Jump to content

వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు

వికీపీడియా నుండి

కొత్తగా తెవికీలో నమోదైన వాడుకరులను వికీలో దిద్దుబాట్లు చేసేలా ప్రోత్సహించి, వికీ పద్ధతులను నేర్చుకోవడంలో వారికి అవసరమైన సహాయాన్ని అందజేసి వారు ఇక్కడ కొనసాగేలా చేసే ప్రయత్నమే ఈ ప్రాజెక్టు. వికీమీడియా ఫౌండేషను వారి గ్రోత్ బృందం ఈ విషయమై ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును రూపొందించి కొన్ని వికీపీడియా ప్రాజెక్టులలో పరీక్షార్థం నడుపుతోంది. ఈ ప్రాజెక్టును తెలుగు వికీపీడియా లోనూ స్థాపించాలని కోరగా గ్రోత్ ఎక్స్పెరిమెంట్స్ అనే పేరున్న వారి ప్రాజెక్టును ఇక్కడ పరీక్షార్థం స్థాపించేందుకు అంగీకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా జరిగే శిక్షణ అంతా ఆన్‌లైన్ లోనే జరుగుతుంది. తెవికీలో ఈ ప్రాజెక్టు స్థాపన కోసం జరిగిన చర్చను ఇక్కడ చూడవచ్చు.

ఈ ప్రాజెక్టు ప్రధాన విశేషాలు

[మార్చు]

ఈ ప్రాజెక్టు ప్రధాన విశేషాలివి:

  • కొత్త వాడుకరులు వికీ పద్ధతులను నేర్చుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన సాఫ్టువేరు ఇంటర్‌ఫేసు ఉంటుంది. ఈ ఇంటర్‌ఫేసు వికీపీడియా లోనే భాగంగా ఉంటుంది.
  • గురు-శిష్య (మెంటర్-మెంటీ అని ఆ బృందం పిలుస్తుంది) పద్ధతిలో కొత్తవారికి ఈ శిక్షణ ఇస్తారు. పై ప్రత్యేక సాఫ్టువేరు ద్వారా గురు శిష్యులు పరస్పరం సంభాషించుకుంటారు.
  • వికీలో చురుగ్గా పనిచేస్తున్న అనుభవజ్ఞులు గురువులుగా కృషి చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు.
  • కొత్తగా నమోదైన వాడుకరులు ఒక్కొక్కరికీ ఒక్కొక్క గురువును సాఫ్టువేరే కేటాయిస్తుంది.
  • శిష్యులు గురువును ప్రశ్నలు అడుగుతూ, గురుముఖతః నేర్చుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది.
  • ఒక గురువు వద్ద అనేక మంది శిష్యులు ఉంటారు.

ఈ ప్రాజెక్టు ఎలా సాగుతుంది

[మార్చు]

ప్రాజెక్టు పనిచేసే పద్ధతి ఇలా ఉంటుంది:

  1. ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా ఒక హోంపేజీ ఉంటుంది (అదే ఈ ప్రాజెక్టు పేజీ అన్నమాట). ప్రతి శిష్యునికీ తన స్వంత హోంపేజీ ఉంటుంది. వాడుకరి పేజీకి వెళ్ళినపుడు "వాడుకరి పేజీ" ట్యాబు పక్కనే ఈ హోంపేజీ ట్యాబు కూడా కనిపిస్తుంది.
  2. ఈ హోంపేజీలో ప్రశ్నలడిగే స్థలం, గురువు ఇచ్చిన సమాధానాలు, శిష్యుడు చేసిన పనుల ప్రభావం, సహాయం పేజీల లింకులు వగైరాలుంటాయి.
  3. గురు శిష్యుల ప్రశ్న-జవాబు లన్నీ ఈ హోంపేజీ లోనే జరుగుతాయి.
  4. శిక్షణ యావత్తూ గురువు శిష్యునికి చేసే బోధన లాగానే జరుగుతుంది.
  5. శిక్షణ ఇచ్చే విషయమై గ్రోత్ ప్రాజెక్టు గురువులకు ఇచ్చే ముఖ్యమైన సలహాలివి:
    1. శిష్యుడు వేసే ప్రతి ప్రశ్నకూ గురువు స్వయంగా సమాధానం చెప్పాలి. అంతేగానీ.. ఫలానా పేజీ చదువుకో, ఫలానా వీడియో చూడు, ఆడియో విను అని చెప్పకూడదు.
    2. తాను చెప్పాల్సిన సమాధానం చెప్పేసాక, అదనపు సమాచారం కోసం ఫలానావి చదువు అని మాత్రం చెప్పవచ్చు.
    3. ప్రశ్న అడిగాక, వీలైనంత త్వరగా సమాధానం చెప్పాలి. ఆలస్యమయ్యేట్లుగా ఉంటే ఆ సంగతే శిష్యునికి చెప్పండి.
    4. సమాధానమిచ్చే మూడ్ లేకపోతే మరొకరు ఆ పని చెయ్యగలరేమో చూడాలి.
    5. ప్రశ్నకు సమాధానం మీకు తెలియని పక్షంలో ఇతర గురువుల సహాయం తీసుకోవాలి.
  6. గ్రోత్ ను స్థాపించిన 17 వికీపీడియాల అనుభవం ప్రోత్సాహకరంగా ఉందని, అన్ని వికీపీడియాలూ దీన్ని స్థాపించుకోవాలని భావిస్తున్నామనీ గ్రోత్ బృందం చెబుతోంది. ఆ వివరాలు ఈ పేజీలో చూడండి.

ప్రాజెక్టును తెవికీలో స్థాపించుకోవడంలో ఏయే పనులు చేసాం

[మార్చు]
  1. గ్రోత్ బృందం వారి ఈ పేజీలో సూచించిన పనులను పూర్తి చేసాం.
  2. ఆ తరువాత గ్రోత్ ప్రాజెక్టును స్థాపించమని ఫ్యాబ్రికేటరులో అభ్యర్ధించాం.
  3. గురువుగా కృషి చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారి కోసం ఒక పేజీని తయారుచేసాం.

శిష్యుల ఇంటర్‌ఫేసును చేతనం చేసుకునే విధానం

[మార్చు]

పాత వాడుకరులు గ్రోత్ ప్రాజెక్టు లోని శిష్యుల ఇంటర్‌ఫేసును పరీక్షించాలంటే దాన్ని కింది విధంగా చేతనం చేసుకోవచ్చు

  • మీ వాడుకరి అభిరుచులు లోని వాడుకరి ప్రవర ట్యాబుకు వెళ్ళండి
  • అక్కడ, అన్నిటికంటే అడుగున, "కొత్త వాడుకరి హోంపేజీ" విభాగంలో "కొత్త వాడుకరి హోంపేజీని చూపించు" అనే చెక్‌బాక్సు కనిపిస్తుంది. అందులో టిక్కు పెట్టాలి.
  • ఆ వెంటనే దాని కిందనే, "వ్యక్తిగత పరికరాల్లోని వాడుకరిపేరును డిఫాల్టుగా కొత్త వాడుకరి హోంపేజీకి లింకు చెయ్యి" అనే మరో చెక్‌బాక్సు కనిపిస్తుంది. దీనిలో టిక్కు పెడితే, తెరపై పైన కుడి పక్కన ఉండే మీ వాడుకరిపేరును నొక్కినపుడు మీ వాడుకరి పేజీకి కాకుండా నేరుగా హోంపేజీ కి పోతుంది.
  • ఆ తరువాత వాడుకరి అభిరుచులు లోనే, "దిద్దుబాట్లు" ట్యాబులో ఉన్న "ఎడిటరు సహాయ ప్యానెల్‌ను చేతనం చెయ్యి" అనే అభిరుచిలో టిక్కు పెట్టండి.
  • హోంపేజిని చేతనం చెయ్యడంతో, వాడుకరి పేజీ, చర్చ పేజీ ట్యాబులకు ఎడమ పక్కన ఓ కొత్త ట్యాబు వచ్చి చేరుతుంది. ఈ కొత్త ట్యాబుపై "హోంపేజీ" అని ఉంటుంది.
  • సహాయ ప్యానెల్‌ను చేతనం చెయ్యడంతో, ఏ పేజీలోనైనా దిద్దుబాటు చేసే సమయంలో, సహాయం లింకులున్న ఒక ప్యానెల్ అందుబాటులో కనిపిస్తూ ఉంటుంది.

గ్రోత్ బృందం ఏం చేస్తుంది

[మార్చు]

పైన మనం చేసిన పనులతో సంతృప్తి చెందితే గ్రోత్ బృందం వారు ఈ ప్రాజెక్టును తెలుగు వికీపీడియాలో స్థాపిస్తారు.

గ్రోత్ ప్రాజెక్టు పనికి సంబంధించిన విశేషాలు

[మార్చు]
  • కొత్త వాడుకరి నమోదు కాగానే వారికి ఒక హోంపేజీ తయారౌతుంది. అక్కడ వారికి ఒక గురువును కేటాయిస్తారు. ఏయే పేజీల్లో ఏయే దిద్దుబాట్లు చెయ్యొచ్చో చెబుతూ సూచనలుంటాయి. కొత్త వాడుకరి చెయ్యి పట్టుకుని ఓనమాలు దిద్దించే ధోరణి కనిపిస్తుంది.
  • అక్కడ మూడు రకాలైన దిద్దుబాటు సూచనలుంటాయి: తేలిక (లింకులివ్వడం, భాషా సవరణలు వంటివి), మధ్యస్థం (మూలాలివ్వడం, వ్యాసాల తాజాకరణ వంటివి), క్లిష్టం (మొలకల విస్తరణ వంటివి).
  • దిద్దుబాట్లు చెయ్యాల్సిన పేజీలు ఒక్కొక్కదాన్నే చూపిస్తూ, ఆ పేజీ ఏ రకపు దిద్దుబాటు చెందినదో చూపిస్తుంది. వాటిలో సంబంధిత దిద్దుబాట్లు చెయ్యమని కొత్త వాడుకరిని ప్రోత్సహిస్తుంది.
  • దిద్దుబాటు చేసే క్రమంలో వచ్చే సందేహాలను తీర్చేందుకు సహాయం పేజీలను అందుబాటులో ఉంచుతుంది.
  • హోంపేజీలో కొత్త వాడుకరి తన గురువును ప్రశ్నలు అడగవచ్చు. ఆ ప్రశ్నలు గురువు గారి వాడుకరి చర్చ పేజీలో కనిపిస్తాయి.
  • ఆ ప్రశ్నలకు గురువు గారు సమాధానాలిచ్చినపుడు శిష్యులకు సందేశం వస్తుంది.

నమోదయ్యే కొత్త వాడుకరులలో అందరినీ గ్రోత్ ప్రాజెక్టు లోకి తీసుకోదు. కొత్త వాడుకరులను రెండు బృందాలుగా చేస్తుంది. 80% మందిని లక్ష్యిత బృందం (టార్గెట్ గ్రూప్) లో చేరుస్తుంది. వీరికి గ్రోత్ ప్రాజెక్టు లోకి తీసుకుంటుంది. మిగతా 20% మందిని నియంత్రణ బృందం (కంట్రోల్ గ్రూప్) గా చేస్తుంది. వీరిని గ్రోత్ ప్రాజెక్టులో చేర్చదు. ఇప్పటి వరకూ మామూలుగా నమోదౌతూ వస్తున్న వాడుకరుల లాగానే వీరూ ఉంటారు. ప్రాజెక్టు ఈ రెండు వర్గాల లోని వాడుకరుల ప్రగతిని పరిశీలిస్తూ, పోల్చి చూస్తూ గ్రోత్ ఉపకరణాల పనితీరును, వాటి ఫలితాలనూ లెక్కగడుతూ ఉంటుంది. అవసరమైన చోట్ల మెరుగు పరుస్తూ ఉంటారు. ఈ పరిశీలనలు, పర్యవేక్షణలు అన్నీ వికీమీడియా వారి గ్రోత్ బృందమే చూసుకుంటుంది. అయితే ప్రస్తుతం వారు కొన్ని ఎంచుకున్న మూడు/నాలుగు వికీపీడియాల మీదనే దృష్టి కేంద్రీకరించారు. వాటినే పర్యవేక్షిస్తూ ఉంటారు. మిగతా వికీపీడియాల్లో గ్రోత్‌ను స్థాపిస్తారు గానీ, అక్కడి ప్రగతిని పర్యవేక్షించరు. తెలుగు వికీపీడియా ఈ రెండో వర్గం లోకి వస్తుంది.

ప్రాజెక్టు వనరులు

[మార్చు]

ప్రాజెక్టుకు సంబంధించి గ్రోత్ బృందం వారు తయారు చేసిన సహాయం పేజీల తెలుగు అనువాదాల జాబితా ఇది. ఇవి మీడియావికీ సైటు లోని పేజీలు

  1. సహాయ ప్యానెల్ గురించి
  2. కొత్త వాడుకరులతో ఎలా వ్యవహరించాలి
  3. గ్రోత్ లోని విశేషాల గురించిన సమాచారం
  4. గురువులు తమను తాము పరిచయం చేసుకోవడం

గురువులకు రిఫరెన్సుగా వాడుకునేందుకు కింది వనరులు కూడా పనికి రావచ్చు. ఇవి తెవికీ లోని పేజీలు

  1. విజువల్ ఎడిటరునే వాడాలి: కొత్తగా చేరే వాడుకరులు విజువల్ ఎడిటరును వాడాలని సూచించాలి. అది వికీటెక్స్టు ఎడిటరు కంటే సుబోధకంగాను, ఇంద్రియ సహజంగానూ (ఇంట్యూటివ్) ఉంటుంది కాబట్టి, పెద్ద ఇబ్బందులేమీ లేకుండా రాయడం మొదలుపెట్టెయ్యవచ్చు. మైక్రోసాఫ్టు వర్డ్ లో రాయడం ఎంత తేలికో ఇందులో రాయడమూ అంతే తేలిక అని కొత్తవారికి చెప్పాలి. అందుకు తగ్గట్టుగా వాడుకరి అభిరుచుల్లో దిద్దుబాట్లు ట్యాబులో తగు సెట్టింగులు చేసుకోవాలని వాళ్లకు చెప్పాలి. ఆ సూచనలు ఈ పేజీలోని విజువల్ ఎడిటరును ఎంచుకోవడం విభాగంలో ఉన్నాయి.
  2. సహాయం:పరిచయం: సరికొత్తగా చేరిన వాడుకరులకు సులభంగా బోధించే సరళమైన సహాయం పేజీలకు ఇది ముఖద్వారం. దీనికింద ఉన్న వివిధ పాఠాల్లో దాదాపు 80 పేజీల దాకా ఉన్నాయి. ఈ పేజీల్లోని సమాచారం అంతా ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. అత్యంత తాజా సమాచారం ఉంటుంది. వికీలో చోటుచేసుకున్న మార్పులను ఇందులో చేరుస్తూ ఈ పేజీలను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచాలనేది లక్ష్యం. ఎక్కడైనా పాత సమాచారం ఉన్నట్లు గమనిస్తే చొరవ తీసుకుని సవరించండి. లేదా ఈ ప్రాజెక్టు చర్చా పేజీల్లో రాయండి.
  3. సహాయం:సూచిక: పై పేజీలు ప్రాథమిక సమాచారం అందిస్తూండగా, ఈ పేజీలు కొంత విపులమైన సమాచారం అందిస్తాయి. కొన్ని పేజీలోని సమాచారం ప్రాథమిక స్థాయి లోనే ఉండవచ్చు. తాజా సమాచారం ఉండకపోవచ్చు.
  4. విజువల్ ఎడిటరు యూజర్ గైడ్ చాలా వివరంగా, తాజా సమాచారంతో ఉంటుంది (కొండొకచో ఇంగ్లీషు వికీపీడియా లోని పేజీ కంటే తాజా సమాచారంతో ఉంటుంది).
  5. వికీపీడియా గురించి తరచుగా వచ్చే వివిధ సందేహాలను, ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే పలు ప్రశ్నలనూ ఒకచోట చేరుస్తూ తరచూ అడిగే ప్రశ్నల పేజీని, దాని అనుబంధ పేజీలనూ విస్తరించుదాం. ప్రస్తుతం ఈ పేజీల్లో ఉన్న సమాచారం చాలా పాతది. బహుశా ఇందులో కొంత భాగానికి కాలదోషం పట్టి ఉండవచ్చు. ఆయా పేజీలను తాజాపరచుకుందాం.
  6. గురువుల చర్చావేదిక: ఈ ప్రాజెక్టులో భాగంగా ఇచ్చే శిక్షణ తదితర విషయాలకు సంబంధించి గురువులు చర్చించేందుకు వేదికగా వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు/గురువుల చర్చావేదిక అనే పేజీని వాడవచ్చు.
  7. గ్రోత్ ప్రాజెక్టు ద్వారా వికీ పట్ల కొంత అవగాహన సాధించిన కొత్తవారు, ఆపై వికీలో పనిచేసే క్రమంలో దిద్దుబాట్ల విషయంలో తమకు వచ్చే సందేహాలను అడగదగ్గ స్థలం - వికీపీడియా:ప్రైవేటు బడి

ప్రాజెక్టు ఉపపేజీలు

[మార్చు]
  1. గురువుల జాబితా
  2. గురువుల చర్చావేదిక
  3. కొత్తగా నమోదు కాగానే కొత్త వాడుకరి చేసే ప్రయాణం గురించి వివరించే పేజీ