Jump to content

వెన్నం జ్యోతి సురేఖ

వికీపీడియా నుండి
వెన్నం జ్యోతి సురేఖ
Jyothi Surekha Vennam
వ్యక్తిగత సమాచారము
Nickname(s)సురేఖ
జాతీయతIndian
జననం (1996-07-03) 1996 జూలై 3 (వయసు 28)
విజయవాడ, Andhra Pradesh
నివాసంవిజయవాడ, Andhra Pradesh, India
క్రీడ
దేశంIndia
క్రీడవిలువిద్య
College టీమ్‌klu
TeamIndian Archery Women Team
Coached byవెన్నం సురేంద్ర కుమార్
విజయాలు, బిరుదులు
Highest world rankingWorld Rank 22[1]

వెన్నం జ్యోతిసురేఖ సుప్రసిద్ధ అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి. ఈమె ప్రపంచ కప్ లో కాంపౌండ్ విలువిద్యలో వ్యక్తిగత (2023), మిక్స్ డ్ టీం పోటీలలో (2022, 2023[4]) స్వర్ణ పతకాలను సాధించింది.[5]

జీవిత విశేషాలు

[మార్చు]

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం లోని నడింపల్లి గ్రామానికి చెందిన శ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీడాకారుడు. వీరి సతీమణి శ్రీదుర్గ బి.ఇ.డి. చేసారు. ఈ దంపతులు తమ కుమార్తె అయిన వెన్నం జ్యోతి సురేఖ భవిష్యత్తు కోసం, విజయవాడలో స్థిరపడినారు. చిన్నప్పటినుండి తమ చిన్నారికి ఈతలో శిక్షణ ఇప్పించారు. జ్యోతి తన నాలుగు సంవత్సరాల వయసులోనే తన ఈత విన్యాసాలతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నది. 5 కి.మీ. దూరంలో కృష్ణానదిని మూడు గంటల ఇరవై నిమిషాల ఎనిమిది సెకండ్లలో ఈది, "పిట్ట కొంచెం కూత ఘనం" అనిపించుకున్నది. తరువాత ఈమె విలువిద్యపై గురిపెట్టినది. కొద్దికాలంలోనే ఆ క్రీడపై తనదైన ముద్రవేసింది. 13 సంవత్సరాల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన జ్యోతి, ఇక వెనుదిరిగి చూడలేదు. 2009 లో టైజునాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం గెల్చుకున్నది. అదే వేదికపై మరో మూడు రజత పతకాలనూ మరియూ ఒక కాంస్య పతకాన్నీ గూడా స్వంతం చేసుకుని తన ప్రతిభ ప్రదర్శించింది. 2011 లో టెహరానులో జరిగిన ఆసియా ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో మహిళా కాంపౌండ్ టీం సభ్యురాలిగా కాంస్య పతకం గెల్చుకున్నది. 2013 లో చైనాలోని "వుక్సి" వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్ మరియూ కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించింది. తాజాగా ఈమె 2014 సెప్టెంబరులో, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుచున్న ఆసియా క్రీడలలో భారత ఆర్చెరీ మహిళా జట్టు సభ్యురాలిగా కాంస్య పతకం స్వంతం చేసుకున్నది.

ఈమె 2015, మే-21 నుండి 24 వరకు, పాటియాలాలో, పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన జాతీయ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొని, ప్రథమ స్థానం సంపాదించింది. ముగ్గురు సభ్యుల బృందంలో ప్రథమ స్థానం సంపాదించి, ఈమె, ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్యా పోటీలకు ఎంపికై, దక్షిణ కొరియా దేశంలోని గ్యాంగ్ జూ నగరంలో నిర్వహించిన ప్రపంచ విశ్వవిద్యాలయల విలువిద్య ఫోటీలలో పాల్గొన్నది. గ్యాంగ్ జూ క్రీడా గ్రామంలో నిర్వహించిన వరల్డ్ యూనివర్సైడ్ గేంస్-2015 ప్రారంభ వేడుకలలో ఈమె భారత జట్టుకి నాయకత్వం వహించి, గౌరవ వందనం చేసింది. ఈ అరుదైన గౌరవం దక్కిన తొలి రాష్ట్ర క్రీడాకారిణి ఈమె. గ్యాంగ్ జూ క్రీడాగ్రామంలో జరిగిన ఈ వేడుకలలో 33 దేశాలకు చెందిన పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. 2015, జూలై-4 నుండి 8 వరకు నిర్వహించిన ఈ పోటీలలో పాల్గొన్న సురేఖ, మహిళా కాంపౌండ్ విలువిద్య పోటీలలో, వ్యక్తిగత ఒలింపిక్ పోటీలలో 5వ స్థానం, మిక్సెడ్ విభాగంలో రజతపతకం, జట్టు విభాగంలో 7వ స్థానంలో నిలిచింది. ర్యాంకిగ్స్ లో, 720 పాయింట్లకు గాను 682 పాయింట్స్ సాధించి 8వ స్థానంలో నిలిచింది.[6] & [7]

ఈమె డెన్మార్క్ దేశంలో 2015, జూలై-26 నుండి ఆగస్టు-2 వరకు నిర్వహించిన ప్రపంచ విలువిద్యా పోటీలలో పాల్గొన్నది. ఈ పోటీలలో ఈమె ఫైనల్సుకు చేరుకున్నది.[8]

2015, అక్టోబరు-15న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో నిర్వహించిన జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో, కాంపౌండ్ ర్యాంకింగ్ రౌండులో, 720 పాయింట్లకుగాను 686 పాయింట్లు సాధించి, స్వర్ణపతకం సాధించింది. ఈ పోటీలలో ఈమె, 4 సంవత్సరాలలో 3 సార్లు నెగ్గటం విశేషం. ప్రస్తుతం ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ ర్యాంకింగ్స్ లో ఈమె 14వ స్థానంలో ఉంది. ఈమె నవంబరు/2015లో నిర్వహించే అసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నది.[9]

ఈమె 2015, నవంబరు-7వ తేదీనాడు, థాయ్ లాండ్ దేశంలోని బ్యాంగ్ కాక్ నగరంలో నిర్వహించిన 19వ ఆసియా ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో, మహిళల కాంపొండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించింది. ఇదే పోటీలలో టీం విభాగంలోనూ ఈమె తన సత్తా చాటినది. ఈమె స్వాతి, సరికొండ జయలక్ష్మి తోడుగా, కాంపౌండ్ విభాగంలో రజత పతకం గిలుచుకున్నది. ప్రస్తుతం కె.ఎల్.విశ్వవిద్యాలయంలో ఇ.సి.ఇ.విభాగంలో 3వ సంవత్సరం విద్యనభ్యసించుచున్న ఈమె, అక్కడ ప్రవేశించిననాటినుండి నేటివరకు, ఈమె 15 అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, 4 స్వర్ణ, 3 రజత, 4 కంచుపతకాలను సాధించింది.[10]

2016, జనవరి-5,6 తేదీలలో మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ పట్నంలో నిర్వహించిన జాతీయస్థాయి విలువిద్య పోటీలలో, ప్రథమస్థానంలో నిలవడం ద్వారా ఈమె, రెండు ర్యాంకులు మెరుగుపరచుకొని, ప్రపంచ కాంపౌండ్ మహిళా ర్యాంకింగులో 12వ స్థానాన్ని పొందినారు. ఈ విజయం సాధించడం ద్వారా ఈమె, 2015, ఫిబ్రవరి-6 నుండి 16 వరకు, గౌహతిలో నిర్వహించు 12వ దక్షిణాసియా విలువిద్యా పోటీలలో పాల్గొను భారత మహిళా కాంపౌండ్ జట్టుకు పి.ఎస్.పి.బి.కి ప్రాతినిధ్యం వహించుచున్న ఈమె ఎంపికైనది.[11]

2016, జనవరి-22 నుండి 26వరకు, పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో, పంజాబ్ విశ్వవిద్యాలయం నిర్వహించు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల విలువిద్యా పోటీలలో ఈమె, గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలోని కోనేరు లక్ల్ష్మయ్య విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించును.[11]

ప్రస్తుతం షిల్లాంగ్ లో నిర్వహించుచున్న 12వ దక్షిణ ఆసియా విలువిద్యా పోటీలలో ఈమె తొలిసారిగా పాల్గొని, వ్యక్తిగత విభాగంలో రజతపతకం, బృంద విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఈ రెండు పతకాలతో కలిసి ఈమె ఇంతవరకు, అంతర్జాతీయస్థాయిలో 15, జాతీయస్థాయిలో 50 పతకాలు గెల్చుకున్నది. ఈమె ఇప్పటికే, విలువిద్యకు సంబంధించి, ప్రపంచంలో నిర్వహించుచున్న అన్ని పోటీలలోనూ ఈమె పాల్గొన్నది. ప్రస్తుతం ఈమె కె.ఎల్.విశ్వవిద్యాలయంలో మూడవ సంవత్సరం బి.టెక్., చదువుచున్నది.<ref>ఈనాడు గుంటూరు సిటీ; 2016, ఫిబ్రవరి-9; 20వపేజీ.</ref>

ఛైనీస్ తైపేలో 2016, సెప్టెంబరు-7 నుండి 13 వరకు నిర్వహించిన ఆసియా కప్ విలువిద్య పోటీలలో భారతదేశ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈమె, మిక్సెడ్ విభాగంలో స్వర్ణ పతకం, టీం విభాగంలో రజత పతకం సాధించింది. ఈమె ఇప్పటి వరకు 20 అంతర్జాతీయ పోటీలలో పాల్గొని, 16 పతకాలు స్వంతం చేసుకున్నది.[12]

ప్రస్తుతం కె.ఎల్ విశ్వవిద్యాలయంలో ఎం.బి.యే మొదటి సంవత్సరం చదువుచున్న ఈమె, 2017, జూలై-3 నుండి 6 వరకు ఒడిషా రాష్ట్రం, భువనేశ్వర్ నగరంలోని కిట్స్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఎంపికపోటీలలో విజయం సాధించి, ఛైనాలోని తైపేలో 2017, ఆగస్టు-19 నుండి 30 వరకు నిర్వహించు ప్రపంచ విశ్వవిద్యాలయాల విలువిద్య పోటీలలో పాల్గొనుటకు అర్హత సాధించింది.[13]

దశాబ్దకాలంగా విలువిద్యలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించుచున్న ఈమెను. తాజాగా కేంద్ర ప్రభుత్వం, అర్జున పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని ఈమెకు భారత రాష్ట్రపతి శ్రీ రామనాథ్ కోవింద్, 2017, ఆగస్టు-29న ఢిల్లీలో అందజేసినారు.[14]

మూలాలు

[మార్చు]
  1. "FITA". archery.org. Archived from the original on 31 ఆగస్టు 2014. Retrieved 6 December 2013.
  2. 2011 Asian Archery Championships
  3. 3.0 3.1 "World Youth Championship". archery.org. Archived from the original on 13 డిసెంబరు 2013. Retrieved 13 December 2013.
  4. "https://twitter.com/worldarchery/status/1649700914842796037?ref_src=twsrc%5Etfw". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2023-04-23. {{cite web}}: External link in |title= (help)
  5. "Archery WC: Jyothi clinches two gold medals". ESPN (in ఇంగ్లీష్). 2023-04-22. Retrieved 2023-04-23.
  6. ఈనాడు గుంటూరు సిటీ; 2015,మే-28; 8వపేజీ.
  7. ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-1; 10వపేజీ.
  8. ఈనాడు అమరావతి; 2015,జులై-6; 13వపేజీ.
  9. ఈనాడు ఆంధ్రప్రదేశ్; 2015,అక్టోబరు-16; 15వపేజీ.
  10. ఈనాడు ఆంధ్రప్రదేశ్; 2015,నవంబరు-8; 14వపేజీ.
  11. 11.0 11.1 ఈనాడు అమరావతి; 2016,జనవరి-8; 3వపేజీ.
  12. ఈనాడు కృష్ణా; 2016,సెప్టెంబరు-29; 12వపేజీ
  13. ఈనాడు అమరావతి; 2017,జులై-7; 3వపేజీ.
  14. ఈనాడు మెయిన్; 2017,ఆగష్టు-30; 1&19 పేజీ.

"సుప్రసిద్ధ అంతర్జాతీయ విలువిద్యా క్రీడాకారిణి". ఈనాడు దినపత్రిక. గుంటూరు రూరల్. 28 సెప్టెంబరు 2014.

బయటి లింకులు

[మార్చు]