Jump to content

వెయ్యి మంది సాహసికుల యాత్ర

వికీపీడియా నుండి
వెయ్యి మంది సాహసికుల యాత్ర

క్వార్టో వద్ద యాత్ర ప్రారంభం.
తేదీ1860–1861
ప్రదేశంసిసిలీ, దక్షిణ ఇటలీ
ఫలితంనిర్ణయాత్మక సార్డీనియన్ / ఇటాలియన్ విజయం, రెండు సిసిలీల రాజ్యం పతనం
రాజ్యసంబంధమైన
మార్పులు
దక్షిణ ఇటలీపై విజయం కొత్త ఇటలీ రాజ్యం (1861-1946) ఏర్పాటు
ప్రత్యర్థులు
సార్దీనియా రాజ్యం రాయల్ నేవీ
ఇటాలియా యొక్క హన్గేరియన్ లెజియన్[1]
రెండు సిసిలీస్ రాజ్యం
సేనాపతులు, నాయకులు
గిసేప్పి గరిబాల్ది
నినో బిక్సియో
ఎన్రికో కాల్డిని
రెండు సిసిలీస్ రాజు ఫ్రాన్సిస్ II
ఫెర్డినాండో లాంజో
గియోసూ రిటూకి
పియట్రో కార్లో మరియా వయల్ డి మెంటన్

1860 లో మొదలైన వెయ్యి మంది సాహసికుల యాత్ర (Italian:- Spedizione dei Mille) అనే ఈ దండయాత్రకు తిరుగుబాటు జనరల్ గిసేప్పి గరిబాల్ది నేతృత్వం వహించాడు. ఈ స్వచ్ఛంద సైనికుల దళం రెండు సిసిలీల రాజ్యాన్ని ఓడించింది. దీని వలన ఆ రాజ్యం రద్దుచెయబడి సార్దీనియాకు స్వాధీనం చెయడం జరిగినది, ఇది ఏకీకృత ఇటలీ రాజ్యం ఏర్పడటంలో ఒక ముఖ్యమైన ఘట్టం.

నేపథ్యం

[మార్చు]

ఈ సాహసయాత్ర యొక్క సంఘటనలు ఇటలీ ఏకీకరణ ప్రక్రియలో భాగంగా జరిగాయి. ఇటలీ ఏకీకరణ ప్రక్రియను సార్దీనియా-పీడ్మొంట్ ప్రధాన మంత్రి అయిన కామిల్లో కావూర్ ప్రారంభించాడు. ఇటలీ మెత్తాన్ని ఒకటిగా చేయటం కావూర్ జీవిత లక్ష్యం. దీనిలో చాలా భాగాన్ని ఆయనే సాధించాడు. టుస్కానీ, మోడేనా, పార్మా, రోమాగ్నా సంస్థానాలను మార్చి 1860 సంవత్సరానికి పీడ్మాంట్ రాజ్యం ఆక్రమించింది. తరువాత ఇటాలియన్ జాతీయవాదుల చూపు రెండు సిసిలీల రాజ్యంపై పడింది. రెండు సిసిలీల రాజ్యంలో దక్షిణ ఇటలీ ప్రధాన భూభాగం, సిసిలీ ద్వీపం కలిసి ఉన్నాయి. సిసిలీల రాజ్యం ఆక్రమణ ఇటలీ ఏకీకరణలో తదుపరి దశ.

1860 లో అప్పటికే ప్రసిద్ధ ఇటాలియన్ విప్లవ నాయకుడయిన గారిబాల్ది జెనోవాలో సిసిలీ, నేపుల్స్ వ్యతిరేకంగా దండయాత్రకు ప్రణాళికను రచించాడు. దీనికి యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క రహస్య మద్దతు కూడా ఉంది.[2] అప్పటికే ఫ్రాన్సిస్కో క్రిస్పితో సహా ఇతర సిసిలియన్ నాయకులు ద్వీపంలోని నియా పోలిటన్ పాలనపై అసంతృప్తితొ ఉన్నారు. అంతేకాక నియా పోలిటన్ల రష్యన్ సామ్రాజ్యం అనుకూల విధానాలను అవలంభించారు. మధ్యధరా సముద్రంలో ఒక సముద్ర మార్గం ఏర్పరచడానికి కూడా ప్రయత్నించారు .అదే సమయంలో సూయజ్ కాలువను ప్రారంభించారు. దీని వలన వ్యూహాత్మకంగా సిసిలియన్ ఓడరేవుల ప్రాముఖ్యత కూడా పెరిగింది. ఈ విషయాలన్నింటిపై బ్రిటన్ వ్యాకులత చెందుతున్నది. అంతేగాక కొత్త స్టీమర్లకు ఎక్కువ పరిమాణంలో కావలసిన సల్ఫర్ సిసిలీలో దొరకుతుంది. ఈ సిసిలియన్ సల్ఫర్ పొందటానికి అవసరమైన అనుకూల ఆర్థిక పరిస్థితులను సిసిలీలో కల్పింటానికి వీలుగా గారిబాల్డి యాత్రకు బ్రిటిష్ మద్దతు పలకింది అని లోరెంజో డెల్ బోకా ఇతరుల అభిప్రాయం.[3]

ఒక యుద్ధ ప్రారంభానికి కావలసిన కారణం కోసం అన్వేషణ

[మార్చు]

సార్డీనియా-పీడ్మాంట్ రాజ్యం రెండు సిసిలీల రాజ్యంపై దాడి చేయడానికి ఒక సాకు కావాలి. కావూర్ సమర్పించిన నివేదికను బట్టి ముఖ్యంగా సవాయ్ రాజవంశానికికు ఒక కారణం అవసరం. ఎందుకంటే సవాయ్ రాజవంశం బోర్బొన్ రాజ్యానికి వ్యతిరేకంగా ఎటువంటి యుధ్ధప్రకటన చేయలేదు. దీనికి అవసరమైన కారణం ఆ రాజ్యం లోపలి ప్రజల నుండి సంభవించే ఒక తిరుగుబాటు మాత్రమే. ఆ సమయంలో నేపుల్స్ బోర్బన్ రాజవంశం పాలనలో ఉంది. వీరు ప్రజలకు ఆమోద యోగ్యమైన విధానాలను రూపొందించటంలో విఫలమయ్యారు. ముఖ్యంగా ఆ సమయంలో సిసిలీని పాలించిన బోర్బన్ రాజవంశానికి చెందిన ఫ్రాన్సిస్ అసమర్థ పాలకుడు. ఇతని అసమర్థత కారణంగా ప్రజలలోని వ్యతిరేకత వలన తిరుగుబాటు తలెత్తే అవకాశం ఉంది. గత దశాబ్దాల చరిత్రను బట్టి సిసిలీ ఒక సారవంతమైన ప్రాంతం, ఆధునిక రాజ్యం అని తెలుస్తుంది. ముఖ్యంగా యువకుడైన రాజు కొంత కాలంగా ఈ దిశలో పనిచేసి ఒక అమ్నెస్టీ మంజూరు చేసాడు. దీని ద్వారా కొంత అభివృధ్ధి సాధ్యమైంది.[4][5]

యాత్ర

[మార్చు]

సిసిలీలో తీరాన్ని చేరటం

[మార్చు]
శాంటో స్టెఫానోలోని గారిబాల్డి తాత్కాలిక శిబిరం వద్ద గారిబాల్డిని స్తుతిస్తూ మే 9, 1860లో నెలకొల్పిన ఫలకం

గరిబాల్ది తన తోటి మతస్థుడయిన జి.బి. ఫౌచె దగ్గర ఫిమాంటె, లాంబార్డో అను పేరు గల రెండు ఆవిరి ఓడలను తీసుకున్నాడు. వీటి సహాయంతో గారిబాల్డి అతని వాలంటీర్లు జెనోవా జిల్లాలోని క్వార్టో అనే ఊరిలో సముద్రతీరంలోని ఒక రాతి పై నుంచి మే 5, 1860 సాయంత్రం తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు.[6] ఉత్తర ఇటలిలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ఒక వేయి మంది వాలంటీర్లతో (ఇటాలిలో మిల్లె అనగా వేయి) రెండు సైనిక దళాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీరిలో ఫ్రాన్సెకో క్రిస్పి భార్య అయిన రోసాలియో క్రిస్పి కూడా ఉంది, [7] తరువాత వీరు టాలమోన్ (మే 7), దక్షిణ టుస్కానీలో పోర్టో శాంటో స్టెఫానో (మే 9) వద్ద పీడ్మాంట్ దళాలకు కావలసిన నీరు, ఆయుధాలు, బొగ్గు కోసం కొంత కాలం ఆగారు.

ఈ నౌకలు మే 11 న, సిసిలీ పశ్చిమ తీరాన గల మర్సాలా వద్ద తీరాన్ని చేరాయి. దీనికి ఓడ రేవులోని బ్రిటిష్ నౌకలు కూడా సహాయం చేసాయి. బ్రిటిష్ నౌకలు బోర్బొన్ నౌకల కార్యకలాపాలను ఆటంకపరచాయి.[8] అయినప్పటికి లాంబార్డోపై దాడి జరిగింది. ఎట్టకేలకు ఆ నౌకలు తీరాన్ని చేరగలిగాయి. లాంబార్డో నౌక నుంచి అందరు దిగిన తరువాత అది మునిగిపోయింది. పీమాంటేను మాత్రం తరువాత శత్రువులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రాన్సిస్కో క్రిప్సి, ఇతరులు తీరాన వీరికి స్వాగతం పలికారు. వీరే ఈ వాలంటీర్లకు స్థానికుల మద్దత్తును సంపాదించారు.

మే 14 న, సలేమి వద్ద, గారిబాల్డి సార్దీనియా రాజు విక్టర్ ఇమ్మాన్యూల్ II పేరు మీద తనను తాను సిసిలీ నియంతగా ప్రకటించుకున్నాడు

కలాటఫిమి, పాలెర్మో నగరాల స్వాధీనం

[మార్చు]
1860 లోని గిసేప్పి గరిబాల్ది ఛాయాచిత్రం

మే 15 న ఈ సాహసికులు కలాటాఫిమీ వద్ద జరిగిన యుధ్ధంలో 2,000 మంది గల నియోపాలిటన్ దళాలకు ఓడించి తమ మొదటి విజయాన్ని సాధించారు. ఈ విజయం అసంపూర్తియైనది. కానీ ఈ విజయం వాలంటీర్లను ఉత్సాహపరిచింది, అదే సమయంలో ఈ పరాజయం నియా పోలిటన్లలో నిరుత్సాహాన్నినింపింది. వారు తమను తాము ఒంటరి వారుగా భావించారు. వీరికి ఎల్లప్పుడూ సరైన నాయకత్వ లక్షణాలు లేని అవినీతి అధికారులు నేతృత్వం వహించారు. అదే సమయంలో మిల్లెలో స్థానికులు చేరటం వలన వాలంటీర్ల సంఖ్య 1,200కు పెరిగింది. మే 27 న వీరు తిరుగుబాటును మొదలుపెట్టారు ఈ వాలంటీర్లు సిసిలీ ద్వీపం రాజధాని అయిన పాలెర్మోను ముట్టడించారు. నగరానికి 16,000 సైనికులు రక్షణగా ఉన్నారు, కానీ వీరికి 75 సంవత్సరాల వయస్సు గల జనరల్ ఫెర్డినాండో లాంజా నాయకత్వం వహించాడు. ఇతను తన సైనికులకు గందరగోళమైన పనికిరాని ఆదేశాలను జారిచేసాడు. (బహుశా ఇతను బ్రిటీష్ వారి దగ్గర లంచం తీసుకున్న నియా పోలిటన్ అధికారులలో ఒకడు అయి ఉండవచ్చు.

రెండు దళాల గారిబాల్డి సైనికులు నగర పొలిమేరపై దాడి చేసారు. అదే సమయంలో స్థానిక జైలు నుండి 2,000 మంది ఖైదీలు విముక్తులయ్యారు. వీరి సహాయంతో కొంత మంది ప్రజలు నగరానికి రక్షణ కోసం ఉన్న సైనిక దళానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. ఈ దాడి వలన లాంజా సైనికులు చాలా స్థావరాలను కొల్పోయారు. తన సైనికులు నగరం నుండి పారిపోయిన తరువాత లాంజా మూడు రోజులు నగరంపై ఫిరంగులతో దాడి చేయమని ఆదేశించాడు. ఈ దాడి వలన 600 మంది పౌరులు మరణించారు. మే 28 నాటికి గారిబాల్డి దాదాపు నగరాన్నంతటిని స్వాధీనం చేసుకున్నారు. బోర్బొన్ అధికారం తొలగిపోయింది అని ప్రకటించాడు. తర్వాత రోజు లాంజా జరిపిన భీకరమైన ప్రతిదాడి విఫలమైంది. దీనితో లాంజా శాంతి ఒప్పందం కావాలని కోరాడు. అయితే బాగా శిక్షణ పొందిన మంచి అయుధాలు గల దళాలు జనరల్ ఫెర్డినాండో లాంజాకు సహాయంగా నగరానికి వచ్చాయి. దీని వలన గరిబాల్ది పరిస్థితి తీవ్రంగా మారింది. కాని అదే సమయం జనరల్ లాంజా లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం గారిబాల్డికి అనుకూలించింది. బ్రిటిష్ అడ్మిరల్ మధ్యవర్తిత్వం ద్వారా ఒక యుద్ధ విరమణ ఒప్పందం చేసుకున్నారు. దీని వలన నియాపోలిటన్ యుధ్ధనౌకలు ఓడ రేవును విడిచి వెళ్ళిపోయాయి.

నియాపోలిటన్ దళాల తిరోగమనం, మిలాజ్జో వద్ద యుద్ధం

[మార్చు]

బోర్బొన్ దళాలు తూర్పువైపుకు చొచ్చుకువెళ్ళాలని, ద్వీపాన్ని ఖాళీ చేయాలని ఆదేశించడం జరిగింది. మే 31 న నికోలా ఫాబ్రిజ్జి నేతృత్వంలోని కటానియా (Catania) లో ఒక తిరుగుబాటు జరిగింది. దీనిని స్థానిక రక్షక దళం అణిచివేసింది, కానీ నియాపోలిటన్ దళాలను మెస్సినాకు సహాయంగా తరలిరావాలని ఆదేశించారు. దీనివలన ఈ నియాపోలిటన్ వ్యూహాత్మక విజయం ఎటువంటి ఆశాజనక ఫలితాలు సాధించలేదని తెలుస్తుంది.

ఆ సమయంలో సైరాకస్, ఆగస్టా, మిలాజ్జొ, మెస్సినాలు మాత్రమే సిసిలీలో రాజుగారి చేతులలో ఉండిపోయాయి. ఈ సమయంలో గారిబాల్డి పాలకుడిగా తన మొదటి చట్టాన్ని జారీ చేసాడు. అయితే 20,000 పైగా దళాలను నిర్భంధంగా సమకూర్చుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. అయితే రైతులు. భూస్వాములు ద్వారా ఎదురయ్యే దారుణమైన పరిస్థితులు నుండి తక్షణ ఉపశమనం కల్పించాలని కోరారు. వీరు అనేక ప్రాంతాలలో తిరుగుబాటు చేశారు. 1860 ఆగష్టు 4న, బ్రోంటే వద్ద జరిగిన తిరుగుబాటును గరిబాల్ది స్నేహితుడయిన నినో బిక్సియో రెండు బెటాలియన్ల రెడ్ షర్టుల సహాయంతో దారుణంగా అణచివేశాడు.

మాజిల్లా యుధ్ధంలో గారిబాల్డి అతని రెడ్ షర్ట్స్

గరిబాల్ది సాధించిన విజయాల్లోని పురోగతిని చూసి కావుర్ వ్యాకులత చెందాడు. అంతేగాక జూలై మొదట్లో పీడ్మొంట్ సిసిలీని తక్షణం సిసిలీని పీడ్మాంట్ కు స్వాదీనపరచవలసిందిగా ఒక ప్రతిపాదన పంపించాడు అయితే గరిబాల్ది యుద్ధం ముగిసే వరకు అటువంటి ప్రతిపాదనను అంగీకరించేంది లేదని గట్టిగా తిరస్కరించాడు. కావుర్ రాయబారి లా ఫారినాను ఖైదు చేసి ద్వీపం నుండి బహిష్కరించారు. అతని స్థానంలో మరింత అనుకూలుడైన అగోస్టినో డెస్ప్రెస్టిస్ వచ్చాడు. అతను గరిబాల్ది యొక్క నమ్మకాన్ని పొందగలిగాడు. అంతేగాక సహ పాలకుడిగా నియమించబడ్డాడు.

జూన్ 25, 1860 న, రెండు సిసిలీస్ రాజు ఫ్రాన్సిస్ II ఒక రాజ్యాంగాన్ని జారీ చేశాడు.ఆలస్యంగా తీసుకున్న ఈ చర్య ప్రజలను సమాధానపరచలేకపోయింది. అంతేగాక రాజ్యాన్ని శతృవుల నుండి రక్షించడానికి వీలుగా వారిలోఉత్సాహాన్ని కూడా నింపలేకపోయింది. ఉదారవాదులు విప్లవకారులు గరిబాల్ది స్వాగతం పలకటానికి ఉత్సుకత చూపించాడు .

అదే సమయంలో గరిబాల్ది దక్షిణ సైన్యాన్ని తయారుచేసాడు. వీరిలో ఇటలీ నుండి వచ్చిన ఇతర వాలంటీర్లతో పాటు పారిపోయిన సిపాయిలమని చెప్పుకుంటున్న పీడ్మాంట్ సైనికులు కూడా ఉన్నారు. నియోపాలిటన్లు మెస్సినా, ఇతర దుర్గముల రక్షణ కోసం 24,000 మంది సైనికులను సమకూర్చుకున్నారు.

జూలై 20 న గరిబాల్ది 5,000 మంది సైనికులతో మిలజ్జోపై దాడి చేసాడు. ఈ నగరాన్ని రక్షించే నియాపోలిటన్ సైనికులు ధైర్యంగా పోరాడారు. కాని మళ్లీ వీరిలో సమన్వయ కొరవడింది. అంతేగాక సిసిలీ ద్వీపంలోని సైన్యానికి ముఖ్యనాయకుడైన మార్షల్ క్లారీ మెస్సినా నుండి సహాయాన్ని పంపడానికి తిరస్కారించాడు, దీనితో మిల్లేకు మరొక విజయం సొంతమైంది. ఆరు రోజుల తర్వాత క్లారి లొంగిపోయాడు. మెస్సినాను గారిబాల్డికి స్వాదీనం చేసాడు. కోట ప్రహరీ గోడ, ఇతర కోటలలో 4,000 మంది మాత్రమే మిగిలారు. ఇతర స్థావరాలు సెప్టెంబర్ చివరినాటికి లొంగిపోయాయి.

కాలాబ్రియాలో అడుగు పెట్టడం తరువాత గారిబాల్డి విజయం

[మార్చు]

ఆగష్టు 19 న గరిబాల్ది అనుచరులు కాలాబ్రియాలో అడుగుపెట్టారు. దీనిని కావూర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అంతేగాక గరిబాల్దిని మెస్సినా స్ట్రైట్ ను దాటవద్దని విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ రాసాడు. అయినప్పటికీ గరిబాల్ది దీనికి నిరాకరించి కాలాబ్రియాలో అడుగుపెట్టారు. దీనికి రాజైన విక్టర్ ఇమ్మాన్యూల్ మౌనంగా అంగీకరించాడు..

కాలాబ్రియాలో 20,000 మంది బోర్బన్ సైనికులు ఉన్నారు, వారు పనికిరాని పసలేని ప్రతిఘటనను ఇచ్చారు, ఇదే సమయంలో బోర్బొన్ సైన్యంలోని అనేక దళాలను ఆకస్మికంగా రద్దు చేసారు. కొతమంది బోర్బన్ సైనికులు గారిబాల్డి సైన్యంలో చేరిపోయారు. కాని దీనికి రెగ్గియో కాలాబ్రియాలాంటి చోట్ల జరిగిన సంఘటనలు కొంత మినహాయింపు. రెగ్గియో కాలాబ్రియాను ఆగష్టు 21 న బిక్సియో ఆక్రమించాడు. దీనికి అతడు అధిక మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. ఆగస్టు 30న జనరల్ గియో నేతృత్వంలోని దాదాపు సిసిలియన్ సైన్యం అంతా సొవేరియా మానెల్లి వద్ద అధికారికంగా రద్దు చేయబదింది. కేవలం కొన్ని చిన్న చిన్న చెదురుమదురు దళాలు మాత్రం పోరాటంకొనసాగించాయి. నియాపోలిటన్ నౌకాదళం కూడా ఇదే విధంగా ప్రవర్తించింది.

వోల్టారస్ వద్ద జరిగినయుద్ధంలోని ఒక దృశ్యం

ముగింపు

[మార్చు]

రాజు ఫ్రాన్సిస్ II ఈ విధంగా నేపుల్స్ ను బలవంతంగా పరిత్యజించివలసి వచ్చింది. రాజు ఫ్రాన్సిస్ II పారిపోయి గేటాలోని బలమైన కోటలో తలదాచుకున్నాడు. ఈ సమయంలోనే నేపుల్స్ కు ఉత్తరాన గల వోల్టర్నో నది వద్ద చివరి పోరాటం జరిగింది. సెప్టెంబర్ 7 న గరిబాల్ది తక్కువ నష్టంతో రెండు సిసిలీల రాజధానిని స్వాధీనం చేసుకున్నాడు. అతను ఒక రైలులో నగరాన్ని చేరుకున్నాడు. ప్రజలు ఆయన్ని తమ కష్టాలనుండి విముక్తంచేసినవాడు అని ప్రశంసించారు.

వోల్టారస్ వద్ద నిర్ణయాత్మక యుద్ధం జరిగింది.[9] గారిబాల్డి యొక్క 24000ల మంది గల సైన్యం నియాపోలిటన్ సైన్యాన్ని పూర్తిగా ఓడించలేక పోయింది. ఈ సమయంలో నియాపోలిటన్ సైన్యాలో దాదాపు 25000 మంది సైనికులు ఉన్నారు. పీడ్మాంట్ సైనికులు గారిబాల్డికి సహాయంగా వచ్చిన తరువాత మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ సైన్యం పాపల్ భూభాగాలైన మార్చె, అంబ్రియ ద్వారా పయనించి ఈ ప్రాంతాన్ని చేరింది. వీరే గేటాలోని కోటకు రక్షణగా ఉన్న ఆఖరి బోర్బన్ దళాన్ని ఓడించారు.

కొన్ని రోజుల తరువాత (అక్టోబర్ 21న) ఒక ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అఖండమైన మెజారిటీ ద్వారా రెండు సిసిలీస్ రాజ్యాన్ని సార్దీనియా రాజ్యంలో కలిపివేసారు. నేటి చరిత్రకారులు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు పెద్ద ప్రాముఖ్యతను ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రజలు ఓటు వేయడానికి రహస్య పధ్ధతిని పాటించలేదు. అంతేగాక పీడ్మాంట్ నుంచి వచ్చిన సైనికులు కూడా ఓటు వేశారు.

అక్టోబర్ 26, 1860న ఉత్తర కంపానియాలోని టియానోలో విక్టర్ ఇమ్మాన్యూల్, గరిబాల్ది సమావేశంమయ్యారు. ఇది ప్రసిధ్ధి చెందిన సమావేశం. దీని తరువాత ఈ యాత్ర ముగించాలని నిర్ణయించారు.[10] కాని కొంతమంది నవంబర్ 7 న విక్టర్ ఇమ్మాన్యూల్ నేపుల్స్ లోకి ప్రవేశించిన తరువాత మాత్రమే ఈ యాత్ర ముగింసింది అంటారు.

గరిబాల్ది ఒక సంవత్సరం పాటు తనను రెండు సిసిలీలకు పాలకుడిగా కొనసాగించాలని రాజుని కోరాడు. అంతేగాక తన అధికారులను కొత్త ఇటాలియన్ సైన్యంలో విలీనం చేసుకోవాలని కోరాడు. అయితే రాజైన విక్టర్ ఇమ్మాన్యూల్ తన అభ్యర్ధనలను తిరస్కరించాడు. దీనితో నిరాశ చెందిన గారిబాల్డి కాప్రియాకు తిరిగి వెళ్ళిపోయాడు.

అయినప్పటికి విజయం ఇంకా పూర్తికాలేదు. ఇంకా ఫ్రాన్సిస్ II వరకు గ్యేటా లోనే దాగి ఉన్నాడు. తరువాతి సంవత్సరం ఫిబ్రవరిలో ఫ్రాన్సిస్ II లొంగిపోయాడు. ఆస్ట్రియాలో ప్రవాసానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి 1861 మార్చిన కొత్త ఇటలీ రాజ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.

నిజ నిర్ధారణ

[మార్చు]
Garibaldino యొక్క చార్టర్ కు సంబంధించిన ఫోటో. దీనిలో ఉన్నది వెయ్యిమంది రెడ్ షర్ట్స్ దళంలోని ఒక సభ్యుడు.. అతని పేరు గిసెప్పి బార్బోగ్లియో. అతను 1865 లో Palermo నగరం జారీ చేసిన అరుదైన ' మెడల్ ఆఫ్ థౌజండ్' లేదా 'మార్సలా మెడల్'ను ధరించాడు

సంప్రదాయబద్ధంగా ఈ వెయ్యి మంది సాహసయాత్ర ఇటలీ ఏకీకరణ ప్రక్రియలో అత్యంత ప్రాముఖ్యత గల సంఘటనలలో ఒకటి. అయితే, ఇటీవల అధ్యయనాలు మొత్తం సంఘటనలోని చివరి వివరణలపై సందేహాలను వ్యక్తం చేసాయి. ముఖ్యంగా ఇవి సైనిక విజయాల యొక్క నిజమైన ప్రాముఖ్యత గురించి వేలెత్తి చూపించాయి. ఎందుకంటే ఇవి ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రల నుండి తీసుకున్నవి. వీటిలో ఈ సైనిక విజయాల గురించి ఎక్కువ చేసి చెప్పబడింది అని ఈ అధ్యయనాలలో అభిప్రాయపడటం జరిగింది.

తరువాత సంవత్సరాలలో స్థానికంగా తిరుగుబాటు తలెత్తింది. దీనిని పర్వతాలలో తలెత్తిన తిరుగుబాటు అంటారు. ఈ తిరుగుబాటును అణచివేసి రెండు సిసిలీల రాజ్యంలో తిరిగి శాంతిభద్రతలను నెలకొల్పడానికి ఒకానొక దశలో 1,20,000ల పీడ్మాంట్ సైనికులను మోహరించవలసి వచ్చింది. సంప్రదాయానుసారంగా ఇటాలియన్ చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రతికూలమైన కోణంలో తీసుకున్నారు అని తెలుస్తుంది. దీనికి గారిబాల్డి అతని అనుచరుల వీరత్వాన్ని లెక్కలోకి తీసుకోవటమే కారణం. ఉదాహరణకు, ఆంగ్ల చరిత్రకారుడు డెనిస్ మాక్ స్మిత్ ఆ కాలంలో అందుబాటులో ఉన్న ఆధారాలలోని లోపాలను సంకుచితత్వాన్ని ఎత్తి చూపించాడు.[11]

అంతేకాక ఈ సాహస యాత్ర దక్షిణ ఇటలీలోని శక్తివంతమైన గొప్ప భూస్వాములు గట్టి మద్దతు లభించింది. దీనికి కారణం రాబోయే రోజుల్లో రాజకీయ మార్పులలో వారి ఆస్తులు యధాతధంగా ఉంటాయని వారికి వాగ్ధానం చేయడం జరిగింది. ఏమైనప్పటికీ అనేకమంది సిసిలియన్ రైతులు మిల్లెలో చేరారు. దీని ద్వారా తాము పని చేసే భూమి తమకు దక్కుతుందని వారు ఆశించారు. ఈ విషయంలో తాము భ్రమ పడ్డామని రైతులకు అర్థమైంది. ఈ విషయం బ్రోటె లాంటి చోట్ల జరిగిన సంఘటనల ద్వారా స్పష్టమౌతుంది

నోట్సు

[మార్చు]
  1. మగ్యారోర్‌సాగ్ హాడ్‌టోర్టాంటే 1. (హంగరీ సైనిక చరిత్ర), జ్యిన్రి కాటొనాయ్ కియాడో 1984. ISBN 963-326-320-4
  2. డెల్ బోకా, మాలెడెట్టి సవోయియా
  3. లొరెంజో డెల్ బోక, మాలెడెట్టి సవోయియా, 2వ అధ్యాయంలో చూడండి. copyright inglese
  4. గిగి డి ఫియరో, ఐ వింటి డెల్ రిసోర్జిమెంటొ', ఊటెత్, టొరినో, 2004, p. 99.
  5. గియాసింటొ డె సివొ, రెండు సిసిలీస్ చరిత్ర 1847–1861, ఎడిజియానొ ట్రాబాంట్, 2009, p. 331.
  6. The ships were the property of Raffaele Rubattino, of whose company Fauché was administrator, and had been paid with a guaranty from King Victor Emmanuel and Prime Minister Cavour themselves. After the conclusion of the expedition the debt was extinguished by handing over to Rubattino the entire Florio fleet, captured in Sicily.
  7. According to some sources, the exact number was 1,089. Most were from the former Lombardy-Venetia. There were some foreigners, often not cited in Italian history books, including Englishmen and Hungarian officers.
  8. These were: Stromboli (steam corvette), Valoroso (brigandine), Partenope (sail frigate) and the armed steamer Capri. The British had the two gunboats Argus and Intrepid.
  9. Effective date of the end of the fightings is debated.
  10. Other sources (including Del Boca) set the location of the meeting at Taverna della Catena, in territory of the modern comune of Vairano Patenora.
  11. Denis Mack Smith, Italy and Its Monarchy.

ఆధారం

[మార్చు]
  • Abba, Giuseppe Cesare (1880). Da Quarto al Volturno. Noterelle di uno dei Mille.
  • Banti, Anna (1967). Noi credevamo.
  • Bianciardi, Luciano (1969). Daghela avanti un passo. Bietti.
  • Del Boca, Lorenzo (1998). Maledetti Savoia. Piemme.
  • Mack Smith, Denis (1990). Italy and Its Monarchy.
  • Zitara, Nicola (1971). L'unità d’Italia. Nascita di una colonia.