రణాళికాబద్ధంగా సహాయం మెరుగుపరచాలనీ, క్రమంతప్పకుండా శిక్షణ అందించాలనీ, ప్రోత్సహించడానికి వైవిధ్యభరితమైన ప్రయత్నాలు మరిన్ని చేయాలనీ వాడుకరులు అభిప్రాయపడ్డారు.
- సహాయం పేజీలు, ఆడియోలు, వీడియోలు పెంచడం, కొత్తవాళ్ళను అనుభవజ్ఞులైన వికీమీడియన్లు వికీదత్తత తీసుకోవడం, ఈనెల వికీపీడియన్లు/ఈ ఏడాది వికీపీడియన్లు వంటి కార్యక్రమాల నిర్వహణ వంటి ఆలోచనలు ఈ క్రమంలో పంచుకున్నారు.
- శిక్షణ విషయంలోనూ, కొత్తవారికి సాయం విషయంలోనూ పనిచేస్తామని కనీసం నలుగురు వికీమీడియన్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, శిక్షణకు అవసరమైన ట్యుటోరియల్స్, గాడ్జెట్స్ వగైరా తయారుచేస్తామన్నవారు తక్కువగా ఉన్నారు.
- వేధింపులు, దాడులు తగ్గాలి. నిర్వహణ మెరుగుపడాలి ఆఫ్‌వికీ కార్యక్రమాల్లో జరిగే వేధింపులు, ఆన్‌వికీలో నిర్వాహకులపై దాడులు, చర్చల్లో గౌరవప్రదమైన భాష వాడకపోవడం, దురుసుతనం వాడుకరులను నిరుత్సాహపరుస్తున్నాయి. వీటిని కట్టడిచేయడానికి తీసుకుంటున్న చర్యల వల్ల కొందరు సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు, అయితే ఈ చర్యలే వద్దంటే నిర్వహణ సాధ్యం కాదు. మరోవైపు, నిర్వాహక చర్యలు తీసుకునే నిర్వాహకుల సంఖ్య, చర్చల్లో చురుగ్గా పాల్గొనే వాడుకరుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. వీటన్నిటిపై లోతుగా కృషిచేయాల్సి ఉంది.
- చర్చలో వచ్చిన అంశాలివి: చర్చల్లో ఎక్కువమంది పాల్గొనాలి. కొత్తవారిని నిర్వాహకులను చేయడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి ఉండాలి. నిర్వాహకుల బడి ఉండాలి. నిర్వహణ సమస్యలు చర్చించాలి. వేధింపులు, దాడుల విషయాన్ని విస్తృతంగా చర్చించి, అవసరమైతే పరిశోధించి కొత్త పరిష్కారమార్గాలు కనిపెట్టాలి. సమష్టి కృషి పెరగాలి.
- అయితే, ఒకరిద్దరు మినహాయించి ఈ అంశంపై పనిచేస్తామని ఎవరూ ప్రస్తావించలేదు.
- తెవికీ సాంకేతిక సమస్యలను పరిష్కారానికి కృషిచేయాలి ప్రస్తుతం ఉన్న, భవిష్యత్తులో రాబోయే సాంకేతిక సమస్యలపై దృష్టిపెట్టాలి. పరిష్కరించగలిగినవి పరిష్కరించాలి. మన చేతిలో లేనివాటిపై లాబీ చేయాలి. ఇందులో ట్వింకిల్ ఉపకరణం సమస్యని పరిష్కరించడం నుంచి మొబైల్ ఎడిటింగ్ వాడుకరులకు సులభం చేయడం వరకూ ఎన్నో ఉన్నాయి. సాంకేతిక అభివృద్ధి తీసుకువస్తున్న ప్రయోజనాలను కూడా ఉపయోగించుకుని సమాచార సృష్టిని సులభతరం చేయాలి.
- ట్వింకిల్ టెంప్లెట్ సరిదిద్దడం, ఎర్రలింకులకు రీడైరెక్టులు సృష్టించినప్పుడు సృష్టించినవారికి సందేశం పంపే వ్యవస్థ ఏర్పాటు, విజువల్ ఎడిటర్ డీఫాల్ట్ అయ్యాకా పనిచేయడం ఆగిపోయిన ఉపకరణాలను సరిదిద్దడం, వికీడేటా - వికీపీడియా సమాచారపెట్టెల మధ్య ఇటునుంచి అటు, అటునుంచి ఇటు డేటా ఆటోమేటెడ్‌గా వెళ్ళడం, తెలుగులో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు చూసిపెట్టే ఉపకరణం తయారీ వంటి ప్రాజెక్టుల ఆలోచనలు వచ్చాయి.
- ముగ్గురు సభ్యులు సాంకేతిక సమస్యల పరిష్కారంపైనా, సాంకేతిక అవకాశాలను ఉపయోగించి సమాచార వృద్ధిపైనా పనిచేస్తామని వెల్లడించారు.
- సోదర ప్రాజెక్టులపై కృషి తెలుగు వికీసోర్సులో డిజటలీకరణ, తెలుగు విక్షనరీలో పదాల చేర్పు, వికీమీడియా కామన్స్‌లో తెలుగు వ్యాసాలకు అవసరమైన ఫోటోల చేర్పు వంటి సోదరప్రాజెక్టుల్లో పనిపైనా దృష్టిపెట్టాలని కొందరు అభిప్రాయపడ్డారు. సోదర ప్రాజెక్టులపై అవగాహన కూడా తక్కువ ఉందనీ, అది పెరగాలనీ అన్నారు. ఈ క్రమంలో ఆడియో బుక్స్ రూపకల్పన, ఆడియో వ్యాసాల సృష్టి వంటి కొత్త ఆలోచనలు కూడా ఉన్నాయి.
- మనతో కలసి వచ్చే వ్యక్తులు, సంస్థలు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నారు?
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెవికీకి అందించదలిచిన సహాయం ఇలా ఉంది:
- వివిధ రంగాలకు సంబంధించిన వ్యాసాల సృష్టిలో మూలాలను అందించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
- కొత్త వికీపీడియన్లకు భాషాపరమైన శిక్షణకు సహాయం చేయడానికి సాయపడగలమన్నారు.
- తెలంగాణ వ్యాప్తంగా ఈ కింది గ్రూపులకు తెలుగు వికీపీడియా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించదలిస్తే వారినీ తెవికీని అనుసంధానించడానికి, ఆ ప్రయత్నానికి సహకారిగా ఉండడానికి సిద్ధమని చెప్పారు.
- డిగ్రీ, పీజీ స్థాయిల్లోని తెలుగు విద్యార్థులు, ఉపాధ్యాయులు
- వివిధ సాంస్కృతిక సంస్థలు, వాటి సభ్యులు
- సీనియర్ సిటిజన్స్ సంస్థలు
- జర్నలిస్టులు
- మనసు ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు, నిర్వాహకుడు అయిన ఎం.వి.రాయుడు సహకారం ఇలా ఉండవచ్చునని సూచించారు:
- మనసు ఫౌండేషన్ రూపొందించిన సినిమాలు, సినిమా పాటల వివరాలు తీసుకుని వాటితో సినిమా వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
- మనసు ఫౌండేషన్ ఆర్కైవ్ చేసినవాటిలో కాపీహక్కుల పరిధి దాటిపోయిన పుస్తకాలు తీసుకుని వికీసోర్సులో చేర్చవచ్చు.
- మహిళలకు, జెండర్‌కు సంబంధించిన పలు అంశాలపై పరిశోధనలు చేసే పరిశోధన సంస్థ అయిన అన్వేషితో కలసి పనిచేయడం గురించి కాకర్ల సజయ, ఇతర అన్వేషి సభ్యులతో తదుపరి చర్చలు చేయవచ్చు.
పట్టికలో పై సూచనలు
[మార్చు]పై సూచనలను కింది పట్తికలో చూడవచ్చు
క్ర.సం | అంశం | ఉప అంశాలు | ఎలా చెయ్యాలి - కొన్ని సూచనలు | సంబంధిత వికీప్రాజెక్టులు |
---|---|---|---|---|
1 | తెవికీమీడియన్ల సంఖ్య పెంచాలి | అవుట్‌రీచ్ కార్యక్రమాల విస్తృతి పెరగాలి | * తెలుగు లెక్చరర్లకు తెలుగు వికీపీడియా శిక్షణ | |
మాధ్యమాల ద్వారా వ్యాప్తి | ||||
ప్రత్యేకించిన సామాజిక సమూహాల ప్రజలకు అవుట్‌రీచ్ కార్యక్రమాలు | ||||
సోదర ప్రాజెక్టులపై కృషి, అవగాహన పెంపు | ||||
2 | తెలుగు వికీపీడియాలో నాణ్యత పెంపు | భాషా నాణ్యత పెంపు | ||
మూలాలను చేర్చడం, లోపాల సవరణ | మనసు ఫౌండేషన్, అన్వేషి వంటి రీసెర్చ్ గ్రూప్ ల తోడ్పాటును స్వీకరించవచ్చు | |||
మంచి వ్యాసాలు, మెరుగైన వ్యాసాల తయారీ కోసం కృషి | ||||
మెరుగైన వర్గీకరణ | 1 వర్గాల సంస్కరణ 2 వర్గాల పేర్ల, లింకుల క్రమబద్ధీకరణ | |||
నాణ్యత పెంపు కోసం వివిధ వికీప్రాజెక్టుల రూపకల్పన | ||||
3 | శిక్షణ |
సహాయం పేజీలను నవీకరించడం, ఇప్పుడు సహాయం అందుబాటులో లేని అనేక అంశాలకు సృష్టించడం. |
||
తెవికీలో కృషి ఏం చేయాలి, ఎలా చేయాలన్నదానిపై వీడియోలు సృష్టించడం | ||||
కొత్తవాళ్ళను అనుభవజ్ఞులైన వికీమీడియన్లు వికీదత్తత తీసుకోవడం |
||||
తెవికీ బడి నడిపి తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో రాయడం గురించి, పలు అంశాల గురించి వీడియో తరగతులు తీసుకోవడం |
వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు | |||
కచ్చితమైన ప్రమాణాలు పెట్టి ఈనెల వికీపీడియన్/ఈ ఏడాది వికీపీడియన్ వంటి టైటిల్స్ ఇచ్చి ప్రోత్సహించడం | ||||
4 | వేధింపులు, దాడులను అరికట్టి, నిర్వహణను మెరుగుపరచాలి | మరింతమంది కొత్తవారిని నిర్వాహకులను చేయాలి. | ||
5 | సాంకేతిక అంశాలపై పనిచేయాలి | మొబైల్ ఎడిటింగ్‌లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయడం | ||
ఎర్రలింకుల సంస్కరణ | ఎర్రలింకులకు రీడైరెక్టులు సృష్టించినప్పుడు సృష్టించినవారికి సందేశం పంపే వ్యవస్థ ఏర్పాటు | |||
ట్వింకిల్ టెంప్లెట్ సరిదిద్దడం | కొత్త ట్వింకిల్ స్థాపన | |||
విజువల్ ఎడిటర్ డీఫాల్ట్ అయ్యాకా పనిచేయడం ఆగిపోయిన ఉపకరణాలను సరిదిద్దడం | ||||
వికీడేటా - వికీపీడియా సమాచారపెట్టెల మధ్య ఇటునుంచి అటు, అటునుంచి ఇటు డేటా ఆటోమేటెడ్‌గా వెళ్ళడం | ||||
తెలుగులో అక్షరదోషాలు, వ్యాకరణదోషాలు చూసిపెట్టే ఉపకరణం రూపకల్పన | ||||
6 | సోదర ప్రాజెక్టులపై కృషి, అవగాహన పెంపు | మనసు ఫౌండేషన్ స్కాన్ చేసిన పుస్తకాల్లో కాపీహక్కులు లేనివాటిని ఎంచి వికీసోర్సులో చేర్చి డిజిటలీకరించడం | ||
ప్రతీ తెలుగు వికీపీడియా వ్యాసంలోనూ తప్పకుండా తగిన బొమ్మలు ఉండేలా కృషిచేయాలి. ఇప్పటికే కామన్స్‌లో ఉన్నవి తెవికీలో చేర్చడం, లేకపోతే ఆ ఫోటోలు కామన్స్‌లోకి చేరేలా కృషిచేయడం | ||||
ఆడియో పుస్తకాలు, ఆడియో వ్యాసాల తయారీకి కృషి | ||||
7 | వైవిధ్యాన్ని పెంపొందించాలి | మహిళల భాగస్వామ్యం పెంచడం
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వల్పసంఖ్యాకుల భాషలకు (గోండి, కొలామి, బంజారా, వగైరా) తెవికీ సముదాయం తన అనుభవం, పరిచయాలు, నైపుణ్యాలను ఉపయోగించి సహాయం చేయాలి. ఇప్పటిదాకా తెవికీమీడియన్లు తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ తెవికీ గురించి అవగాహన పెంపొందించాలి. |
||