వెంపటాపు సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెంపటాపు సత్యనారాయణ (సత్యం) శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు, అనేక కమ్యూనిస్టు సంస్థలలో సభ్యులు, 1967లోని శ్రీకాకుళం గిరిజనోద్యమం యొక్క నాయకులు.

ఉద్యమ విశేషాలు[మార్చు]

ఆయన కమ్యూనిస్టు నాయకుడు శ్రీకాకుళ గిరిజనోద్యమ నేత ఆదిభట్ల కైలాసం సహచరుడు. వారిరువురూ నాటి గిరిజనుల అమాయకత్వం, అన్నింటా దోపిడీకి గురవడంపై చలించి పోయారు. పగలు విద్యార్థులకు పాఠాలు చెబుతూ, ఖాళీ సమయాల్లో రాత్రి పూట గిరిజన గ్రామాల్లో తిరుగుతూ వారిని సంఘటిత పరుస్తూ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమ పంథాలో నడిపారు. ఆ సమయంలో వీరఘట్టం ప్రాంతానికి చెందిన ఆదిభట్ల కైలాసం, చౌదరి తేజేశ్వరరావు, పాణిగ్రహి తదితర ఒకే భావజాలం గల పలువురు నాయకులు ఒక్కటవడం, వీరందరూ కమ్యూనిస్టు పార్టీ గొడుగు కింద సమష్టి నిర్ణయాలతో పోరటాన్ని ఉద్యమ రూపంలోకి తీసుకువెళ్లారు. గిరిజన ప్రజలను దోచుకొనే షాహుకార్లు, సొండీలు, ఇతర భూస్వాములను హత్యలు చేయడం, వీరి ఇళ్లను దోపిడీ చేసి పేద గిరిజన ప్రజలకు పంపిణీ చేయడం, భూ పోరాటాలు చేయడం ప్రారంభించారు. 1967 అక్టోబరు 31న మొండెంఖల్లు గ్రామంలో గిరిజన ప్రజలతో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు పుచ్చలపల్లి సుందరయ్య, కప్పగంతుల సుబ్బారావు తదితర నాయకులు హాజరవుతున్నారు. వందలు, వేలాదిగా గిరిజన ప్రజలు ఈ సభకు తరలివస్తున్నారు. ఆ సమయంలో గుమ్మ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన భూస్వాములు ఈ సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా పిలేవిడి గ్రామం వద్ద దారికాచి సభకు వెళుతున్న గిరిజనులను అడ్డుకున్నారు. వందలాదిగా వస్తున్న గిరిజనులను భూస్వాములు అడ్డుకోవడంతో గిరిజనులు, వీరి మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘర్షణ ఇరువర్గాల మధ్య కొట్లాటగా దారితీసి చివరకు భూస్వాములు గిరిజనులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కోరన్న మంగన్న అనే గిరిజనులు చనిపోయారు. ఈ సంఘటనతో గిరిజన ప్రజలు కసి పెంచుకోవడంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. భూ స్వాములను, షాహుకార్లను హత్యలు చేయడం, వారి ఇళ్లను దోపిడీ చేసి గిరిజన ప్రజలకు పంచి పెట్టడం వంటి కార్యక్రమాలను ఉధృతం చేశారు.[1]

సత్యం భారతీయ కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) లో చేరారు. ఆయన 1969లో సి.పి.ఐ(ఎం.ఎల్) కు కేంద్ర ఆర్గనైజింగ్ సభ్యునిగా ఉన్నారు. తరువాత ఆయన కొత్త సెంట్రల్ కమిటీలో సభ్యునిగా ఎన్నికై ఆ పార్టీ మొదటి కాంగ్రెస్ సమావేశాన్ని చారు ముజుందార్ ప్రధాన కార్యదర్శి తో కలసి నిర్వహించారు.[2]

ఉద్యమం అణచివేత[మార్చు]

ఈ నేపథ్యంలో నాటి ప్రభుత్వం పోలీసు బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం తదితర నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లి సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. 1967 నుంచి 70 వరకు వందలాదిగా సంఘటనలు జరిగాయి. భూస్వాములు హత్యలు, పోలీసు, సీఆర్పీఎఫ్ గాలింపు చర్యలు, ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ రెండు ఉద్యమాలకు భావసారూప్యత గల కారణాలుగా ఆ నాటి నక్సలైట్ పార్టీ జాతీయ నాయకులు చారూ మజుందార్, కానూసన్యాల్, నాగభూషణ్ పట్నాయిక్ తదితర నాయకులు ఉద్యమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ సహాయ సహకారాలు అందించారు. చివరకు 1970, జూలై 10న వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలు కురుపాం సమీపంలోని కొండల్లో ఉన్నట్లు సమాచారంతో పోలీసులు వీరిని చుటుముట్టి ఎన్‌కౌంటరు చేశారు. ఆ తరువాత పలువురు నాయకులను అరెస్టులు చేయడంతో నాటి ఉద్యమం బలహీనపడింది.[3][4]

మూలాలు[మార్చు]

  1. "తెలంగాణ‌, ఆంధ్రాల్లో నక్సల్స్‌ ఉద్యమ ప్రభావం". Archived from the original on 2017-05-28. Retrieved 2017-04-29.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-18. Retrieved 2017-04-29.
  3. http://imp-personalities.blogspot.com/
  4. Overview about the History of Naxalism by the Hindustan Times