విజయవాడకు చెందిన చెప్పుకోదగ్గ వ్యక్తుల జాబితా
స్వరూపం
ఆర్థిక, రాజకీయ, రవాణా కేంద్రంగా ఉన్న విజయవాడకు చెందిన వ్యక్తులు పలు రంగాలకు చెందిన చెప్పుకోదగ్గ వ్యక్తులుగా పేరొందారు. వీరిలో కొందరు విజయవాడలోనే జన్మించి, పెరిగినవారు కాగా, మరికొందరు విజయవాడలో జీవించినవారు.
సాహిత్యకారులు, పాత్రికేయులు
[మార్చు]- విశ్వనాథ సత్యనారాయణ: తెలుగు కవి, రచయిత. జ్ఞాన పీఠ్ పురస్కారం పొందిన తొలి తెలుగు సాహిత్యకారుడు. విశ్వనాథ సత్యనారాయణ 1938 నుంచి విజయవాడలోనే జీవించాడు. 1939 నుంచి 1958 వరకు విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కళాశాలలో తెలుగు పండితునిగా పనిచేశాడు. కొద్దికాలం తప్పించి 1976లో మరణించేవరకు విజయవాడలోనే జీవించాడు.
కళాకారులు
[మార్చు]- కొత్తడి కృష్ణారావు సోదరులు: శిల్పి కొత్తడి చిన్నయ్య కుమారులైన కృష్ణారావు, చిన్న కృష్ణారావు శిల్పులు, జాతీయవాదులు. 1930 దశకంలో విజయవాడ, పరిసర ప్రాంతాల్లో శిల్పులుగా మంచి పేరొందారు. వీరిద్దరూ జాతీయవాదులు కావడంతో జాతీయ నాయకులు విగ్రహాలు తప్ప మరే మానవ విగ్రహాలూ రూపొందించమని ప్రతిజ్ఞ పట్టారని గూడూరు నమశ్శివాయ చెప్పేవాడు. ఉండవల్లి గుహల్లో అనంత పద్మనాభస్వామి విగ్రహం దెబ్బతింటే దాన్ని సరిజేసిన శిల్పి కృష్ణారావు.
క్రీడాకారులు
[మార్చు]- మహమ్మద్ గాలిబ్ సాహెబ్: మల్ల యోధుడు, మల్ల విద్యా గురువు. హద్దు సాహెబ్ అన్న బిరుదుతో పేరొందాడు.[1]
- సయ్యద్ అప్పల స్వామి: మల్ల యోధుడు. హద్దు సాహెబ్ శిష్యుడు.[1]
మతాచార్యులు, భక్తులు
[మార్చు]- కాళి భద్రాచార్యుడు: 7వ శతాబ్దికి చెందిన జైన మతాచార్యుడు. సా.శ..620లో తూర్పు చాళుక్యుల పాలన ఆంధ్రదేశంలో ప్రారంభం అయింది. చాళుక్య రాజు కుబ్జవర్థనుడి భార్య అయ్యనమహాదేవి ప్రోత్సాహం మీద కాళి భద్రాచార్యుడు జైన మతాభివృద్ధి చేయడానికి బెజవాడ వచ్చాడు. అయ్యన మహాదేవిని జైన మతానికి మార్చి రాజ్యంలో జైన మత వ్యాప్తికి కృషిచేశాడు.[2]
- శ్రీపతి పండితారాధ్యుడు: 12వ శతాబ్దికి చెందిన శైవ మతాచార్యుడు, శివ భక్తుడు. శైవ మతానికి చెందిన ఆరాధ్య సంప్రదాయానికి చెందిన ముగ్గురు ఆరాధ్యులలో మొదటివాడు. బ్రాహ్మణ వీధిలో జమ్మిచెట్టు సమీపంలో నివసించేవాడు.[3]
- రాయల సూర్యనారాయణ: భక్తుడు, కవి, రచయిత. వృత్తిరీత్యా పొగాకు వ్యాపారి, ప్రవృత్తిరీత్యా రామకృష్ణ పరమహంస మార్గాన్ని అనుసరించిన భక్తుడు. వాగ్గేయకార సంప్రదాయంలో భక్తి గీతాలు, పలు భక్తి రచనలు చేశాడు.[4]
- కుమ్మరి గుండయ్య: శివ భక్తుడు, కవి. సరళమైన తాత్త్వికతను, శివ భక్తిని పద్యాలుగా రాసినవాడు. ఇతను బెజవాడ కుమ్మరి వాడ వాడని చెప్పుకున్నాడు.[5]
సాంకేతిక నిపుణులు, వైద్యులు
[మార్చు]- కె.ఎల్.రావు: ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు వంటి అనేక భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు రూపకల్పన చేశాడు. 1962 నుంచి మూడుసార్లు విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికై, పదేళ్ళ పాటు కేంద్ర నీటి పారుదల, విద్యుచ్ఛక్తి శాఖా మంత్రిగా పనిచేశాడు.
- గోపరాజు సమరం: వైద్యనిపుణుడు, వైద్య విజ్ఞానంపై ప్రత్యేకించి సెక్స్ సమస్యలపై రచనలు చేసి పేరొందిన వ్యక్తి, నాస్తిక ఉద్యమ నేత. నాస్తికోద్యమ నాయకుడు గోరా, గోపరాజు సరస్వతిల కుమారుడు. విజయవాడలో హాస్పిటల్, నాస్తిక విజ్ఞాన కేంద్రాలు నిర్వహిస్తున్నాడు.[6]
రాజకీయ నాయకులు
[మార్చు]స్వాతంత్ర్య సమర యోధులు
[మార్చు]- అయ్యదేవర కాళేశ్వరరావు: స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి, రచయిత. 1926, 1937, 1939 (బందరు సహా) 1946, 1955ల్లో శాసన సభ్యునిగా విజయవాడ ప్రాంతం నుంచి గెలుపొందాడు. ఇతని పేరు మీదుగానే విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ పేరుపెట్టారు.[7]
- మరుపిళ్ల చిట్టి: స్వాతంత్ర్య సమరయోధుడు, కార్మికోద్యమ నాయకుడు. "ఎవరి పేరైతే చెప్పకుండా బెజవాడ ఆధునిక చరిత్ర పూర్తికాదో ఆయనే చిట్టిగారు" అని లంక వెంకటరమణ పేర్కొన్నాడు.
- సింగరాజు లింగరాజు పంతులు: న్యాయవాది, స్వాతంత్ర్య సమర యోధుడు. ఎడ్ల బళ్ళు తోలే కార్మికుల పోరాటానికి మద్దతునిచ్చి 1937లో చిట్టి నగర్ ఆవిర్భావానికి కారకుడయ్యాడు. అతని గౌరవార్థమే చిట్టి నగర్ కి అతని పేరుపెట్టారు. విజయవాడ పురపాలక సంఘానికి తొలి అధ్యక్షుడు. తెలుగువారిలో బారిస్టరు అయిన తొలి వ్యక్తి.[8]
- కాట్రగడ్డ మధుసూదనరావు: స్వాతంత్ర్య సమర యోధుడు, పారిశ్రామిక వేత్త. పలు ఉద్యమాల్లో పాల్గొని జైలు పాలయ్యాడు. మొగల్రాజపురంలో ఇంజనీరింగ్ పరిశ్రమ స్థాపించి నడిపాడు.[9]
- గులాం మొహియుద్దీన్: స్వాతంత్ర్య సమర యోధుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. విజయవాడ వైస్-ఛైర్మన్ పదవి నిర్వహించాడు. ఫ్యూడల్ వ్యవస్థ మారాలన్న సంస్కరణ దృష్టితో తన జాగీర్దారీ, గౌరవ బ్రిటీష్ పాలనపై నిరసనగా గౌరవ మెజిస్ట్రేట్ పదవి వదులుకున్నాడు. హిందూ-ముస్లిం ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి.[10]
- మఠం బాలసుబ్రహ్మణ్యం గుప్తా: స్వాతంత్ర్య సమర యోధుడు. 1920 సమీప కాలంలో విజయవాడ వన్ టౌన్ కు చెందిన బాలసుబ్రహ్మణ్యం గుప్త తన వాగ్ధాటితో కోస్తాంధ్ర జిల్లాల్లో ప్రజాకర్షణ సాధించి జాతీయోద్యమానికి సేవచేశాడు. అతని సూచన మేరకు విద్యార్థులు కళాశాలలు, కార్మికులు పనులు మానివేయడంతో బ్రిటీష్ వారు రాజద్రోహ నేరం మోపి అరెస్టుచేశారు. అతని అరెస్టు వల్ల ప్రజలు నగరాన్ని అల్లకల్లోలం చేశారు.[11]
- రాంపిళ్ల నరసాయమ్మ: విజయవాడకు చెందిన స్వాతంత్ర్య సమరయోధురాలు.
రాజకీయ నేతలు
[మార్చు]- చెన్నుపాటి విద్య: రాజకీయ నాయకురాలు, నాస్తిక ఉద్యమకారిణి. విద్య నాస్తిక ఉద్యమ నాయకులు గోరా, సరస్వతి గోరాల కుమార్తె. విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి రెండు సార్లు లోక్ సభ సభ్యురాలిగా ఎన్నికై, ప్రాతినిధ్యం వహించింది.[12]
వ్యాపారవేత్తలు, దాతలు
[మార్చు]- కారకపర్తి భావనారాయణ: వ్యాపారవేత్త, దాత, రాజకీయ నేత. భావనారాయణ గుంటూరు జిల్లాలో జన్మించి, బందరులో చదువుకున్నా, విజయవాడను కార్యక్షేత్రంగా చేసుకుని ఇక్కడే స్థిరపడ్డాడు. రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల వ్యాపారిగా కోట్లు గడించాడు. కళాశాలలు, పాఠశాలల ఏర్పాటుకు, చర్చిలు, దేవాలయాల నిర్మాణానికి దానాలిచ్చి దాతగా పేరొందాడు. కాంగ్రెస్ నేతగా విజయవాడ ఛైర్మన్, వైస్-ఛైర్మన్ పదవులు చేపట్టాడు.[13]
- ఆలపాటి కుటుంబరావు: వ్యాపారవేత్త. 1920లు, 30లు, 40ల్లో ఆంధ్ర దేశమంతటా వ్యాపారానికి పేరొందినవాడు. రెండు, మూడు దశాబ్దాల పాటు 81 వ్యాపారాలు విజయవంతంగా సాగించాడు.[14]
- సౌదాగర్ మహమ్మద్ హక్: వ్యాపారవేత్త, రాజకీయ నేత. రవాణా రంగంలో వ్యాపారవేత్తగా పనిచేశాడు. సౌదాగర్ 1920 దశకంలో మచిలీపట్నం, నెల్లూరు, జగ్గయ్యపేట పట్టణాలకు విజయవాడ నుంచి బస్సు సర్వీసులు నడిపాడు. 1940 దశకాల్లో విజయవాడలో కార్లకు, తర్వాతికాలంలో స్కూటర్లకు డీలర్ షిప్ తెచ్చుకుని వ్యాపారం చేశాడు. 1940ల్లోనే ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ శాసన మండలికి కోస్తాంధ్ర సభ్యునిగా పనిచేశాడు.[15]
- మనికొండ కాశీవిశ్వనాథం: వ్యాపారవేత్త, కళా ప్రియుడు, దాత. పుస్తక ప్రచురణ రంగం విస్తృతంగా వృద్ధి చెందిన విజయవాడలో బుక్ బైండింగ్ పని అనుబంధ పరిశ్రమగా పెంపొందించినవారిలో ఇతను ఒకరు. తెలుగు నాట ప్రతిభ కల ప్రతీ కవిని, సంగీతకారుడిని గౌరవించి, సంగీత, సాహిత్య కార్యక్రమాలకు దాతగా నిలిచాడు. కంచర్ల సుబ్బనారాయణ అనే నాదస్వర విద్వాంసుడికి విజయవాడలో సన్మానం చేసి, ఏకంగా బంగారు సన్నాయి బహూకరించాడు.[16]
- నందిపాటి రామకృష్ణయ్య: నందిపాటి రామకృష్ణయ్య, సోదరులు కిరాణా వ్యాపారస్తులు, దాతలు. 1800ల్లో విజయవాడలో స్థిరపడ్డ వీరు కిరాణా వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకున్నారు. విజయవాడలోని కన్యకా పరమేశ్వరి అన్నదాన సత్రానికి జక్కంపూడిలో పాతిక ఎకరాల తోట, దానిని నిర్వహించడానికి సుక్షేత్రమైన మరో పాతిక ఎకరాల భూమి దానం చేశారు. దుర్గా మల్లేశ్వర స్వామికి బంగారు పూలను, కుటుంబరావు వీధిలో రామానుజ కూటాన్ని కూడా వీరే ఏర్పాటుచేశారు.[17]
- పారేపల్లి శ్రీరాములు: భక్తుడు, దాత. వైష్ణవంలోని భాగవత శాఖకు చెందిన శ్రీరాములు నగరంలో పారేపల్లి శ్రీరాములు ధర్మ రామానుజ కూటాన్ని ఏర్పాటుచేశాడు. 1915లో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు అప్పట్లోనే లక్షలాది రూపాయలు విలువచేసే ఆస్తులు దానమిచ్చాడు. వైష్ణవ యాత్రికులకు ఉచిత భోజన, వసతి సదుపాయాలు చూడడం మొదలుకొని వైష్ణవాన్ని ప్రచారం చేయడం వరకూ పలు లక్ష్యాలతో ఏర్పాటుచేసిన ఈ సంస్థ వందేళ్ళైనా పనిచేస్తూనే ఉంది.[18]
- వెలగలేటి దశరథ రామయ్య: న్యాయవాది, భక్తుడు, దాత. 1920ల్లో విజయవాడలో పేరున్న న్యాయవాదుల్లో ఒకడైన దశరథ రామయ్య విజయవాడ బార్ అసోసియేషన్, దుర్గా సహకార బ్యాంకులకు వ్యవస్థాపక అధ్యక్షుడు. సమీపంలోని వెలగలేరు గ్రామంలో శివాలయం నిర్మించి, దానికి 50 ఎకరాలు, విజయవాడలోని గోశాలకు 10 ఎకరాలు, అర్జున వీధిలో శంకర మఠానికి 7 ఎకరాలు దానం చేశాడు. మరెన్నో గుప్తదానాలు చేసినట్టు ప్రతీతి. అతని విచిత్రమైన సరదాల్లో సింహం పిల్లని, చిరుతపులి పిల్లని తెచ్చుకుని పరమ సాత్వికంగా పెంచడం ఒకటి. విపరీతమైన సంపద సంపాదించి, భూరి దానాలు చేసిన దశరథ రామయ్య వీటిని దొంగలు, ఆగంతుకులను భయపెట్టడానికి పెంచేవాడు.[19]
- పొట్టి స్వామి: వ్యాపారస్తుడు, దాత. 1920లు, 30ల్లో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో 28 కంపెనీలు, 18 పరిశ్రమలు నెలకొల్పాడు. అమెరికన్ ఆసుపత్రికి అనుబంధంగా అన్నదాన సత్రాన్ని కట్టించాడు.[20]
- దినవహి సుబ్రహ్మణ్యం పంతులు: దాత. 1939లో బెజవాడ వన్ టౌన్ పాత శివాలయం పరిసరాల్లో ఓ అన్నదాన సత్రాన్ని నెలకొల్పాడు. దానికి 87 ఎకరాల 37 సెంట్ల భూమిని దానమిచ్చాడు.[21]
- పోతిన గణపతిరావు పాత్రుడు: స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం సినీ వ్యాపారవేత్త. 1919 అక్టోబరు 23న విజయవాడలో పోతిన శ్రీనివాసరావు పాత్రునితో తొలి సినిమా థియేటర్ మారుతీ హాలు కట్టాడు. 1921లో నాగపూరు జండా సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. సినిమాలు తెలుగులోకి అనువదించడం, నేరుగా తెలుగులోనే నిర్మించడం కూడా చేశాడు.[22]
- పోతిన శ్రీనివాసరావు పాత్రుడు: తొలితరం సినీ వ్యాపారవేత్త. పోతిన గణపతిరావుతో కలిసి సినిమా ప్రదర్శన, నిర్మాణం చేశాడు.[22]
- నవోదయ రామమోహనరావు: ప్రచురణ కర్త. నవోదయ పబ్లిషర్ సంస్థను నడిపి ఎన్నో మంచి గ్రంథాలను ప్రచురించాడు.
సంస్కర్తలు
[మార్చు]నాస్తిక వాదులు
[మార్చు]- గోరా: నాస్తిక ఉద్యమకారుడు, అస్పృశ్యత నివారణ ఉద్యమకారుడు, గాంధేయవాది. నేటి ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తొలి 45 సంవత్సరాలు గడిపాడు. అతని జీవితంలో చివరి 25 సంవత్సరాల కాలం విజయవాడలోనే గడిపాడు. 1947లో తన ఉద్యమ ప్రణాళిక అమలుచేయడానికి విజయవాడ సరైన ప్రాంతంగా తలిచి నాస్తికోద్యమాన్ని కృష్ణా జిల్లా ముదునూరు నుంచి విజయవాడ పటమటకు తరలించాడు.[23]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 లంక వెంకటరమణ 2014, p. 64.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 88.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 19.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 82.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 84.
- ↑ ఎం., సువర్ణరాజు (25 November 2017). "ఐఎంఏ ప్రొఫెసర్‌గా ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం". telugu.oneindia.com. Retrieved 27 April 2019.
- ↑ అయ్యదేవర, పురుషోత్తమ రావు. "మలితరం గొప్ప నేత 'అయ్యదేవర'". www.andhrabhoomi.net. Retrieved 27 April 2019.[permanent dead link]
- ↑ లంక వెంకటరమణ 2014, pp. 55, 56.
- ↑ "నవయుగ ప్రయోగశీలి కాట్రగడ్డ నరసయ్య". www.prajasakti.com. Retrieved 27 April 2019.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 49.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 23.
- ↑ "విజయవాడ మాజీ ఎంపీ కన్నుమూత". Sakshi. 18 August 2018. Retrieved 28 April 2019.
- ↑ లంక వెంకటరమణ 2014, pp. 42–44.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 95.
- ↑ లంక వెంకటరమణ 2014, pp. 49, 50.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 35.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 33.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 29.
- ↑ లంక వెంకటరమణ 2014, pp. 51, 52.
- ↑ లంక వెంకటరమణ 2014, p. 79.
- ↑ లంక వెంకటరమణ 2014, pp. 85, 86.
- ↑ 22.0 22.1 లంక వెంకటరమణ 2014, pp. 101, 102.
- ↑ జాన్సన్ చోరగుడి 2000, p. 32.
ఆధార గ్రంథాలు
[మార్చు]- జాన్సన్ చోరగుడి (2000), మన విజయవాడ, విజయవాడ: కృష్ణవేణి ప్రచురణలు, retrieved 25 April 2019[permanent dead link]
- లంక వెంకటరమణ (2014), విజయవాడ వీధుల కథలు, విజయవాడ: విక్టరీ పబ్లికేషన్స్, retrieved 25 April 2019[permanent dead link]